బెజవాడలో టిడిపి మహాధర్నా

కృష్ణా డెల్టాకు నీటివిడుదలకోసం టిడిపి చేపట్టిన మహాధర్నాకి అనూహ్య స్పందన లభించింది. విజయవాడలో టిడిపి, సిపిఐ మహాధర్నా నిర్వహించాయి. పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గరికి ర్యాలీగా వెళ్తున్న రైతులు, పార్టీల నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. ప్రకాశం బ్యారేజీని ముట్టడించేందుకు ప్రయత్నించిన ఇరుపార్టీల నేతలు, కార్యకర్తల్ని ఆదుపులోకి తీసుకోవడంతో రెచ్చిపోయిన రైతులు పోలీసుల వాహనాల్ని అడ్డుకున్నారు. టిడిపి నేతలు పోలీసుల వాహనాలకు అడ్డంగా పడుకోవడంతో చాలాసేపటివరకూ ఉద్రిక్త వాతావరణ ఏర్పడింది. టిడిపి నేతలు, పోలీసులకు మధ్య పెద్దఎత్తున వాగ్వాదం జరిగింది.   

ఉప్పల్ టెస్ట్: 159 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి ఇన్నింగ్స్‌లో టీంఇండియా పట్టు బిగించింది. 105 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజైన శనివారం బరిలోకి దిగిన కివీస్ 159 పరుగులకు ఆలౌట్ అవడంతో ఫాలో ఆన్‌లో పడిపోయింది. దీంతో భారత్ 279 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ స్కోర్ : 438. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌కు 6 వికెట్లు, ఓజాకు 3, ఉమేష్‌కు 1 వికెట్ తీశారు. శుక్రవారం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూడిలాండ్ సాయంత్రం ఆట ముగిసే సమయానికి 42 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. శనివారం ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ 54 పరుగులు చేసి 159 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. దీంతో ఫాలో ఆన్‌లో న్యూజిలాండ్ జట్టు ఆడనుంది.

పోలీసుల తీరుపై దేవినేని ఉమా ఆగ్రహం

కృష్ణా డెల్టా పరిరక్షణ కోసం జిల్లాలోని ప్రకాశం బ్యారేజీ వద్ద టీడీపీ చేపట్టి మహాధర్నాకు వస్తున్న రైతులు, నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఎమ్మెల్యే దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్త పరిచారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు మహాధర్నా జరుగుతున్న తరుణంలో ప్రభుత్వం కృష్ణా డెల్టా కాలువకు నీరు విడుదల చేసింది. దీంతో ప్రకాశం బ్యారేజీలో వాటర్ లెవల్ 10.7 అడుగులకు పెరిగింది. డెల్టా తూర్పు కాలువకు 500 క్యూసెక్కులు, పశ్చిమ కాల్వకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, తాగు నీటి అవసరాల కోసం గుంటూరు చానెల్‌కు 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయితే ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ పోరాటం ఆగదని దేవినేని హెచ్చరించారు.

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కల్పన సింగ్ మృతి

హైదరాబాద్ లోని మెహదీపట్నంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్పన సింగ్ (27) అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మృతి చెందింది. బంజారాహిల్స్ లోని బీఎస్ ట్రాన్స్‌కమ్ లిమిటెడ్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సంవత్సర కాలంగా ఆమె పనిచేస్తోంది. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సు ఢీకొట్టడంతో, కింద పడిపోయిన కల్పన సింగ్ తలపై నుంచి వాహనాలు వెలడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. కల్పన తండ్రి ఉద్యోగరీత్యా కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వచ్చాడు. ఆరు నెలల నుంచి వీరు హుమాయున్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు.

న్యూయార్క్‌లో కాల్పులు: 2మృతి, 9మందికి గాయలు

అమెరికాలోని న్యూయార్క్‌లో గల ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ సమీపంలో జనంపై తూటాలు పేలాయి. జాన్సన్‌ అనే ఉద్యోగిని తొలగించారన్న అసంతృప్తితో ఉన్మాదిగా మారి కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో ఇద్దరు మరణించారు, మరో తొమ్మిది మందికి గాయలయ్యాయి. ఈ ఉదంతం న్యూయార్క్‌లోని 102 అంతస్తుల ఆకాశహర్మ్యం ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ బయట శుక్రవారం చోటుచేసుకుంది. ఘాతుకానికి పాల్పడిన జెఫ్రీ జాన్సన్(53) అనే వ్యక్తిని పోలీసులు ఎదురుకాల్పుల్లో హతమార్చా రు. ఇటీవల కాలంలో రెండు విచక్షణారహిత కాల్పుల సంఘటనలు చోటు చేసుకున్నాయి. జులై 20న అరోరాలో 'ది డార్క్‌ నైట్‌ రైజెస్‌' అనే సినిమా చూస్తున్న వారిపై జేమ్స్‌ హోమ్స్‌ (24) అనే వ్యక్తి కాల్పులు జరిపిన సంఘటనలో 12 మంది మృతి చెందారు. 58 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ నెల 5న మిల్‌వాకీ బయట సిక్కు మందిరం వద్ద ఒక వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

జేసీతో జగన్ కి చెక్!

