ఎఎస్పీని చంపాలని చూసిన ఎస్పీ?

తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు పోలీస్ బాసులు బాహాటంగా కొట్టుకుంటున్నారు. ఎస్పీ త్రివిక్రమవర్మకు ఎఎస్పీ నవీన్ కుమార్ కి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. ఎస్పీ తనను చంపడానికి ప్రయత్నించారని అడిషనల్ ఎస్పీ నవీన్ కుమార్ ఆరోపించారు. జీపు స్టీరింగ్ బోల్డ్ ని ఊడదీయించి తనను హత్యచేసేందుకు కుట్రచేశారని ఆరోపించారు. అదృష్టం బాగుండి బతికి బైటపడ్డానని చెబుతున్నారు. గంజాయి స్మగ్లర్లనుంచి ఒత్తిడి ఎక్కువకావడంవల్లే త్రివిక్రమవర్మ తనను వేధిస్తున్నారని ఎఎస్పీ ఆరోపిస్తున్నారు. తను చార్జ్ తీసుకున్న దగ్గర్నుంచి గంజాయి స్మగ్లర్లను ఏరేస్తున్నానని, లంచాలకోసం పాకులాడే ఎస్పీ.. ఆ కారణంగా తనపై కక్షకట్టి  ప్రాణాలు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఎస్పీకి వ్యతిరేకంగా కేసు నమోదుచేసేందుకు రంపచోడవరం పోలీస్టేషన్ అధికారులు సహకరించకపోవడంతో నవీన్ కుమార్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గోపాలకృష్ణను కలిసి ప్రైవేట్ కేసు నమోదు చేశారు. ఎస్పీ డ్రైవర్ బసవ దగ్గరుండి గంజాయి స్మగ్లింగ్ మామూళ్లను వసూలు చేస్తాడని, ఎస్పీకి వాటాని పంపిస్తాడని ఎఎస్పీ నవీన్ కుమార్ చెబుతున్నారు.  

ఆస్టేలియా తర్వాత చరిత్ర సృష్టించిన భారత్

అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఆస్టేలియా తర్వాత భారత్ తొలిసారి రెండు వరల్డ్ కప్ టైటిల్ ని సాధించిన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ క్రికెట్ చరిత్రలో ఇండియా, ఆస్టేలియా మాత్రమే ఇలా రెండు వరల్డ్ కప్ టైటిల్స్‌ని సొంతం చేసుకున్న దేశాల లిస్ట్‌లో ఉన్నాయి. ఆస్టేలియా 1987, 1988లో ఈ రికార్డుని నమోదు చేసింది. ఆస్టేలియా 1987లో సీనియర్ వరల్డ్ కప్‌ని గెలుచుకోగా.. 1988లో తొలిసారి ప్రవేశ పెట్టిన అండర్ 19 వరల్డ్ కప్‌ని కైవసం చేసుకుంది. ఆదివారం టౌన్స్ విల్లేలో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్టేలియాపై టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. గతంలో భారత్ 2000, 2008వ సంవత్సరంలో అండర్ 19 వరల్డ్ కప్ టైటిల్స్‌ని గెలిచారు.

ప్రేయసికి కడుపు చేసి వదిలేసిన ప్రియుడు

నల్గొండ జిల్లాలోకల్లెపల్లి గ్రామానికి చెందిన నాగార్జున, బుల్లి (19) అనే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి కడుపు చేసి వేదిలేసాడు. పెళ్లి చేసుకోవాలని అడిగితే నిరాకరించాడు. దీంతో యువతి తల్లిదండ్రులు వాడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నాగార్జునను పిలిపించి బుల్లిని పెళ్లి చేసుకోవాలని లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని చెప్పారు. అయినా అతడు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బుల్లి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును పోలీస్‌ స్టేషన్ ఎదుట తాగి౦ది. వెంటనే ఆమెను మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సలహా మేరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. బుల్లి మృతికి కారణమైన నాగార్జునపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉప్పల్ టెస్ట్: న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం

