టెన్నిస్ కి అండీ రాడిక్ గుడ్ బై

యూఎస్ ఓపెన్ కు టెన్నిస్ స్టార్ స్టార్ అండీ రాడిక్ గుడ్ బై చెప్పాడు. అర్జెంటీనా ఆటగాడు మార్టిన్ డెల్ పోత్రో చేతిలో ఓటమిపాలైన రాడిక్ యూఎస్ ఓపెన్ టెన్నిస్ లో కెరీర్ విషాదంతో ముగిసింది. 12 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ లో 2003 యూఎస్ ఓపెన్ తోపాటు 32 టైటిల్స్, 20 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. అంతేకాకుండా తన టెన్నిస్ కెరీర్ లో మూడు సార్లు వింబుల్డన్ రన్నరప్ గా నిలిచాడు. 2002 నుండి 2009 వరకు ప్రతి సంవత్సరం ఫెదరర్‌తో పాటు ఆండీ రాడిక్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ టాప్ 10లో స్థానం పొందాడు. టెన్నిస్‌లో అత్యంత శక్తివంతమైన సర్వీస్‌కు రాడిక్ పేరు. ప్రొఫెషనల్ టెన్నిస్‌లో రికార్డు చేయబడిన వేగవంతమైన సర్వ్ అతనిదే, దాని వేగం 155 mph.

శివకాశి ప్రమాద ఘటనలో 6గురి అరెస్ట్

తమిళనాడు శివకాశి ప్రమాద ఘటనలో ఓంశక్తి ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీ యజమాని సహా అయిదుగురు కాంట్రాక్టర్లను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పేలుళ్ల ఘటనలో 54మంది మృతి చెందగా, మరో 80మంది గాయపడ్డారు. ప్రమాదం అనంతరం ఫ్యాక్టరీ యజమాని పరారిలో ఉన్నాడు. ప్రమాదం సంభవించిన ఓంశక్తి ఫ్యాక్టరీకి బుధవారంతో లెసైన్స్ గడువు ముగిసింది. అందువల్లే చివరిరోజు కార్మికులపై యూజమాన్యం ఒత్తిడి పెంచి ఎక్కువ పని పూర్తిచేసేలా ప్రయత్నించిందని, దీనివల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కాగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నేడు ప్రమాద స్థలంలో పర్యటించనున్నారు. మృతుల కుటుంబాలతో పాటు, క్షతగాత్రులను ఆమె పరామర్శించనున్నారు.

రైల్వే స్టేషన్లో అమ్మాయిని రేప్ చేసిన పోలీస్

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ విఐపి వెయిటింగ్ రూం వద్ద రైల్వే కానిస్టేబుల్ తన ఫ్రెండ్ తో కలిసి 20 ఏళ్ల అమ్మాయి పై రేప్ చేసినట్లు కేసు నమోదైంది. అమ్మాయి పై ఆత్యాచారం చేసిన కానిస్టేబుల్ పింటూ సింగ్ (24), అతని ఫ్రెండ్ ప్రతాప్ సింగ్ (21) పోలీస్ అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. బాధితురాలు మంగళవారం రాత్రి తన చెల్లెతో కలిసి రైల్వే స్టేషన్‌కు వచ్చింది. లాకర్ రూం కోసం చూస్తుండగా, పోలీసు కానిస్టేబుల్ అమ్మాయిని రెండో అంతస్థులో వెయిటింగ్ రూం ఉందంటూ తీసుకుని వెళ్లి, 201 నెంబర్ గదిలో రేప్ చేశారు. రేప్ జరిగినట్లు బాధితురాలికి జరిపిన వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో కానిస్టేబుల్‌ను బుధవారం ఉదయం అరెస్టు చేశారు.కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సైకాలజీ పాఠాలతో పాలమూరు బిడ్డ గిన్నిస్ రికార్డ్

