కసబ్ కి ఉరిశిక్ష ఖరారుచేసిన సుప్రీంకోర్టు

ముంబై మారణకాండ కేసులో ప్రథాన నిందితుడైన కసబ్ కి సుప్రీంకోర్ట్ ఉరిశిక్షని ఖరారు చేసింది. కసబ్ కి మరణ శిక్ష తప్ప మరో శిక్ష విధించడానికి వీల్లేదని సుప్రీంకోర్ట్ అభిప్రాయపడింది. కసబ్ కి గతంలోనే ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. తనని మానసికంగా యాంత్రికంగా తయారు చేసి భారత్ మీదికి వదిలారని కసబ్ తన వాంగ్మూలంలో చెప్పాడు. పాకిస్తాన్.. భారత్ వ్యతిరేకంగా కుట్రచేస్తోందన్న విషయం తనకు తెలియకుండానే ఓ పావులా ఉపయోగపడ్డానని కసబ్ ఒప్పుకున్నాడు. ఉద్దేశపూర్వకంగా తను భారత్ కి వ్యతిరేకంగా కుట్రచేయలేదు కనుక మరణశిక్షనుంచి తప్పిచాలని అభ్యర్థించాడు. కిందికోర్టు తన తీర్పును మార్చుకోకపోవడంతో సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకున్నాడు. సుప్రీంకోర్ట్ కూడా అజ్మల్ కసబ్ కి ఉరిశిక్షని ఖరారు చేసింది. కసబ్ పై మొత్తం 12 కేసులున్నాయి.

తెలుగు భాషకి పట్టం కడదాం!

తెలుగునేలమీద తెలుగంటే తెలీని రోజులొచ్చేశాయ్. కాన్వెంట్ చదువులతో ఎంగిలిపీచుమీద మమకారం బాగా పెరిగిపోతోంది. పరభాషల మోజులోపడి మన పిల్లలు మన భాషనే మర్చిపోతున్నారు.  పరాయిభాషని ప్రేమించడం తప్పని చెప్పడం సరికాదు. కానీ.. మాతృభాషను నిర్లక్ష్యం చేయడంమాత్రం క్షమించరాని నేరం. విదేశాల్లో ఉంటున్న తెలుగువాళ్లు పిల్లలకు తెలుగు భాషని నేర్పాలని తెగ తాపత్రయపడుతుంటారు. ఆంధ్రదేశంలో ఉన్నవాళ్లు మాత్రం తెలుగు మాట్లాడితే కీర్తి కిరీటం ఎక్కడ రాలిపడుతుందో అని భయపడిపోతుంటారు. ఇంగ్లిష్ మాట్లాడ్డం ఇప్పుడు స్టేటస్ సింబల్ గా చెలామణీ అవుతోంది. ఎక్కడికెళ్లినా ఇంగ్లిష్ లేదా హిందీలో చెలరేగడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. పొరపాటున ఎవరైనా తెలుగులో మాట్లాడితే తక్కువరకం కింద జమకట్టే దుష్ట సంప్రదాయం ఏపీలో బాగా వేళ్లూనుకుంటోంది. నిజానికి  వచ్చీరాని ఇంగ్లిష్ యాసలో తెలుగుని ముక్కలుముక్కలుగా విరగ్గొట్టి పలికే కొత్త సంప్రదాయాన్ని కొంతమంది తల్లిదండ్రులే పిల్లలకు నేర్పిస్తున్నారనికూడా చెప్పొచ్చేమో. వీలైనంత ఎక్కువగా అక్షరాలను విరిచేసి , పదాలను తుంచేసి జజ్జుజజ్జుగా పలకడం మోడ్రన్ ట్రెండ్ గా మారింది. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఆ రాష్ట్రానికి సంబంధించిన భాష విద్యాప్రణాళికలో తప్పకుండా ఉంటుంది. కానీ.. ఏపీలో మాత్రం కొన్ని స్కూళ్లలో అసలు తెలుగన్నది లేకుండానే పరాయిభాషలసాయంతో లాగించేస్తున్నారు. తెలుగువాళ్లు దీన్ని క్షమించరాని నేరంగా పరిగణించాలి.   గ్లోబలైజేషన్ రోజుల్లో ఇంగ్లిష్ మీద పట్టుసాధించకపోతే అభివృద్ధి పధంలో దూసుకుపోవడం చాలాకష్టం. ఎన్ని ఎక్కువభాషల్లో ప్రావీణ్యముంటే అంత ఎక్కువగా చొచ్చుకుపోగలిగే సామర్ధ్యం అలవడుతుంది. అలాఅని మాతృభాషను మనంతటమనమే కించపరుచుకోవడం, తక్కువగా చూడడంమాత్రం ఏమాత్రం తగనిపని. ఇలా నేల విడిచి సాముచేయడంవల్ల ఏదో ఒకరోజు కిందపడి నడ్డి విరగ్గొట్టుకునే దుస్థితి దాపురిస్తుందన్న విషయాన్ని పరాయిభాషల మోజులోపడి కొట్టుకునేవాళ్లు గుర్తించితీరాలి.     తెలుగు తెలిసినవాళ్లంతా, తెలుగునేలమీద ఉంటున్న వాళ్లంతా తమ మాతృభాషమీద ఎంతగా మమకారం ఉన్నా.. మన భాషనుకూడా ప్రేమతో నేర్చుకుంటున్నారు. మనవాళ్లు మాత్రం పరాయి భాషల్ని నెత్తికెక్కించుకుని మాతృభాషని నేలకేసి కొడుతున్నారు. మాతృభాషను అవమానించడమంటే అమ్మని అవమానించడంలాంటిదే. పరాయివాళ్లు తెలుగుమీద అంత ప్రేమచూపిస్తున్నప్పుడు మనంకూడా కాస్తో కూస్తో ప్రేమను పెంచుకుంటే బాగుంటుందేమో.. తెలుగులో మాట్లాడడం, రాయడం, చదవడం, పిల్లలకు ఓపిగ్గా నేర్పుకోవడంనవ్వ ముందుతరాలకు తేటతేనియల కమ్మని అమ్మభాషను అందించగలుగుతామన్న విషయాన్ని అందరూ గుర్తించితీరాలి.

