వివిఎస్ లక్ష్మణ్ రిటైర్మెంట్ వెనక అసలు కథ!
posted on Aug 28, 2012 @ 10:46AM
వివిఎస్ లక్ష్మన్.. వెరీవెరీ స్పెషల్ లక్ష్మన్.. అవసరమైనప్పుడల్లా భారత జట్టుకి అండగా నిలబడ్డ క్రికెట్ వీరుడు. ప్రత్యర్థి జట్ల గుండెల్లో రెళ్లు పరిగెత్తించిన సెంచరీల యోధుడు. ఎప్పుడూ స్వలాభంకోసం చూసుకోలేదు. దేశం కోసం, ప్రపంచవ్యాప్తంగా భారత క్రికెట్ జట్టు ఖ్యాతి మారుమోగడంకోసం మాత్రమే కృషిచేసిన నిస్వార్ధపరుడికి చివర్లో దక్కిన గౌరవం అర్థంతరంగా అస్త్రసన్యాసం చేయాల్సిన దుస్థితి. నిజంగా లక్ష్మన్ కి ఇంకా ఆడే దమ్ములేదా?మెరుపువేగంతో బ్యాట్ ని ఝుళిపిస్తూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే పౌరుషం తగ్గిపోయిందా..? లేక రాజకీయాలకు తట్టుకోలేక, లెక్కలేనితనంతో విర్రవీగుతున్న పిచ్చికుంకలముందు తలదించుకుని నిలబడలేక రిటైర్మెంట్ ప్రకటించాడా..? అని ప్రశ్నించుకుంటే నిప్పులాంటి నిజం తప్పక పైకి తేలుతుంది.
లక్ష్మన్ ఇప్పటికీ పటిష్టమైన ఆటతీరుని కనపరుస్తున్నాడు. సాటిలేని మేటి టెక్నిక్ కి పదునుపెట్టుకుంటూ నమ్మకంగా రాణిస్తున్నాడు. కానీ.. కొత్తగా జట్టులోకి వస్తున్న కమిట్ మెంట్ లేని ఆటగాళ్లను చూస్తే రోజురోజుకీ రోతపుడుతోంది. డబ్బు కుమ్మరించి అడ్డగోలుగా అడ్డదారిలో జాతీయ జట్టులోకి వచ్చేస్తున్న ఆటగాళ్లతీరుని చూస్తే లక్ష్మన్ కే కాదు, మామూలు క్రికెట్ అభిమానులకుకూడా అసహ్యం వేస్తుంది. తనకు ఎదురైన చేదు అనుభవాలు లక్ష్మన్ ని రిటైర్మెంట్ దిశగా నడిపించాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. బెంగళూర్ క్యాంప్ కి కెప్టెన్ ధోనీ హాజరుకాలేదట. బాధ్యతగల సీనియర్ గా లక్ష్మన్ తను
చేయాల్సింది చేశాడట. వెర్రిమొర్రివేషాలు వేస్తున్న కుర్ర క్రికెటర్లకు నచ్చేలేదట. వాళ్ల ప్రవర్తన లక్ష్మన్ కి కూడా నచ్చలేదట. కౌన్సిలింగ్
పెట్టిస్తే.. నీ పని నువ్వుచూసుకో అంటూ లక్ష్మన్ ని కుర్రకుంకలు రెట్టించారట. కుర్ర క్రికెటర్లు వేస్తున్న వెర్రివేషాల గురించి కెప్టెన్ తో
చర్చించేందుకు ధోనీకి ఫోన్ చేస్తే ధోనీ నుంచి స్పందన కరవైందట. తీవ్రంగా మనస్తాపం చెందిన లక్ష్మణ్.. జాతీయజట్టులోంచి తనను
తప్పించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని తెలుసుకున్న తర్వాత తనకు అండగా నిలబడమని అడిగేందుకు ముఖ్యమంత్రి కిరణ్
కుమార్ రెడ్డిని కలిశాడట. అసలే నా సీటు ఉంటుందో ఊడుతుందో చెప్పలేని పరిస్థితుల్లో నానా తిప్పలు పడుతున్నా. ఈ పరిస్థితుల్లో
