బాధ్యతలను పంచుకోవడమంటే ఏంటి?

ప్రతీ పుట్టుకకీ ఒక ప్రయోజనం వుంది. మన నైపుణ్యాలనీ, శక్తి సామర్థ్యాలనీ అధికంగా ఉపయోగించుకుంటూ, బాధ్యతలను పంచుకుంటూ, మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆనందకర జీవితాన్ని కొనసాగించాలి. ఇదే మనిషి జీవితంలో అందరికీ కావలసినది కూడా. కానీ మనుషులు కొంచెం ఆశ ఎక్కువ గలవారు. ఉన్నదాంతో తృప్తి పడరు. ఇంకా ఇంకా కావాలని అనుకుంటూ వుంటారు.  అయితే మనుషులు జీవితంలో తమకు కావలసిన వాటిని గట్టిగా అడిగి మరీ సాధించుకుంటారు. వీటినే హక్కులు అని అంటారు. ప్రతీ మనిషి హక్కులతోబాటు బాధ్యతలను కూడా పంచుకోవటం నేర్చుకోవాలి. ఒక విద్యార్థిగా, ఉద్యోగిగా, భర్తగా, లేక భార్యగా సంఘంలో సభ్యుడిగా, ఒక అన్నగా, ప్రతి విషయంలోనూ బాధ్యతలను పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం బాధ్యతలను పంచుకోవటం ద్వారా మనకంటూ ఒక విలువ ఏర్పడుతుంది. విలువలు మనిషి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆ విలువలే మనిషిని ప్రత్యేకంగా నిలబెడతాయి. మనిషిలో నైతిక, సామాజిక, ధార్మిక విలువలు తప్పకుండా ఉండాలి. అవి ఉన్న వ్యక్తి లో గొప్ప వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుంది. మనందరిలో వున్న బలహీనత ఏమిటంటే బాధ్యతల నుండి తప్పించుకోవటం, ఇక్కడ బాధ్యత అనే పదాన్ని బట్టే అది ఆ వ్యక్తి తప్పకుండా నిర్వహించాల్సిన పని అనే విషయం అర్థమవుతుంది. కానీ అందరూ ఏమి చేస్తారు?? ఆ పని ఎక్కడ చేయాల్సి వస్తుందో అనే బద్దకంతో ఏవో కుంటి సాకులు, అబద్ధాలు చెప్పి ఆ పని నుండి మెల్లగా దూరం వెళ్ళిపోతారు. కానీ అందరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే బాధ్యతలను స్వీకరించటం వల్ల మనకు ప్రతీ విషయంలోనూ అనుభవం అనేది ఏర్పడుతుంది. ఈ అనుభవం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొనే తెలివితేటలు మనకు లభ్యమవుతాయి. అనుభవమే గురువు, అనుభవాల సారమే జీవితం అని స్వామి వివేకానంద చెప్పిన విషయం అందరూ గుర్తుచేసుకోవాలి.   ఏ పనినైనా సరే తప్పించుకోవడానికి, సాకులు చెప్పడానికి ప్రయత్నించకూడదు. ఎప్పుడూ ఏదోసాకులు చెప్పడానికి ప్రయత్నించేవారు జీవితంలో ఏ పని చెయ్యడానికి కూడా ముందుకు రాలేరు. ఏ పనీ చేయలేరు, పనులు చేయకుండా తప్పించుకునేవారు పనులు చేయడం చేతకాకుండా నిస్సహాయుడిగా, చేతకానివాడిగా తయారవుతున్నాడని అర్థం. అంటే తనని తాను అలా మార్చుకుంటున్నాడు. అలాంటి వాడు  కొంచెం కూడా విలువలను కూడా దక్కించుకోలేరు.  ఒక పనిని చేయకపోవడానికి వంద కారణాలు చెప్పవచ్చు. కానీ అదే పనిని చేయడానికి ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంత అసౌకర్యం ఉన్నా చెయ్యాలన్న మనస్సు ఒక్కటుంటే చాలు చేసేస్తారు. మనలో చెయ్యాలన్న తపన వుండాలి, మన మనస్సును మనమే ప్రోత్సహించుకోవాలి. చెయ్యగలమనే నమ్మకాన్ని మనసుకు ఇవ్వాలి. ఆ రకమైన మనస్తత్వాన్ని మనమే సృష్టించుకోవాలి. అప్పుడే మనం ఏ పనినైనా చెయ్యగలం. ఏ పనినైనా మనసుపెట్టి, బాధ్యతతో చేయగలం అన్న మనస్తత్వంతో చేయాలి. చేయగలమన్న నమ్మకమే మన చేత ఏ పనినైనా చేయిస్తుంది. బాధ్యత అనేది అభివృద్ధికి దారితీస్తుంది. ఈ విధంగా పని చేయాలనే నమ్మకం మనిషిలో బాధ్యతలను మెల్లిగా అభివృద్ధి చేస్తే ఆ బాధ్యతలను అందరూ పంచుకుని వాటిని సక్రమంగా నిర్వర్తిస్తే అప్పుడు ప్రతి కుటుంబం, సమాజం, నేటి వ్యవస్థ అంతా సవ్యంగా ఉంటుంది.                                        ◆నిశ్శబ్ద.

నేటికాలం అనారోగ్యాలకు హేతువు ఇదే!

డిప్రెషన్ అనేది ఒక మానసిక వ్యాధి. జీవితంలో చాలామందికి ఏదో ఒక తెలియని బాధ ఉంటుంది. ప్రపంచ జనాభాలో నూటికి 80% మంది ఏదో ఒక సందర్భంలో డిప్రెషన్కు గురి అవుతుంటారు. ప్రపంచం అభివృద్ధి చెందేకొద్ది, మనుషులు అన్ని రకాల అవసరాలను చాలా సులభంగా తీర్చుకునే కొద్దీ మనుషులకు మానసిక వ్యాధులు ఎక్కువ అవుతూ ఉన్నాయి.  చాలామంది మానసిక సమస్యతో బాధపడుతున్నా సరే అది మానసిక వ్యాధి అని వారు గుర్తించరు. మరీ ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలలో దీన్ని గుర్తించేవారు లేరు. డిప్రెషన్ తో బాధపడే వారిని పొగరు మనుషులుగా ముద్ర వేస్తుంటారు చాలా మంది. డిప్రెషన్కు గురి అయినవారు ఏదో ఒక బాధతో, దుఃఖంతో బాధపడుతుంటారు. ఈ వ్యాధి లక్షణాలు వున్నవారు మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా ఎప్పుడూ అలసిపోయినట్లు కనిపిస్తారు. ఏదో చిరాకు, ఇష్టమైన వాటి మీద కూడా అయిష్టంగా వుంటారు. అంతేకాకుండా వారు చెయ్యగలిగిన వాటిని చెయ్యలేరు, నా వల్లకాదు అన్న ఆలోచనలు కలిగివుంటారు. అందుకే వారు ఏ పనికి ముందుకు రారు, చేయమని ఎవరైనా చెప్పినా కాదని చెబుతారు. ఎప్పుడూ నెగిటివ్ థింకింగ్ కలిగి ఉంటారు. కానీ ఇదంతా వారి నాటకం అని, పని తప్పించుకోవడానికి వారు అలా చేస్తున్నారని చుట్టూ ఉన్నవారు చెబుతారు.  జీవితానికి అవసరం అయిన ఎన్నో విషయాలపై మనం ఇంట్రస్టును కోల్పోతుంటాము. మనకు ఆనందాన్నిచ్చే విషయాలపై ఆటలు, పాటలు, సినిమాలు, షికార్లు, పిక్నిక్ లు, మొదలైన వాటిపట్ల కూడా ఆసక్తి కోల్పోతారు. ఎప్పుడూ ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. డిప్రెషన్ తో బాధపడుతున్న వారికి నిద్రపట్టకపోవడం, నిద్రపట్టినా కలతనిద్రే తప్ప సుఖనిద్ర లభించదు. అంతేకాకుండా నిద్రలో ఏదో భయంకరమైన కలలు రావటం జరుగుతుంది. మరణం గురించిన ఆలోచనలు తరుచుగా వస్తూ వుంటాయి. జీవితం మీద విరక్తి వస్తుంది. బతకటం కంటే చావటం మేలు అనుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. జీవితాన్ని భారంగా భావిస్తారు.  మార్పు అన్నది జీవితంలో అత్యంత సహజమైన విషయం. కాలానుగుణంగా ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. అయితే అందరూ ఆ మార్పులను తట్టుకోలేరు. జీవితంలో ఎప్పుడూ కూడా అన్ని రోజులు ఒకేలా ఉండవు. జీవితం అన్నాక సుఖదుఃఖాలు రెండూ వుంటాయి. దుఃఖం కలిగినప్పుడు తల్లడిల్లిపోయి డిప్రెషన్లోకి వెళ్లిపోకుండా జరిగిన అనుభవించిన సుఖాల గురించి, మంచిని గురించి ఆలోచించాలి. అప్పుడు మనం దుఃఖం గురించి ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళకుండా వుండేందుకు అవకాశం ఏర్పడుతుంది. మార్పులకు అనుగుణంగా మనం మారాలే తప్ప బాధ పడకూడదు. ఏ మార్పు జరిగినా అది మన మంచికే అన్న భావనను కలిగి ఉండాలి. అప్పుడే మానసికంగా ఎంతో కొంత ఓదార్పు లభిస్తుంది. మనం మనకి సంబంధించిన వారు ఎవరైనా దూరమైపోతున్నప్పుడు చాలా బాధపడుతుంటాం. కొంతమంది ఈ చిన్న విషయానికి డిప్రెషన్ కు గురి కావటం జరుగుతుంది. మనుషులు దూరమైనంత మాత్రాన వారిలో మార్పు సంభవించదు, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి.  ఎంతదూరంగా ఉంటే అంత ఎక్కువ ప్రేమ పెరుగుతుంది అన్న సత్యాన్ని ఆలోచించినట్లయితే డిప్రెషన్కు టాటా చెప్పవచ్చు.                                        ◆నిశ్శబ్ద.

ప్రేమకు నిర్వచనాలు ఏవి?