తెలుగుకు పట్టంకడుతున్న తెలుగు వన్ డాట్ కామ్!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లందర్నీ ఒక్కటిగా నిలబెట్టాలన్న సదాశయంలో మొదలైన ఏకైక సంస్థ తెలుగువన్ డాట్ కామ్. తెలుగు భాషని, తెలుగు సంప్రదాయాన్ని, సంస్కారాన్నీ, విలువల్నీ ప్రపంచవ్యాప్తం చేయాలన్నదే మా ప్రయత్నం. తెలుగు భాషకు పట్టంకట్టేందుకు, ప్రపంచదేశాల్లో తెలుగువాళ్లని ప్రథమస్థానంలో నిలబెట్టేందుకు కంకణంకట్టుకున్న ఏకైక వెబ్ సైట్ తెలుగు వన్ డాట్ కామ్. తెలుగువాళ్లందర్నీ ఒక్కటిగా నిలబెట్టేందుకు మేం చేస్తున్న బలీయమైన ప్రయత్నానికి టోరీ ఓ బలమైన వేదికగా నిలుస్తోంది. ప్రపంచదేశాలన్నింటినుంచి తెలుగుభాషంటే విపరీతమైన అభిమానం ఉన్న వందమంది టోరీకి ఆర్జేలుగా పనిచేస్తూ తెలుగుభాషకి, తెలుగు సంప్రదాయాలకూ అతి విలువైన సేవలందిస్తున్నారు. తెలుగు భాషకి పట్టంకడుతున్న తొలి తెలుగు వెబ్ సైట్ తెలుగు వన్ డాట్ కామ్. తెలుగు భాషను ప్రపంచవ్యాప్తం చేసేందుకు అంతర్జాలంలో వచ్చిన తొలి వెబ్ సైట్ తెలుగు వన్ డాట్ కామ్. ప్రపంచదేశాల్లోఉన్న తెలుగువాళ్లంతా అత్మీయానురాగాల్ని కురిపిస్తూ అక్కున చేర్చుకున్న తొట్టతొలి వెబ్ సైట్ తెలుగువన్ డాట్ కామ్.. ఇప్పటికీ, ఎప్పటికీ మా లక్ష్యం ఒక్కటే తెలుగువాళ్లంతా చల్లగా ఉండాలి. తెలుగు నేలపై పుట్టినవాళ్లంతా ప్రపంచంలో ఎక్కడున్నా ఒక్కటిగానే ఉండాలి. తెలుగుతల్లి ప్రాభవాన్ని దశదిశలా చాటాలి. తెలుగువాళ్ల సత్తాని ప్రపంచానికి రుచిచూపించాలి. తెలుగు పలుకులో ఉన్న తియ్యదనాన్ని తెలుగుబిడ్డలంతా ఆనందంగా అనుభవించాలి.

మా తెలుగు తల్లికీ మల్లెపూదండ !