నేనేమీ చేయలేను అని ఆ పెద్దాయన చేతులెత్తేయడంతో పరిస్థితి ఇంతదాకా వచ్చింది. లక్ష్మన్ కి కడుపుమండిపోయింది. ఇంత దయనీయమైన పరిస్థితిలో జాతీయ జట్టుకు ఆడడం అనవసరమనిపించి వెంటనే రిటైర్మెంట్ ప్రకటించాడట. లక్ష్మన్ రిటైర్మెంట్ వెనకున్న తెరవెనక కథ ఇదేనని క్రికెట్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మనది చాలా పెద్ద రాష్ట్రం. చాలామంది పెద్దమనుషులున్న రాష్ట్రం. 42మంది ఎంపీలు రాష్ట్రంనుంచి చట్టసభలకు ఎంపికయ్యారు. కానీ.. ఒక్కరికికూడా దేశానికి కీర్తిప్రతిష్టల్ని ఆర్జించిపెట్టిన నిష్కల్మషమైన క్రీడాకారుణ్ణి వెనకేసుకొచ్చే తీరిక లేదు. ఎవరి పైరవీలు వాళ్లవి. ఎవరి బిజినెస్ లు వాళ్లవి. పక్కవాళ్ల బాధను పట్టించుకునే తీరిక మన ఎంపీలకు లేనేలేదు. వాళ్లు చాలా బిజీ.. అదే సచిన్ టెండూల్కర్ ని పక్కనపెడితే, లేదా టెండూల్కర్ కి ఇలాంటి పరాభవం జరిగితే మహారాష్ట్రీయులు ఊరుకుంటారా..? దేశంమొత్తం మండిపోదూ.. ఓసారి ఇద్దర్నీ పోల్చి చూసుకుంటే విషయం పూర్తిగా అవగతమౌతుంది. టెండూల్కర్ ఎన్ని మ్యాచ్ లు ఆడి ఎన్ని సెంచరీలు కొట్టాడు? లక్ష్మన్ ఎన్ని మ్యాచ్ లు ఆడి ఎన్ని సెంచరీలు చేశాడు? అని అడిగితే క్రికెట్ గురించి తెలిసిన ఏ చిన్నపిల్లాడైనా టక్కున సమాధానం చెబుతాడు.
ఏపీలాంటి పెద్ద రాష్ట్రంలో పుట్టిసాటిలేని మేటి ప్రతిభను ప్రదర్శించిన క్రీడాకారుడికి దక్కుతున్న గౌరవం ఎంత? జార్ఖండ్ లాంటి చిన్నరాష్ట్రంలో పుట్టి అన్నిరకాలుగానూ అండదండలతో అందలమెక్కిన ధోనీకి దక్కిన గౌరవమెంత? లక్ష్మణ్ రిటైర్మెంట్ ప్రకటించాడన్న వార్త తెలుసుకున్నాక హెచ్ సీఏ పెద్దలకు చీమకుట్టినట్టైనా అనిపించలేదు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగుతేజాల ఖ్యాతిని చాటిన మేటి క్రీడాకారుడికి కనీసం చిన్న సన్మానం చేయాలన్న జ్ఞానంకూడా లేదు. అడ్డదారుల్లో ఎలా సంపాదించుకోవాలి, దొడ్డిదారిన ఎంత డబ్బుపోగేసుకోవాలి, ఏమార్గంలో మేడలు కట్టుకోవాలి అన్న శ్రద్ధతప్ప.. మన ఆటగాడికి అన్యాయం జరిగినప్పుడు తిరగబడదామన్న ధ్యాసేలేదు. మొదట్నుంచీ రాష్ట్రానికి చెందిన క్రికెటర్లకు అన్యాయం జరుగుతూనే ఉంది. రాష్ట్రంలో సాటిలేని మేటి ఆటగాళ్లుగా రాణించిన ప్రతిభావంతులైన ఆటగాళ్లకు అవకాశాలు దక్కనే లేదు. ప్రస్తుతం హెచ్ సి ఎ అధ్యక్షుడిగా ఉన్న ముందటితరం ఆటగాడు ఎం.వి శ్రీధర్, అవకాశం కోసం పోరాడిపోరాడి విసిగిపోయి పరాయిరాష్ట్రానికి తరలిపోయిన యువతరం ఆటగాడు అంబటిరాయుడు.. అవకాశాలు దక్కని ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఉదాహరణ.