ప్రేమ అనగానే అందరికీ ఎక్కడలేని హుషారు పుడుతుంది. జీవితంలో తోడుగా అన్ని రకాల ఎమోషన్స్ షేర్ చేసుకోవడానికి ఒక తోడు అనేది ప్రేమికుడు లేదా ప్రేమికురాలి ద్వారా దొరుకుతుంది. అయితే ప్రేమ అనే రెండు అక్షరాలకు నిజమైన అర్థం నిజం, నిజాయితీ, నమ్మకం, ధైర్యం, విజయం. ఈ అయిదు ప్రేమకు నిజమైన అర్థాలు...! ఈనాటి సమాజంలో వున్న యువకుల ఆలోచనలు ఎక్కువగా ప్రేమవైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రేమ అంటే వాళ్ళ దృష్టిలో కళ్ళలో కళ్లు పెట్టుకుని చూసుకుని నవ్వుకోవడం, సైగలు చేసుకోవడం, ప్రేమికుడు లేదా ప్రియురాలి కోసం ఏమైనా కొనివ్వడం సినిమాలకు తీసుకెళ్ళడం, ప్రియురాలు ఏదైనా అడిగితే ప్రేమికుడు ప్రియురాలు కోసం తన తాహతుకు మించకపోయినా ప్రియురాలు అడిగినదాని కోసం తల్లిదండ్రులకు తెలియకుండా అప్పులు చేయడం ప్రియురాలి కోరికలు తీర్చడం వంటివి చేస్తున్నారు. చివరికి తల్లి దండ్రులకు అప్పుల బాధను మిగిల్చి, వాళ్ళు వారి సరదాలను కోరికలను తీర్చుకుంటున్నారు. ఇది సమంజసం కాదు. ఇది ప్రేమికురాలికి న్యాయం చేయడమా, లేక తల్లిదండ్రులకు న్యాయం చేయడమా మీరే ఆలోచించండి.  నిజమైన ప్రేమికుడు లేక ప్రియురాలుకు ముందు ప్రేమ పట్ల మంచి అవగాహన వుండాలి. ప్రేమను ఆరాధించాలి, అలాగే తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడాలి. వయసులో ఉన్నవారు ప్రేమించడం సహజం. ప్రేమించడం తప్పేమీ కాదు. ప్రేమికులు ఇద్దరు మీకు ఉన్నదాంట్లో మీ కుటుంబానికి తగ్గట్టుగా ఖర్చు చేసుకోవాలి. మీరు మీ ప్రేమ మోజులో పడిపోయి తల్లిదండ్రులను అప్పుల బాధకు గురి చేయకూడదు. ప్రేమికుడికి, ప్రేమికురాలు ఇవ్వవలసిన నిజమైన ఆనందం, ప్రేమికుడికి తల్లి దండ్రుల దగ్గర మంచిగౌరవం వుండేలా సమాజంలో మంచి గుర్తింపు ఉండేలా చేయడం. ఇది నిజమైన ప్రేమికురాలు ప్రేమికుడికి ఇచ్చే నిజమైన ఆనందం. ప్రేమ మోజులో పడిపోయి మీరు అనవసరపు ఖర్చు చేయకూడదు. అలాగే అబ్బాయిలు అమ్మాయిల విషయంలో  ఒక పరిధిలో ఉండాలి. చాలామంది ప్రేమ అనగానే ఇక మొత్తం ఒకరికొకరు ఏకమైపోవాలి అనుకుంటారు. శారీరకంగా కలవడానికి ఒత్తిడి చేస్తుంటారు. దానివల్ల జీవితాలు పెద్ద సమస్యల్లో చిక్కుకుంటాయి. ప్రేమంటే మనుషుల్ని అర్థం చేసుకుని ఆరాధించి తరువాత ఇద్దరూ కలిసి ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టడం. అంతే తప్ప ముందే అన్ని అయిపోవాలని లేకపోతే ప్రేమ లేదు అని మాటలు చెప్పడం కాదు.  మీరు ఒకవేళ ప్రేమ మోజులో పడితే నిజాయితీగా వుండి మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. ఇద్దరు ఒకరికొకరు ఆలోచించుకొని ఒక సరైన లక్ష్యాన్ని ఎంచుకోవచ్చు. ఆ లక్ష్యంపై నమ్మకాన్ని పెంచుకోవాలి. అలా నమ్మకం ఏర్పడితే జీవితంలో భవిష్యత్తు గొప్పగా ఉంటుందనే ధీమా వస్తుంది.  ఏర్పరుచుకున్న ఆ లక్ష్యంలో ఏవైన సమస్యలు వస్తే కృంగిపోకుండా ధైర్యంగా వుండాలి. ఆ సమస్యను ఇద్దరు ధైర్యంతో పరిష్కరించుకోవాలి. ఇద్దరూ నిర్ణయంలోనూ, సమస్యలొనూ, పరిష్కారంలోనూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటే ఎంత ఇబ్బందులు అయినా అధిగమించగలుగుతారు.  ఇలా లక్ష్యాన్ని ఏర్పరుచుకొని విజయాన్ని సాధించి మీ తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టి మీ ప్రేమకు తల్లిదండ్రుల నుండి సమాజం నుండి మంచి గుర్తింపు వుండేలా చేసుకోవాలి. మీ ప్రేమను ఇతర ప్రేమికులు ఆదర్శంగా తీసుకునేలా మీరు గొప్పగా ఉండాలి అనుకోవాలి. ఇద్దరి మధ్యన ప్రేమ స్నేహభావంగా వుండాలి. ఇది మాత్రమే కాదు ప్రేమకు కావలసింది ఓర్పు, సహనం, ఇవి రెండూ కూడా చాలా అవసరం. అదే విషయాన్ని ఆలోచించాలి.  ప్రేమ మోజులో పడిపోయి తల్లిదండ్రులకు కడుపు కోతను కన్నీటిని మిగిల్చి పారిపోయి పెళ్ళి చేసుకోవడం న్యాయమా? లేక మీ ప్రేమకు మంచి లక్ష్యాన్ని ఏర్పరుచుకుని మీ ప్రేమ పట్ల మీ తల్లిదండ్రులకు మంచి గుర్తింపు కలిగేటట్లుగా వ్యవహరించడం న్యాయమా? ప్రేమకు నిర్వచనాలను ఎవరికి వారు ఇచ్చుకుంటూ నిజమైన నిర్వచనాన్ని నవ్వులపాలు చేయకూడదు. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి.                                           ◆నిశ్శబ్ద.

నమ్మకం విజయానికి తొలి అడుగు అంటారెందుకు?

మనిషికి జీవితంలో నమ్మకమనేది ఎంతో ముఖ్యం. అది మనిషి జీవితాన్ని ఎప్పుడూ మెరుగ్గా ఉండేలా, ధైర్యంతో నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఓ చిన్న కథ అదే చెబుతుంది….. పూర్వం ఒక రాజు వుండేవాడు. అతని భార్య గొప్ప అందగత్తె.  ఆమెను చాలా ప్రేమతో చూసుకునేవాడు. ఆమెకు ఎక్కడ లేని నగలను దేశ విదేశాల నుంచి తీసుకువచ్చే వాడు. అరేబియా నుంచి నగల వర్తకులు నేరుగా ఆమె భవనానికి వచ్చి నగలు అమ్మేవారు. ఇలా 25 సంవత్సరాలు గడిచాయి. ఆమె అందం తగ్గింది. రాజు మరో భార్యను చేసుకున్నాడు. క్రమక్రమంగా ఆమె దగ్గరికి రావటం తగ్గించాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. పెద్దభార్య భర్త తనదగ్గరకి తిరిగి రాకపోతాడా అని ఎదురు చూస్తుండేది. ఆ రాజ్యంలో జరుగుతున్న విశయలు ఏమీ తెలియని ఒక అరేబియా వర్తకుడు రాజ్యానికి వచ్చాడు. అతడు తన దగ్గరవున్న అత్యంత ఖరీదైన నగను పెద్ద రాణికి అమ్మడానికి సరాసరి ఆమె భవనానికి వచ్చాడు. ఆ నగను ఆమెకు చూపించాడు. ఆ రాణి ఆ నగ పనితనానికి ముచ్చటపడి కొనాలని ఆసక్తి చూపి, భర్త నిరాదరణ గుర్తుకువచ్చి మానివేసింది.  ఆమె అనాసక్తిని అరేబియా వర్తకుడు మరొక విధంగా తలచి "అమ్మా, ఈ హారానికయ్యే సొమ్మును నాకు వెంటనే ఇవ్వవలసిన అవసరం లేదు. నేను వర్తకం నిమిత్తం మరిన్ని దేశాలు తిరగవలసివస్తుంది. సంవత్సరం తరువాత నేను మీ రాజ్యానికి తిరిగివస్తాను. అప్పుడు నాకు సొమ్ము ఇవ్వవచ్చు" అన్నాడు.  రాణి ఇంకా తటపటాయిస్తూండగా ఆమె కొడుకైన యువరాజు ఆ హారాన్ని తీసుకొని, తల్లి మెడలో అలంకరించాడు. వర్తకుడు ఆనందంతో వెళ్ళిపోయాడు. వర్తకుడు వెళ్ళిపోయిన తర్వాత కొడుకు తల్లితో "ఎందుకమ్మా అంత ఆలోచిస్తున్నావు? సంవత్సరం లోపల ఏమైనా జరగవచ్చు. నాన్నగారు మనసు మారి మళ్లీ నీ దగ్గరకు రావచ్చు, రాజ్యాధికారం అంటే విరక్తి కలిగి నన్నే రాజుగా ప్రకటించవచ్చు. పిన్ని ఆరోగ్యానికి భంగం కలిగి రాజు నిన్నే ఆదరించవచ్చు, రాజు దురదృష్టం కొద్దీ మరణిస్తే నేనే యువరాజును కాబట్టి రాజ్యాధికారం నాకే రావచ్చు. నాన్నగారు అనారోగ్యానికి లోనైనా నాకే రాజ్యాధికారం రావచ్చు. సంవత్సరంలోపు ఏమైనా జరగవచ్చు, నేను పొరుగు రాజ్యాన్ని జయించి రాజును కావచ్చు. గుర్రం ఎగరవచ్చు, కుక్కలు సింహాలను ఎదిరించవచ్చు. సంవత్సరంలో ఈ నగల వ్యాపారి మరణించవచ్చు, ఒక సంవత్సరం తరువాత మన దగ్గరడబ్బు లేకపోతే నగ నచ్చలేదని తిరిగి అతనికే ఇచ్చేయవచ్చు. సంవత్సరం తరువాత మనదే రాజ్యం అన్న నమ్మకాన్ని పెంచుకో అమ్మా మనకి మంచి జరుగుతుంది అన్నాడు.  వర్తకుడు తిరిగివచ్చేగడువు మూడు రోజులలోకి వచ్చింది. పెద్దరాణి ఆందోళన పడసాగింది. యువరాజు ధైర్యంగా ఉన్నాడు. పరిస్థితులలో ఏ మార్పు లేదు. రెండు రోజులలోకి వచ్చింది గడువు, పెద్దరాణి నగను వర్తకుడికి ఇచ్చేయడానికి సిద్ధపడింది ఇంతలో పిడుగులాంటి వార్త. రాజుగారిని హఠాత్తుగా కొంతమంది దొంగలు బంధించటం జరిగింది. యువరాజు ధైర్యంగా అడవికి వెళ్ళి, ఆ దొంగలను బంధించి, రాజును విడిపించాడు. రాజుగారు సంతోషించి యువరాజుకు రాజ్యం అప్పగించడానికి సిద్ధపడ్డాడు. గడువు చివరిరోజు యువరాజుకి రాజుగా పట్టాభిషేకం జరుగుతున్నది. ఆ సమయానికి అక్కడికి వచ్చిన అరేబియా వర్తకుడిని యువరాజు సాదరంగా ఆహ్వానించి, అతనికి నగకి ఇవ్వలసిన దానికంటే ఇంకా ఎక్కువ ఇచ్చి ఉచితరీతిన సత్కరించి పంపాడు. ఏ పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని పొగొట్టుకోకూడదు. నమ్మకమనే విశ్వాసాన్ని మించిన శక్తి లేదు. భవిష్యత్తు మనదేనన్న నమ్మకంతో జీవించాలి. పైన చెప్పుకున్న కథ అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఏ పరిస్థితులలో అయినా నమ్మకం, ధైర్యం కలిగి ఉన్నపుడే మనం జీవితంలో ఏదైనా సాధించగలిగేది. ఆ విషయం ఎప్పటికీ మరచిపోకూడాది.                                       ◆నిశ్శబ్ద.

ప్రపంచము-శాంతి అంతిమ లక్ష్యమేంటి?