ఇవాళ తెలుగు భాషా దినోత్సవం. తెలుగుతల్లి తెగ సంబరపడిపోతోంది. పలుకు తేనెలతల్లిగా ప్రసిద్ధురాలైన తెలుగుతల్లికి బిడ్డలంటే ఎంతో మమకారం. అజంతాలకు అనంతమైన మాధుర్యాన్ని కల్పించి నోరారా కమ్మగా మాట్లాడుకోగలిగిన భాగ్యాన్ని కలిగించే ఒక్కగానొక్క భాష తెలుగు భాషే. మిగతా భాషల్లో అక్షరాల చివరలు నేలకు పడిపోతాయి. ఒక్క మన తెలుగు భాషలో మాత్రం అక్షరాలు గర్వంగా నిలబడతాయి. గిడుగు రామ్మూర్తి పంతులుగారి జయంతిని అధికారికంగా మనం తెలుగుభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. తెలుగు భాషకి పట్టంకట్టిన ఆ మహనీయుడు పుట్టిన రోజున పండగ చేసుకుంటున్నాం. వ్యవహారిక భాషను వ్యాప్తి చేయడానికి ఆయన చేసిన కృషి తెలుగువాళ్లందరికీ శ్రీరామరక్ష.  1863 ఆగస్ట్ 29న శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట గ్రామంలో గిడుగు రామ్మూర్తి జన్మించారు. మెట్రిక్యులేషన్ పాసై బడిపంతులు ఉద్యోగంలో చేరారు. ఉద్యోగం చేసుకుంటూనే ఎఫ్.ఎ, బి.ఎ పూర్తి చేశారు. మహారాజా పాఠశాల కళాశాలగా మారగానే ఉపన్యాసకుడిగా అందులో చేరారు. తర్వాతికాలంలో వ్యవహారిక భాషా ఉద్యమమే ఆయనకు ఊపిరిగా మారింది. గిడుగురామ్మూర్తికంటే ముందు చాలామంది వ్యవహారిక భాషను వ్యాప్తి చేయడానికి కృషి చేశారు. కానీ.. వాళ్లంతా వ్యక్తిగతంగా ప్రయత్నంచేసినవాళ్లే.. గిడుగు వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వ్యవహారిక భాష వ్యాప్తిని ఆయన ఓ ఉద్యమంగా మార్చేశారు. దానికోసం కృషి చేస్తున్నవాళ్లందర్నీ ఒక్కతాటిమీదికి తీసుకొచ్చి భాషకి పట్టంకట్టారు. అందుకే గిడుగు తెలుగు వాళ్లకీ, తెలుగు భాషని అమితంగా ప్రేమించేవాళ్లకీ ఆరాధ్యదైవంగా మారారు.

అన్నా పంచెకిందకి నీళ్లొచ్చేస్తున్నాయ్!

అన్నా హజారే టీమ్ సభ్యులు కొట్టుకు ఛస్తున్నారు. ఒకళ్లంటే ఒకళ్లకి ఏమాత్రం పడడం లేదు. విభేదాలు ఎక్కువైపోయి ఎవరిదారి వాళ్లు చూసుకుంటున్నారు. జనం కోసం మొదలుపెట్టిన ఆందోళన రాజకీయ రంగును పులుముకోవడంతో నిజంగా జనంకోసమే బరిలోకి దిగినవాళ్లు టీమ్ నుంచి విడిపోయారు. రాజకీయప్రయోజనాలకోసమే ఇదంతా చేస్తున్నారంటూ బాహాటంగానే సహచరులపై విమర్శలు గుప్పిస్తున్నారు. త్వరలోనే అన్నా కొత్త పార్టీ పెడతారన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అన్నా టీమ్ లో పొలిటికల్ కెరీర్ గురించి కలలుగంటున్నవాళ్ల మాటలుకూడా కొత్త పార్టీ ప్రయత్నాల్ని బలపరుస్తున్నాయ్. పార్టీ పెట్టితీరాలన్న పట్టుదలతో కేజ్రీవాల్ ముందుకు దూసుకెళ్తున్నారు. కోల్ గేట్ కుంభకోణాన్ని సాకుగా చూపించి యూపీఏ, బీజేపీలను ఇబ్బందిపెట్టేందుకు కేజ్రీవాల్ చేసిన ప్రయత్నాల్ని ప్రభుత్వం చాకచక్యంగా అడ్డుకుంది. కేజ్రీవాల్ స్వలాభంకోసమే పనిచేస్తున్నారంటూ కిరణ్ బేడీ ట్విట్టర్ ఇచ్చిన సందేశాలు చాలామందిని ఆలోచింపజేస్తున్నాయి. కేజ్రీవాల్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రాజకీయ మార్గాన్ని ఎంచుకోవడం చాలా ఆనుమానాలకు తావిస్తోందని, అన్నా తక్షణం జోక్యం చేసుకుని కేజ్రీవాల్ కి మార్గనిర్దేశం చేయాలని కిరణ్ గట్టిగా పట్టుబడుతున్నారు. ఆదివారం జరిగిన నిరసన ప్రదర్శనలో బిజెపిని లక్ష్యంగా చేసుకోవాల్సిన అవసరం లేదని కిరణ్ గట్టిగా పట్టుబట్టారు.

