Read more!

దస్తగిరిని కాపాడు దేవుడా!

Publish Date:Apr 24, 2024

గురువారం నాడు పులివెందులలో జగన్మోహన్‌రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి పేరిట ఈనెల 22వ తేదీన ఆయన మరో బాబాయ్ వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. గురువారం నాడు జగన్ స్వయంగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా లోకల్‌గా వున్న వైసీపీ కార్యకర్తలు మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు పులివెందులకు వచ్చే అవకాశం వుంది. వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఇల్లు మరెక్కడో లేదు.. జగన్ ఇంటికి కూత వేటు దూరంలోనే వుంటుంది. గురువారం నాడు జగన్ నామినేషన్ సందర్భంగా దస్తగిరి ఇంటి మీదకి వైసీపీ కార్యకర్తలు ఆవేశంతో దాడి చేసి లేపేసే ప్రమాదం వుందనే అనుమానాలు వున్నాయి. అందుకే దస్తగిరికి బుధ, గురువారాల్లో భద్రత పెంచారు. ప్రస్తుతం 3 ప్లస్ 3, 4 ప్లస్ 4 భద్రత నుంచి 4 ప్లస్ 4, 10 ప్లస్ 10 స్థాయికి భద్రతను పెంచారు. ఇదిలా వుంటే వైసీపీ కారకర్తల బారి నుంచి దస్తగిరిని కాపాడు దేవుడా అని దస్తగిరి కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారు. ఇదిలా వుంటే, మరోవైపు దస్తగిరి కూడా ర్యాలీగా వెళ్ళి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రేపు నామినేషన్ దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జై భీమ్ భారత్ పార్టీ తరఫున దస్తగిరి బరిలోకి దిగుతున్నారు. జగన్ నామినేషన్ వేసినప్పుడే తాను కూడా నామినేషన్ వేస్తానని, తనకు అధికారులు అడ్డుపడుతున్నారని దస్తగిరి అంటున్నారు. అధికారులు అడ్డుకున్నా తాను గురువారం నాడు నామినేషన్ వేయడం ఖాయమని ఆయన అంటున్నారు. తాను నిర్వహించే ర్యాలీలోకి వైసీపీ కార్యకర్తలు ప్రవేశించి దాడి చేసే అవకాశం వుందని దస్తగిరి అనుమానిస్తున్నారు.

మనిషి జీవితంలో గురువు ప్రాధాన్యత తెలిపే కథనం!!

Publish Date:Oct 9, 2023

సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.

చంద్రబాబుకు సీఐడీ నోటీసులు

Publish Date:Mar 15, 2021

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సిఐడి అధికారులు..ఆయన నోటీసులు ఇచ్చారు. అమరావతి రాజధానిలో అసైన్డ్ భూములు కొనుగోలు అమ్మకాలపై చంద్రబాబుపై కేసు నమోదు అయింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది.  41సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు. నోటీసులు  ఇచ్చాక ఇన్వెస్టిగేషన్ కు పిలుస్తామని ఏపీ సీఐడీ అధికారులు చెబుతున్నారు. అమరావతి నుంచి రెండు సీఐడీ బృందాలు హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై 120బి, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులుకూ సీఐడీ నోటీసులు  అందాయి. 41 సీఆర్పీసీ కింద మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. 

భార్యాభర్తలలో ఉండే ఈ అలవాట్లు ఏకంగా విడిపోవడానికి దారితీస్తాయ్!