శాంతి అనేది ఎన్నో జీవితాలను సమస్యల నుండి బయట పడేస్తుంది. ఎలాంటి భయాందోళనలు లేని జీవితం గడిపేలా చేస్తుంది. అందుకే ఎందరో ప్రముఖులు శాంతి కోసం పోరాడారు. ప్రపంచానికి శాంతి కావాలని, అదే ప్రపంచాన్ని ఉన్నతంగా నిలబెడుతుందని. శాంతి వల్లనే అన్ని దేశాలు, అన్ని వర్గాలు ప్రజలు తమ జీవితాన్ని తాము హాయిగా గడపగలుగుతారు.   ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 21ని అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా జరుపుకుంటారు.  ఈ శాంతి దినోత్సవం రోజు ఐక్యరాజ్యసమితి 24 గంటల పాటు ఎక్కడా హింస, పీడించడం,  కాల్పులు జరపడం వంటివి చేయకూడదని. దీని ద్వారా కలిగే చిన్నపాటి మార్పు ప్రజలలో ఆలోచనను రేకెత్తి ఆ మార్పు దీర్ఘకాలం వైపు మరలేలా అడుగులు పడటానికి మూలమవుతుందని నిర్ణయించింది. ఈ విధంగా  శాంతి దినోత్సవాన్ని పాటించడం ద్వారా శాంతి ఆదర్శాలను బలోపేతం చేయడానికి  సాధ్యమవుతుంది.   ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు హింసాత్మకమైన, రక్తపాతమైన గతాన్ని కలిగి ఉన్నాయి. ఈ దేశాలలో కొన్ని తమ దేశ పౌరుల భవిష్యత్తును, దేశ భవిష్యత్తును, ప్రపంచంలో వారి మనుగడను దృష్టిలో ఉంచుకుని తమ ధోరణి మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ, శాంతి దినోత్సవాన్ని తమలో అంతర్భాగం చేసుకోవడానికి, ప్రజల ఆలోచనల్లో మార్పులు తీసుకురావడానికి ముందడుగు వేస్తున్నాయి. అయితే మరికొన్ని దేశాలు మాత్రం సరిహద్దులలో ఉన్న ఇతర దేశాలతో హింసాత్మకంగా కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతికి భంగం కలిగిస్తుంటాయి.  ఇలాంటి వాటిని అరికట్టడానికే ప్రపంచ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఈ శాంతి దినోత్సవ చరిత్ర ఏమిటి??  1981లో ఈ శాంతి దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఆమోదం చేయబడింది.ఆ తరువాత ఇరవై సంవత్సరాలకు ప్రపంచంలో చాలా దేశాలు శాంతి దినోత్సవం వైపు అడుగులు వేసాయి.  శాంతి దినోత్సవం మాట!! చివరి ఏడాది కరోనా విలయతాండవం చేస్తుండటంతో కరోనా నుండి ప్రపంచం కోలుకోవాలనే థీమ్ తో శాంతి దినోత్సవాన్ని జరుపుకున్నారు. అయితే 2022 సంవత్సరంలో శాంతి దినోత్సవాన్ని జాత్యహంకారం నశించాలనే నినాదంతో జరపాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ప్రపంచంలో ఎన్నో దేశాలలో జాతి, వర్గ బేధాలను అనుసరించి మనుషుల మీద దాడులు జరుగుతున్నాయి. దేశాలు, దేశాల మధ్య ఏర్పడిపోయే ఈ అభద్రాభావ చర్య మనుషుల్ని, సమాజాన్ని, సరిహద్దు ప్రాంతాల ప్రజలను, ముఖ్యంగా విదేశాలకు వెళ్లే వారిని భయాందోళనలో నెట్టేస్తాయి. శాంతి బహుమతి!! ప్రపంచ వ్యాప్తంగా శాంతి కోసం కృషి చేసిన వారికి, అహింస కోసం పోరాడిన వారికి నోబెల్ శాంతి బహుమతి ప్రదానం చేస్తారు. మొదటి నోబెల్ శాంతి బహుమతి 1901లో అందించారు. దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు, సౌబ్రాతృత్వం కోసం దేశాల మధ్య పగలు, శత్రుత్వాలు తగ్గించే దిశగా కృషి చేసేవారికి శాంతి బహుమతి అందజేయడం జరుగుతుంది.  ప్రశాంత దేశం!! ప్రపంచంలో అత్యంత ప్రశాంత దేశంగా 2008లో ఐస్ ల్యాండ్ గుర్తించబడింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం దాని స్థానాన్ని అది నిలబెట్టుకుంటూ వస్తోంది.  కొన్ని ఆసక్తికర విషయాలు!! 2015లో హింస వల్ల జరిగిన ఆర్థిక వ్యయం 13.6 ట్రిలియన్లు.  సెప్టెంబర్ 2015 నాటికి హింసాత్మక విషయాలను కలిగి ఉన్న ఉగ్రవాద వెబ్‌సైట్‌ల సంఖ్య 9,800 గా ఉంది. ఇవన్నీ హింసను ప్రేరేపిస్తాయ్.  1992 మరియు 2019 మధ్య మహిళా సంధానకర్తల శాతం 13%. 1992 మరియు 2019 మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రధాన శాంతి ప్రక్రియల్లో సంతకం చేసిన మహిళల శాతం 6%.   2015 మరియు 2019 మధ్య కాల్పుల విరమణ ఒప్పందాల శాతం11%. ఇందులో లింగ నిబంధనలు కూడా ఉన్నాయి.  ప్రపంచంలోని అత్యంత ఘోరమైన ఆహార సంక్షోభం కారణంగా యెమెన్ జనాభాలో అంచనా వేసిన వారి సంఖ్య 15.9 మిలియన్లు.   2019లో తీవ్రమైన ఆకలితో జీవిస్తున్న వారి సంఖ్య 135 మిలియన్లు.   సంఘర్షణ చెందుతున్న  దేశాలలో తీవ్రమైన ఆకలితో బాధపడుతున్న వ్యక్తుల శాతం 60%  అక్టోబర్ 2020 నాటికి మహిళలు, శాంతి  భద్రతపై జాతీయ కార్యాచరణ ప్రణాళికలను కలిగి ఉన్న దేశాల సంఖ్య 88.    COVID-19 సంక్షోభానికి ప్రతిస్పందనగా జాతీయ ప్రభుత్వాలు రూపొందించిన విధాన చర్యల సంఖ్య 417.    2016లో సాయుధ పోరాట ప్రాంతాల్లో నివసిస్తున్న యువత 408 మిలియన్లు అని అంచనా. ఇకపోతే ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా అందరూ తెలుసుకోవలసిన విషయాలు. ప్రపంచం, ప్రపంచం చుట్టూ ఉన్న పరిస్థితులు, విషయాలు అన్నీ తెలుసుకుని వాటిని అర్థం చేసుకోవాలి.  ఆర్థిక, ఆహార భద్రతను సామాజిక పరంగా దృడం చేసుకోవాలి. అన్ని రకాల, అన్ని వయసుల వారికి కేటాయించబడిన హక్కులను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. సమానత్వం కోసం, సమన్యాయం కోసం పోరాడాలి. ప్రజాస్వామ్య నిర్ణయాలను, ప్రజాస్వామ్య వ్యవస్థలోని ఉద్దేశ్యాలను తెలుసుకుని వాటికి అనుగుణంగా నడుచుకోవాలి.                                        ◆నిశ్శబ్ద.

కథలు చెప్పడం వల్ల పిల్లలకు నేర్పే దేమిటి??

ప్రస్తుతం ఎదిగే పిల్లలు ఏదైనా చేయాలంటే పెద్దలు చెప్పిన మాట గుర్తు తెచ్చుకుంటారు. కానీ వరించుట్టూ ఉండే స్నేహితులు వారిని వివిధ రకాలుగా మాటలతో మనస్తత్వం మారిపోయేలా చేస్తారు. ఉదాహరణకు… ఓ అబ్బాయి కాలేజీలో చేరాడు. అతడి మిత్రులంతా కలసి సినిమాకు వెళ్ళాలని పథకం వేశారు. అయితే క్లాసులు ఎగ్గొట్టి, పెద్దల అనుమతి లేకుండా సినిమా చూడటం తప్పు అని తల్లిదండ్రులు నేర్పారు ఆ పిల్లవాడికి. కానీ సినిమా చూసినంత మాత్రాన ఏమీ కాదని మిత్రులు ప్రోత్సహిస్తూంటారు. ఎందరో సినిమాలు చూస్తున్నారు. అందరూ పాడైపోతున్నారా? అని వాదిస్తారు. ఇటువంటి పరిస్థితిలో పిల్లవాడు విచక్షణను ఉపయోగించి నిర్ణయం తీసుకోవాలి.  "సినిమాకు వెళ్ళకపోవటం" అంటే పేరెంట్ గెలిచినట్టు "వాళ్ళొద్దంటే మానెయ్యాలా?" అనో "వెళ్ళకపోతే మిత్రులు హేళన చేస్తారనో" సినిమాకు వెళ్తే "చైల్డ్" గెలిచినట్టు. అలా కాక "ఇప్పుడు ఆ సినిమా చూడాల్సిన అవసరం అంతగా లేదు. సినిమా కన్న క్లాసు ప్రాముఖ్యం అధికం" అని విశ్లేషించి నిర్ణయం తీసుకున్నా, "క్లాసులో చెప్పేది చదువుకోవచ్చు, నష్టం కూడదీసుకోగలిగిందే కాబట్టి ఇప్పుడు సినిమా చూసినంత మాత్రాన పెద్దగా నష్టం లేదు" అని తర్కించి నిర్ణయం తీసుకున్నా, "అడల్ట్" పని చేస్తున్నట్టు. ఇలా మానవమనస్తత్వం పని తీరును ఆధునిక మానసికశాస్త్రవేత్తలు వివరిస్తారు. అంటే, ఊహ తెలియని దశ నుంచీ ప్రతీదీ పిల్లవాడిపై ప్రభావం చూపిస్తాయన్నమాట. అటువంటప్పుడు ఉయ్యాలలో నిద్రిస్తున్న పిల్లవాడి కోసం పాడే పాటల ప్రభావం అతడిపై చూపటంలో ఆశ్చర్యం ఉందా! అది అబద్ధం అవుతుందా? పాకే వయసు రాగానే 'చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ' అంటూ నేర్పేవి పనికి రాకుండా పోతాయా? ఆ తరువాత చెప్పే పురాణకథలు, ప్రభావరహితం అవుతాయా? బాల్యంలో కృష్ణుడి అల్లరి చేష్టలు పిల్లవాడి ఊహాప్రపంచానికి రెక్కలనిస్తాయి. తానూ కృష్ణుడిలా సాహసకార్యాలు, అవీ లోకకల్యాణకారకాలైన సాహసకార్యాలు చేయాలన్న తపన పిల్లవాడిలో కలుగుతుంది. ఆ వెంటనే చెప్పే ధ్రువుడి కథ, అష్టావక్రుడి కథ, సత్యహరిశ్చంద్రుడు, హనుమంతుడు, రాముడు, లవకుశుల కథలు పిల్లలకు స్ఫూర్తినిస్తాయి. ముఖ్యంగా హనుమంతుడి కథలు, సాహసాలు సూపర్ మేన్, బ్యాట్ మేన్ లను మరపిస్తాయి. వాటి కన్నా ఆరోగ్యకరమైన వినోదాన్నిచ్చి, ఉన్నతమైన ఆదర్శాన్ని నిలుపుతాయి. పిల్లలను అమితంగా ఆకర్షించే అనేకాంశాలు హనుమంతుడి కథల్లో ఉన్నాయి. అంటే నీతులు చెప్పకుండా, ఉపన్యాసాలు ఇవ్వకుండా కేవలం కథలు చెప్పటం ద్వారా. పిల్లల వ్యక్తిత్వవికాసానికి బీజాలు వేసే వ్యవస్థ అన్నమాట మనది. ఇళ్ళల్లో తల్లికి సమయం లేకపోతే, తాతయ్యనో, నాయనమ్మనో, బాబాయిలో, అత్తయ్యలో, ఎవరో ఒకరు సాయంత్రం కాగానే పిల్లలను పోగేసి కథలు చెప్పేవారు. పురాణకథలతో పాటు జానపదకథలూ వినిపించేవారు. చారిత్రకగాథలు చెప్పేవారు ఆయా కథలు పిల్లలను ఎంతగా ఆకట్టుకునేవంటే మళ్ళీ సాయంత్రం కోసం పిల్లలు ఎదురుచూసేవారు. నెమ్మదిగా ఈ కథలు దేశభక్తుల కథలుగా రూపాంతరం చెందేవి. రాణా ప్రతాప్ త్యాగం, శివాజీ సాహసం, భగత్ సింగ్ బలిదానం, ఝాన్సీలక్ష్మి వీరత్వం..... ఇలా ప్రారంభం నుంచీ పిల్లల ముందు ఉత్తమాలోచనలు, ఉత్తమ ఆదర్శాలు నిలపటం జరిగేది. పిల్లలు పాఠశాలలకు వెళ్ళి కొత్త ప్రపంచద్వారాలు తెరుచుకునేసరికి, ఆ ప్రపంచపు తాకిడిని తట్టుకుని విచక్షణతో నిర్ణయాలు తీసుకునే విజ్ఞానం వారికి అందేది. దాంతో ప్రలోభాలను తట్టుకుని సరైన మార్గం ఎంచుకోగలుగుతాడు పిల్లవాడు. ఇదీ పిల్లలకు కథల వల్ల పెద్దలు నేర్పే మంచి. ఇలాంటి వాటిలో పిల్లలు విలువలు సులువుగా గ్రహిస్తారు. తద్వారా వారిలో స్నేహితులు రెచ్చగొట్టినా అది నాకు అవసరం లేదు, చదువుకోవాలి అనే మాటను ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా చెప్పగలుగుతారు.                                            ◆నిశ్శబ్ద.  

కష్టనష్టాలు చూసి దిగులుపడుతున్నారా?