భద్రకాళిగా మారిన సోనియా

బొగ్గు కుంభకోణం స్కామ్ విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్న బిజేపీ ఉభయసభల్లో తన ప్రతాపాన్ని చూపించింది. ప్రథాని రాజీనామాకోసం పట్టుబట్టి ఉభయసభల్ని స్తంభింపజేసింది. సోనియాకి, ప్రథానికి ఊపిరాడని పరిస్థితిని కల్పించి పై చేయి సాధించడం ప్రథాన ప్రతిపక్షం వ్యూహం .. ప్రతిపక్షపార్టీ సిద్ధం చేసుకున్న వ్యూహం పూర్తిగా తలకిందులైంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బిజేపీ చేసిన ప్రయత్నాలు ఈ సారి అంతగా పారినట్టు కనిపించలేదు. ఎందుకంటే సోనియా దగ్గరుండి మరీ తమ ఎంపీలతో బీజేపీ ఎంపీలమీద ఎదురుదాడి చేయించారు. గెలవాలంటే నియమాలను పక్కనపెట్టేయక తప్పదనే సూత్రాన్ని స్పష్టంగా పాటించారు. అధికార పక్షం.. మేమేమీ తక్కువ తినలేదన్న రీతిలో విరుచుకుపడింది. యూపీఏ ఎంపీలందరినీ సోనియా ఒక్కతాటిమీద నడిపించారు. ప్రత్యర్ధులు ఖంగుతినే రీతిలో ఎదురుదాడి చేయించారు. సభలో సోనియా దగ్గరుండి తమ ఎంపీల్ని బీజేపీ నేతలమీదికి ఉసిగొలపడం ఆ పార్టీ నేతలకు మింగుడుపడలేదు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా ఆవేశంగా ప్రసంగించారు. తమ పార్టీ ఎంపీలకు ధైర్యాన్ని నూరిపోశారు. కిందపడ్డా మనదే పై చేయి కావాలంటూ అదేశాలు జారీ చేశారు.

రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి

వచ్చేఎన్నికల్లో జగన్ కి ప్రజలు పట్టం కడతారు. ఎన్డీటీవీ తాజా సర్వేలో తేలిన నిజమిది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్థిరతను దూరం చేసుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం లేదని జనం గట్టిగా నమ్ముతున్నారని ఎన్డీటీవీ అంటోంది. జనంలోకూడా ఈ అభిప్రాయం బలంగా స్థిరపడిపోయినట్టే కనిపిస్తోంది.                 ప్రతిపక్షాలుమాత్రం ఎన్డీటీవీ సర్వేపై దుమ్మెత్తి పోస్తున్నాయి. జగన్ మీడియాకు కన్సల్టెంట్ గా పనిచేస్తున్న ఎన్డీటీవీ ఇప్పటికిప్పుడు ఏ సందర్భం లేకుండా ఇలాంటి సర్వేలు ఎందుకు చేయాల్సొచ్చిందో చెప్పాలంటూ టిడిపి నేతలు మండిపడుతున్నారు. కేవలం కన్సల్టెంట్ గా ఉన్న ఎన్డీటీవీ జగన్ ని భుజాలకెత్తుకోవడానికి మాత్రమే ఈ కాకి లెక్కలు చూపిస్తోందని చంద్రబాబు మండిపడుతున్నారు. త్వరలో సాక్షితో ఎన్డీటీవీ టైఅప్ ముగియబోతోంది. పనిలోపనిగా ఓ సర్వేచేసిచ్చేస్తే పోలా అనుకున్న ప్రణయ్ రాయ్.. జగన్ కి ఫేవర్ గా సర్వే ఫలితాలుండేలా జాగ్రత్త తీసుకున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. పబ్లిక్ ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు జగన్ వేసిన ఎత్తుగడే ఎన్డీటీవీ సర్వే అని టిడిపి గట్టిగా అభిప్రాయపడుతోంది.  

ప్రధాని రాజీనామాకు డిమాండ్, సభ వాయిదా

మంగళవారం కూడా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే బొగ్గు కుంభకోణంపై దుమారం చెలరేగింది. ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్ రాజీనామా చేయాలని బీజేపీ పట్టినపట్టు వీడలేదు. ఈ నేపథ్యంలో పార్లమెంటు రెండు సార్లు వాయిదా పడింది. రెండుసార్లు వాయిదా పడిన అనంతరం తిరిగి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయినా పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. బొగ్గుపై చర్చ చేపట్టాలని, ప్రధాని రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుపట్టడంతో సభాపతి లోక్‌సభను గురువారం నాటికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలో కూడా ఇతే పరిస్థితి కొనసాగడంతో ఛైర్మన్ అన్సారీ సభను ఎల్లుండికి వాయిదా వేశారు.

