RELATED NEWS
NEWS
కన్నులవిందుగా సిలికానాంధ్ర మన్మథ నామ ఉగాది ఉత్సవం

 

కన్నులవిందుగా సిలికానాంధ్ర మన్మథ నామ ఉగాది ఉత్సవం


మార్చి 21న సిలికానాంధ్ర శ్రీ మన్మథనామ ఉగాది మహోత్సవాన్ని సన్నివేల్ హిందూదేవాలయంలో ఆనందోత్సాహాలతో నిర్వహించింది. ఉదయం పది గంటలకు మొదలైన తెలుగు భాషా వికాస పోటీల్లో సుమారు మూడు వందల మంది పిల్లలు పాల్గొన్నారు. మూడు సంవత్సరాలు మొదలు పదమూడు సంవత్సరాల వయసు పిల్లలు అయిదు విభాగాల్లో పోటీపడి చిట్టిపొట్టి పాటలు, సుమతీ, వేమన, భాస్కర శతకాల్లోని పద్యాలు, నీతి కథలు చెప్పారు.

 సాయంత్రం అయిదు గంటలకు మారేపల్లి వెంకటశాస్త్రి గారి వేదపఠనం, పంచాంగశ్రవణంతో ప్రధాన కార్యక్రమం మొదలైంది. అన్ని నక్షత్రాల కందాయఫలాలను, రాశుల ఆదాయవ్యయాలను, రాజ్యపూజ్యావమానాలను వివరిస్తూ మాటను అదుపులో పెట్టుకొని ఇంట్లో బయట మసలుకుంటే మనిషికి శాంతి కలుగుతుందని, ప్రపంచ యుద్ధాల గురించి బెంగపడవలసిన అవసరం లేదని హితవు చెప్పారు. అటు తర్వాత 'కవితా క్రీడాభిరామం' పేరుతో విన్నూత్నమైన కవిసమ్మేళనం నిర్వహించబడింది. కవులు, కవయిత్రులు రెండు జట్లుగా పాల్గొని ప్రపంచకప్ క్రికెట్ ఆటను అనుసరిస్తూ సాహితీ ప్రశ్నోత్తరాలతో రసవత్తరంగా జరిపారు. హాస్యరస ప్రధానంగా 'మన్మథ ', 'హైటెక్', 'తెలుగు మీడియా', 'భావుకత ' మొదలగు నాలుగు ఆంశాల్లో కవులు, కవయిత్రులు ప్రఖ్య మధుబాబు, ప్రఖ్య వంశీ, పుల్లెల శ్యాంసుందర్, తాటిపర్తి బాలకృష్ణారెడ్డి, కాశీవఝులశారద, శాఖమూరి శ్రీకళ్యాణీలతో పాటు బాలకవులు మాలెంపాటి మనీష్, దంతుర్తి మాధవ్, కూచిభొట్ల అనూష, కొండిపర్తి అనూష కూడా పాల్గొనడం ఒక విశేషం. తాటిపాముల మృత్యుంజయుడు, కూచిభొట్ల శాంతి సంచాలకులుగా పనిచేసారు.


సిలికానాంధ్ర పూర్వ అధ్యక్షుడు కొండుభట్ల దీనబాబు 'జయహో కూచిపూడి' గురించి ప్రేక్షకులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సిలికానాంధ్ర కూచిపూడి గ్రామాన్ని దత్తత తీసుకొంది. వచ్చే మూడు సంవత్సరాల్లో కూచిపూడిని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలన్నది సిలికానాంధ్ర ముఖ్యోద్దేశమని అందుకుగాను తెలుగు వారందరు ఇతోధికంగా తమవంతు సహకారంఅందించాలని విన్నపం చేసారు. ఈ సందర్భంగా జయహో కూచిపూడి ' వెబ్ సైట్ కూడా ఆవిష్కరించబడింది.

కార్యక్రమంలో చివరి భాగంగా ప్రముఖ కవి, రచయిత, సంగీతకర్త బాలాంత్రపు రజనీకాంతరావు నూరవ జనందినోత్సవ సందర్భంగా వారు రచించిన లలితగీతాలు పదింటిని 'రజనీగంధం' పేరిట కార్యదర్శి మాలెంపాటి ప్రభ సారధ్యంలో సిలికానాంధ్ర గాయనీగాయకులు స్వరపరిచి ఆలాపించారు. సరిపల్లి పద్మిని, పొట్టి యామిని, చెబియం నిరుపమ, గంటి మూర్తి, మల్లాది సదా, నాదెళ్ళ వంశీ, నారయణన్ రాజు తోపాటు కొంతమందిబాలగాయకులు రాగయుక్తంగా పాడగా గూటాల రవి, సుశీల నరసింహన్, భమిడిపాటి శ్రీనివాస్ తబల, వయోలిన్, కీబోర్డ్ సహకారం అందించారు.

 తనుగుల సంజీవ్ అధ్యక్షోపన్యాసం చేస్తూ భవిష్యత్కాలానికి సాంస్కృతిక ప్రతినిధులైన యువతకు పెద్దపీట వేయాలన్న సంకల్పంతో 'సిలికానాంధ్ర యువత ' అనే నూతన విభాగాన్ని ప్రారంభించడం జరిగిందని తెలియజేసారు. దీనిలో భాగంగానే పిల్లలకు కవి సమ్మేళనం, సంగీత కార్యక్రమాల్లో ప్రవేశం కలిగించడమే కాకుండా సాంకేతికరంగంలో కూడా శిక్షణ ఇవ్వబడుతుంది. అందుకు తొలిమెట్టుగా మిడిల్ స్కూల్, హైస్కూల్ విద్యార్థులు మద్దాల కార్తీక్, వేదుల మూర్తి సాంకేతిక సారధ్యంలో నిర్మించినరోబోను ప్రదర్శించారు. రోబో తెలుగులో సంభాషిస్తూ, సంగీతానికి అనుగుణంగా నర్తించి అందరిని అబ్బురపరిచింది. కోశాధికారి కూచిభొట్ల రవీంద్ర దాతలను సత్కరించారు. వైస్ చైర్మన్ కొండిపర్తి దిలిప్, అనిల్ అన్నం సారధ్యంలో నలభీములు, అన్నపూర్ణలు రుచికరమైన వంటకాలను వండివడ్డించారు. సీరంరెడ్డి భువనేశ్వరి, కీర్తి శ్రీసుధ రథసారథులుగా, సహాయ కార్యదర్శి బొడ్డు కిశోర్ సహాయంతో విజయవంతంగా నిర్వహింపబడిన ఈ మహోత్సవం అందరి ప్రశంసలను పొందింది.

TeluguOne For Your Business
About TeluguOne
;