భద్రకాళిగా మారిన సోనియా
posted on Aug 29, 2012 9:13AM
బొగ్గు కుంభకోణం స్కామ్ విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్న బిజేపీ ఉభయసభల్లో తన ప్రతాపాన్ని చూపించింది. ప్రథాని రాజీనామాకోసం పట్టుబట్టి ఉభయసభల్ని స్తంభింపజేసింది. సోనియాకి, ప్రథానికి ఊపిరాడని పరిస్థితిని కల్పించి పై చేయి సాధించడం ప్రథాన ప్రతిపక్షం వ్యూహం ..
ప్రతిపక్షపార్టీ సిద్ధం చేసుకున్న వ్యూహం పూర్తిగా తలకిందులైంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బిజేపీ చేసిన ప్రయత్నాలు ఈ సారి అంతగా పారినట్టు కనిపించలేదు. ఎందుకంటే సోనియా దగ్గరుండి మరీ తమ ఎంపీలతో బీజేపీ ఎంపీలమీద ఎదురుదాడి చేయించారు. గెలవాలంటే నియమాలను పక్కనపెట్టేయక తప్పదనే సూత్రాన్ని స్పష్టంగా పాటించారు.
అధికార పక్షం.. మేమేమీ తక్కువ తినలేదన్న రీతిలో విరుచుకుపడింది. యూపీఏ ఎంపీలందరినీ సోనియా ఒక్కతాటిమీద నడిపించారు. ప్రత్యర్ధులు ఖంగుతినే రీతిలో ఎదురుదాడి చేయించారు. సభలో సోనియా దగ్గరుండి తమ ఎంపీల్ని బీజేపీ నేతలమీదికి ఉసిగొలపడం ఆ పార్టీ నేతలకు మింగుడుపడలేదు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా ఆవేశంగా ప్రసంగించారు. తమ పార్టీ ఎంపీలకు ధైర్యాన్ని నూరిపోశారు. కిందపడ్డా మనదే పై చేయి కావాలంటూ అదేశాలు జారీ చేశారు.