కరెంట్ కష్టాలకు పరిష్కారం

రాష్ట్రంలో ఉన్న కరెంట్ కొరత త్వరలోనే అధిగమిస్తామని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కరెంట్ కొనుగోలు చేద్దామన్నా అందుబాటులో లేకపోవడంతో కరెంట్ కష్టాలు నెలకొన్నాయని అన్నారు. మంగళవారం సీఎం కిరణ్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే 50 ఏళ్లలో బొగ్గు కొరత ఉంటుందని, అందువల్ల సోలార్, విండ్ బయోమ్యాస్ నుంచి విద్యుత్ ఉత్పత్తికి కృషి చేస్తామని కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 2.20 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయన్నారు. అందులో 35 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయని, కరెంట్ సబ్సీడీ కింద రూ.5 వేల కోట్లు ఖర్చుచేస్తున్నామన్నారు. కరెంట్‌ను ఎలా ఆదా చేయాలన్న అంశాలపై సీఎం మాట్లాడారు. టీవీ చూడని సమయంలో స్విచ్ ఆఫ్ చేయడం వల్ల పదిశాతం విద్యత్‌ను ఆదా చేయవచ్చని కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు.

అలిగి అసెంబ్లీ ఎక్కిన నన్నపనేని

రాష్ట్రంలో రైతులుపడుతున్న అవస్థల్ని చూసి టిడిపి నేతలు అల్లాడిపోతున్నారు. రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వానికి తీవ్రస్థాయిలో  నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలపాలన్ననిర్ణయం జరిగిపోయింది. పోలీసులు అక్కడికి వెళ్లనివ్వలేదు. గాంధీ బొమ్మ విగ్రహం ఉన్న ప్రాంగణానికి తాళంవేశారు. టిడిపి నేత నన్నపనేని రాజకుమారికి సర్రున కోపం ముంచుకొచ్చింది. అధికారుల వైఖరిపై అలిగిన ఆమె వెనకాముందూ చూసుకోకుండా అసెంబ్లీపైకి ఎక్కేశారు. అక్కడే కూర్చుని నిరసన తెలపడం మొదలుపెట్టారు. అధికారులకు కంగారు పుట్టుకొచ్చింది. అమ్మా, తల్లీ.. కిందకి దిగితే కోరినవన్నీ ఇస్తామని హామీ ఇచ్చారు. గాంధీ విగ్రహం దగ్గరికి వెళ్లినిస్తామన్నారు. పట్టుబట్టి కూర్చున్న నన్నపనేని కాస్త ఆలోచించారు. అధికారులు అరెస్ట్ చేస్తే నిరసన తెలపడం కష్టమౌతుందనుకున్న ఆమె.. అందరితో కలిసి గాంధీ విగ్రహంముందు ధర్నా చేయొచ్చన్న ఆశతో కిందికి దిగొచ్చారు. రైతుల కష్టాలగురించి చర్చించేందుకు వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలని, అసెంబ్లీలో రైతుల సమస్యలగురించి ఉన్నపళంగా చర్చించాలని నన్నపనేని డిమాండ్ చేస్తున్నారు.

వివిఎస్ లక్ష్మణ్ రిటైర్మెంట్ వెనక అసలు కథ!

