స్తంభించిన బ్యాంకింగ్ సేవలు
దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో లావాదేవీలన్నీ పూర్తిగా స్తంభించిపోయాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకులు, ఎటీఎంలు మాత్రం పనిచేయడంతో వినియోగదారులకు కాస్తంత ఊరట కలిగింది.
కానీ గురువారంకూడా సమ్మె కొనసాగుతుంది కనుక ఏటీఎంలలో డబ్బు అయిపోతే పరిస్థితి మరింత గడ్డుగా తయారవుతుంది. ద యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్స్ ఆధ్వర్యంలో 5 యూనియన్లు, ప్రభుత్వ బ్యాంకుల అధికారులకు చెందిన నాలుగు యూనియన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి. ఎస్బీఐ, ఐడీబీఐ లాంటి ప్రభుత్వరంగ బ్యాంకులతోపాటు 12 ప్రైవేట్ రంగ బ్యాంకులు, 8 విదేశీ బ్యాంకులకు సంబంధించిన అధికార్లంతా సమ్మెలో పాల్గొంటున్నారు. కేంద్రం నియమించిన ఖండేల్వాల్ కమిటీ మానవవనరుల విధానాలపై చేసిన సిఫార్సుల్ని యూఎఫ్ బీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో
యూనియన్లు సమ్మెకు దిగాయి. సమ్మెకారణంగా నగదు బదిలీలు, చెక్కుల క్లియరెన్స్ లు, విదేశీ మారక సేవలు, ఇతర బ్యాంకింగ్ కార్యకలాపాలకు తీవ్రస్థాయిలో విఘాతం కలిగింది. ఖాతాదారులు నానా కష్టాలూ పడ్డారు. ఖాతాదారుల సౌకర్యార్థం ఏటీఎమ్ లలో నగదును ఉంచడానికి ఎస్బీఐ ప్రైవేట్ సంస్థ సేవల్ని వినియోగించుకుంది.