ఏపీలో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా తహతహలాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీపై వై.ఎస్ మార్క్ ని తొలగించేందుకు ఆమె విశ్వప్రయత్నం చేస్తున్నారు. కిందటి ఉపఎన్నికల్లో వై.ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనంలో దక్కిన ఆదరణ చూశాక సోనియాకి కంటిమీద కునుకురావడంలేదు. ఎలాగైనా ఏపీలో జగన్ కి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం గట్టి ప్రయత్నాలు చేస్తోందని పార్టీలో సీనియర్లు అనుకుంటున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిని మారుస్తారంటూ పుకార్లు షికార్లు చేస్తున్న నేపధ్యంలో అధిష్ఠానం పరిశీలనలో ఉన్న పోటీదారుల లిస్ట్ లో రాయలసీమ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి పేరుకూడా ప్రముఖంగా వినిపిస్తోందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో జగన్ పార్టీకి , జగన్ వర్గానికి చెక్ పెట్టాలంటే కాస్త గట్టి ప్రత్యర్థినే ఎంపికచేయాల్సుంటుందని సోనియా అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు హస్తినలో కాంగ్రెస్ పెద్దలతో కిరణ్ కుమార్ రెడ్డి జరుపుతున్న సీరియస్ చర్చలు ప్రచారంలో ఉన్న ఊహలకు రెక్కలు మొలిపిస్తున్నాయి. ఏదెలా ఉన్నా..జగన్ వర్గాన్ని గట్టిగా ఎదుర్కోవడానికే అధిష్ఠానం ఇష్టపడుతుందని పార్టీలో సీనియర్లు అంటున్నారు.  

హస్తినలో కుర్చీలాట

పిసీసీ పీఠం ఖాళీ అవుతుందన్న ఊహాగానాలు ఊపందుకున్నకొద్దీ ఆ కుర్చీని దక్కించుకోవాలని తాపత్రయపడేవాళ్ల ప్రయత్నాలు పెరిగిపోతున్నాయి. చిరంజీవికి పీసీసీ పీఠం అప్పజెబితే బాగుంటుందంటూ కొందరు ప్రచారం చేసేస్తున్నారు. చిరుకే సీటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, పీసీసీ పీఠం దక్కితే రాజ్యసభకు రాజీనామా చేస్తారని అభిమానులు అప్పుడే లెక్కలేసుకుంటున్నారు. వాస్తవానికి సీనియర్ హ్యాండ్ రఘువీరాకే సీటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోపక్క రేసులో తనుకూడా ఉన్నానంటూ పాలడుగు యమా స్పీడ్ గా ప్రయత్నం చేసుకుంటున్నారు. అభిమానులు తనని పీసీసీ పీఠంపై చూడాలనుకుంటున్నారంటూ పాలడుగు అధిష్ఠానం దగ్గర సొంతడబ్బా తెగకొట్టేసుకుంటున్నారు. వ్యవసాయ శాఖమంత్రి కన్నా లక్ష్మీ నారాయణ పేరుకూడా ప్రచారంలోఉన్న ప్రాబబుల్స్ లిస్ట్ లో ఉంది.

ఏటి సేస్తాం!

పీసీసీ అధ్యక్షుడు సత్తిబాబు ప్రస్తుతం పీకల్లోతు వైరాగ్యంలో మునిగితేలుతున్నారు. పదవి ఉంటుందో, ఊడుతుందో తెలీని పరిస్థితిలో తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కుంటున్నారు. ఈ విషయమై ఎవరు కదిలించినా చిర్రుబుర్రులాడుతున్నారు. చివరికి ఏమౌతుందోనన్న ఉత్కంఠను స్వయంగా బొత్సకూడా భరించలేకపోతున్నారు. తనకీ దుస్థితి కలగడానికి పూర్తిగా ముఖ్యమంత్రే కారణమంటూ కనిపించినవాళ్లదగ్గరల్లా బొత్స బాధను వెళ్లబోసుకుంటున్నారన్న వార్తలు హస్తిన వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి. అసలు తనకు పీసీసీ అధ్యక్షపీఠం దక్కుతుందని కలలో కూడా ఎప్పుడూ ఊహించలేదని, కాబట్టి ఇప్పుడది ఉన్నా, ఊడినా పెద్ద తేడాయేం లేదని బొత్స అందరితో చెప్పుకుంటున్నట్టు సమాచారం. రేపు పదవిపోతే తలెత్తుకుని ఎలా తిరగాలా అని తెగ ఆలోచించి బొత్స ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారని కొందరు సీనియర్లు గుసగుసలాడుకుంటున్నారు. సత్తిబాబుకి ఎలా అయినా కాస్త ముందు చూపు ఎక్కువే మరి.

