అలిగి అసెంబ్లీ ఎక్కిన నన్నపనేని
posted on Aug 28, 2012 @ 12:53PM
రాష్ట్రంలో రైతులుపడుతున్న అవస్థల్ని చూసి టిడిపి నేతలు అల్లాడిపోతున్నారు. రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వానికి తీవ్రస్థాయిలో నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలపాలన్ననిర్ణయం జరిగిపోయింది. పోలీసులు అక్కడికి వెళ్లనివ్వలేదు. గాంధీ బొమ్మ విగ్రహం ఉన్న ప్రాంగణానికి తాళంవేశారు. టిడిపి నేత నన్నపనేని రాజకుమారికి సర్రున కోపం ముంచుకొచ్చింది. అధికారుల వైఖరిపై అలిగిన ఆమె వెనకాముందూ చూసుకోకుండా అసెంబ్లీపైకి ఎక్కేశారు. అక్కడే కూర్చుని నిరసన తెలపడం మొదలుపెట్టారు. అధికారులకు కంగారు పుట్టుకొచ్చింది. అమ్మా, తల్లీ.. కిందకి దిగితే కోరినవన్నీ ఇస్తామని హామీ ఇచ్చారు. గాంధీ విగ్రహం దగ్గరికి వెళ్లినిస్తామన్నారు. పట్టుబట్టి కూర్చున్న నన్నపనేని కాస్త ఆలోచించారు. అధికారులు అరెస్ట్ చేస్తే నిరసన తెలపడం కష్టమౌతుందనుకున్న ఆమె.. అందరితో కలిసి గాంధీ విగ్రహంముందు ధర్నా చేయొచ్చన్న ఆశతో కిందికి దిగొచ్చారు. రైతుల కష్టాలగురించి చర్చించేందుకు వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలని, అసెంబ్లీలో రైతుల సమస్యలగురించి ఉన్నపళంగా చర్చించాలని నన్నపనేని డిమాండ్ చేస్తున్నారు.