జీవితం అనేది సుఖదుఃఖాల కలయిక. మనం సుఖాన్ని ఎలా అనుభవిస్తామో, దుఃఖాన్ని కూడా సహించగలిగి ఉండాలి. జీవితాన్ని అన్ని కోణాలలో పరిశీలిస్తే జీవన సంబంధాల విలువ, ప్రాముఖ్యత మనకు అర్ధమవుతుంది. కానీ ఈ విషయం అర్ధం చేసుకోకుండా చాలామంది సంతోషాలు, సుఖాలు మాత్రమే కావాలని అనుకుంటారు. అది చాలా పొరపాటు అనే విషయం అందరూ అర్థం చేసుకోవాలి.  మనిషి జీవితంలో కష్టాలు, సుఖాలు అనేవి చీకటి వెలుగులులాంటివి. చీకటి తరువాత వెలుగు, వెలుగు తరువాత చీకటి ఇలా ఒకదాని తరువాత ఒకటి ఎలాగ వస్తూ పోతూ ఉంటాయో అలాగే మనిషి జీవితంలో కష్టాలు, సుఖాలు అనేవి కూడా ఒకదాని తరువాత ఒకటి వస్తూపోతూ ఉంటాయి. వాటి గురించి మనం ఆలోచించ కూడదు. కష్టం వచ్చినప్పుడు బాధపడి, సుఖం వచ్చినప్పుడు ఆనందించకూడదు. కష్టసుఖాలను సమానంగా అనుభవించే గుణాన్ని కలిగి ఉండాలి. ఇలా కష్టసుఖాలను సమానంగా చూసే స్వభావం ఉన్నవారు అన్ని పరిస్థితులను తట్టుకుని నిలబడగలరు.  ముఖ్యంగా ఓటమికి వెనకడుగు వేయడం, కష్టాలు వచ్చినప్పుడు భయపడటం వంటి స్వభావం తగ్గిపోతుంది. రెండింటిని సమానంగా చూడటం నేర్చుకుంటే. అప్పుడే మనిషి తన జీవితంలో ఎదగగలడు. ప్రస్తుత సమాజంలో అందరూ కూడా అశాశ్వతమైన విషయాలపై మోజు పెంచుకొని జీవన సమరంలో అలసిపోతున్నారు. నిరంతరం అశాంతి, ఆందోళనలు, అలజడుల మధ్య మనిషి జీవితం కొనసాగుతుంది. మనిషికి జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అయినా సరే వాటికోసమే పోరాటం సాగించి జీవితంలో ఆనందాన్ని కోల్పోతున్నాడు. జీవితంలో పోరాటం అనేది ఉండాలి. ఎందుకంటే జీవితమంటేనే పోరాటం, పోరాటంలోనే ఉంటుంది జయం అన్నారు. అంతేకానీ జీవితాన్నే పోరాటంగా చేసుకోకూడదు. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో సంఘటనలు, జ్ఞాపకాలు, అనుభూతులు, సామాజిక బంధాలు జీవితంలో పెనవేసుకు పోతాయి. విజయవంతమైన, ఫలప్రదమైన జీవితం గడపటానికి ఈ బంధాలు, వాటి మధ్య పటిష్టత చాలా అవసరం. ప్రస్తుత సమాజంలో జీవితం వేగవంతం కావటం,  తీరికలేని పరిస్థితి, పట్టణాలలో స్థిరపడటం, ప్రవాస జీవితం మొదలైన కారణాల వల్ల మనుషుల మధ్య బంధాలు బలహీనంగా ఉన్నాయని చెప్పవచ్చు.  పూర్వకాలంలో పండుగలు, పుణ్యకార్యక్రమాలకు కుటుంబ సభ్యులు అందరూ సమావేశమయ్యేవారు. కష్టసుఖాల గురించి చర్చించుకొనేవారు. ఇలాంటి పరిస్థితులు ప్రస్తుత కాలంలో తగ్గిపోతున్నాయి. ఫోనులలో పలకరించటం, తమకు తీరికలేదని చెప్పటం ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రకంగా అనుబంధాలలో స్వచ్ఛత లోపించటం కనిపిస్తుంది. జీవితం అనేది చాలా విలువైనది. మన విలువైన జీవితాన్ని అంతం చేసుకోవటం అనేది సమర్ధనీయం కాదు. ఎందుకంటే చాలామంది యువకులు, గృహస్తులు తాత్కాలిక భావోద్వేగాలకు లోనయి జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. ఇది సమంజసం కాదు. జీవితం విలువ తెలుసుకున్నవారు మాత్రమే జీవితాన్ని అర్ధం చేసుకుంటారు. ఆర్ధిక బాధలు, ప్రేమ విషయాలలో విఫలం కావటం, అవమానం, మానసిక ఒత్తిడి, తీవ్ర అనారోగ్యం, అనుకున్నవి జరగలేదనే తీవ్ర ఆవేదన, డిప్రెషన్లతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది ఇటీవల కాలంలో ఎక్కువ అయింది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే జీవితానుభవం ఉన్నవారు ఇతరులకు మార్గదర్శకులుగా ఉండాలి.                                         ◆నిశ్శబ్ద.

ఆత్మహత్యలు వద్దే వద్దు!

మనిషి ప్రాణం చాలా విలువైనది. జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించినప్పుడు, కష్టాలను, అడ్డంకులను ఎదుర్కొని విజేతలుగా నిలిచినప్పుడు మనిషిగా పుట్టినందుకు చాలా సంతోషపడతాం. కేవలం అవి మాత్రమే కాదు జీవితంలో ఎంతో సంతోషకరమైన క్షణాలలో ఉన్నప్పుడు ఫలానా వారికి పుట్టినందుకు ఎంత సంతోషంగా ఉన్నామనో, ఈ జీవితం ఇలా సాగుతున్నందుకు మనం అదృష్టవంతులమనో అనుకుంటాం ఖచ్చితంగా. కానీ జీవితంలో చెప్పలేనంత విరక్తి వచ్చి చచ్చిపోవాలని నిర్ణయించుకుని, బలవంతంగా ప్రాణాలు తీసుకుంటే?? ఎంతో గొప్పగా జీవించాల్సిన వాళ్ళు అర్థాంతరంగా జీవితానికి ముగింపు ఇస్తే!! ప్రస్తుత సమాజాన్ని ఎంతో భయపెడుతున్న విషయం ఇదే!! ఏ విషయాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నవారు చాలామంది ఉంటున్నారు. ఈ ఆత్మహత్యల మీద దృష్టి సారించి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటారు.  ఆత్మహత్య చేసుకోవడం రాను రాను పెరుగుతున్న సమస్య. వీటి నమోదు సంఖ్యలు చాలా దిగ్భ్రాంతికరమైన కథనాలు చెబుతాయి.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ప్రతి 40 సెకన్లకు ఒకరు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు.  ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 8,00,000(ఎనిమిది లక్షల) మంది ప్రజలు మరణిస్తున్నారు.  కొన్ని అంచనాల ప్రకారం ఆ సంఖ్య పది లక్షలకు దగ్గరగా ఉంది.   మరీ ముఖ్యంగా 15 నుండి 29 సంవత్సరాల వయస్సు గల వారి మరణానికి ఆత్మహత్య ప్రధాన కారణం అనే విషయం కలవరపెడుతోంది.  ప్రయత్నించే ప్రతి 40 మందిలో కనీసం ఒక్కరు అయినా చనిపోతున్నారు. మనిషి జీవించడానికి చాలా గొప్ప గొప్ప అవకాశాలు, మార్గాలు ఉంటాయి అనే విషయం అందరికీ తెలుసు. మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నది ఎందుకు?? ఆత్మహత్యలకు ప్రధాన కారణం!! ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణం ఒకటే. మందులతో బాగు చేయలేని, ఇదీ అని నిర్ధారించలేని సమస్య అది. ఏమిటా సమస్య అంటే?? మానసిక అనారోగ్యం. మానసిక ఇబ్బందులతో బాధపడేవారు ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీరిలో అర్థం చేసుకునే ఆలోచనా స్థాయిలు తక్కువ. అతిగా ఆలోచించడం ఎక్కువ. ఈ కారణంగా ఆత్మహత్యలు జరిగిపోతున్నాయి.  ఏం చెయ్యాలి?? కౌన్సెలింగ్ ఇవ్వడం, సపోర్ట్ గా ఉండటం వల్ల  ఆత్మహత్యలను నివారించవచ్చు. ప్రతి వ్యక్తి తన కుటుంబంలోని వారితో ఎప్పుడూ దగ్గరగా ఉంటూ, వారికి తగిన ప్రాధాన్యత ఇస్తూ, వారికున్న సమస్యలను చెప్పుకునే స్నేహాభావాన్ని కలిగిస్తే దాదాపుగా ఆత్మహత్య అనే భావనను రానివ్వకుండా చేయచ్చు.   ఇతరులకు వారి జీవితాలకు బాధ్యత వహించడానికి, వారి జీవితానికి వారు ఇచ్చుకోవలసిన ప్రాధాన్యత, వారి మీద వారికి ఉండాల్సిన బాధ్యత మొదలైనవి గుర్తుచేయడం కూడా వారిలో ఆత్మహత్య ఆలోచనను రానివ్వకుండా చేయడానికి ఒక గొప్ప మార్గం. ఆత్మహత్య అనేది అన్ని వయసుల వారిని సమానంగా ప్రభావితం చేస్తుంది.  అందువల్ల మానసిక ఆరోగ్యం గురించి చర్చలు జరపడం చాలా ముఖ్యం, ఇతరులు వారు ఎదుర్కొంటున్న కష్ట సమయాల గురించి మాట్లాడటం వల్ల అవసరమైతే వృత్తిపరమైన లేదా మానసిక ఆలోచనలకు సంబంధించిన సహాయం పొందడం సులభం చేస్తుంది. 'టేక్ ఎ మినిట్, చేంజ్ ఎ లైఫ్' ఒక్క నిమిషం ఆగండి జీవితాన్ని మార్చుకోండి అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచారం చేసిన ఒక గొప్ప వాక్యం. ఆత్మహత్యలు ఎప్పుడూ తొందరపాటుగా జరిగిపోతుంటాయి. అలాంటి సందర్భంలో ఒక్క నిమిషం ఆగి, జీవితం గురించి, భవిష్యత్తు గురించి, బ్రతకాల్సిన ఆవశ్యకత, జీవితానికి ముఖ్యమైన మార్గాలు వంటివి ఆలోచిస్తే జీవితం చెయ్యిజారిపోదనే విషయం అర్థమవుతుంది. ఆత్మహత్య నిరోధక దినోత్సవం సందర్భంగా ఈవెంట్‌లు, సమావేశాలు, సెమినార్‌లు చర్చా వేదికలను నిర్వహిస్తారు. ఆత్మహత్యల నివారణకు కొత్త విధానాలను రూపొందిస్తారు.  వ్యక్తులలో జీవితం పట్ల అవగాహనను కలిగించడానికి సాధనంగా మీడియాను ఉపయోగించవచ్చు.  మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నవారికి కుటుంబం, డాక్టర్ల కౌన్సిలింగ్ చాలా ఉపయోగపడుతుంది.  సమాజ పౌరులుగా మన చుట్టూ ఉన్న వారికి మనవంతు సాయం చేయడం అనుసరించాల్సిన విషయమే!! కాబట్టి మీ వంతు మీరూ కృషి చేయండి. ఆత్మహత్యల నివారణకు తోడ్పాటు అందించండి.                                   ◆నిశ్శబ్ద.

వివేకం లేని విద్య ఎవ్వరికీ ఉపయోగం?

సమాజంలో విద్య పాత్ర చాలా గొప్పది. విద్య కలిగినవాడి మార్గం వేరుగా ఉంటుంది. జీవితంలో గొప్ప ఉద్యోగ అవకాశాలను పొందాలి అంటే విద్య కూడా గొప్పగానే ఉండాలి.  మనిషి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి విద్య చాలా అవసరం. విటువలులేని విద్య వల్ల వచ్చే ప్రయోజనం శూన్యం! విజ్ఞానం ద్వారా మానవాళికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుత సమాజంలో విలువలతో కూడిన విద్య సమాజానికి చాలా అవసరం. కానీ ఎక్కడా విలువలు అనేవి విద్యలో అంతగా కనిపించడం లేదు. కారణం విద్యను ఒక వ్యాపారంగా మార్చేయడం. విద్య అనేది ప్రగతిశీలకంగా చైతన్యంగా ఉన్నప్పుడే విద్యకు విలువ అనేది ఉంటుంది. భవిష్యత్ కార్యక్రమాలకు కూడా విద్య ద్వారా అందే ఫలాలు అందరికీ చేరతాయి. కొంతమంది విద్యాలయాల్లో కాకుండా స్వతంత్రంగా చదివి పైకి వచ్చినవారు ఉన్నారు. దూరవిద్య, ఓపెన్ యూనివర్శిటీల ద్వారా ముందుకు సాగుతూ ఉన్నారు కొందరు. విద్య అనేది వివేకాన్ని ఇవ్వాలి. వివేకం లేని విద్య ఎవ్వరికీ ఉపయోగపడదు. ఎందుకంటే అందరూ విద్యా వంతులైతేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. విద్యారంగం విస్తరింపబడుతుంది. దేశ ప్రగతికి, సమాజ శ్రేయస్సుకూ సాంకేతిక వృత్తి, వైద్య విద్యా రంగాలకు ప్రాధాన్యం ఇవ్వ వలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందరూ దీనిని ముక్త కంఠంతో ఆమోదిస్తున్నా అమలుచేయడంలో మాత్రం అలసత్వమే ఎదురవుతోంది. అర్హతలు లేనివారు అందలం ఎక్కటం, విలువలు తక్కువైన విద్య, గుర్తింపు లేని విద్యాలయాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి.  మేధావులు సలహాలూ సంప్రదింపులూ లేకుండా, కేవలం కార్యనిర్వాహక పదవులలో ఉన్నవారు. చేసే నిర్ణయాల వల్ల హాని జరుగుతుందని గుర్తించే నాటికి జరగవలసిన హాని జరిగిపోతుంది. అందుకే ఎక్కడ చూసినా అర్హత లేనివాళ్ళు ఉంటున్నారు. ప్రభుత్వనేతల రాజకీయాల ప్రాతిపదికతో కాకుండా ప్రతిభ ఆధారంగా, సమర్థులను ఈ రంగంలోకి తీసుకువస్తే విద్యా వ్యవస్థలో మార్పులకు అవకాశం ఉ ఉంటుంది. పాఠశాలలు, కళాశాలల్లో జరిగే బోధనా కార్యక్రమంతోనే విద్య యొక్క పరమావధి పూర్తిగా నెరవేరింది అనుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే వ్యక్తిగత అనుభవాల ద్వారా, ప్రపంచ జ్ఞానం ద్వారా, అలవాట్ల ద్వారా కూడా విద్య సమకూరుతుంది. ప్రపంచాన్ని అర్ధం చేసుకోవటానికి, ఆలోచనా పరిధిని పెంచుకోవటానికి విద్య ఉపయోగపడాలి. విద్య మనకు వినయాన్ని, సంస్కారాన్ని ఇవ్వాలి. విద్య ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్, నిర్వహణా సమర్ధ్యం, నాయకత్వ పటిమ పెంపొందాలి. విద్య అనేది సమగ్ర వ్యక్తిత్వానికి పునాదిగా నిలవాలి. విలువలు లేని విద్య నిరర్ధకము. విద్యతో పాటు విలువలు కూడా నేర్చుకోవాలి. విద్యావంతులైన యువతీ యువకులు విశ్వమానవ సౌభ్రాతృత్వానికి, విశ్వశాంతికి, సమాజ వికాసానికి, దేశాభివృద్ధికి కృషి చేస్తూ  తమ ఉన్నత విద్య ద్వారా విదేశాలలో సైతం గౌరవం, ఆదరణ పొందాలి. విద్య ద్వారా సంస్కారవంతులు, గుణవంతులైన వారు తయారౌతారు విద్య జీవనోపాధిగా ఉండటమే కాక, జీవన పరమావధిగానూ ఉండాలి. అందుకే విద్య వస్తే సరిపోదు. దానికి విలువలు ముఖ్యం.                                         ◆నిశ్శబ్ద.