హైదరాబాద్‌లో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై టీమిండియా ఒక ఇన్నింగ్స్115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫాలో ఆన్ ఆడిన న్యూజిలాండ్ భారత స్పిన్నర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్ లో 164 పరుగులకు ఆలౌటయింది. మెక్ కల్లమ్(52), విలియమ్సన్(42) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆరు వికెట్లు నేల కూల్చాడు. ఓజా మూడు వికెట్లు పడగొట్టాడు. యాదవ్ ఒక వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 438 పరుగులు, కివీస్ 159 పరుగులు చేసింది. ఈ విజయంతో రెండు టెస్ట్ ల సిరీస్ లో ధోనీ సేన 1-0 ఆధిక్యం సాధించింది. రెండో టెస్ట్ బెంగళూరులో ఈనెల 31న ప్రారంభమవుతుంది.

సోనియా, మన్మోహన్ నివాసాల దగ్గర ఉద్రిక్తత

బొగ్గు కుంభకోణాన్ని నిరసిస్తూ సామాజిక కార్యకర్త అన్నా హజారే బృందం సభ్యుడు అరబింద కేజ్రీవాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసం ముట్టడికి కార్యకర్తలు యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకుని, నిరసన కారులను చెల్లాచెదురు చేశారు. లాఠీచార్జీ జరిపి కేజ్రీవాల్‌తో సహ పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు వెళ్లిన కేజ్రీవాల్‌ను పోలీసులు రెండోసారి అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ బృందం నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ప్రధాని ఇంటి ముందు ధర్నాకు దిగింది. మరోవైపు భారీ ఎత్తున మహిళా ఆందోళనకారులు సోనియా నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేయడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. సోనియా, మన్మోహన్ నివాసాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

సైనా నెహ్వాల్ కు డీఎల్ఎఫ్ ఆడి క్యూ 5 కారు

లండన్ ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచి దేశానికి ఖ్యాతి తీసుకొచ్చిన హర్యానా ప్లేయర్లకు ఆడి క్యూ 5 కార్లుతో సత్కరించాలని ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్ నిర్ణయించింది. ఈ ఎస్‌యూవీ కార్లు అందుకునే వారిలో రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్, షూటర్ గగన్ నారంగ్ ఉన్నారు. కాగా, ఒలింపిక్స్‌లో పతకాలు సాధించలేకపోయి నా, బెర్త్ సంపాదించిన మరో 15 మంది రాష్ట్ర క్రీడాకారులకు కూడా మారుతి సుజుకి ఎస్ ఎక్స్ 4 సెడాన్ స్పెషల్ ఎడిషన్ కార్లును డీఎల్ఎఫ్ బహూకరించనుంది. హర్యానా ప్రభుత్వం, డీఎల్ఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్లేయర్లను సత్కరించనున్నారు. ఆదివారం జరిగే కార్యక్రమంలో హర్యానా సీఎం భూపిందర్ సింగ్ హూడా ప్లేయర్లకు తాళాలు అందించనున్నారు.   

అండర్ 19 ప్రపంచకప్ భారత్ సొంతం

అండర్ 19 ప్రపంచకప్ ని భారత్ సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. ఉమ్మక్తచంద్ సెంచరీ, పటేల్ హాఫ్ సెంచరీ జట్టుని బలంగా నిలబెట్టాయి. 47.4 ఓవర్లలోనే భారత్ 227 పరుగులు సాధించి విజయాన్ని సొంతం చేసుకుంది. అపర్ జిత్ 33 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లు పరీస్, స్టెకెటీ, సందూ, టర్నర్.. తలో వికెట్ తీశారు. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ని ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. భారత్ అండర్ 19 ప్రపంచకప్ ని గెలవడం ఇది మూడోసారి. 2000, 2008, 2012లలో అండర్ 19 ప్రపంచ కప్ ని గెలిచిన భారత్ అస్ట్రేలియా రికార్డ్ ని సమం చేసింది.