పాలమూరు జిల్లా మరోసారి గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది. నాగర్ కర్నూల్ మండలం పెద్దముద్దనూరుకి చెందిన వంగీపురం శ్రీనివాసాచారి లార్జెస్ట్ సైకాలజీ లెసన్ అనే బోధనా విన్యాసం ద్వారా సైకాలజీ విభాగంలో ప్రపంచంలోనే గిన్నిస్ రికార్డ్ కెక్కిన మొదటి వ్యక్తిగా అర్హత సాధించారు. సెప్టెంబర్ 5, 2102న ఉపాధ్యాయ దినోత్సవంనాడు మహబూబ్ నగర్ లోని ఫాతిమా విద్యాలయం ప్రాంగణంలో శ్రీనివాసాచారి ఒకేసారి 1,436మందికి సైకాలజీ పరిచయపాఠాన్ని చెప్పి గిన్నిస్ రికార్డుని సాధించారు.   డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన ఈ ఘనతను సాధించడంద్వారా సామాజిక చైతన్యాన్ని కలిగించాలన్న ఉద్దేశంతో చారి ప్రత్యేకంగా గురుపూజోత్సవంనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసుకున్నారు. ఈ ఘనతను సాధించడంకోసం మూడేళ్లుగా శ్రీనివాసాచారి గట్టిపట్టుదలతో పనిచేశారు.   

తూ.గో జిల్లా ఎఎస్పీ నవీన్ కుమార్ కిడ్నాప్?

తూర్పుగోదావరిజిల్లా ఎఎస్పీ నవీన్ కుమార్ ని ఎవరో కిడ్నాప్ చేశారన్న అనుమానాన్ని ఆయన బంధువులు వ్యక్తం చేశారు. ఎవరో వచ్చి నవీన్ కుమార్ ని కారులో ఎక్కించుకెళ్లారని, వాళ్లటువెళ్లగానే నవీన్ సెల్ కూడా స్విచాఫ్ అయ్యిందని కుంటుబసభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. నవీన్ కుమార్ బంధువు రోహిత్ స్వయంగా ఈ వివరాల్ని మీడియాకి వెల్లడించారు. ఎస్పీ త్రివిక్రమవర్మకి, ఎఎస్పీ నవీన్ కి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. ఎస్పీ త్రివిక్రమ్ వర్మ తనని చంపడానికి ప్లాన్ చేస్తున్నారని ఆరోపిస్తూ నవీన్ ఈ మధ్యే బహిరంగప్రకటనకూడా చేశారు. జీపు స్టీరింగ్ బోల్ట్ తీసేయించి తనని చంపేసేందుకు ప్రయత్నించారని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దగ్గర నవీన్.. కేసు కూడా నమోదు చేశారు. గంజాయి స్మగ్లర్లనుంచి లంచాలు తీసుకుంటున్న ఎస్పీ.. వాళ్లని ఏమీ అనొద్దని తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని నవీన్ ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో నవీన్ కనిపించకుండా పోవడం తమకు ఆందోళన కలిగిస్తోందని ఆయన బంధువులు చెబుతున్నారు.

శివకాశీలో భారీ అగ్నిప్రమాదం

శివకాశికి దగ్గర్లోఉన్నమీనంబట్టీ గ్రామంలో ఓంశక్తి బాణసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. టపాసుల తయారీ పూర్తైన తర్వాత ప్యాక్ చేసి మరో చోటికి చేర్చేటప్పుడు టపాసులు పేలిపోవడంతో పెద్ద ప్రమాదం జరిగింది. బాణసంచా పేలుడు ధాటికి 20 గదులు పూర్తిగా కాలిపోయాయి. 25మంది ఈ ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయారు. 40మందికిపైగా తీవ్ర గాయాల పాలయ్యారు. పేలుడు పదార్ధాలు జనావాసాలపై పడడంతో ఇళ్లలో కూడా మంటలు చెలరేగాయి. స్థానికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. బైటి ప్రాంతాలనుంచి టపాసులు కొనుక్కెళ్లడానికొచ్చిన వ్యాపారులుకూడా ప్రమాదంలో చిక్కుకున్నారు. మంటల తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంవల్ల ఫైర్ సిబ్బందికూడా ప్రమాదం జరిగిన ప్రాంతం దరిదాపులక్కూడా వెళ్లే పరిస్థితి లేదు. మీనంబట్టీ గ్రామీణ ప్రాంతం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో మెరుగైన వైద్యసేవలుకూడా అందుబాటులో లేవు. ఉన్న ఆసుపత్రులు, డాక్టర్లతోనే క్షతగాత్రులకు వైద్యం జరుగుతోంది. మృతుల సంఖ్య మంరింతగా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

మూడేళ్ల తర్వాతకూడా వై.ఎస్ పాటే..!

