RELATED NEWS
NEWS
అమెరికాలో అత్యంత వైభవం గా సిలికానాంధ్ర 609వ అన్నమయ్య జయంతి ఉత్సవం
అమెరికాలో అత్యంత వైభవం గా సిలికానాంధ్ర

609వ అన్నమయ్య జయంతి ఉత్సవం

 

 


క్యాలిఫోర్నియా :  తొలి వాగ్గేయకారుడు పదకవితాపితమహునిగా పేరొందిన అన్నమయ్య 609వ జయంతి ఉత్సవం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ  డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో అత్యంత వైభవం గా జరిగింది. ప్రాంగణమంతా తెలుగుతనం ఉట్టిపడేలా అలకరించడంతో పాటు. పద్మావతీ వేంకటేశ్వరుల విగ్రహాలతో కూడిన మంటపం అందరినీ ఆకట్టుకుంది.

 

 

అన్నమయ్య జయంతి సందర్భంగా సిలికానాంధ్ర ఆధ్వర్యంలో గత రెండు నెలలుగా అమెరికాలోని న్యూజెర్సీ, డాలస్, చికాగో, మిల్పీటస్ మొదలైన నాలుగు నగరాల్లో జరిగిన సంగీత, నృత్య పోటీల్లోని ప్రాంతీయ విజేతలు తుది విడత క్యాలిఫోర్నియా తరలి వచ్చారు.  శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు, వివిధ వయో పరిధుల్లో  సంగీత పోటీదారులకు  అన్నమయ్య కీర్తనలు, మనోధర్మ సంగీతంలో  పోటీలు జరిగాయి. పోటీల మధ్యలో గీతాంజలి మ్యూజిక్ స్కూల్, కచపి స్వరధార అకాడెమి విద్యార్థులు నృత్య గాన ప్రదర్శనలు ఇచ్చారు.

  సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి నృత్య కళాప్రవీణ సుమతీ కౌశల్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. బాలక్కగా సుపరిచితులైన బాల కొండలరావు తన కుమారుడైన ఆదిత్య బుల్లిబ్రహ్మంతో పలు అన్నమయ్య కీర్తనలకు కూచిపూడీ నృత్యం చేసారు. ఈ సంవత్సరం సంగీత నాటక అకాడమీ అవార్డు కు ఎంపికైన బాల్క్కకు, అమెరికాలో కూచిపూడి కి సేవ చేస్తున్న సుమతీ కౌశల్ గారికి మహారాజ పోషకులైన లకిరెడ్డి హనిమిరెడ్డి ఘనంగా సత్కరించారు.

 

 

అనంతరం తితిదే ఆష్తాన విద్వాంసులైన గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ తనయుడు గరిమెళ్ళ అనిల్ కుమార్ అనూరాధ శ్రీధర్ (వయోలిన్), రవీద్రభారతి శ్రీధరన్ (మృదంగం) వాద్య సహకారంతో అన్నమయ్య కీర్తనలతో  సంగీత కచ్చేరీ నిర్వహించారు. ముఖ్యంగా 'తందనాన అహి తందనాన ' మరియు 'సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట ' కీర్తనలు సభికులను ఉత్తేజపరిచాయి. అన్నమయ్య జయంతి సందర్భంగా  మృత్యుంజయుడు తాటిపామల సంపాదకత్వంలో తయారైన   సుజనరంజని ప్రత్యేక సంచికను ఆనంద్ కూచిభొట్ల, దిలీప్ కొండిపర్తి, రాజు చమర్తి, దీనబాబు కొండుభట్ల,  ప్రభ మాలేంపాటి  సమక్షం లో  విడుదల చేసారు ఈ పత్రికకు ఉప సంపాదకులు గా ఫణిమాధవ్ కస్తూరి వ్యవహరించారు. 

  ఆదివారం ఉదయం  అన్నమయ్య జయంతి ఉత్సవం 2వ రోజు నగర సంకీర్తనతో ప్రారంభమైంది. స్వామి వారి ఉత్సవ విగ్రహాలను అన్నమయ్య కీర్తనలతో మిల్పీటస్ నగరంలో రధం మీద ఊరేగించి, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణం లోకి తీసుకువచ్చి వేదిక వద్ద ఉంచి, క్యాలిఫోర్నియాలోని కళాకారులెందరో కలిసి సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలక్క తో పాటు, ఆశ్రిత వేముగంటి (బాహుబలి ఫేం) లు నృత్యార్చన నిర్వహించారు. పిమ్మట ప్రాంతీయ నృత్యపోటీల్లో గెలిచిన వివిధ వయో పరిధుల్లోని పోటీదారులు జాతీయ నృత్య పోటీల్లో పాల్గొన్నారు.  సాయంత్రం జరిగిన కార్యక్రమంలో  పెరవలి జయభాస్కర్ గారిచే  మృదంగ లయ విన్యాసం, అనూరాధ శ్రీధర్ వయోలిన్ సహకారం అందించగా అమోఘంగా జరిగింది. సాయకాలం కార్యక్రమాల్లో ప్రధానాంశమైన నృత్య కచ్చేరి సభను కట్టిపడేసింది.

 

 

 

నృత్యం, సంగీతం కన్నుల పండుగగా, వీనుల విందుగా సాగిన ఈ ద్వంద కళా ప్రదర్శనలో... కర్ణాటక సంగీత విద్వాంసులు శశికిరణ్, చిత్రవీణ గణేశ్ అన్నమయ్య కీర్తనలు ఆలాపించగా కృపాలక్ష్మి దానికి తదనుగుణంగా నృత్యం చేసారు. ముఖ్యంగా 'రామచంద్రుడితడు రఘువీరుడు ', 'వచ్చెను అలమేలుమంగ ' కీర్తనలకు చేసిన నాట్యం, గీతం ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఈ కార్యక్రమానికి వయొలిన్ పై అనూరాధ శ్రీధర్, మృదంగం పై రమేశ్ శ్రీనివాసన్ ఘటం పై నేమాని సోమయాజులు సహకారం అందించారు. జాతీయ పొటీలలో గెలుపొందిన సంగీత, నృత్య పోటీదార్లకు బహుమతుల ప్రదానం తో కార్యక్రమం ముగిసింది.

 

 

అమెరికా వ్యాప్తంగా జరిగిన అన్నమయ్య జయంతి ఉత్సవాలను అత్యంత వైభవం గా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు సిలికానాంధ్ర వాగ్గేయకార బృంద ఉపాద్యక్షులు సంజీవ్ తనుగుల, మరియు బృంద సభ్యులు షీలా సర్వ, వంశీ నాదెళ్ల, వాణి గుండ్లపల్లి, సదా మల్లాది, ప్రవీణ్, శరత్ వేట(న్యూజెర్సీ), భాస్కర్ రాయవరం(డాలస్), సుజాత అప్పలనేని(చికాగో).

TeluguOne For Your Business
About TeluguOne
;