ఎదుటివారిలో ఈ గుణాన్ని గుర్తిస్తున్నారా?

జీవితం చాలా విలువైనది. చాలా అందమైనది. ఇటువంటి విలువైన నీ జీవితం పట్ల సమాజానికి మంచి సదభిప్రాయం వుండాలి. మనం మన వ్యక్తిగత విషయాల పట్ల ఎదుటివారి దృష్టిలో విలువలు సంపాదించాలి. జీవితంలో కష్టసుఖాలు లాభనష్టాలు అల్లుకుపోయి వుంటాయి. వాటిని అందుకుని తీరకతప్పదు. మన జీవితంలో వచ్చిన కష్టనష్టాలకు గల కారణాలను వాస్తవాలను గ్రహించాలి. మనకు వచ్చిన కష్టనష్టాలకు ఇతరులు బాధ్యులు అని వారిని నిందించకూడదు. వారే నీ కష్టాలకు బాధ్యులు అని నీవు వారి పట్ల అంచనా వేయకూడదు. ఒకప్పుడు ఒక వ్యక్తి చాలా సంపన్నుడు. అతనికి చాలా డబ్బు వుండేది. ఆ డబ్బంతా ఏమి చేయాలో అతనికి తోచక తన స్నేహితుడిని ఈ డబ్బంతా ఏమి చేయాలో తెలియడం లేదు. ఏదైనా సలహా ఇవ్వమని కోరతాడు. అప్పుడు ఆ స్నేహితుడు ఒక సలహా ఇస్తాడు. నాకు తెలిసిన ఒక వ్యక్తి కష్టాలలో వున్నాడు. అతనికి నీవు డబ్బులు ఇస్తే అతను తన కష్టాలు తీరిన తరువాత వడ్డీతో సహా నీ డబ్బులు నీకు ఇస్తాడు. నీకు నీ డబ్బు ఇంకా రెట్టింపు అవుతుంది. తరువాత రాబోయే తరాలకు కూడా నీ డబ్బు ఉపయోగపడుతుంది. అని సలహా ఇచ్చి నీవు కూడా ఆలోచించు నేను చెప్పిన సలహా సరి అయినది అని అనిపిస్తేనే నీవు ఈ పని చేయి అని చెబుతాడు.  స్నేహితుడు చెప్పిన సలహా సరైనది అని తన మనసుకు తోచింది. స్నేహితుడు చెప్పినట్లుగా అతను కష్టాల్లో వున్న ఆ వ్యక్తికి డబ్బును ఇచ్చాడు. కొన్ని రోజుల తరువాత స్నేహితుడు చెప్పినట్లుగా ఆ వ్యక్తి ఇతనికి వడ్డీతో సహా డబ్బులను తెచ్చి ఇచ్చాడు. స్నేహితుడు చెప్పినట్లుగా అతనికి డబ్బు రెట్టింపు అయ్యింది. అపుడు అతను స్నేహితుడిని మెచ్చుకుంటాడు. కొన్ని రోజుల తరువాత ఇతనికి బిజినెస్ చేయాలని అనిపించింది. అపుడు మరల స్నేహితుడి సలహాను కోరతాడు. అప్పుడు స్నేహితుడు రొయ్యల బిజినెస్ పెట్టమని సలహా ఇస్తాడు. కొన్ని రోజులు ఆ రొయ్యల బిజినెస్ మంచిలాభం వచ్చింది. ఇలా లాభం రావడానికి కారణం తన స్నేహితుడే అని అతడిని బాగా అభినందించాడు.  తరువాత కొన్ని రోజులకి, ఆ రొయ్యల బిజినెస్ కి సరైన సదుపాయం లేక నష్టం వచ్చింది. ఆ స్నేహితుడు వల్ల అతను చాలా లాభాలు పొందాడు. కానీ నష్టం వచ్చేటప్పటికీ, నా స్నేహితుడు వలన నేను ఈ రొయ్యల బిజినెస్ పెట్టాను. దీనికి కారణం నా స్నేహితుడే అని అతడిని నిందిస్తాడు, అవమానపరుస్తాడు. అప్పుడు ఆ స్నేహితుడు తనకు లాభాలు వచ్చినప్పుడు మెచ్చుకున్నాడు. తనకు నష్టం వచ్చినప్పుడు మరల నన్ను నిందిస్తున్నాడు. ఎప్పుడూ ఈ వ్యక్తికి సలహా ఇవ్వకూడదు. ఇతను డబ్బుకు విలువ ఇస్తున్నాడు. మనిషికి మనిషిగా విలువను ఇవ్వడంలేదు. అని తన మనస్సులో అనుకుని అతని నుండి దూరంగా వెళ్ళిపోయాడు.  ఇప్పుడు అతనికి సలహాలు ఇచ్చే వ్యక్తులు లేరు. నేను నిందించడం వల్లే నా స్నేహితుడు నా నుండి వెళ్ళిపోయాడు అని బాధపడి అతనిలో వున్న చెడు అభిప్రాయాలను తొలగించుకుని మనిషిగా మానవతా విలువలను పెంచుకున్నాడు. ఎప్పుడైనా మనం ఎవరి సలహా అయినా తీసుకున్నప్పుడు ఆ మనిషి చేసిన సహాయాన్ని మరిచిపోకూడదు. అలాగే ఆ మనిషి వలనే నీకు కష్టం వచ్చింది అంటే అందుకు నీవే బాధ్యుడవు. అతని వల్ల పొందిన లాభాన్ని గ్రహించాలి. అతని వల్ల వచ్చిన కష్టాన్ని నిందించకూడదు, మీలోని ఆలోచనా విధానాన్ని గ్రహించాలి, దాన్ని సరిచేసుకోవాలి.  ఎదుటివారు చెప్పారు కదా అని మీరు ఆలోచించకుండా, సరైన నిర్ణయం తీసుకోకుండా వారు చెప్పినట్లుగానే చేసి, అందువల్ల ఏదైనా కష్టం వస్తే వారే బాధ్యులు అని ఎలా నిందించగలరు? మీరే ఆలోచించండి..... మనం మనిషిగా మానవత్వపు విలువలను సంపాదించాలంటే మొదట మనం ఎదుటివారిలో వున్న మంచిని గ్రహించాలి.                                          ◆నిశ్శబ్ద.

మీరు చేసే ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నారా?

ప్రస్తుత సమాజంలో చదివింది ఒకటయితే చేసే ఉద్యోగం మరొకటి అవుతుంది. చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకటం చాలా కష్టంగా వుంటుంది. జీవితంలో ఎదురయ్యే ఆర్థిక అవసరాలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ కారణాలు కావచ్చు చదివిన చదువుకు సంబంధించినది కాకుండా పరిచయం లేని, దాని గురించి ఏమీ తెలియని ఉద్యోగం చేయాల్సి రావచ్చు.  చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం లభించకపోవటం వల్ల మనలో నిరాశ, అసంతృప్తి అనేవి చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయాన్ని ప్రస్తుతం ఉన్న యువతలో చాలా బాగా గమనించవచ్చు. దానివల్ల  మానసిక ప్రశాంతత అనేది కరువైపోతుంది. ఈ మానసిక ప్రశాంతత లేని కారణంగానే  ఇబ్బందులకు గురి అవుతున్నాము. మానవ జీవితాలలో అత్యంత ప్రాముఖ్యత వహించే అంశం ఉద్యోగం, మనకు అనుకూలమైన ఉద్యోగం దొరకనప్పుడు దొరికిన దానితో సంతృప్తి చెందుతూనే మనకు అనుకూలమైన ఉద్యోగం దొరికేంత వరకు దాని కోసం కృషి చేయాలి, దానిని సాధించుకోవాలి. అంతే తప్ప మనకు తగినది దొరకలేదనే కారణంతో ఏదీ చేయకుండా కాలాన్ని వృధా చేస్తూ ఉండటం వివేకవంతుల లక్షణం కాదు.  దీనికంటే మంచి ఉద్యోగం దొరుకుతుంది అని మనం మానసికంగా ఫీల్ అవ్వాలి అటువంటి మంచి ఉద్యోగం పొందే సామర్థ్యాన్ని, అంటే అర్హతలు మనకున్నాయో లేదో గమనించుకుని ఆ అర్హతలు సాధించేందుకు అవిశ్రాంతంగా కృషి చెయ్యాలి. అలాగని చెప్పి, ఉన్న ఉద్యోగం వదులుకుని, నిరుద్యోగిగా ఆఫీసులచుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఏ ప్రయోజనం ఉండదు. చేస్తున్న ఉద్యోగం మంచి క్రమశిక్షణతో అంకిత భావంతో చేస్తూనే మన సమర్ధతకు సరిపోయే ఉద్యోగం కోసం కృషి చేయాలి. కృషి చేస్తే ఈ ప్రపంచంలో సాధించలేనిదేదీ లేదు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఉద్యోగాలు లేక, దొరికిన ఉద్యోగాలు చేయలేక ఆత్మనూన్యతాభావంతో ఎన్నో రకాలైన మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. కాని అది సమంజసం కాదు. ఏ పని లేకుండా ఖాళీగా కూర్చుంటే అసమర్ధుడిగా ముద్రపడే ప్రమాదం ఉంది. అందుకే దొరికిన ఉద్యోగం చేసుకుంటూ మనలోని ప్రతిభకు మెరుగులు దిద్దుకోవాలి. నిజానికి పరిచయం లేని పని దొరికినా ఆ కొత్త పనిలో విషయాన్ని, ఆ పనికి సంబంధించిన మెలకువలను ఆసక్తిగా తెలుసుకునేవాడు ప్రతిభావంతుడు అవుతాడు. ఎదురయ్యే ప్రతిదాన్ని సద్వినియోగం చేసుకోవడమే వివేకవంతుల విజయాల వెనుక కారణం. ప్రస్తుతం సమాజంలో వ్యక్తి నైపుణ్యానికి తెలివికి విలువలేని కాలంలో తనకు గుర్తింపు లేదనో, తన తెలివికి తగ్గ ఉద్యోగం లేదనో బాధపడుతూ అశాంతికి గురి అవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన తెలివిని మన నైపుణ్యాన్ని గుర్తించే రోజు ఒకటంటూ వుంటుందని గ్రహించాలి, విశ్వసించాలి. పరిస్థితులను అర్ధం చేసుకుని జీవించాలి. మనం వున్న పరిస్థితులలో మౌనంగా ఉంటూ, మన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలి. ఆఫీసులో ఉద్యోగం చేసుకుంటూనే నిత్య జీవితంలో తమ ప్రతిభను వెల్లడించాలి, మనం కొంతమందిని చూస్తూ వుంటాము. వారు ఎదుటివారి దోషాలు చూపటం వల్ల తాను గొప్పవాడైనట్టు భావిస్తుంటారు. తప్ప, తమలోనూ లోపాలున్నాయని అనుకోరు. ఎదుటివారిలో తప్పులు వెతకడం మాని, తనలోని లోపాలను గుర్తించి, సరిదిద్దుకునే వ్యక్తికి ఉన్నత అవకాశాలు ఎప్పుడూ ఆహ్వానం పలుకుతూనే ఉంటాయి.                                       ◆నిశ్శబ్ద.

ధర్మంగా ఎందుకుండాలో తెలియజెప్పే కథ!