వైఎస్ చనిపోయి మూడేళ్లైంది. అయినా ఆయన అభిమానుల గుండెల్లో బతికేఉన్నాడు. రాష్ట్రవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజానీకం ఇప్పటికీ వై.ఎస్ ని ప్రాణసమానంగా ఆరాధిస్తున్నారు. బతికున్నప్పుడు నోరు మెదపలేని మంత్రులు, వై.ఎస్ చనిపోయిన మూడేళ్ల తర్వాత నొప్పి మా దాకా వచ్చింది కనక కళంకమంతా ఆయనకే అంటగట్టాలన్నట్టుగా మాట్లాడుతున్నా జనంలో మాత్రం వీసమెత్తైనా వై.ఎస్ పేరుమీద వ్యతిరేకత కనిపించడంలేదు. వై.ఎస్ ఉన్నన్నాళ్లూ రాష్ట్ర రాజకీయాన్ని శాసించారు. ఊహించని రీతిలో హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించి మూడేళ్లు దాటిన తర్వాతకూడా వై.ఎస్ పేరు రాష్ట్ర రాజకీయాల్ని ఇంకా ప్రభావితం చేస్తూనే ఉంది.   వై.ఎస్ తర్వాత అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలనుకున్న జగన్ కు కాలం కలిసిరాక పోయినప్పటికీ ప్రజల్లో వై.ఎస్ మీద మెండుగా ఉన్న అభిమానం, జగన్ కి కొండంత అండగా నిలబడుతోంది. జగన్ అవినీతి ఆరోపణల్లో పీకలదాకా కూరుకుపోయుండొచ్చుగాక, కానీ.. జనానికిమాత్రం రాజన్న కొడుకన్న సానుభూతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఎవరిని కదిలించినా ‘ఎవరు తినట్లేదు చెప్పండి. ఎందుకు పెద్దాయన కొడుకుని అలా వేధించుకు తింటున్నారు కాంగ్రెసోళ్లు’ అని ప్రభుత్వాన్ని తిట్టిపోయడమేతప్ప జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవాళ్లే లేరు. నిజానికి అభిమానం అనే మాటని పక్కనపెడితే.. ఎవరు తినట్లేదు చెప్పండి అనే భావన ప్రజలకు కలగడం నిజంగా దురదృష్టకరమైన పరిణామమని రాజకీయ విశ్లేషకులంటున్నారు. పొట్టుపోసుకోవడంకోసమే, జల్సాలకోసమో లేక ఖర్చులకోసమో జేబులుకొట్టే చిల్లర దొంగల్ని క్షమించేసినట్టుగా లక్షలకోట్లు మింగేశాడని, మాయచేసి మతలబుచేసి రాష్ట్రాన్ని దోచుకుతిన్నాడని పీకల్లోతు ఆరోపణల్లో కూరుకుపోయిన వ్యక్తిని క్షమించగలిగే మనస్తత్వం ప్రజబాహుళ్యానికే మంచిది కాదని ప్రజస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తుల అంచనా.   ఏదెలాఉన్నా, జగన్ మీద ఎన్ని ఆరోపణలొచ్చినా, నిజంగా జగన్ అవినీతికి పాల్పడ్డాడని రుజువైనాసరే.. ప్రజలు మాత్రం వై.ఎస్ మీద అభిమానాన్ని జగన్ మీద కురిపించడం ఖాయమన్న విషయం కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా తేటతెల్లమయ్యింది. నిజానికి కాంగ్రెస్ అధిష్ఠానం.. జగన్ ఇంత ఎత్తుకు ఎదుగుతాడని ఊహించనేలేదు. మొగ్గలోనే తుంచిపారేద్దామన్న రీతిలో అన్ని వైపులనుంచీ అడ్డుకట్టలు వేసి ఏమాత్రం తలెత్తడానికి వీల్లేకుండా నేరుగా పడగమీదే కొట్టే ప్రయత్నాలు చాలా జరిగినా, వై.ఎస్ ఆశీస్సులతోనే వాటన్నింటినీ తప్పించుకుని ఆయన తనయుడు నెగ్గుకు రాగలుగుతున్నాడని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు మోస్తున్న వాళ్లని అంతలా నెత్తికెత్తుకోవడం సరికాదని చాలా మంది బాహాటంగానే అనుకుంటున్నా.. వై.ఎస్ మీద ప్రజలు చూపిస్తున్న అభిమానాన్నిమాత్రం హర్షించకుండా ఉండలేకపోతున్నారు.  రాష్ట్రంలో ఇప్పుడు టిడిపి, కాంగ్రెస్ పార్టీలకంటే జగన్ పార్టీయే చాలా బలంగా ఉంది. అప్పట్లో జగన్ కి దూరంగా జరిగినవాళ్లుకూడా ఇప్పుడు రాసుకుపూసుకు తిరిగే ప్రయత్నాలు చేస్తున్నారు. వైయస్ చనిపోయిన మూడేళ్ల తర్వాతకూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పార్టీలన్నీ ఆయన పేరుని పలవరిస్తూనే ఉన్నాయ్. వై.ఎస్ చనిపోయాక రాష్ట్ర రాజకీయాలు పెను సంక్షోభంలో కూరుకుపోయాయన్న నిజాన్ని మాత్రం అందరూ అంగీకరించక తప్పదు. మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందన్న నమ్మకంతో కొందరుంటే, ఎలాగైనా జగన్ చేతికి అధికారం చిక్కకుండా చేయాలన్న పట్టుదలతో కాంగ్రెస్ అధిష్ఠానం గట్టిగా పనిచేస్తోంది. చివరికి వై.ఎస్ దయవల్ల జగన్ వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి బైటినుంచి కాంగ్రెస్ కి వెన్నుదన్నుగా నిలవాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుందని చాలా మంది గట్టిగా నమ్ముతున్నారు. ఎవరి నమ్మకాలు వాళ్లవి మరి..  