ఉప్పల్ టెస్ట్: భారత బౌలర్స్ దెబ్బకు కుప్పకూలిన కీవిస్

భారత్ న్యూజిలాండ్‌ల మధ్య నగరంలోని రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో రోజులో భారత బౌలర్లు ధాటికి న్యూజిలాండ్‌ టాప్ ఆర్డర్ బాట్స్ మెన్ లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. న్యూజిలాండ్ ఓపెనర్లు మెక్ కల్లమ్ 22, విలియమ్సన్ 32 పరుగులకే ప్రజ్ఞాన్ ఓజా పెవిలియన్‌కు పంపగా, గుప్తిల్ 2, రాస్ టేలర్ 2, ఫ్లిన్ 16 పరుగులకే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేశాడు. టీమిండియా బౌలర్స్‌లలో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్ తీసుకోగా, ప్రజ్ఞాన్ ఓజా 2 వికెట్లు తీసుకున్నారు. రెండో రోజు ఆట ముగిసే సయమానికి క్రీజులో ఫ్రాంక్లిన్ 31, వ్యాన్ వేక్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ఫాలోఆన్ నుండి తప్పించుకోవాలంటే ఇంకా 133 పరుగులు చేయాల్సి ఉంది.   శుక్రవారం టీమ్ ఇండియా తొలి ఇన్సింగ్స్లో 438 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. ఓవర్ నైట్ బ్యాట్స్ మెన్ పుజారా 159 పరుగులు చేయగా, ధోని 73 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అశ్విన్ 37 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జీతన్ పటేల్ 4, బౌల్ట్ 3 వికెట్లు తీశారు.     

పాము కరిచి౦దని వెంటపడి కొరికి చంపిన రైతు

నేపాల్ లో మొహమ్మద్ సాల్మో మియా అనే రైతు తన వరిపొలంలో పని చేసుకుంటుండగా నాగుపాము అతడిని కరిచింది. దాంతో విపరీతమైన కోపం వచ్చిన మొహమ్మద్ సాల్మో మియా అనే రైతు పాము వెంటపడి పట్టుకొని దానిని కొరికి చంపాడు. ఆ పాము తనను కరిచినందుకు దానిని కర్రతో కొట్టడమే కాకుండా నోటితో కొరికి చంపాడు. ఈ ఘటన జరిగిన వెంటనే రైతును గ్రామంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించారు. మొహమ్మద్ సాల్మో మియా వయస్సు 55. ఇతను నేపాల్ రాజధాని ఖాట్మాండుకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో ఉంటాడు. ఈ వార్తను నేపాల్ దిన పత్రిక అన్నపూర్ణ డెయిలీ పోస్ట్ గురువారం రోజు ప్రచురించింది.

సుప్రీం కోర్టు తీర్పు పై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తా : సుబ్రమణ్యం స్వామి

2జి కుంభకోణంలో ప్రధాన నిందితునిగా చిదంబరాన్ని చేర్చాలని కోరుతూ సుబ్రమణ్యం స్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు త్రోసిపుచ్చింది. అయితే కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయదలచినట్టు సుబ్రమణ్యం స్వామి వెల్లడించారు. సుప్రీం కోర్టు తీర్పు వెలువడుతూనే సుబ్రమణ్యం స్వామి ఆగ్రహంతో కోర్టు బయటకు వచ్చి తమ ఆక్షేపణను మీడియా ప్రతినిధుల ముందు వ్యక్తం చేశారు. ఇది చెడ్డ తీర్పు అని కూడా వ్యాఖ్యానిస్తూ, కోర్టు తీర్పు ప్రతి అందిన తర్వాత మిగిలిన విషయాలను మాట్లాడతానని ఆయన అన్నారు. తాను అసలు కుట్ర అనే మాటను వాడలేదని, అటువంటప్పుడు కోర్టు ఆ మాటతో తన కేసును ఎలా త్రోసిపుచ్చుతుందని ఆయన ఆవేశంతో ప్రశ్నించారు.

సీఎం పదవికి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా?

 సీఎం సీటు మారబోతోందా..? కిరణ్ కుర్చీకి ఎసరొచ్చేసిందా..? అవునంటున్నారు.. రాష్ట్ర రాజకీయాల్లో తలపండిన నేతలు. ఇప్పటికే ఉన్న సమాచారం నిజమైతే.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్ఠానానికి తన రాజీనామా సమర్పించినట్టే. హై కమాండ్ ఆయన రాజీనామాని ఆమోదించడమే తరువాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం అధిష్ఠానం దగ్గర ఇప్పటికే సీమాంధ్ర,  తెలంగాణ, రాయలసీమ  ప్రాంతాలనుంచి నలుగులు అభ్యర్థుల బయోడేటాలు రెడీగా ఉన్నాయి. కొద్ది కాలంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితిపై తీవ్ర అసంతృప్తితోఉన్న అధిష్ఠానం సీఎం అభ్యర్థిని మార్చాలన్న నిర్ణయానికొచ్చిందని, దాని పర్యవసానమే హస్తినలో ప్రస్తుతం భారీగా జరుగుతున్న కసరత్తని రాజకీయవర్గాలు కోడైకూస్తున్నాయి.