వివిఎస్ లక్ష్మన్.. వెరీవెరీ స్పెషల్ లక్ష్మన్.. అవసరమైనప్పుడల్లా భారత జట్టుకి అండగా నిలబడ్డ క్రికెట్ వీరుడు. ప్రత్యర్థి జట్ల గుండెల్లో రెళ్లు పరిగెత్తించిన సెంచరీల యోధుడు. ఎప్పుడూ స్వలాభంకోసం చూసుకోలేదు. దేశం కోసం, ప్రపంచవ్యాప్తంగా భారత క్రికెట్ జట్టు ఖ్యాతి మారుమోగడంకోసం మాత్రమే కృషిచేసిన నిస్వార్ధపరుడికి చివర్లో దక్కిన గౌరవం అర్థంతరంగా అస్త్రసన్యాసం చేయాల్సిన దుస్థితి. నిజంగా లక్ష్మన్ కి ఇంకా ఆడే దమ్ములేదా?మెరుపువేగంతో బ్యాట్ ని ఝుళిపిస్తూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే పౌరుషం తగ్గిపోయిందా..? లేక రాజకీయాలకు తట్టుకోలేక, లెక్కలేనితనంతో విర్రవీగుతున్న పిచ్చికుంకలముందు తలదించుకుని నిలబడలేక రిటైర్మెంట్ ప్రకటించాడా..? అని ప్రశ్నించుకుంటే నిప్పులాంటి నిజం తప్పక పైకి తేలుతుంది. లక్ష్మన్ ఇప్పటికీ పటిష్టమైన ఆటతీరుని కనపరుస్తున్నాడు. సాటిలేని మేటి టెక్నిక్ కి పదునుపెట్టుకుంటూ నమ్మకంగా రాణిస్తున్నాడు. కానీ.. కొత్తగా జట్టులోకి వస్తున్న కమిట్ మెంట్ లేని ఆటగాళ్లను చూస్తే రోజురోజుకీ రోతపుడుతోంది. డబ్బు కుమ్మరించి అడ్డగోలుగా అడ్డదారిలో జాతీయ జట్టులోకి వచ్చేస్తున్న ఆటగాళ్లతీరుని చూస్తే లక్ష్మన్ కే కాదు, మామూలు క్రికెట్ అభిమానులకుకూడా అసహ్యం వేస్తుంది. తనకు ఎదురైన చేదు అనుభవాలు లక్ష్మన్ ని రిటైర్మెంట్ దిశగా నడిపించాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. బెంగళూర్ క్యాంప్ కి కెప్టెన్ ధోనీ హాజరుకాలేదట. బాధ్యతగల సీనియర్ గా లక్ష్మన్ తను చేయాల్సింది చేశాడట. వెర్రిమొర్రివేషాలు వేస్తున్న కుర్ర క్రికెటర్లకు నచ్చేలేదట. వాళ్ల ప్రవర్తన లక్ష్మన్ కి కూడా నచ్చలేదట. కౌన్సిలింగ్ పెట్టిస్తే.. నీ పని నువ్వుచూసుకో అంటూ లక్ష్మన్ ని కుర్రకుంకలు రెట్టించారట. కుర్ర క్రికెటర్లు వేస్తున్న వెర్రివేషాల గురించి కెప్టెన్ తో చర్చించేందుకు ధోనీకి ఫోన్ చేస్తే ధోనీ నుంచి స్పందన కరవైందట. తీవ్రంగా మనస్తాపం చెందిన లక్ష్మణ్.. జాతీయజట్టులోంచి తనను తప్పించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని తెలుసుకున్న తర్వాత తనకు అండగా నిలబడమని అడిగేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశాడట. అసలే నా సీటు ఉంటుందో ఊడుతుందో చెప్పలేని పరిస్థితుల్లో నానా తిప్పలు పడుతున్నా. ఈ పరిస్థితుల్లో నేనేమీ చేయలేను అని ఆ పెద్దాయన చేతులెత్తేయడంతో పరిస్థితి ఇంతదాకా వచ్చింది.  లక్ష్మన్ కి కడుపుమండిపోయింది. ఇంత దయనీయమైన పరిస్థితిలో జాతీయ జట్టుకు ఆడడం అనవసరమనిపించి వెంటనే రిటైర్మెంట్ ప్రకటించాడట. లక్ష్మన్ రిటైర్మెంట్ వెనకున్న తెరవెనక కథ ఇదేనని క్రికెట్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మనది చాలా పెద్ద రాష్ట్రం. చాలామంది పెద్దమనుషులున్న రాష్ట్రం. 42మంది ఎంపీలు రాష్ట్రంనుంచి చట్టసభలకు ఎంపికయ్యారు. కానీ.. ఒక్కరికికూడా దేశానికి కీర్తిప్రతిష్టల్ని ఆర్జించిపెట్టిన నిష్కల్మషమైన క్రీడాకారుణ్ణి వెనకేసుకొచ్చే తీరిక లేదు. ఎవరి పైరవీలు వాళ్లవి. ఎవరి బిజినెస్ లు వాళ్లవి. పక్కవాళ్ల బాధను పట్టించుకునే తీరిక మన ఎంపీలకు లేనేలేదు. వాళ్లు చాలా బిజీ.. అదే సచిన్ టెండూల్కర్ ని పక్కనపెడితే, లేదా టెండూల్కర్ కి ఇలాంటి పరాభవం జరిగితే మహారాష్ట్రీయులు ఊరుకుంటారా..? దేశంమొత్తం మండిపోదూ.. ఓసారి ఇద్దర్నీ పోల్చి చూసుకుంటే విషయం పూర్తిగా అవగతమౌతుంది. టెండూల్కర్ ఎన్ని మ్యాచ్ లు ఆడి ఎన్ని సెంచరీలు కొట్టాడు? లక్ష్మన్ ఎన్ని మ్యాచ్ లు ఆడి ఎన్ని సెంచరీలు చేశాడు? అని అడిగితే క్రికెట్ గురించి తెలిసిన ఏ చిన్నపిల్లాడైనా టక్కున సమాధానం చెబుతాడు. ఏపీలాంటి పెద్ద రాష్ట్రంలో పుట్టిసాటిలేని మేటి ప్రతిభను ప్రదర్శించిన క్రీడాకారుడికి దక్కుతున్న గౌరవం ఎంత? జార్ఖండ్ లాంటి చిన్నరాష్ట్రంలో పుట్టి అన్నిరకాలుగానూ అండదండలతో అందలమెక్కిన ధోనీకి దక్కిన గౌరవమెంత? లక్ష్మణ్ రిటైర్మెంట్ ప్రకటించాడన్న వార్త తెలుసుకున్నాక హెచ్ సీఏ పెద్దలకు చీమకుట్టినట్టైనా అనిపించలేదు.  