మనిషి జీవితంలో ధర్మమే ఎప్పటికైనా మూల స్థంభం. ధర్మాన్ని దాటి ప్రవర్తించేవారు, జీవించేవారు భవిష్యత్తులో ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొని తీరతారు.ఎందుకు అంటే అధర్మంగా ఉన్నవారికి జీవితంలో నీతి అనేది ఉండదు. అంటే ప్రవర్తన తప్పుగా ఉందని అర్థం. తప్పు ప్రవర్తన కలిగిన వారు అధర్మంలో ఉన్నారంటే అది తప్పు దారిలో వెళ్తున్నారని అర్థం. మనిషి ధర్మం గా ఉండాల్సిన అవసరం గురించి, ధర్మం తప్పితే ఎదురయ్యే పరిస్థితి గురించి, ధర్మంగా ఎందుకుండాలో తెలియజెప్పే ఒక కథ ఇది!! ఓ గ్రామంలో ఓ బ్రాహ్మణుడికి అనుకోకుండా యజ్ఞకుండంలో బంగారు ముద్ద దొరికింది. అతడు ఈ వింత చూసి ఆశ్చర్యపోతున్నప్పుడు అతడి భార్య అక్కడికి వచ్చింది.  "ఏమిటండీ అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు" అని అడిగిందామె. యజ్ఞకుండంలో బంగారు ముద్ద దొరికింది" అని బదులిచ్చాడు అతడు. "అవునా నేను నిన్న పొరపాటున  తాంబూలాన్ని యజ్ఞకుండంలో ఉమ్మేశాను. అదే ఇలా బంగారం అయ్యిందేమో!!"  "తాంబూలం అమ్మితే బంగారు ముద్ద రావడం ఏమిటే!! నీ బుద్దిలేని ఆలోచన కాకపోతే" అని విసుక్కున్నాడు అతడు. "సరే మీకు నమ్మకం లేకపోతే ఈరోజు నిన్నటిలాగే చేస్తాను. రేపు ఏమవుతుందో చూద్దాం" అన్నదామె. అతను సరేనని చెప్పడంతో ఆమె తాంబూలం నమిలి యజ్ఞకుండంలో ఉమ్మేసింది. మరుసటిరోజు చూడగానే ఆశ్చర్యంగా మళ్ళీ బంగారు ముద్ద కనిపించింది. వారికి రోజు తాంబూలం ఉమ్మి వేయడం, మరుసటిరోజు బంగారు ముద్ద తీసుకోవడం అలవాటు అయిపోయింది. అలా చేయడం వల్ల కొద్ధి కాలంలోనే వాళ్ళు గొప్ప ధనవంతులు అయిపోయారు. వాళ్ళు ధనవంతులు అయిన కారణం ఊరిలో కొందరికి తెలిసింది. ఆ ఊర్లో మిగిలిన వాళ్ళ ఇళ్లలో కూడా తాంబూలం ఉమ్మి యజ్ఞకుండంలో వేయడం బంగారు ముద్దలు తీసుకోవడం అందరికీ అలవాటు అయింది.  అందరూ ధనవంతులైపోతున్నారు. అయితే ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు మాత్రం భార్య ఎంత పోరినా ఆమె యజ్ఞకుండంలో ఉమ్మి బంగారం అందుకునేందుకు ఇష్టపడటం లేదు. అందరూ ధనవంతులవుతుంటే, తాము మాత్రం పేదవారుగానే ఉండటం ఆమెకు నచ్చలేదు. చివరికి భర్త ఎంతకీ మాట వినకపోవటంతో ఆమె పుట్టింటికి బయలుదేరింది. చేసేది లేక భర్త ఆమెను అనుసరించాడు. వారు ఊరి పొలిమేర దాటగానే ఊళ్ళో గొడవలు ప్రారంభమై ఇళ్ళు తగలబడిపోసాగాయి.  అప్పుడు ఆ బ్రాహ్మణుడు భార్యకు వివరించాడు "ధర్మానుసారం సంపాదించిన ధనం శాంతినిస్తుంది. అలా కాక ధర్మచ్యుతి చేస్తూ ఇష్టం వచ్చిన రీతిలో సంపాదన చేస్తే అది అనర్థానికి దారి తీస్తుంది. ఇన్నాళ్ళూ మనం ధర్మం పాటించటం ఈ ఊరిని కాపాడింది. మనం ఊరిని వదిలాం. అసూయా, ద్వేషాలతో ఊరు నాశనమైంది" అని. అది విన్న భార్యకు విషయం అర్థమైంది. ప్రస్తుతం మన సమాజం ఆ ఊళ్ళోవారున్న స్థితిలో ఉంది. ధనసంపాదన కోసం యజ్ఞకుండంలో సైతం ఉమ్మేసేందుకు సిద్ధపడ్డ ఆ ఊరివాళ్ళలాగా, ప్రస్తుతసమాజం డబ్బు సంపాదన కోసం అడ్డమైన గడ్డీ మేసేందుకు సిద్ధమౌతోంది. ఎంత ధనం సంపాదిస్తే, అంత అశాంతి పాలవుతోంది. నైతికవిలువలు వదిలి సమాజం మానవత్వాన్ని కోల్పోతుంది. మన తరువాతి తరాలైనా ఉత్తమ వ్యక్తిత్వంతో ప్రశాంతంగా జీవించాలంటే "ఉత్తమ ఆదర్శం" ఎంతో అవసరం.                                    ◆నిశ్శబ్ద.

ప్రస్తుత సమాజాన్ని తప్పుదోవలో నడుపుతున్నది ఎవరు?

ప్రస్తుతసమాజాన్ని వ్యాపారసంస్కృతి నిర్దేశిస్తున్నది. వ్యాపారంలో ప్రచారం అత్యంత ప్రాధాన్యాన్ని వహిస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందిందంటే ప్రస్తుతం వ్యాపార ప్రచారం ఇరవై నాలుగు గంటలూ ప్రతి నట్టింటా వికృతరూపంలో నర్తనమాడుతోంది. పుట్టినప్పటి నుంచీ జీవితంలో అనుభవించగల సౌఖ్యాలు ప్రతివాడికీ ప్రతి వయసు నుంచీ తెలుస్తున్నాయి. ఆ సౌఖ్యాల సాధనకు ఏకైక మార్గం డబ్బు సంపాదన. దాంతో వ్యక్తి అభివృద్ధిని డబ్బు సంపాదనతో కొలవటం తప్పనిసరి అయింది. తమ పిల్లవాడు డబ్బు సంపాదించకపోతే పనికి రానివాడన్న అభిప్రాయం స్థిరపడిపోయింది. దాంతో ప్రతివాడి జీవితలక్ష్యం ఎలాగోలాగ, వీలైన రీతిలో డబ్బు సంపాదించటమే అన్నది స్థిరమైపోయింది. సమాజం అవినీతిమయమై విలువలు తరగటంలో ప్రధానంగా తోడ్పడిన అంశం ఇది. డబ్బు మీద ఆశను కల్పించి, పెంచటంలో పాశ్చాత్య ప్రచారసంస్థలు గణనీయమైన విజయాన్ని సాధించాయని చెప్పవచ్చు. ప్రేమప్రచారం సమర్థంగా జరిగింది. యువతీ యువకులు కలిస్తే ప్రేమించి తీరాలన్న అభిప్రాయం ఏర్పడింది. కాలేజీలకు వెళ్ళేది ప్రేమించటం కోసమేనన్న అభిప్రాయం విస్తృతంగా ప్రచారమైంది. టూత్ పేస్టుతో పళ్ళు తోముకుంటే అమ్మాయి వచ్చి ఒళ్ళో వాలుతుంది. ఓ మోటర్ సైకిల్ కొంటే, ఇతరుడితో ఉన్న అమ్మాయి, వాడిని వదిలి వీడి దగ్గరకు వచ్చేస్తుంది. ఓ షేవింగ్ లోషన్ వాడగానే అమ్మాయి ప్రత్యక్షమైపోతుంది. ఇంకో మౌత్ ఫ్రెష్నర్ ఉపయోగిస్తే అమ్మాయిలు ఎగురుకుంటూ వచ్చి పడిపోతారు. ఇంకేదో సువాసన ద్రవ్యం వాడితే అమ్మాయిలు వెర్రెక్కి వెంటపడతారు. మరింకేదో కంపెనీ కళ్ళద్దాలు పెట్టుకుంటే, అమ్మాయిలు నిజంగానే పడిపోతుంటారు. ఈ ప్రచారం వల్ల, అబ్బాయిలకు అమ్మాయిలంటే ఎంతగా చులకన అభిప్రాయం కలుగుతుందో ఆలోచిస్తే, ఈ తరానికి మనం చేస్తున్న అన్యాయం అర్థమౌతుంది. అలాగే, ఓ అమ్మాయి "మిస్ యూనివర్స్" గా ఎన్నికై, సినిమాల్లోకి వెళ్ళి డబ్బు సంపాదించింది. ఆమె మిగతావారందరికీ ఆదర్శమైంది. ప్రతి వారూ అందంగా ఉండాలని పోటీలు మొదలుపెట్టారు. విదేశీ కాస్మెటిక్ కంపెనీలకు లాభం. విదేశీ ఎక్సర్ సైజ్ పరికరాల తయారీదారులకు లాభాలు. ఇక అమ్మాయిలు ఉన్నది అబ్బాయిలను ఆకర్షించేందుకే అన్న ప్రచారం పుట్టినప్పటి నుంచీ ఉగ్గు పాలతో అబ్బాయిలు నేర్చుకుంటున్నారు. ఓ అమ్మాయి ఓ క్రీమ్ వాడగానే అబ్బాయిలు వెంటపడతారు. ఓ హెయిర్ షాంపూ వాడితే ముగ్ధులైపోతారు. కంపెనీ ఐస్ క్రీమ్ అసభ్యంగా తింటూంటే కుర్రాళ్ళు సర్వం మరచిపోతారు.  ముఖం మీద మొటిమలు ఉంటే అబ్బాయిలు మెచ్చరు. కాబట్టి ఓ కంపెనీ మొటిమల మందు వాడితే ఇక అబ్బాయిలు క్యూలు కడతారు. ఇంకేదో పౌడరు, మరింకేదో అందాన్ని పెంచే వస్తువు.... కానీ అన్నీ అబ్బాయిలను ఆకర్షించేందుకే. ఐతే వీటన్నిటికీ డబ్బు కావాలి. డబ్బు కావాలంటే పరీక్షల్లో పాసవాలి. మార్కులు రావాలి. అప్పుడు కార్లు కొనవచ్చు, అమ్మాయిల్ని వెంట తిప్పుకోవచ్చు. ఇదీ ప్రస్తుతసమాజం ఆలోచిస్తున్న దిశ.  పైన చెప్పుకున్నవి అన్ని గమనిస్తే వ్యాపార సామ్రాజ్యాలు చాలావరకు ప్రస్తుత సమాజానికి నష్టం చేకూరుస్తున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.                                     ◆నిశ్శబ్ద.

నేచర్ లవర్స్ కోసం మినియేచర్ గార్డెనింగ్..!

మన ఇళ్లలోని పచ్చదనం మనకు ఆహ్లాదం, ఉత్తేజం కలిగేలా చేస్తుంది. అలాంటి అందమైన ఆలోచనకు మినియేచర్ గార్డెన్స్ సరిగ్గా సరిపోతాయి. మినియేచర్ గార్డెన్స్ సృజనాత్మకత యొక్క ఉత్తమ రూపాలలో ఒకటి మరియు వాటిని ఫెయిరీ గార్డెన్స్ అని కూడా అంటారు. ఈ గార్డెన్స్ కుర్చీలు, బల్లలు, బెంచీలు, చిన్న జంతువులు, పక్షులు, సీతాకోకచిలుకలు, మొక్కల స్టాండ్‌లు, మానవ బొమ్మలు మొదలైన రూపాలలో అలంకరించబడతాయి. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలికైన గార్డెనింగ్ వల్ల రాత్రిపూట నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని వెల్లడైంది. 'పర్పస్ ఫుల్ యాక్టివిటీస్' అనే అధ్యయనం ప్రకారం, యోగా మరియు గార్డెనింగ్ వల్ల మంచి నిద్ర అలవాట్లు కలుగుతాయి. డ్వార్ఫ్ బటర్ ఫ్లై ఎగేవ్, క్రాసుల, కలబంద, సెడమ్, స్నేక్ ప్లాంట్, రివర్ యుఫోర్బియా కాక్టస్, యుఫోర్బియా రుబ్రా కాక్టస్ మరియు ఇతర సక్యూలెంట్‌లను మీ స్వం మినియేచర్ గార్డెన్ తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. చాలా మంది ఈ గార్డెన్ లో చిన్న మొక్కలను (బోన్సాయ్) పెట్టడానికి ఇష్టపడతారు.

మనిషిలో విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా?

