జూనియర్ డాక్టర్ల సమ్మె

హైదరాబాద్ లో జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. ఎమర్జెన్సీ విధుల్నికూడా బహిష్కరించడంతో రోగులు తీవ్ర స్థాయిలో ఇబ్బందిపడుతున్నారు. హౌస్ సర్జన్లపై జరిగిన దాడికి నిరసనగా జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. తమ రక్షణకోసం ప్రత్యేక భద్రతా బలగాల్ని ఏర్పాటు చేసేవరకూ సమ్మెను ఆపేది లేదని జూనియర్ డాక్టర్లు తేల్చి చెబుతున్నారు. తమ ప్రాణాలకు రక్షణ ఉంటేనే రోగులకు వైద్యం చేయడానికి వీలౌతుందని తెగేసి చెబుతున్నారు. రోగులకు ఇబ్బందులు కలిగినప్పుడల్లా డాక్టర్లపై దాడి చేయడం పరిపాటిగా మారిందని జుడాలు మండిపడుతున్నారు. గతంలో తమపై జరిగిన దాడులు, ఘటనలు, ప్రభుత్వ స్పందనని దృష్టిలోపెట్టుకుని ఈసారి తాము ఆరునూరైనా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని జూడాలు స్పష్టం చేస్తున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు తర్వాతే సమ్మెను విరమిస్తామని తెగేసి చెబుతున్నారు.

గోదావరికి వరదపోటు

వరదగోదారి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రాణహిత ఉగ్రరూపం దాల్చింది. ఖమ్మంజిల్లా భద్రాచలం దగ్గర వరద ఉద్ధృతి చాలా ఎక్కువగా ఉంది. ప్రవాహం రెండో ప్రమాదహెచ్చరిక స్థాయిని దాటింది. గోదావరి వరద ఉద్ధృతి కారణంగా ఖమ్మంజిల్లాలో 21 గ్రామాలకు, పశ్చిమగోదావరి జిల్లాలో 18 గ్రామాలకు, తూర్పుగోదావరి జిల్లాలో 30 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ప్రవాహం మరింత పెరిగితే వరద పోలవరం గ్రామాన్ని ముంచెత్తే ప్రమాదముంది. కొత్తూరు కాజ్ వేలోకి, రామయ్యపేటలోని తవ్వకాలువలోకి భారీగా వరదనీరు చేరింది. 9 లక్షల క్యూసెక్కుల నీటిని భద్రాచలం నుంచి కిందికి వదిలేస్తున్నారు. లంకగ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రత్యేక హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యేలు ఉన్నబొల్లారం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న బొల్లారం పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యేల అరెస్ట్ నేపథ్యంలో పీఎస్‌కు తరలివచ్చిన పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. మరోవైపు పీఎస్‌లోకి రాడానికి మీడియాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అటు ఎమ్మెల్యేల అరెస్ట్‌కు నిరసనగా టీఆర్ఎస్, జేఏసీ నేతలు కాసేపట్లో విద్యుత్ సౌధను ముట్టడించనున్నారు. ఈ నేపథ్యంలో కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ముందు జాగ్రత్తగా టీఆర్ఎస్ నేతలు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావులను పోలీసులు గృహనిర్భంధం చేయగా, మరో నేత టీఆర్ఎస్‌వీ అధ్యక్షుడు సుమన్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

రైతులకు కరెంట్ కష్టాలు తీరేవరకు దీక్ష: హరీష్

తెలంగాణ ప్రాంత రైతులకు కరెంట్‌ కష్టాలు తీరేంత వరకూ తమ నిరసన దీక్ష కొనసాగుతుందని టీర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు, కిరణ్కు మధ్య పెద్ద తేడాలేదని వారు మండిపడ్డారు. బాబు హయాంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించమంటే కాల్చి చంపారని... ఇప్పుడు కరెంట్ కోసం పోరాడుతున్న ఎమ్మెల్యేలను కిరణ్ అరెస్ట్ చేయిస్తున్నారని అన్నారు. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ ఇవ్వమనటమే నేరమా అని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. రైతులకు ఏడు గంటల కరెంట్పై స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేని వారు డిమాండ్ చేశారు. అప్పటివరకూ తమ నిరసన దీక్ష కోనసాగుతుందని స్పష్టం చేశారు.