అంతర్జాతీయ స్థాయిలో తెలుగుతేజాల ఖ్యాతిని చాటిన మేటి క్రీడాకారుడికి కనీసం చిన్న సన్మానం చేయాలన్న జ్ఞానంకూడా లేదు. అడ్డదారుల్లో ఎలా సంపాదించుకోవాలి, దొడ్డిదారిన ఎంత డబ్బుపోగేసుకోవాలి, ఏమార్గంలో మేడలు కట్టుకోవాలి అన్న శ్రద్ధతప్ప.. మన ఆటగాడికి అన్యాయం జరిగినప్పుడు తిరగబడదామన్న ధ్యాసేలేదు. మొదట్నుంచీ రాష్ట్రానికి చెందిన క్రికెటర్లకు అన్యాయం జరుగుతూనే ఉంది. రాష్ట్రంలో సాటిలేని మేటి ఆటగాళ్లుగా రాణించిన ప్రతిభావంతులైన ఆటగాళ్లకు అవకాశాలు దక్కనే లేదు. ప్రస్తుతం హెచ్ సి ఎ అధ్యక్షుడిగా ఉన్న ముందటితరం ఆటగాడు ఎం.వి శ్రీధర్, అవకాశం కోసం పోరాడిపోరాడి విసిగిపోయి పరాయిరాష్ట్రానికి తరలిపోయిన యువతరం ఆటగాడు అంబటిరాయుడు.. అవకాశాలు దక్కని ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఉదాహరణ. మొదట్నుంచీ క్రికెట్ ప్రపంచంలో మహారాష్ట్రీయుల హవానే నడుస్తోంది. కాస్తో కూస్తో కర్నాటక రాష్ట్రం కొందరు ఆటగాళ్లని పట్టించుకుని గట్టిగా పట్టుబడితే వాళ్లకు అవకాశాలు దక్కాయితప్ప మొదట్నుంచీ దక్షిణభారతందేశం ఆటగాళ్లపై జాతీయస్థాయి క్రికెట్ లో అంతులేని వివక్ష కొనసాగుతూనే ఉంది. యువరాజ్ సింగ్ కేన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకుని బాగుపడ్డాక మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. గతంలో అందించిన సేవలకు ప్రతిగా ప్రతిభావంతుడైన ఆటగాడికి ఇప్పుడు మళ్లీ అవకాశం కల్పించడం హర్షణీయమే. కానీ..నిజానికి యువీ సంపూర్ణమైన ఫిట్ నెస్ తో ఉన్నాడో లేదో అన్న ప్రశ్నను మాత్రం ఎవరూ లేవెనెత్తలేదు. సంపూర్ణ ఆరోగ్యంతో, సత్తాచూపించగలిగిన స్థితిలో ఉన్న వివిఎస్ లక్ష్మణ్ సేవల్నిమాత్రం వినియోగించుకోవడానికి బీబీసీఐ ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. అందుకే లక్ష్మణ్ కి విసుగొచ్చి రిటైర్మెంట్ ప్రకటించాడు. లక్షణ్ గొప్పదనాన్ని మనవాళ్లు గుర్తించకపోయినా ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం గుర్తించింది. ఉప్పల్ స్టేడియంలో వి.వి.ఎస్ లక్ష్మణ్, అజారుద్దీన్ ల కాంస్య విగ్రహాల్ని ఏర్పాటుచేయడానికి ముందుకొచ్చింది. కోల్ కతా టెస్ట్ లో క్రికెట్ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన తర్వాత లక్ష్మణ్ ప్రేక్షకులకు బ్యాట్ చూపించిన సన్నివేశం క్రికెట్ అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసింది. అదే తీరులో కాంస్య విగ్రహాన్నితయారుచేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జాతీయ స్థాయి క్రికెట్ లో జరుగుతున్న అంతులేని అరాచకాల్ని, అక్రమాల్నిఎండగట్టడానికి లక్ష్మన్ లాంటి సంస్కారవంతులైన ఆటగాళ్లు సాహసించలేకపోవచ్చు. కానీ.. నిరంతరం ఆ రొచ్చుగుంటలో గడపాలంటే మాత్రం లక్ష్మణ్ కిమాత్రమే కాదు.. నిజాయతీ, నిబద్ధత ఉన్న ఏ ఆటగాడికైనా రోతపుడుతుంది. వెరీవెరీ స్పెషల్ లక్ష్మణ్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. అన్నేళ్లపాటు జాతీయ జట్టుకి సేవలందించినా మ్యాచ్ ఫీజులు తప్ప ఎర్రటి ఏగానీకూడా అడ్డదారిలో సంపాదించకుండా తన నిజాయతీని, నిబద్ధతను చాటుకున్నాడు. చివరికి గౌరవప్రదంగానే రిటైర్మెంట్ ని ప్రకటించి తన ఔన్నత్యాన్నిచాటుకున్నాడు. హేట్సాఫ్ టు వివిఎస్ లక్ష్మణ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లందరి తరఫున లక్ష్మణ్ కి తెలుగువన్ డాట్ కామ్ ఇప్పటికీ, ఎప్పటికీ వివిఎస్ కి మద్దతుగా నిలుస్తుంది.