అనగనగా ఓ రాజ్యం ఉండేది.  ఆ రాజ్యానికి ఓ రాజున్నాడు, రాణి కూడా ఉంది. ఆ రాజ్యంలో ఓ సన్యాసి కూడా ఉన్నాడు. ఆ సన్న్యాసి ప్రత్యేకత ఏమిటంటే, అతడు అబద్ధం వినలేడు. అబద్ధం ఆయన చెవిన పడిన వెంటనే అది అబద్దం అని ఆయనకు తెలిసిపోతుంది. దాని కారణం వల్ల ఆయన తన తల మీదున్న ఓ వెంట్రుకని లాగి పడేసేవాడు. అది ఆయనకు అలవాటో లేక అది అందులో ఏదైనా రహస్యం ఉందొ ఎవరికీ తెలీదు. కానీ అలా అబద్దం వినగానే వెంట్రుక లాగి పడేయడం ఆ రాజ్య రాజుకి తెలిసింది. ఆయన గొప్ప సన్యాసి అనే కారణంతో పట్టణం పొలిమేరల్లో ఉన్న వనంలో ఓ ఆశ్రమం కట్టించి ఇచ్చాడు రాజు.  అయినా సరే, ఏవో అబద్ధాలు ఆయన చెవిన పడుతూనే ఉన్నాయి. ఆయన వెంట్రుకలు పీక్కుంటూనే ఉన్నాడు. చివరికి ఆయన తలపై ఒకే వెంట్రుక మిగిలింది. అదొక్కటే పోతే ఆయన మరణిస్తాడు అని తెలిసి ఆ సన్యాసి ఉంటున్న ఆశ్రమ పరిసరప్రాంతాలలో ఎవరూ మాట్లాడకూడదని ఆజ్ఞ జారిచేసాడు రాజు. రాజు ఆజ్ఞ ప్రకారం అక్కడ ఎవరూ తిరిగేవారు కాదు, ముఖ్ట్లాడేవారు కూడా కాదు.  పట్టణం పొలిమేరలో ఆశ్రమానికి పక్కనే ఒక తోట ఉంది. అది రాజుగారి తోట. ఓ రోజు రాజు, రాణి తోటలో విహరిస్తున్నారు. శృంగారసరససల్లాపాలు ఆడుతున్నారు. రాణి మీదకు ఓ పువ్వు విసిరాడు రాజు, ఆ దెబ్బకు తట్టుకోలేక పడి పోయినట్టు నటించింది రాణి. వెంటనే రాజు ఆమెకు ఉపశమనాలు చేయటం ప్రారంభించాడు. ఇంతలో రాజుకు 'హుం'కారం వినిపించింది.  "అంతా అబద్ధం నటన!" అంటూ అరుస్తూ రాజు, రాణి ఉన్నచోటుకు వచ్చాడు సన్న్యాసి. "నాకు తెలుసు, రాణికి దెబ్బ తగలలేదు. అంత సుకుమారి కాదామె!" అని అరచి, తలమీద ఉన్న ఒక్క వెంట్రుక పీకేసుకుని అక్కడే పడి మరణించాడు సన్న్యాసి. జరిగిందానికి రాజు విచారించాడు. ముఖ్యంగా సన్న్యాసి విచక్షణరాహిత్యానికి మరింత విచారించాడు. ఎందుకంటే, రాణిది నటనే అయినా శృంగార సమయంలో అది చెల్లుతుంది. ఇది అర్థం కాని సన్న్యాసి మాటల అర్థం వెంట పడ్డాడు కానీ సందర్భాన్ని పట్టించుకోలేదు. సందర్భాన్ని బట్టి మనుషుల మాటల్లో ఉన్న అంతరార్థాన్ని గ్రహించాలనేది ఇక్కడి విషయం. పిల్లలకు బ్రహ్మభావన వివరించేటప్పుడు ఈ విషయం దృష్టిలో ఉంచుకోవాలి. "ప్రపంచమంతా బ్రహ్మమయం" అన్న భావనను అపార్థం చేసుకునే  మూర్ఖులు ఉన్నారు ఈ ప్రపంచంలో.  ప్రపంచమంతా బ్రహ్మమయమై, అంతా ఆయన ఇష్టప్రకారం జరిగితే మనం చేసేదేం లేదు. అంతా కర్మప్రకారం జరుగుతుందని చేతులు ముడుచుకుని కూర్చునే ప్రయత్నాలు చేస్తారు కొందరు. అబద్ధాల విషయంలో సన్న్యాసి ప్రదర్శించిన మూర్ఖత్వం లాంటిదే ఇది కూడా. కాబట్టి సృష్టికర్తపై మనుషులకు ఉన్న విశ్వాసం ఆ వ్యక్తిలో శక్తిలా ఎదగాలి తప్ప, బలహీనతలా మారకూడదు. బలహీనతలా ఎలా మారుతుందో మనకు తెలుస్తూనే ఉంటుంది. మనం నిజజీవితంలో వాటిని  అనుభవిస్తూనే ఉంటాం కూడా.. దాన్ని శక్తిగా మార్చుకోవడమే మనుషుల్లో ఉండాల్సిన గుణం.                                     ◆నిశ్శబ్ద.

జీవితంలో ఎదగాలన్నా, ఆగిపోవాలన్నా కారణం ఇవే!

మనిషి జీవితంలో వర్తమానం మాత్రమే చాలా ముఖ్యమైన అంశం. అయితే గతం అనేది అనుభవాలు మిగులుస్తుంది, అదే జ్ఞాపకాలను మనదగ్గర వదిలిపోతుంది. ఆ జ్ఞాపకాలను తలచుకుంటూ ఉంటే గతాన్ని గుర్తుచేసుకుంటూ ఉన్నట్టే. చాలామంది గతంలో ఇలా అని వాటి గురించి ఆలోచిస్తూ వర్తమానంలో సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు.  గతాన్ని, వర్తమానాన్ని రెంటినీ సరిచూసుకుంటూ గతాన్ని తలచుకుంటూ అక్కడే ఉండిపోతారు కొందరు. వర్తమానంలో లక్ష్యాలను నిర్ణయించుకోవాలి, ఆ లక్ష్యాలను సాధిస్తూ వ్యక్తిత్వాన్ని క్రమంగా ఒక ఉన్నత స్థాయికి చేర్చుకోవాలి. అప్పుడే వ్యక్తిత్వం ఎదిగినట్టు అవుతుంది. మనుషులకు సంస్కారం ఎంతో ముఖ్యం. ఒక సమాజ పౌరుడిగా, నాయకుడిగా, ప్రతిభ కలిగిన కళాకారులుగా, గొప్ప ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్తలుగా ఈ సమాజంలో రూపాంతరం చెందాలి. అప్పుడే సమాజం ముందుకు సాగుతుంది. గతాన్ని గురించి ఆలోచించే వ్యక్తుల వల్ల సమాజం, కులం, దేశం ముందుకు కదలకుండా అభివృద్ధి అనేది లేకుండా అక్కడే ఆగిపోతాయి. వారి అభివృద్ధి శూన్యంగా ఉంటుంది. ఈ ప్రపంచం అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం మనిషి ఆదిమకాలం నుండి అక్షరాస్యుడిగా ఎదగడం అనే విషయాన్ని అందరూ చూపిస్తారు. అయితే గతాన్ని గురించే ఆలోచించేవారు ఆధునిక సమాజంలో ఆదిమానవులు జీవించినట్లుగా ఉంటుంది. అంటే అభివృద్ధి శూన్యమని అర్థం. ఎప్పుడూ గతానికి అనుకూలంగా బతకకూడదు. మనిషి జీవితం ఎలా ఉండాలంటే వర్తమానం నుండి భవిష్యత్తులోకి ప్రయాణం చేస్తున్నట్టు ఉండాలి. అంటే వర్తమానం నుండి గతం ఆలోచించడం అనేది ఇంకా వెనక్కు వెళ్తున్నట్టు అని అర్థం.  అనవసరమైన భయాలు, అనుమానాలు వదిలివేయాలి. ఈ ప్రపంచంలో సంస్కృతి, అలవాట్లు గతంనుంచి వస్తున్నవే. అవి ఇప్పక్టికిప్పుడు పుట్టి మనుషుల్ని నసహణం చేయలేదు. సంస్కృతి, అలవాట్లు అనేవి ఎప్పుడూ జీవితంలో ఎదుగుదలకు ఆటంకాలు కాకూడదు. జీవితంలో ఎదుగుదలకు ఇబ్బంది అయ్యే ఆలోచనలను, స్నేహాలు, న్యాయకత్వాలను వదిలేసుకోవాలి.   ఈకాలంలో మనిషి తనకు తాను ఎంపిక చేసుకోగలిగినన్ని అవకాశాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఇది రాజులకాలం నాటి పాలన కాదు, భూస్వాముల నాటి అజమాయిషీ కాదు, కుల వ్యవస్థలో కూరుకుపోయే దశ కాదు. ఇది మనిషి చైతన్యవంతుడై ఈ ప్రపంచాన్ని శాసించవలసిన పారిశ్రామిక సమాజం, ప్రజాస్వామిక సమాజం, ప్రపంచీకరణ పొందుతున్న ప్రజాస్వామిక సమాజం. జీవితాన్ని గెలుచుకోవడం వైపే మనుషుల ఆలోచనలుండాలి. జీవితాన్ని గెలుచుకోవడానికి స్ఫూర్తిని ఇచ్చే వాటి గురించి తెలుసుకుంటూ ఉంటే మనిషి ఆలోచన మారుతుంది.  ఈ ప్రపంచంలో మనిషిని ఒక వృత్తంలో ఉంచడానికి ఎన్నో పద్ధతులను, మరెన్నో విషయాలను నిర్ణయించారు. వీటిలో మతాలు, మతాల విశ్వాసాలు కూడా ఒకటి. ఎన్నో సిద్ధాంతాలు మనుషుల్ని కొన్ని అవకాశాలకు దూరం చేస్తాయి  వాటిని నమ్మితే మంచి, లేకుంటే చెడు అన్నట్టు అవి నొక్కి వక్కాణిస్తాయి. కానీ నిజానికి ఇలాంటి ఆలోచనలే నిజమైన సమస్యలు సృష్టిస్తాయి. ఈ ప్రపంచంలో మనిషి ఎదుగుదలకు తెలివి, కష్టం, ఆత్మవిశ్వాసం వంటివి మాత్రమే దోహదం చేస్తాయి తప్ప మతవిశ్వాసాలు, మతపరమైన నమ్మకాలు కాదు. ప్రతిదీ హేతుబద్ధంగా ఆలోచించాలి. హేతుబద్ధంగా ఆలోచించినప్పుడే విషయం పూర్తిగా అర్థమవుతుంది. మతపరమైన కారణాల వల్లనో, ఇతర కోణాల్లోనో ఆలోచిస్తే వాటిలో ఖచ్చితమైన సారాంశం అర్థం కాదు. ఏదైనా మనసును కల్లోలం చేస్తే దాన్నుండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటపడాలి. ఎదుగుదలకు తగిన నమ్మకాలు ఏర్పరుచుకోవాలి. నూతన జ్ఞానం అందిన కొద్దీ విశ్వాసాలను మార్చుకోవాలి. ఎంత ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటే అంత ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అంత మంచి ఉన్నత లక్ష్యాలు నిర్ణయించుకోగలుగుతాము.  మానవ సంబంధాలలో ముఖ్యమైనవి కొన్ని ఉంటాయి. అవే  విలువలు. విలువలున్న చాలామందికి  లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలు  ఉద్యోగం గురించి కావచ్చు, వేరే ఇతర విషయాలు కావచ్చు. ఇంకా జీవితం, స్నేహాలు, ప్రేమ ఇవన్నీ కూడా విలువలతో కూడుకుని ఉంటాయి. భారతీయ సంస్కృతి కూడా గొప్ప విలువలు కలిగినదే.  వీటి గురించి సరైన సమయంలో సరైనవిధంగా నిర్ణయాలు తీసుకోవాలి. సకాలంలో తీసుకునే నిర్ణయాలు మనిషి జీవితాన్ని ఎంతో అందంగా మారుస్తాయి.  తీసుకునే నిర్ణయాలు సరైనవే అయినా ఆలస్యమైతే అవకాశాలు చేజారుతాయి కదా. ఏవో భయాలు, శకునాలు అడ్డుపెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో తీసుకోకపోతే అపుడు జరిగేది నష్టమే. ఏఏ విలువలు, లక్ష్యాలు, మన సంస్కృతి మొదలైనవాటిని ఒక కోణంలో నుండి చూసే అలవాటు వల్ల అందరికీ ఆవైపు మాత్రమే అర్థమవుతుంది. అందుకే విషయాన్ని మొత్తం క్షుణ్ణంగా అన్ని కోణాల్లో నుండి చూడాలి, అర్థం చేసుకోవాలి. జీవితంలో ఎదగడానికి, ఆగిపోవడానికి కూడా ఒక విషయాన్ని చూసే కోణం కారణమవుతుంది.                                         ◆నిశ్శబ్ద.

