RELATED NEWS
NEWS
TAL 20 వ వార్షికోత్సవం మరియు ఉగాది సంబరాలు

TAL 20 వ వార్షికోత్సవం మరియు ఉగాది సంబరాలు

లండన్, యూకే – లండన్ తెలుగు అసోసియేషన్ (TAL) దాని 20వ వార్షికోత్సవాన్ని మరియు ఉగాది వేడుకలు 2025 ఏప్రిల్ 26న ఈస్ట్ లండన్‌లోని లేక్‌వ్యూమార్కీ లో ఘనంగా నిర్వహించింది. ‘‘TAL విలువలను ప్రతిబింబించే వేడుక’’ గా ఈ కార్యక్రమాన్ని అనేక మంది కొనియాడారు. యూకే నలుమూలల నుంచి వచ్చిన 1000 మందికి పైగా హాజరైన ఈ వేడుక TAL చరిత్రలోనే అతిపెద్ద ఉత్సవంగా నిలిచింది. ఈ వేడుకలో ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల తన బృందంతో లైవ్ కాన్సర్ట్ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కార్యక్రమాన్ని ఈవెంట్ కన్వీనర్ రవీందర్ రెడ్డి గుమ్మకొండ మరియు కల్చరల్ ట్రస్టీ శ్రీదేవి ఆలెద్దుల ఫల్గాం విషాద సంఘటనలో అసువులు బాసిన వారి ఆత్మలకు శాంతికి చిహ్నంగా 2 నిముషాల మౌనంతో సంతాప ప్రకటనతో ప్రారంభించారు. TAL యొక్క సామూహికతను, మానవతా విలువలను ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమం జరిగింది.

20 సంవత్సరాల మైలు రాయిని దాటిన ఈ ప్రత్యేక స్మరణోత్సవంలో, ఛైర్మన్ రవి సబ్బా గారు TAL విజయ పరంపరకు తోడ్పడిన గత చైర్మన్‌లు, ట్రస్టీలు మరియు ఉగాది కన్వీనర్‌ లనందరినీ వారి అనితర సేవలకు గాను సత్కరించారు. TAL వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రాములు దాసోజు"TAL కమ్యూనిటీ లీడర్ షిప్ అవార్డు" తో సత్కరించారు. ఈ అవార్డును రవి సబ్బా మరియు ట్రస్టీలు, వ్యవస్థాపక సభ్యులు శ్రీధర్ వనం, రామానాయుడు బోయల్ల కలిసి రాములు గారికి, ఆయన ధర్మ పత్ని స్వదేశ్ దాసోజు లకు అందజేశారు.

రామ్ మిరియాల మరియు ఆయన బృందం అద్భుతమైన లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ఇచ్చి ప్రేక్షకులను ఉత్సాహభరితులను చేశారు, ఎన్నటికీ మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిలించారు.

పూర్తి కార్యక్రమాన్ని నటి భానుశ్రీ గారు యాంకరింగ్ చేశారు. TAL సాంస్కృతిక కేంద్రం (TCC) విద్యార్థులు అందించిన కళారూపాలు ఆకట్టుకునేలా ఉండి, యువతలో తెలుగు సంప్రదాయాలను పెంపొందించాలనే TAL సంకల్పాన్ని చాటిచెప్పాయి. యక్షగానం వంటి భారతీయ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు వేడుకకు మరింత వైభవాన్ని జత చేశాయి.

TAL వార్షిక పత్రిక ‘‘మా తెలుగు 2025’’ కూడా ఈ వేడుకలో ఆవిష్కరించారు. ఈ ప్రయత్నానికి నాయ‌కత్వం వహించిన సూర్య కందుకూరి గారు ప్రధాన సంపాదకుడు రమేష్ కలవల మరియు సంపాదక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

TAL చరిత్రను ప్రతిబింబించే ఫోటో గ్యాలరీ ప్రదర్శన ద్వారా గత రెండు దశాబ్దాల విశేషాలను చిత్ర మాలికా రూపంలో ప్రదర్శించారు.

స్పోర్ట్స్ ఇన్ ఛార్జ్ సత్య పెద్దిరెడ్డి గారు TAL ప్రీమియర్ లీగ్ (TPL) T20 క్రికెట్ సీజన్‌ను ప్రారంభించారు. ముఖ్యఅతిథి రామ్ మిరియాల గారు 2025 ఛాంపియన్ ట్రోఫీని ఆవిష్కరించారు.

ఫండ్ రైసింగ్ ట్రస్టీలు వెంకట్ నీలా మరియు రవి మోచెర్ల గారు స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు మరియు వారిని ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ఛైర్మన్ రవి సబ్బా గారు మాట్లాడుతూ, ‘‘ఇంగ్లాండ్ లో తెలుగు సమాజాన్ని ఐక్యంగా మలచిన మరియు 20 సంవత్సరాలుగా సేవ చేసిన సంస్థలో భాగం కావడం గర్వకారణం. ఇది కేవలం వేడుక కాదు - ఇది వేల మైళ్ల దూరంలో కూడా మన భాష, మన విలువలు, మన సంప్రదాయాలను నిలుపుకున్న ప్రతి తెలుగు గుండెకు నివాళి’’ అని అన్నారు.

కల్చరల్ ట్రస్టీ శ్రీదేవి ఆలెద్దుల గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన బృందానికి, ట్రస్టీల బోర్డుకు, వెంకట్ నీలా, అనిల్ అనంతుల, రవికుమార్ మోచెర్ల, అశోక్ మాడిశెట్టి, కిరణ్ కప్పెటమరియు రాయ్ బొప్పనలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, వాలంటీర్లకు, ప్రత్యేకంగా భారతి కందుకూరి, బాలాజీ కల్లూరు, గిరిధర్ పుట్లూరు, లక్ష్మణ్ కోట, కిషోర్ కస్తూరి, పవన్ తిరునగరి, వాసుమేరెడ్డి, విజయ్ బెలిదే తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.

TAL ప్రారంభమైన నాటి నుండి సాంస్కృతిక విద్య, సేవా కార్యక్రమాలు మరియు సాంస్కృతిక కార్యాచరణల ద్వారా తెలుగు సంస్కృతిని ఇక్కడ పరిరక్షిస్తూ, పోషిస్తూ వచ్చింది. TAL కేవలం ఒక సంఘం కాదు; ఇది ఒక ఉద్యమం, ఒక స్మృతి, ఒక వారసత్వం. ఉగాది ఉత్సవాల నుంచి సేవా కార్యక్రమాల దాకా, సాహిత్యం నుంచి సంగీతం వరకూ TAL UK లోని తెలుగు వారిలో తెలుగు భాష మరియు సంస్కృతి ఉనికికి మూలంగా నిలిచింది.

CLICK HERE for Event Photos

TeluguOne For Your Business
About TeluguOne