కాగ్ నివేదిక తప్పులతడకంటున్నప్రథాని

గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల్నే తాము అనుసరించామని, బొగ్గు కేటాయింపుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రథాని అంటున్నారు. బిజెపి కావాలని తమపై బురదజల్లుతోందని యూపీఏ ఎదురుదాడి చేస్తోంది. కాగ్ నివేదికను తప్పులతడకగా అభివర్ణించడం హాస్యాస్పదమని ఆ పార్టీ మండిపడుతోంది. బొగ్గు కుంభకోణంపై ఉభయసభలూ అట్టుడికిపోతున్నాయి. ప్రథాని ప్రకటన చేసినప్పటికీ బిజెపి శాంతించడం లేదు. మన్మోహన్ రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు గట్టిగా పట్టుబడుతున్నాయి. సభలో ప్రథాని ప్రకటన చేసేటప్పుడుకూడా బిజేపీ సభ్యులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. పోడియందగ్గరికి వచ్చి పెద్దపెట్టున నినాదాలు చేశారు. అకాలీదళ్ సభ్యులుమాత్రం మౌనం వహించారు. ఎస్పీ, బిఎస్పీ, ఆర్జేడీ, వామపక్షాల సభ్యులు సీట్లలోనే కూర్చుండిపోయారు. బిజేపీ సభ్యులు ఎంతకీ శాంతించకపోవడంతో సోమవారం.. సభ వాయిదాపడింది.  

ఫీజు రీ ఇంబర్స్ మెంట్ గందరగోళం

ఫీజు రీఇంబర్స్ మెంట్ విషయంలో ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఫీజుల విషయంలో నిర్ణయం తీసుకోకపోవడం, రీ ఇంబర్స్ మెంట్ వ్యవహారంలో స్పష్టత లేకపోవడం విద్యార్థులపాలిట శాపంగా మారింది. మంత్రివర్గ ఉపసంఘం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ప్రభుత్వ ఉదాసీన వైఖరే ఈ గందరగోళానికి కారణమంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఫీజుల రీ ఇంబర్స్ మెంట్ ని ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసిందంటూ ఎస్.ఎఫ్.ఐ పెద్ద ఎత్తున ఆందోళన జరుపుతోంది. ఇంజినీరింగ్ ఫీజుల వ్యవహారంలో అమీతుమీ తేల్చుకునేందుకు  రాష్ట్ర ప్రభుత్వం కోర్ట్ గడపతొక్కింది. కోర్టు నిర్ణయం వెలువడేవరకూ ఈ గందరగోళం తప్పేలా కనిపించడంలేదని విద్యావేత్తలు అంటున్నారు. తమ పిల్లల చదువులతో ప్రభుత్వం ఆడుకుంటోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సమావేశంలో మంత్రివర్గం ఉపసంఘం ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటుందన్న ఆశతో చాలామంది ఎదురుచూస్తున్నారు.  

సీమాంధ్ర ఎంపీల సమైక్యరాగం

సీమాంధ్ర ఎంపీలు మళ్లీ సమైక్యరాగాన్ని ఆలపిస్తున్నారు. తెలంగాణ వాదం మెల్లగా చల్లారుతోందని సీమాంధ్ర ఎంపీలు భావిస్తున్నారు. త్వరలో ఈ విషయంలో ఏదో ఒకటి తేల్చిచెప్పాలని అధిష్టానానికి లేఖ రాశారు. తామంతా సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని చేసిన తీర్మానాన్నికూడా సీమాంధ్ర ఎంపీలు హై కమాండ్ కి పంపుతున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అన్ని ప్రాంతాల అభివృద్ధీ సమానంగా జరుగుతుందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. త్వరలోనే కావూరి ఆధ్వర్యంలో సీమాంధ్ర ఎంపీలంతా కాంగ్రెస్ అధినేత్రిని కలిసి తమ అభిప్రాయాన్ని వ్యక్తిగతంగా తెలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.