స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభిచాలని, రిజర్వేష్లన్లు 50 శాతం కుదిస్తూ ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి తెలిపింది. నివేదిక అందిన మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. గత ఏడాది స్థానిక సంస్థల నిర్వహి ప్రత్యే అధికారుల పాలనలో ఉంది. స్థానికల సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ గత సంవత్సరం హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే.

రష్యన్ భామతో పవన్ తీన్ మార్ రూమర్

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ రేణు దేశాయ్ ని వదిలేసి మరో ముద్దుగుమ్మతో ప్రేమాయణం సాగిస్తున్నాడని, వీరి ప్రేమకు గుర్తుగా ఓ బిడ్డకూడా పుట్టిందని, ఓ ప్రముఖ ఇంగ్లిష్ పత్రికతోపాటు, దమ్మున్న ఓ ప్రముఖ వార్తా ఛానల్లో దీనిగురించి వచ్చిన వార్తలన్నీ పుకార్లని అంటున్నారు. కాని ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే పవన్ కళ్యాణ్‌కి పోటీ‌గా టాలీవుడ్లో రాణిస్తున్న ఓ స్మార్ట్ స్టార్ హీరో అభిమాని ఇలాంటి రూమర్లు స్ర్పెడ్ కావడానికి కారణం అయ్యారని అతనిపై పవన్ అభిమానులు కేసు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. పవర్ స్టార్ పై వచ్చిన వార్తలు రూమర్స్ అని తెలియటంతో పవన్ అభిమానులు ఉపిరిపిల్చుకున్నారు.