మొదట్నుంచీ క్రికెట్ ప్రపంచంలో మహారాష్ట్రీయుల హవానే నడుస్తోంది. కాస్తో కూస్తో కర్నాటక రాష్ట్రం కొందరు ఆటగాళ్లని పట్టించుకుని గట్టిగా పట్టుబడితే వాళ్లకు అవకాశాలు దక్కాయితప్ప మొదట్నుంచీ దక్షిణభారతందేశం ఆటగాళ్లపై జాతీయస్థాయి క్రికెట్ లో అంతులేని వివక్ష కొనసాగుతూనే ఉంది. యువరాజ్ సింగ్ కేన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకుని బాగుపడ్డాక మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. గతంలో అందించిన సేవలకు ప్రతిగా ప్రతిభావంతుడైన ఆటగాడికి ఇప్పుడు మళ్లీ అవకాశం కల్పించడం హర్షణీయమే. కానీ..నిజానికి యువీ సంపూర్ణమైన ఫిట్ నెస్ తో ఉన్నాడో లేదో అన్న ప్రశ్నను మాత్రం ఎవరూ లేవెనెత్తలేదు. సంపూర్ణ ఆరోగ్యంతో, సత్తాచూపించగలిగిన స్థితిలో ఉన్న వివిఎస్ లక్ష్మణ్ సేవల్నిమాత్రం వినియోగించుకోవడానికి బీబీసీఐ ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. అందుకే లక్ష్మణ్ కి విసుగొచ్చి రిటైర్మెంట్ ప్రకటించాడు.
లక్షణ్ గొప్పదనాన్ని మనవాళ్లు గుర్తించకపోయినా ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం గుర్తించింది. ఉప్పల్ స్టేడియంలో వి.వి.ఎస్ లక్ష్మణ్, అజారుద్దీన్ ల కాంస్య విగ్రహాల్ని ఏర్పాటుచేయడానికి ముందుకొచ్చింది. కోల్ కతా టెస్ట్ లో క్రికెట్ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన తర్వాత లక్ష్మణ్ ప్రేక్షకులకు బ్యాట్ చూపించిన సన్నివేశం క్రికెట్ అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసింది. అదే తీరులో కాంస్య విగ్రహాన్నితయారుచేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జాతీయ స్థాయి క్రికెట్ లో జరుగుతున్న అంతులేని అరాచకాల్ని, అక్రమాల్నిఎండగట్టడానికి లక్ష్మన్ లాంటి సంస్కారవంతులైన ఆటగాళ్లు సాహసించలేకపోవచ్చు. కానీ.. నిరంతరం ఆ రొచ్చుగుంటలో గడపాలంటే మాత్రం లక్ష్మణ్ కిమాత్రమే కాదు.. నిజాయతీ, నిబద్ధత ఉన్న ఏ ఆటగాడికైనా రోతపుడుతుంది.
వెరీవెరీ స్పెషల్ లక్ష్మణ్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. అన్నేళ్లపాటు జాతీయ జట్టుకి సేవలందించినా మ్యాచ్ ఫీజులు తప్ప ఎర్రటి ఏగానీకూడా అడ్డదారిలో సంపాదించకుండా తన నిజాయతీని, నిబద్ధతను చాటుకున్నాడు. చివరికి గౌరవప్రదంగానే రిటైర్మెంట్ ని ప్రకటించి తన ఔన్నత్యాన్నిచాటుకున్నాడు. హేట్సాఫ్ టు వివిఎస్ లక్ష్మణ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లందరి తరఫున లక్ష్మణ్ కి తెలుగువన్ డాట్ కామ్ ఇప్పటికీ, ఎప్పటికీ వివిఎస్ కి మద్దతుగా నిలుస్తుంది.