ఇంటిలోకే పచ్చదనం.. ప్రకృతితో మమేకం

పచ్చదనాన్ని ఎవరు ఇష్టపడరు! మనమందరం ఇష్టపడతాం. మొక్కల పెంపకానికి సరిపడా ఖాళీ స్థలం లేకపోయినా.. గార్డెనింగ్‌పై ఉన్న ప్రేమ మొక్కలు పెంచాలనే మీ కోరికను మరింత పెంచేస్తుంది. నీడలో మరియు తక్కువ సూర్యకాంతిలో జీవించే వివిధ రకాల మొక్కలను ప్రకృతి మనకు అందిస్తుంది. అవి సులభంగానే లభిస్తాయి. కానీ కొన్ని మాత్రం చాలా అరుదుగా మరియు తక్కువ అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ నగరం మధ్యలో అన్యదేశ ఇండోర్ ప్లాంట్ కేంద్రం ఉంది. ఇది హైదరాబాద్‌ లోని మొక్కల ప్రేమికులకు అందమైన అరుదైన మొక్కలను అందిస్తుంది. ఇది మీ ఇండోర్‌ను రిఫ్రెష్ చేయడమే కాకుండా మీ ఇళ్లలోకి ప్రకృతిని తీసుకొచ్చినట్లు ఉంటుంది. ప్లాంటిక్ అనేది ఇండోర్ మొక్కలు, బోన్సాయ్, ఇండోర్ చెట్లు, సక్యూలెంట్స్ ను విక్రయించే ఒక ప్రత్యేకమైన స్టోర్. మొక్కలను సక్యూలెంట్స్ మరియు కాక్టితో మినియేచర్ గార్డెనింగ్‌లో ప్రదర్శించవచ్చు. ప్లాంటిక్ మీ ఇళ్లు మరియు కార్యాలయలను పచ్చదనంగా మార్చడంలో సహాయపడుతుంది. వారు మీ ఇండోర్ గార్డెన్‌లు, బాల్కనీ స్పేస్‌లు, టెర్రస్ గార్డెన్‌లు మరియు పోర్చ్‌లను కూడా నిర్వహిస్తారు. 9160608787@King Kazemi పై మీరు వారిని సంప్రదించవచ్చు.

మాటలతో కట్టిపడేయాలంటే ఇలా ఆకట్టుకోవాలి!

మాట ఆభరణం మనిషికి అంటారు పెద్దలు. మాటే మంత్రము అంటారు కవులు. మాట ఇతరులను ముగ్ధులను చేస్తుంది, ఆకర్షిస్తుంది. అందంగా ఆకట్టుకునేలా మాట్లాడటం కూడా ఒక కళ. ఇప్పటి యూత్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో మాట్లాడటం గురించి కూడా ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ మాట్లాడటంలో అందరూ తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించవలసిన విషయాలు కొన్ని ఉంటాయి.  ఇతరులతో సంభాషిస్తున్నప్పుడు ఆ సంభాషణలో మనం ఎప్పుడూ ఇతరులతో వాదించడానికి ప్రయత్నం చేయకూడదు. సంభాషణలో మనకు తెలిసిన విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. అంతేకానీ వాదనకు దిగటం అంత మంచిది కాదు. ఎందుకంటే వాదనే గొడవలకు దారి తీస్తుంది. సంభాషణలో ఇతరుల అభిప్రాయాలకు విలువనిస్తూ మాట్లాడాలి. ఇతరులు చెప్పిన దాన్ని వారి ముఖం మీదే తప్పు అని ఖండిస్తూ మాట్లాడకూడదు. ఎప్పుడూ కూడా సంభాషణలో మనం మాట్లాడేది తప్పు అని మీరు గమనించినా లేక ఇతరులు తెలియజేసినా హుందాగా ఆ తప్పును అంగీకరించాలి. అంగీకరించడంలో కూడా గొప్ప వ్యక్తిత్వం వ్యక్తం అవుతుంది. అంతేగానీ ఆ తప్పును కప్పిపుచ్చడానికి ప్రయత్నించకూడదు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసే ఇతర పనులు కూడా తప్పిదాలే అవుతాయి. ఒకదాని వెనుక ఒకటిగా తప్పుల చిట్టా పెరుగుతుంది. సంభాషణని ఎప్పుడూ కూడా స్నేహపూర్వకంగా ప్రారంభించాలి. అలాగే చిరునవ్వుతో ముగించాలి. అప్పుడే విలువను కాపాడుకోగలిగిన వారమవుతాము. నచ్చని విషయాలు ఉన్నా, న్యాయమైన విషయాలు లేకపోయినా వాటిని సుతిమెత్తగా నవ్వుతూనే చెప్పాలి తప్ప గొడవకు దారితీసేలా ఆవేశంగా ఉండకూడదు. ఇతరులు చెప్పే విషయాలను మనం ఎప్పుడూ జాగ్రత్తగా వినాలి. వారు చెబుతున్నప్పుడు మీరు కూర్చున్న కుర్చీలో లేదా కూర్చున్న స్థానంలో కొంచెం ముందుకు వంగి వినాలి. వారికి అటెన్షన్ ఇస్తున్నామనే అభిప్రాయం  కలుగుతుంది. చెప్పాల్సిన విషయాన్ని ఎలాంటి తడబాటు లేకుండా, దాపరికం లేకుండా చెబుతారు. ఇతరుల అభిప్రాయాలపట్ల సానుకూలంగా స్పందించాలి. ఎప్పుడూ కూడా సంభాషణలో ఇతరులను ఆకర్షించాలంటే ఎదుటి వారిని ఎక్కువగా మాట్లాడనివ్వాలి. మనం చెప్పాలనుకున్న విషయాలు, మనం చేయాలనుకున్న ఆలోచనలనూ ఇతరుల ఆలోచనలుగా చేసి వాటిని ఆమోదించాలి. విషయాలను మనం చూసే కోణంలో కాక ఇతరుల కోణంలోంచి చూడాలి, ఆలోచించాలి. మనం ఇతరులపట్ల చూపవలసింది గౌరవాన్ని అనే విషయం మరచిపోకూడదు. వారు చెప్పే మంచిని మనస్ఫూర్తిగా అభినందించాలి. సంభాషణలో అన్నీ నాకు తెలుసు అనుకొనే మనస్తత్వాన్ని వదులుకోవాలి. అవతలి వారు అభిప్రాయాన్ని విషయాన్ని పూర్తిగా చెప్పేంతవరకూ వినాలి. అంతేకానీ మధ్యలో  తొందరపడి ఎటువంటి సూచనలు, సలహాలు ఇవ్వకూడదు. సూచనలు ఇచ్చే ముందు వారు చెప్పిన విషయాన్ని సమగ్రంగా అర్ధం చేసుకొన్నాకే ఇవ్వండి. ఇతరులతో సంభాషించే ముందు సంభాషణను అభినందనతో ప్రారంభించాలి. ఇతరులు చేసిన పొరబాట్లను బహిరంగంగా విమర్శించకూడదు. ఇతరులను విమర్శించే ముందు మీ తప్పుల్ని మీరు అంగీకరించాలి. ఇతరులకు ఆజ్ఞాపూర్వకమైన సూచనలు ఇవ్వవద్దు. దానికి బదులుగా సలహాపూర్వక సూచనలు ఇవ్వాలి. సంభాషణలో ఎప్పుడూ కూడా ఇతరులను అవమానించకూడదు. ఇతరులలో ఉన్న మంచి గుణాలను గాని లేక ఇతరులలో మీరు ఆశిస్తున్న మంచి గుణాలను వారికి ఆపాదించి, వారిని ఆ విధంగా ఉండేలా మలచుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే మనం ఇతరులను ఆకర్షించుకోగలుగుతాము. ఎప్పుడైనా సరే ఎదుటివారి మంచిని బయటకు చెప్పి వారిలో ఉన్న తప్పును ఇది ఇలా ఉండచ్చా?? అలా ఉంటుందని నాకు తెలియదు లాంటి మాటలతో చెప్పాలి. అలా చెబితే మన మాటల ద్వారా అది తప్పేమో అనే ఆలోచన చేసి చివరికి వారు దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ఇదీ మాటల్లో ఉన్న మర్మం, మాటకు ఉన్న ఆకర్షణ, మాటకున్న శక్తి.                                      ◆నిశ్శబ్ద.

సక్సెస్ వెంట రావాలంటే దీన్ని నమ్మాలి!

మనిషి జీవితంలో పనులను చేసే విధానాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. సాధారణంగా చేసిన పనికి సాధారణమైన పలితం ఉండొచ్చు, అదే పనిని మరింత కష్టపడి చేస్తే ఆ పనికి దక్కే ఫలితం మరింత గొప్పగా ఉండొచ్చు. అంటే  దక్కే ఫలితం అంతా చేసే విధానంలోనే ఉంటుంది.  కష్టపడి పనిచేస్తే దేనినైనా సాధించవచ్చు. అందుకే కష్టేఫలి అన్నారు. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం లభిస్తుంది. కష్టపడి అంకితభావంతో పనిచేయటం ప్రారంభిస్తే విజయాలు వాటంతటవే వస్తాయి. కష్టపడకుండా అన్నీ కావాలనుకోవటం అసమర్థత అవుతుంది. అసమర్థత మాత్రమే కాదు మనుషుల్లో ఉన్న మూర్ఖత్వం కూడా అదే. అలా అనుకునే వారు ఎప్పటికీ ఏమీ సాధించలేరు. కాబట్టి విజయాలు సాధించడానికి వంకర మార్గాలు, సులువైన దారులు, వేరే ఇతర ఆలోచనలు ఏమీ ఉండవు.  కేవలం కష్టపడాలి. కొందరు డబ్బు అడ్డు పెట్టుకుని పనులు విజయవంతం చేసుకుంటారు. అపుడు అది విజయం అవ్వదు. కష్టపడి సాధించుకునేది మాత్రమే విజయం అనబడుతుంది. కష్టపడితే దేనినైనా సొంతం చేసుకోవచ్చు. కష్టపడి అంకితభావంతో పనిచేయగలగటమే అదృష్టం! కష్టపడి పనిచేసే అవకాశం లభించడమే ఒక అదృష్టం! అటువంటి అదృష్టం మనల్ని వరిస్తున్నప్పుడు మనం తలుపులను మనస్సుని మూసుకుని కూర్చుంటే ఏ ప్రయోజనాన్నీ పొందలేము. అవకాశాలు మనల్ని వరిస్తున్నప్పుడు మనం అందుకోవడానికి సిద్ధంగా వుండాలి.  రోదసి ప్రయోగానికి సిద్ధంగా వున్న ఏస్ట్రోనాట్ లాగా, సముద్రగర్భంలోకి వెళ్ళే డైవర్లాగా సిద్ధంగా వుండాలి. ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ ఆపరేషన్ కి కావలసిన వస్తువులన్నీ ముందుగా ఆపరేషన్ థియేటర్ తో సహా సిద్ధం చేసుకుంటారు. వ్యాపారం చేసేవారు వ్యాపారానికి కావలసిన అవకాశాలతో సిద్ధంగా ఉంటారు. ఇలా ప్రతిదానికి సిద్ధంగా ఉండటం ఎంత ముఖ్యమో, విద్యార్థులు పరీక్షల కోసం కావలసిన మెటీరియల్ తో సిద్ధంగా ఉండటం అంతే అవసరం. ప్రతి విషయంలోనూ కష్టపడే గుణం అలవరచుకోవాలి. ఎందుకంటే కష్టం వెనకాలే ఫలితం కూడా ఉంటుంది. కష్టపడడం వల్ల మన శ్రమ ఏమీ వృధాకాదు. అందుకు సంబంధించిన ఫలితం ఇవ్వాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఎల్లుండు కాకపోతే ఇంకొకరోజు ఇలా ఎప్పటికైనా ఆ ఫలితం లభిస్తుంది. 'చేతకానితనముంటే జాతకాన్ని నిందించకు, నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు' అంటారు ఓ మహానుభావుడు.  మనిషిలో  చేతకానితనం ఉన్నప్పుడు, ఆ మనిషి తన వైఫల్యాలకు కారణంగా జాతకాన్ని చూపించాల్సిన అవసరం ఉంటుందా?? అలాగే నాసిరకంగా, ఒకరికి నమ్మకం ఇవ్వలేని సరుకు పెట్టుకుని అసలు అమ్మకం అనే విషయం గురించి ఎందుకు అరవాలి. సరుకు మంచిది అయితే కొనకుండా ఉంటారా ఎవరైనా?? ఈ చేతకానితనం, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి జాతకాలను, బయట పరిస్థితులను సాకుగా చూపెడితే మనిషికే నష్టం తప్ప బయటివాళ్లకు ఏంటి నష్టం?? మనలో సమర్ధవంతమైన నైపుణ్యాలు ఉండాలి. అప్పుడు జీవితంలో విజయాలు సాధిస్తాము. జీవితంలో అరుదుగా వచ్చే అవకాశం లభించినపుడు మీనమేషాలు లెక్కించుకుంటూ వెనుకాడకూడదు. అదృష్టం వరించినంత కాలం మన తెలివితేటలే దానికి కారణం అని చెబుతుంటాము. దురదృష్టం వెంటాడు తున్నప్పుడు దానికి కారణం జాతకాలని, వాస్తు అని చెప్పడం మంచి పద్ధతి కాదు. భారతదేశంలో చాలామంది సంపన్నులు తమ స్వయం కృషితో ఎదిగిన వారే కాని, వారసత్వం మీద వచ్చిన వారుకాదు. కష్టపడితే ఫలితం లభిస్తుందన్న నమ్మకం కలిగివుంటే విజయాలను సొంతం చేసుకోవచ్చు. కష్టించి పనిచేస్తే భవిష్యత్ మన గుప్పిట్లోనే వుంటుంది. అందుకే కష్టాన్ని నమ్మితే బాగుపడే వాడే కానీ చెడిపోయేవాడు లేడు ఈ ప్రపంచంలో. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే కష్టం వైపు క్రమంగా నడుస్తారు ఖచ్చితంగా.                                      ◆నిశ్శబ్ద.