కిరణ్‌కుమార్ రెడ్డితో మంత్రుల బృందం భేటీ

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో మంత్రుల బృందం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. ధర్మాన ప్రాసిక్యూషన్‌పై వారు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మంత్రులు వట్టి వసంత్‌కుమార్,ఏరాసు ప్రతాప్‌రెడ్డి, దానం నాగేందర్, గల్లా అరుణ, ఆనం రాంనారాయణరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, డి.కె అరుణ, శైలజానాథ్, జానారెడ్డి, మహీధర్‌రెడ్డి, గంటా, పొన్నాల లక్ష్మయ్య, సుదర్శన్‌రెడ్డి, కొండ్రు మురళి, పితాని, సారయ్య, తోట నర్సింహ, ప్రసాద్‌కుమార్ పాల్గొన్నారు. ధర్మాన ప్రసాద్‌రావు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. ఇదే అంశంపై నిన్న రాత్రి మంత్రి వట్టి వసంత్‌కుమార్ ఇంట్లో మంత్రులు సమావేశమైన విషయం తెలిసిందే.  

ధర్మానను ప్రాసిక్యూషన్కు అనుమతించవద్దంటున్న మంత్రులు

మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా వ్యవహారం అధికార కాంగ్రెస్‌లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి చొరవ చూపకపోవటంతో మంత్రులు స్వయంగా రంగంలోకి దిగారు. ఈరోజు ఉదయం పది గంటలకు క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రితో మంత్రులు సమావేశం కానున్నారు. ధర్మానను ప్రాసిక్యూషన్కు అనుమతించకూడదనే మంత్రులు సీఎం ముందు ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. సీఎంతో సమావేశానికి రావల్సింది ధర్మాన స్వయంగా మంత్రులకు ఫోన్ చేశారు. కాగా గతరాత్రి మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ ఇంట్లో ఆరుగురు సీనియర్ మంత్రులు మంతనాలు జరిపారు. ధర్మాన కేసు, భవిష్యత్‌ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

రుయా ఆస్పత్రిని సందర్శించిన చంద్రబాబు

గత కొద్ది రోజులుగా తిరుపతి రుయా ఆస్పత్రిలో శిశు మరణాలు జరుగుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం ఉదయం ఆస్పత్రిని సందర్శించారు. ఐసీయూ, చిన్నారుల వార్డులను పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. వరుసగా చిన్నారులు మరణిస్తూ ఉంటే సిబ్బంది ఏం చేస్తున్నారని బాబు మండిపడ్డారు.   అనంతరం మీడియాతో మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యంపట్ల ప్రభుత్వానికి పట్టింపులేదని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజలకు విశ్వాసం కల్పించలేకపోతుందన్నారు. పారామెడికల్ సిబ్బందికి జీతాల ఇవ్వలేని పరిస్థితి ఉందని విమర్శించారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు, మంచినీళ్లు లేవని చంద్రబాబునాయుడు మండిపడ్డారు.

బిసిలపై కాన్సట్రేషన్ చేస్తున్న బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ తాజాగా బిసిలపై కాన్సట్రేషన్ చేస్తుండటంతో ఆ వర్గాలు మళ్లీ టిడిపి వైపు భారీగా మొగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరోవైపు బాలకృష్ణ తన ఫ్యాన్స్‌ను పార్టీకి అటాచ్ చేసే విధంగా వ్యూహరచన చేస్తున్నారని తెలుస్తోంది. నందమూరి అభిమానులలో ఎక్కువగా బిసిలు ఉన్నారు. దీంతో బాలయ్య బిసిలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారని అంటున్నారు. బాలయ్య త్వరలో రాష్ట్రంలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. అయితే బాలయ్య ఏ పదవితో ప్రజల్లోకి వెళ్లాలనే అంశంపై సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉందని సమాచారం. పార్టీ ప్రధాన కార్యదర్శిగా వెళ్లాలా లేక వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వెళ్లాలా అనే అంశంపై తర్జన భర్జనలు జరుగుతున్నాయని అంటున్నారు.

పిల్లల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి పట్టింపులేదు: చంద్రబాబు

మెరుగైన చికిత్స అందకనే చిన్నారులు మృతి చెందుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం ఉదయం తిరుపతి రుయా ఆస్పత్రిని సందర్శించిన బాబు చిన్న పిల్లల వార్డులను పరిశీలించారు. ఆస్పత్రి తీరుపై అధికారులపై ఆగ్రహం వ్యక్తపరిచారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యంపట్ల ప్రభుత్వానికి పట్టింపులేదని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజలకు విశ్వాసం కల్పించలేకపోతుందన్నారు. పారామెడికల్ సిబ్బందికి జీతాల ఇవ్వలేని పరిస్థితి ఉందని విమర్శించారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు, మంచినీళ్లు లేవని చంద్రబాబునాయుడు మండిపడ్డారు.