అన్నా పంచెకిందకి నీళ్లొచ్చేస్తున్నాయ్!
posted on Aug 29, 2012 9:24AM
అన్నా హజారే టీమ్ సభ్యులు కొట్టుకు ఛస్తున్నారు. ఒకళ్లంటే ఒకళ్లకి ఏమాత్రం పడడం లేదు. విభేదాలు ఎక్కువైపోయి ఎవరిదారి వాళ్లు చూసుకుంటున్నారు. జనం కోసం మొదలుపెట్టిన ఆందోళన రాజకీయ రంగును పులుముకోవడంతో నిజంగా జనంకోసమే బరిలోకి దిగినవాళ్లు టీమ్ నుంచి విడిపోయారు. రాజకీయప్రయోజనాలకోసమే ఇదంతా చేస్తున్నారంటూ బాహాటంగానే సహచరులపై విమర్శలు గుప్పిస్తున్నారు.
త్వరలోనే అన్నా కొత్త పార్టీ పెడతారన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అన్నా టీమ్ లో పొలిటికల్ కెరీర్ గురించి కలలుగంటున్నవాళ్ల మాటలుకూడా కొత్త పార్టీ ప్రయత్నాల్ని బలపరుస్తున్నాయ్. పార్టీ పెట్టితీరాలన్న పట్టుదలతో కేజ్రీవాల్ ముందుకు దూసుకెళ్తున్నారు. కోల్ గేట్ కుంభకోణాన్ని సాకుగా చూపించి యూపీఏ, బీజేపీలను ఇబ్బందిపెట్టేందుకు కేజ్రీవాల్ చేసిన ప్రయత్నాల్ని ప్రభుత్వం చాకచక్యంగా అడ్డుకుంది.
కేజ్రీవాల్ స్వలాభంకోసమే పనిచేస్తున్నారంటూ కిరణ్ బేడీ ట్విట్టర్ ఇచ్చిన సందేశాలు చాలామందిని ఆలోచింపజేస్తున్నాయి. కేజ్రీవాల్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రాజకీయ మార్గాన్ని ఎంచుకోవడం చాలా ఆనుమానాలకు తావిస్తోందని, అన్నా తక్షణం జోక్యం చేసుకుని కేజ్రీవాల్ కి మార్గనిర్దేశం చేయాలని కిరణ్ గట్టిగా పట్టుబడుతున్నారు. ఆదివారం జరిగిన నిరసన ప్రదర్శనలో బిజెపిని లక్ష్యంగా చేసుకోవాల్సిన అవసరం లేదని కిరణ్ గట్టిగా పట్టుబట్టారు.