తెలుగు భాషకి పట్టం కడదాం!
posted on Aug 29, 2012 @ 11:26AM
తెలుగునేలమీద తెలుగంటే తెలీని రోజులొచ్చేశాయ్. కాన్వెంట్ చదువులతో ఎంగిలిపీచుమీద మమకారం బాగా పెరిగిపోతోంది. పరభాషల మోజులోపడి మన పిల్లలు మన భాషనే మర్చిపోతున్నారు. పరాయిభాషని ప్రేమించడం తప్పని చెప్పడం సరికాదు. కానీ.. మాతృభాషను నిర్లక్ష్యం చేయడంమాత్రం క్షమించరాని నేరం. విదేశాల్లో ఉంటున్న తెలుగువాళ్లు పిల్లలకు తెలుగు భాషని నేర్పాలని తెగ తాపత్రయపడుతుంటారు. ఆంధ్రదేశంలో ఉన్నవాళ్లు మాత్రం తెలుగు మాట్లాడితే కీర్తి కిరీటం ఎక్కడ రాలిపడుతుందో అని భయపడిపోతుంటారు.
ఇంగ్లిష్ మాట్లాడ్డం ఇప్పుడు స్టేటస్ సింబల్ గా చెలామణీ అవుతోంది. ఎక్కడికెళ్లినా ఇంగ్లిష్ లేదా హిందీలో చెలరేగడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. పొరపాటున ఎవరైనా తెలుగులో మాట్లాడితే తక్కువరకం కింద జమకట్టే దుష్ట సంప్రదాయం ఏపీలో బాగా వేళ్లూనుకుంటోంది. నిజానికి వచ్చీరాని ఇంగ్లిష్ యాసలో తెలుగుని ముక్కలుముక్కలుగా విరగ్గొట్టి పలికే కొత్త సంప్రదాయాన్ని కొంతమంది తల్లిదండ్రులే పిల్లలకు నేర్పిస్తున్నారనికూడా చెప్పొచ్చేమో. వీలైనంత ఎక్కువగా అక్షరాలను విరిచేసి , పదాలను తుంచేసి జజ్జుజజ్జుగా పలకడం మోడ్రన్ ట్రెండ్ గా మారింది.
దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఆ రాష్ట్రానికి సంబంధించిన భాష విద్యాప్రణాళికలో తప్పకుండా ఉంటుంది. కానీ.. ఏపీలో మాత్రం కొన్ని స్కూళ్లలో అసలు తెలుగన్నది లేకుండానే పరాయిభాషలసాయంతో లాగించేస్తున్నారు. తెలుగువాళ్లు దీన్ని క్షమించరాని నేరంగా పరిగణించాలి.
గ్లోబలైజేషన్ రోజుల్లో ఇంగ్లిష్ మీద పట్టుసాధించకపోతే అభివృద్ధి పధంలో దూసుకుపోవడం చాలాకష్టం. ఎన్ని ఎక్కువభాషల్లో ప్రావీణ్యముంటే అంత ఎక్కువగా చొచ్చుకుపోగలిగే సామర్ధ్యం అలవడుతుంది. అలాఅని మాతృభాషను మనంతటమనమే కించపరుచుకోవడం, తక్కువగా చూడడంమాత్రం ఏమాత్రం తగనిపని. ఇలా నేల విడిచి సాముచేయడంవల్ల ఏదో ఒకరోజు కిందపడి నడ్డి విరగ్గొట్టుకునే దుస్థితి దాపురిస్తుందన్న విషయాన్ని పరాయిభాషల మోజులోపడి కొట్టుకునేవాళ్లు గుర్తించితీరాలి.
తెలుగు తెలిసినవాళ్లంతా, తెలుగునేలమీద ఉంటున్న వాళ్లంతా తమ మాతృభాషమీద ఎంతగా మమకారం ఉన్నా.. మన భాషనుకూడా ప్రేమతో నేర్చుకుంటున్నారు. మనవాళ్లు మాత్రం పరాయి భాషల్ని నెత్తికెక్కించుకుని మాతృభాషని నేలకేసి కొడుతున్నారు. మాతృభాషను అవమానించడమంటే అమ్మని అవమానించడంలాంటిదే. పరాయివాళ్లు తెలుగుమీద అంత ప్రేమచూపిస్తున్నప్పుడు మనంకూడా కాస్తో కూస్తో ప్రేమను పెంచుకుంటే బాగుంటుందేమో.. తెలుగులో మాట్లాడడం, రాయడం, చదవడం, పిల్లలకు ఓపిగ్గా నేర్పుకోవడంనవ్వ ముందుతరాలకు తేటతేనియల కమ్మని అమ్మభాషను అందించగలుగుతామన్న విషయాన్ని అందరూ గుర్తించితీరాలి.