Publish Date:Apr 24, 2024

  ఈ ప్రపంచంలో భార్యభర్తల బంధం చాలా గొప్పది. ఈ బంధాన్ని పదిలంగా ఉంచుకోవాల్సిన బాధ్యత భార్యాభర్తల మీదనే  ఆధారపడి ఉంటుంది.  సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపడానికి, పరస్పర అవగాహన, ప్రేమ,  నమ్మకం వంటివి అవసరం. సహజంగానే విభిన్న స్వభావం గల ఇద్దరు వ్యక్తులు ఒకచోట ఉన్నప్పుడు  అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. కానీ వాటిని పరిష్కరించడానికి భార్యాభర్తలిద్దరూ కూర్చుని అవగాహనతో నెమ్మదిగా మాట్లాడుకోవడం ముఖ్యం.  సంబంధాలలో చిన్న చిన్న తగాదాలు సాధారణం. కానీ ఇవి  ఎప్పుడో ఒకసారి జరిగితే పర్లేదు. కానీ ఎప్పుడూ ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటే మాత్రం దీని గురించి ఆలోచించాల్సిందే.. ముఖ్యంగా భార్యాభర్తలలో ఉండే కొన్ని అలవాట్ల కారణంగా గొడవలు ఎక్కువగా అవుతుంటాయి. వీటి గురించి భార్యాభర్తలు జాగ్రత్త తీసుకుంటే వారి బంధం పదిలంగా ఉంటుంది. కమ్యూనికేషన్ లేకపోవడం.. ఏదైనా సమస్యను పరిష్కరించడానికి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అవసరం. ఇద్దరి మధ్య  తగాదాలు ఉన్నా  దాన్ని ఆపకుండా   ఉంటే లేదా  సమస్యను వదిలి అప్పటికే ముందుగా ఉన్న తగాదా గురించే మాటిమాటికి మాట్లాడుతూ ఉంటే అది బంధం విచ్చిన్నం కావడానికి దారితీస్తుంది. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగుంటేనే సమస్యలు ఏవైనా పరిష్కారం అవుతాయి. బాధ్యతల నుండి తప్పించుకోవడం.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసినా లేదా ఒకరే ఉద్యోగం చేసినా ఇంటిపని, బయటి పని అనే బాధ్యతలను విభజించుకోవాలి. పనిని ఎగ్గొట్టడం, తప్పించుకోవడం, పని లేకుండా ప్లాన్ చేయడం వంటివి   ఇద్దరి మధ్య గొడవకు దారితీస్తుంది. దీని కారణంగా  చాలా గొడవలు జరుగుతాయి. గౌరవించకపోవడం..  వైవాహిక జీవితం అనే బండి  సజావుగా నడవడానికి అవసరమైన మరొక విషయం ఒకరినొకరు గౌరవించడం. ఒకరి పనిని మెచ్చుకోండి,  ఇద్దరి బంధంలో ఒకరి ప్రాధాన్యతను మరొకరు గుర్తించాలి.  భాగస్వామిలో లోపాలను వెతుకుతూ, వారిలో మంచి విషయాన్ని గ్రహించకుండా ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటే వైవాహిక బంధం నాశనం అవుతుంది. అనవసర కోపాలు.. కొందరికి చిన్న విషయాలకు చటుక్కున కోపం వస్తుంది. చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం, అనవసరంగా కోపం తెచ్చుకోవడం... ఇవి  భార్యాభర్తల బంధంలో   గొడవలకు కారణం కావచ్చు. ఎప్పుడూ  కోపంగా ఉండే భాగస్వామితో మాట్లాడటం  కష్టం.  కోపం ఎెందుకు వస్తుందనే విషయం గురించి ఓపెన్ గా మాట్లాడాలి తప్పితే భాగస్వామి ముందు అనవసరంగా కోపం తెచ్చుకుంటే బంధం నిలవదు.                                           *రూపశ్రీ.  
[

Health

]

మామిడిపండ్లను తినేముందు నీటిలో కొద్దిసేపు ఉంచి తినాలి ఎందుకో తెలుసా?

Publish Date:Apr 24, 2024

వేసవికాలం కోసం చాలామంది కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారు. ఆ ఎదురు చూపులు అన్నీ మామిడికాయల కోసమే. పండ్లలో రారాజు అని చెప్పుకునే మామిడికి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. సమ్మర్ లో మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చాయంటే చాలు..  ఎంత ధర అయినా కొనేసి వాటి రుచిని ఆస్వాదించేవారు ఉన్నారు. అయితే ఒకప్పుడు ఇంట్లో మామిడి కాయలు ఉంటే అమ్మలో, అమ్మమ్మలో ముందే వాటిని నీళ్లున్న టబ్ లో వేసి ఓ గంటాగిన తరువాత తినడానికి ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఆ సీన్ మారింది. మామిడి పండ్లను ఎంచక్కా ఫ్రిజ్ లో పెట్టి చల్లగా అయ్యాక మండుతున్న ఎండల్లో హాయిగా చల్లగా తింటూ ఉంటారు. అయితే ఇది తప్పని ఒకప్పుడు మన పెద్దలు చెప్పిన మార్గమే మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు మామిడిపండ్లను నీటిలో ఎందుకు ఉంచాలి? దీనివెనుక గల ఆరోగ్య రహస్యం ఏంటి? తెలుసుకుంటే... నీళ్లలో కొద్దిసేపు ఉంచిన మామిడిపండు తింటే శరీరంలో వేడి తగ్గుతుంది. నిజానికి మామిడిపండు తినడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. ఇది జీర్ణక్రియ,  చర్మ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. కానీ ఈ సమస్యను నీటిలో కాసేపు ఉంచడం ద్వారా తగ్గించుకోవచ్చు. మామిడిలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యాంటీ న్యూట్రియంట్. ఇది శరీరంలోకి ప్రవేశించినప్పుడు పోషకాలను గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుంది. దాని అధిక పరిమాణం కారణంగా శరీరంలో పోషకాల లోపం ఏర్పడే  అవకాశం ఉంటుంది . అయితే మామిడిని కనీసం అరగంట పాటు నీటిలో నానబెట్టడం ద్వారా ఫైటిక్ యాసిడ్ స్థాయిని తగ్గించవచ్చు. ఈ రోజుల్లో ప్రతి పంటకు  హానికరమైన పురుగుమందులు,  ఎరువులు అధిక పరిమాణంలో  ఉపయోగిస్తారు. మామిడి సాగులో కూడా ఇవి తప్పనిసరి. ఇవి మామిడి తొక్కపై ఉంటాయి.  ఇవి తినేటప్పుడు  శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకే మామిడిని కనీసం అరగంట నుండి గంట సేపైనా నీటిలో ఉంచడం అవసరం. తద్వారా వాటిపై ఉన్న పురుగుమందులు తొలగిపోతాయి. మామిడిలో కొంత మొత్తంలో తెల్లని స్రావం ఉంటుంది. ఇది మొటిమలు, దద్దుర్లు,  అలెర్జీ వంటి చర్మ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. మామిడికాయను నీళ్లలో కాసేపు నానబెట్టడం వల్ల  స్రావం తగ్గుతుంది.   తద్వారా చర్మ సమస్యలు ఏవీ ఇబ్బంది పెట్టవు. మామిడికాయను నీళ్లలో ఉంచకుండా తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. ఇది జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తుంది. అందువల్ల కొంత సమయం పాటు నానబెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది.  మామిడిని నీటిలో ఉంచి తింటే అందులో హైడ్రేటింగ్ లక్షణాలు పెరుగుతాయి.                                                     *రూపశ్రీ.

