కవిత వెనక కమల దళం?
భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుట్ల కవిత పార్టీ అధ్యక్షుడికి రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవంక కవిత లేఖలో పేర్కొన్న అంశాలతో పాటుగా.. అందుకు సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు, విమర్శలు, వీటన్నింటి మించి గత కొంతకాలంగా ఆమె పార్టీతో, ఫ్యామిలీతో సంబంధం లేకుండా సొంత పంథాలో సాగిస్తున్నరాజకీయాలను గమనిస్తే.. ఆమె వెనక ఇంకెవరో ఉన్నారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ లో తనకు అండదండ రెండూ లేవనే నిర్ణయానికి వచ్చే.. ఆమె మరో మార్గంలో ముందుకు సాగుతున్నారని అంటున్నారు.
అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఇంతలా సంచలనం సృష్టించిన కవిత లేఖ పై బీఆర్ఎస్ సహా ప్రధాన రాజకీయ పార్టీలు, వేచి చూచే ధోరణిలోనే ఉన్నాయి. పెద్దగా స్పందించలేదు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కవిత లేఖను పరస్పర ఆరోపణలకు వినియోగించుకుంటున్నాయి. ఆచి తూచి స్పందిస్తున్నాయే కానీ.. గట్టిగా రియాక్ట్ కావడం లేదు. ఆమె రాసిన లేఖను గానీ, ఆమె చేసిన వ్యాఖ్యలను గానీ, అంతగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
బీఆర్ఎస్ ముఖ్య నాయకులలో ఒక్క కేటీఆర్ మినహా మరెవరూ స్పందించలేదు. కేటీఆర్ కూడాజజ పార్టీ అంతర్గత సమస్యలను పార్టీలో చర్చించు కోవాలే కానీ, బయట మాట్లాడడం మంచింది కాదని పరోక్షంగా కవితను హెచ్చరించారు. అలాగే, కవిత లేఖ అంత పెద్ద విషయం కాదని కేటీఆర్ కవిత రేపిన దుమారాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేశారు. అలాగే.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ లో రెంత్ రెడ్డి పేరున్న విషయాన్ని పైకి తెచ్చి చర్చను పక్కదారి పట్టించడానికి ప్రయత్నించారు.
మరోవంక కాంగ్రెస్, బీజేపీలు గుమ్మడికాయ దొంగ ఎవరంటే బుజాలు తడుముకున్నట్లుగా.. ఇదంతా ఫ్యామిలీ డ్రామా అన్నట్లుగా కొట్టి పారేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు , మంత్రులు వివరణ కోరుతున్నారు. ఆ దయ్యాల పేర్లు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా బీజేపీ ఎంపీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు జాయింట్ గా డ్రామాలు ఆడుతున్నాయని అంటున్నారు.
అయితే నిజంగానే.. ఇది ఫ్యామిలీ డ్రామానే అయినా, ఈ డ్రామాలో బీఆర్ఎస్ తో పాటుగా కాంగ్రెస్, బీజేపీ పాత్ర కూడా ఉందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. నిజానికి పైకి కనిపిస్తున్న చిత్రానికి, లోపల జరుగతున్నతతంగానికి మధ్య పొంతన, పోలిక లేదని అంటున్నారు. ముఖ్యంగా, 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు, వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న బీజేపీ, బీఆర్ఎస్ ను బలహీన పరిచేందుకు, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో చిక్కిన కవితను, పావుగా ఉపయోగించుకునే వ్యూహాన్ని అమలు చేస్తోందని అంటున్నారు. నిజానికి ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై, బెయిలుపై విడుదలై వచ్చిన తర్వాతనే కవిత ధోరణిలో మార్పు వచ్చిందని, ముఖ్యంగా తాను కష్టాల్లో ఉన్న సమయంలో తనను పార్టీ, ఫ్యామిలీ పట్టించుకోలేదనే బాధ ఆమెలో ఉందని మెల్ల మెల్లగా బయటకు వస్తోందని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే, కవిత బీజేపీకి దగ్గరయ్యారని, అంటున్నారు. అందుకే జైలు నుంచి బెయిలు పై వచ్చిన తర్వాత కవిత బీఆర్ఎస్ తో అంటీ ముట్టనట్లు ఉండడమే కాకుండా, తెలంగాణ జాగృతి వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. మరో వంక సామాజిక తెలంగాణ నినాదాన్ని పైకి తీసుకు వచ్చి, బీసీల్లో పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహం పెట్టాలనే డిమాండ్ తో పాటుగా బీసీల హక్కుల పోరాటాల్లో పార్టీతో సంబంధం లేకుండా తెలంగాణ జాగృతి తరపున పాల్గొన్నారు.
అయితే.. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నీడ అయినా తనమీద పడకుండా కవిత జాగ్రత్త పడుతున్నారు. చివరకు అమెరికా నుంచి శుక్రవారం (మే 23) హైదరాబాద్ చేరుకున్న సమయంలో కూడా ఆమెకు స్వాగతం పలికేందుక వచ్చిన వారిలో, కుల సంఘాలు, జాగృతి కార్యకర్తలతో పాటుగా కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నా, ఏ ఒక్కరూ కూడా గులాబీ జెండా పట్ట లేదు, కేసీఆర్ కు జై కొట్టలేదు. అంటే.. బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా కవిత, సామాజిక తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారని, ఈ ప్రయత్నాల్లో ఆమె సక్సెస్ అయితే, సామాజిక తెలంగాణ నినాదంగా సొంత పార్టీని ఏర్పాటు చేయవచ్చని అంటున్నారు. అయితే.. ఇదంతా కవిత బీజేపీ కనుసన్నల్లో చేస్తున్నారని అంటున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత తార స్థాయికి చేరిందిజ రానున్న మూడున్నర ఏళ్లలో కాంగ్రెస్ ఇంకా బలహీనపడుతుందని అంచనా వేస్తున్న కమల దళం, కవితను ప్రయోగించి, బీఆర్ఎస్ ను బలహీన పరిస్తే.. కొత్త సమీకరణాలతో, కొత్త పొత్తులతో రాష్ట్రంలో పాగ వేయవచ్చని భావిస్తోంది. అందులో భాగంగానే కవిత ఎపిసోడ్ తెర పైకి వచ్చిందని అంటున్నారు.