RELATED NEWS
NEWS
డల్లాస్ లో భోగి మంటలు






ఇటీవల సంక్రాంతి సందర్భంగా డాలాస్ లోని ప్రవాసాంధ్రులు స్థానిక బొర్రా ఫార్మ్స్ లో వైభోగంగా భోగి మంటలతో మకర సంక్రమణాన్ని జరుపుకున్నారు.

 భారతదేశంలో పండుగలు చేసుకోడానికి, విదేశాలలో పండుగలు చేసుకోడానికి చాలా తేడా ఉంది. మాతృదేశం నుండి దూరం గా విదేశాలలో ఉన్న ప్రవాసులు ఈ మధ్య భారతదేశం లో లాగానే అన్ని పండుగలు వారాంతాల్లో స్నేహితులతో కలిసి మెలిసి కుటుంబసమేతం గా చేసుకుంటున్న సంగతి మనందరికి తెలిసిందే! ఎంత ప్రయత్నించినా కొన్ని పండుగలు మాత్రం భారతదేశం లో లాగా చేసుకోలేని పరిస్తితి విదేశాలలో ఉంది.

అమెరికా లో దీపావళి మందులు కాల్చడం మరియు భోగి మంటలు వేయడం అనేక అనుమతులు, ముందు జాగ్రత్తలతో కూడుకున్న విషయం. చాలా ప్రాంతాలలో నిషిద్దం, కష్టం.

అయితే ఈ కష్టాలను లక్ష్యపెట్టకుండా, డల్లాస్ లో ఈసారి భోగి పండుగ చేసుకోవాలని సంకల్పించి, డల్లాస్ కు చెందిన బొర్రా సోదరులు విజయ్, రవి తమ సొంత ఫార్మ్ లో భోగి మంటలను, ఆంధ్ర షడ్రుచుల వంటలను ఏర్పాటు చేసి వారిఊరికి సంక్రాంతి శోభను కలిగించారు.



 



దాదాపు 100 తెలుగు కుటుంబాలు డల్లాస్ సమీపం లోని మేలిస్సా లో గల బొర్రా ఫార్మ్స్ లో శనివారం వేకువ జామున, చలిని లెఖ్ఖచేయకుండా, పొగమంచు చాటున సమావేశమై, నిలువెత్తు భోగి మంటను వెలిగించారు.

 

ఎప్పుడో తమ చిన్నప్పుడు పల్లెటూళ్ళలో, వీధుల్లో స్నేహితులందరితో కలిసి చేసుకున్న పండుగను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.





పెద్దలతోపాటు శీతాకాలం తెల్లవారుఝాము చలిలో భోగిమంటల మజా మొదటి సారి చవిచూసిన పిల్లలు ఈ కార్యక్రమం లో రెట్టించిన ఉత్సాహం తో పాల్గొన్నారు. 

గారెలు, అరిశెలు, పులిహోర, మొదలైన అనేక తెలుగు వంటకాలతో విందులు, మగువలు తీర్చిదిద్దిన వన్నెవన్నెల రంగవల్లులు, సంక్రాంతిపాటలు ఆటలు వినోదాలతో ఎంతో ఆహ్లాదంగా సాగిన ఈవేడుకను ఏర్పాటు చేసిన బొర్రా బ్రదర్స్ కు అందరూ అభినందనలు తెలియజేశారు.

TeluguOne For Your Business
About TeluguOne
;