మా తెలుగు తల్లికీ మల్లెపూదండ !
posted on Aug 29, 2012 @ 9:39AM
ఇవాళ తెలుగు భాషా దినోత్సవం. తెలుగుతల్లి తెగ సంబరపడిపోతోంది. పలుకు తేనెలతల్లిగా ప్రసిద్ధురాలైన తెలుగుతల్లికి బిడ్డలంటే ఎంతో మమకారం. అజంతాలకు అనంతమైన మాధుర్యాన్ని కల్పించి నోరారా కమ్మగా మాట్లాడుకోగలిగిన భాగ్యాన్ని కలిగించే ఒక్కగానొక్క భాష తెలుగు భాషే. మిగతా భాషల్లో అక్షరాల చివరలు నేలకు పడిపోతాయి. ఒక్క మన తెలుగు భాషలో మాత్రం అక్షరాలు గర్వంగా నిలబడతాయి. గిడుగు రామ్మూర్తి పంతులుగారి జయంతిని అధికారికంగా మనం తెలుగుభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. తెలుగు భాషకి పట్టంకట్టిన ఆ మహనీయుడు పుట్టిన రోజున పండగ చేసుకుంటున్నాం. వ్యవహారిక భాషను వ్యాప్తి చేయడానికి ఆయన చేసిన కృషి తెలుగువాళ్లందరికీ శ్రీరామరక్ష. 1863 ఆగస్ట్ 29న శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట గ్రామంలో గిడుగు రామ్మూర్తి జన్మించారు. మెట్రిక్యులేషన్ పాసై బడిపంతులు ఉద్యోగంలో చేరారు. ఉద్యోగం చేసుకుంటూనే ఎఫ్.ఎ, బి.ఎ పూర్తి చేశారు. మహారాజా పాఠశాల కళాశాలగా మారగానే ఉపన్యాసకుడిగా అందులో చేరారు. తర్వాతికాలంలో వ్యవహారిక భాషా ఉద్యమమే ఆయనకు ఊపిరిగా మారింది. గిడుగురామ్మూర్తికంటే ముందు చాలామంది వ్యవహారిక భాషను వ్యాప్తి చేయడానికి కృషి చేశారు. కానీ.. వాళ్లంతా వ్యక్తిగతంగా ప్రయత్నంచేసినవాళ్లే.. గిడుగు వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వ్యవహారిక భాష వ్యాప్తిని ఆయన ఓ ఉద్యమంగా మార్చేశారు. దానికోసం కృషి చేస్తున్నవాళ్లందర్నీ ఒక్కతాటిమీదికి తీసుకొచ్చి భాషకి పట్టంకట్టారు. అందుకే గిడుగు తెలుగు వాళ్లకీ, తెలుగు భాషని అమితంగా ప్రేమించేవాళ్లకీ ఆరాధ్యదైవంగా మారారు.