ఈ వినాయక చవితికి బొజ్జగణపయ్య బుజ్జి విగ్రహాలు

హైదరాబాద్ లో పెద్దఎత్తున ఉగ్రవాదుల ఆనవాళ్లు బైటపడుతున్నాయ్. ఇంటెలిజెన్స్ చాకచక్యం కారణంగా చాలామంది కొత్త ఉగ్రవాదుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ఎంతమంది ఎన్ని రకాలుగా మారు వేషాల్లో తిరుగుతున్నారో అన్న భయం అందరికీ పట్టుకుంది. ఈ వినాయక చవితికి ఉగ్రవాదులు ఎలాంటి విధ్వంసరచనకు స్కెచ్చేస్తున్నారో అన్న భయం అందరిలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.   ఉగ్రవాదులనుంచి ముప్పు పొంచి ఉన్నందుకు వీలైనంతవరకూ చిన్న చిన్న విగ్రహాల్ని ఏర్పాటుచేసుకోవడమే మంచిదని పోలీసులు చెబుతున్నారు. చిన్న విగ్రహాల్ని ప్రతిష్ఠించి పూజించడంవల్ల చుట్టుపక్కల ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరు కొత్తవాళ్లో, ఎవరు విద్రోహులో, ఎవరు స్థానికులో తెలుసుకోవడానికి, అప్రమత్తంగా ఉండడానికి వీలౌతుందని పోలీసులు అంటున్నారు. చిన్న విగ్రహాల్ని నిమజ్జనానికి తరలించడంకూడా చాలా తేలికౌతుంది కనుక ఉగ్రవాదులకు విధ్యంసం సృష్టించేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా నెట్టుకు రావొచ్చని ప్రచారం చేస్తున్నారు.   సాధారణంగా గణేష్ మండపాల్లో హడావుడంతా కుర్రాళ్లదే ఉంటుంది. విగ్రహాన్ని తీసుకురావడం దగ్గర్నుంచి, మంటపాల్ని ముస్తాబు చేయడం, రాత్రివేళల్లో కాపలా పడుకోవడందాకా అంతా కాలనీల్లో కుర్రాళ్లే దగ్గరుండి చూసుకుంటారు. చాలా పెద్దఎత్తున ఉగ్రవాదులు ఆనవాళ్లు బట్టబయలుకావడంతో ఈ సారి పిల్లల బాగోగులపై తల్లిదండ్రులుకూడా కలవరపడుతున్నారు.  

బొగ్గుకుంభకోణంపై దాసరిని ప్రశ్నించిన సిబిఐ

బొగ్గుకుంభకోణానికి సంబంధించి గతంలో గనులశాఖ మంత్రిగా పనిచేసిన దాసరి నారాయణవుని సిబిఐ ప్రశ్నించిందని మీడియాలో పెద్ఎత్తున ప్రచారం జరుగుతోంది. పలుకంపెనీలకు బొగ్గు కేటాయింపులపై దాసరినుంచి వివరాలు సేకరించిన సిబిఐ.. ఐదు కంపెనీలపై చార్జ్ షీట్ దాఖలు చేసిందని, మొయినాబాద్ గెస్ట్ హౌస్ లో దాసరిని అధికారులు ప్రశ్నించారని లోకల్ మీడియా కోడైకూస్తోంది. కానీ.. దాసరి నారాయణరావుమాత్రం తనని సిబిఐ అధికారులు ప్రశ్నించలేదని, మీడియాలో ఈ విషయంపై ప్రసారమౌతున్న వార్తలన్నీ పుకార్లేనని కొట్టిపారేస్తున్నారు. తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ దాసరి ఓ ప్రెస్ నోట్ ని కూడా విడుదల చేశారు.

ఢిల్లీలో మళ్లీ తెలంగాణ లొల్లి

ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేపట్టిన దీక్ష ఉద్రిక్తంగా మారింది. జంతర్ మంతర్ నుంచి ప్రథాని నివాసంవరకూ ర్యాలీగా వెళ్లిన  బీజేపీ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రథాని నివాసంవైపుకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించి బీజేపీ కార్యకర్తల్ని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువుని ప్రయోగించారు. వాటర్ కేనన్ తో గుంపుని చెదరగొట్టారు. కొందరు కార్యకర్తల్నిపార్లమెంట్ పోలీస్టేషన్ లో ఉంచడంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పెద్దఎత్తున విరుచుకుపడుతున్నారు. ప్రకాష్ జవదేకర్ తోపాటు, తెలంగాణని కోరుకునే కొందరు నేతలుకూడా కిషన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఆందోళనలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణకు గాయమైంది.