కండ్ల ముందే ప్రపంచం.. కళ్లజోడు లోనే సమస్తం

Publish Date:Jul 17, 2020

సాంకేతిక రంగంలో మరో విప్లవానికి రిలయన్స్ సంస్థ తెరతీసింది. జియో ఇంటర్నెట్ తో లక్షలాది మంది వినియోగదారులను తన ఖాతాలో జమచేసుకున్న ఈ సంస్థ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన జియో గ్లాసెస్ డిజిటల్ ప్రపంచాన్ని కొత్త కోణంలో చూపించబోతున్నాయి. రిలయన్స్ సంస్థ 43న వార్షికోత్సవంలో జియో గ్లాస్ ను ఆవిష్కరించారు. ఈ కళ్లజోడుతో ఇప్పటివరకు అరచేతిలో ఇమిడిన ప్రపంచం ఇంక కంటి ముందు సాక్షాత్కరించబోతుంది. కరోనా వ్యాప్తి కారణంగా ప్రపంచమంతా డిజిటలైజ్ అయ్యిన తరుణంలో ఆన్ లైన్ క్లాస్ లు, వీడియా కాన్ఫరెన్సులు, జూమ్ మీటింగ్ లు సగటు మనిషి జీవితంలో సాధారణమైన తరుణంలో ఈ జియో గ్లాస్ లు ఎంతో ఉపయోగకరంగా ఉండ బోతున్నాయి. అయితే వీటి ధరను మాత్రం ఇంకా ప్రకటించలేదు. జియో గ్లాస్ ఫీచర్స్ - నల్లని రంగు..కాస్త మందంగా.. కూలింగ్ గ్లాసెస్ లను పోలిన వీటి బరువు కేవలం 75 గ్రాములు మాత్రమే. - ఈ గ్లాసెస్ ద్వారా మన స్మార్ట్ ఫోన్ నుంచి 25 మిక్సిడ్ రియాలిటీ యాప్స్ పనిచేసేలా సెట్టింగ్ చేసుకోవచ్చు. - ప్రత్యేకంగా పొందుపరిచిన 3 డి హోలో గ్రాఫిక్ డిజైన్ ద్వారా వర్చువల్ రియాల్జీలో మీటింగ్స్ నిర్వహించుకోవచ్చు. - ఇందులో అమర్చిన సెన్సార్లు, హార్డ్ వేర్ అధునాతన టెక్నాలజీలో పనిచేస్తాయి. ఎక్స్ ఆర్ సౌండ్ సిస్టం ద్వారా ఎలాంటి కేబుల్ అటాచ్ మెంట్ లేకుండా మీకు ఇష్టమైన మ్యూజిక్ వినవచ్చు. ఆన్ లైన్ క్లాస్ లు వినవచ్చు. అన్ని రకాల ఆడియో ఫార్మెట్లను సపోర్ట్ చేసే టెక్నాలజీ ఇందులో ఉంది. - హై రిజల్యూషన్ లో ఉండే డిస్ ప్లే ద్వారా గేమింగ్, షాపింగ్ ఎంజాయ్ చేయవచ్చు. - ఇందులోని హోలా గ్రాఫిక్ వీడియో కాల్ ద్వారా పెద్ద స్క్రీన్ పై ప్రజెంటేషన్లు ఇవ్వచ్చు. - అంతేకాదు 3డీ వర్చువల్ అవతార్, 2డి వర్చువల్ ఇంటరాక్షన్ ద్వారా కూడా మీకు కావల్సిన విధంగా ఈ కళ్లజోడు పనిచేస్తుంది. - జియో మిక్స్ డ్ రియాలిటీ క్లౌడ్ అందుబాటులో ఉండటంతో ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహించేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. - ప్రపంచాన్నిసుందరంగా చూపించగల టెక్నాలజీని ఈ కళ్లజోడుతో అందిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపార వేత్తలు ఇలా అన్నిరంగాల వారికి ఉపయోగపడేలా ప్రపంచాన్ని అరచేతిలో నుంచి కండ్లముందుకు తీసుకువస్తున్నారు.