ప్రేయసితో సరసాలాడుతూ పెళ్లానికి దొరికిపోయిన ఎస్సై

  బేగం బజార్  పోలీస్టేషన్  ఎస్సై వెంకట్ రెడ్డి ప్రేయసితో సరసాలాడుతూ పెళ్లానికి అడ్డంగా దొరికిపోయాడు. కడుపుమండిన  పెళ్లాం.. ఇద్దరినీ బజారుకీడ్చేందుకు ప్రయత్నించింది. మొదటి భార్య బంధువులు ఎస్సైమీద, కొత్త ప్రియురాలిమీద దాడికి ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఫిర్యాదుచేస్తే నిందితుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. అడ్డంగా దొరికిపోయిన ఎస్సైమాత్రం అడ్డగోలుగా వాదిస్తున్నాడు. తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని బుకాయిస్తున్నాడు.   

అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కన్నుమూత

చంద్రుడిపై కాలు పెట్టిన తొలి మానవుడు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్  కన్నుమూశారు. ఆగస్టు 5న జరిగిన బైపాస్ సర్జరీ అనంతరం తలెత్తిన సమస్యలే మరణానికి కారణం. 1969 జూలై 20న చంద్రునిపై దిగిన అపోలో 11 అంతరిక్ష నౌకకు ఆర్మ్‌స్ట్రాంగ్ కమాండర్‌గా వ్యవహరించారు. చంద్రునిపై పాదం మోపీ మోపగానే, ‘‘ఒక మనిషిగా ఇది చాలా చిన్న అడుగే గానీ మానవాళికి మాత్రం గొప్ప ముందడుగు’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయాయి. సహచరుడు ఎడ్విన్ ఆల్డ్రిన్‌తో కలిసి చంద్రుని ఉపరితలంపై స్ట్రాంగ్ మూడు గంటల పాటు గడిపారు. పరిశోధనలు చేయడం, నమూనాలు సేకరించడం, ఫొటోలు దిగడంతో పాటు గోల్ఫ్ కూడా ఆడారు! చంద్రునిపై మనిషి తొలిసారి కాలు మోపిన ఆ క్షణాలను అప్పట్లోనే 50 కోట్ల మందికి పైగా టీవీలో చూశారు. 

ఉప్పల్‌లో క్రికెటర్‌ లక్ష్మణ్, అజర్ విగ్రహాలు

దేశంలో ఏ క్రికెటర్‌కూ ద క్కని అరుదైన గౌరవం హైదరాబాద్ ఆటగాళ్లు వీవీఎస్ లక్ష్మణ్, మహ్మద్ అజరుద్దీన్‌లకు దక్కనుంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాం ధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ ఇద్దరి కాంస్య విగ్రహాలు పెట్టాలని హెచ్‌సీఏ నిర్ణయించింది. అయితే గత మాసంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని హెచ్‌సీఏ కార్యదర్శి ఎంవీ శ్రీధర్ చెప్పారు. మూడు నెలల్లోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. క్రికెట్ ఆస్ట్రేలియా ఆదర్శంతో హెచ్‌సీఏ ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. తొమ్మిది అడుగుల ఎత్తుండే ఈ విగ్రహాలకు దాదాపు రూ. 10 లక్షలు ఖర్చవుతుందని ఆయన తెలిపారు. 2001 కోల్‌కతా టెస్ట్‌లో చారిత్రక ఇన్నింగ్స్ తర్వాత ప్రేక్షకులకు బ్యాట్ చూపిస్తున్న లక్ష్మణ్ విగ్రహం, తన ట్రేడ్‌మార్క్ షాట్ 'ఆన్ డ్రైవ్' పోజులో అజరుద్దీన్ విగ్రహం తయారుచేయిస్తున్నట్లు శ్రీధర్ చెప్పారు.