అరెస్టు భయంతో ముందస్తు బెయిలుకు అవినాష్

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు అనివార్యమని ఫిక్సైపోయారా? అందుకే తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేశారా అంటే న్యాయ నిపుణులు ఔననే అంటున్నారు. గత విచారణ సందర్భంగానే సీబీఐ తెలంగాణ హైకోర్టుకు అవినాష్ ను అరెస్టు చేయనున్నట్లు చెప్పింది. అయితే ఆ తరువాత కేసు దర్యాప్తు ఎందుకనో మందగించింది. కేసు దర్యాప్తు వేగం మందగించడానికీ జగన్ హస్తిన పర్యటనకూ లింకు పెడుతూ.. సామాజిక మాధ్యమంలో పలు వ్యాఖ్యలు వచ్చాయి. అలాగే సుప్రీం కోర్టు వివేకా హత్య కేసు దర్యాప్తు ఇంకా ఎంత కాలం సాగదీస్తారంటూ సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, అవసరం అనుకుంటే మరో దర్యాప్తు అధికారిని నియమించండని పేర్కొంది. దీంతో వివేకా హత్య కేసు మళ్లీ మొదటికి వచ్చిందన్న అనుమానాలు వ్యక్త మయ్యాయి. అయితే మంగళవారం (మార్చి 28) అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేయడం, అలాగే బుధవారం ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనుండటంతో వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టుకు సీబీఐ రంగం సిద్ధం చేసిందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇటు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించడం, అటు ముఖ్యమంత్రి జగన్ హస్తినకు వెళ్లనుండటంతో ఒకటి రెండు రోజులలో ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలున్నయని పరిశీలకులు అంటున్నారు.

పులివెందుల కాల్పుల ఘటన.. ఒకరి మృతి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇలాకా పులివెందులలోనే నడి రోడ్డుపై కాల్పుల జరిపి హత్యలు జరుగుతున్నాయంటేనే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దివ్యంగా ఉందో అవగత మౌతుంది. పైగా వివేకా హత్య కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొన్న భరత్ యాదవే ఈ కాల్పులకు పాల్పడ్డాడంటే అరాచకం ఏ స్థాయిలో రాజ్యమేలుతోందా అర్ధం అవుతుంది.   వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్‌కు బంధువు, ఆ కేసులో   భరత్ యాదవ్ ను కూడా సీబీఐ విచారించింది. కాగా డబ్బు విషయంలో దిలీప్ అనే వ్యక్తితో గొడవపడిన భరత్ నడిరోడ్డుపై  తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన దిలీప్ అనే వ్యక్తి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, మరో వ్యక్తి బాషా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు.  కాగా కాల్పులకు తెగబడ్డ భరత్ ఆ తరువాత పోలీసులకు లొంగిపోయాడు.   ఇలా ఉండగా.. భరత్ కుమార్ యాదవ్  గతంలో సీబీఐ పై  ఆరోపణలు చేశారు. సునీత భర్త రాజశేఖర్ రెడ్డి నుంచి తనకు ప్రాణహానీ పలు సందర్భాలలో పేర్కొన్నాడు. అలాగే వివేకా హత్య కేసులో  అప్రూవర్‌గా మారిన దస్తగిరి   భరత్ యాదవ్ తనను బెదరిస్తున్నాడంటూ పోలీసులకు  ఫిర్యాదు కూడా చేశారు.  ఇప్పుడు జరిపిన కాల్పులకు కూడా కూడా వివేకా హత్య కేసుకు సంబంధించిన   అర్థిక వ్యవహారాలలో  వచ్చిన విభేదాలే అన్న అనుమానాలు వ్యక్తమౌతు్నాయి.  

ఏపీ సర్కార్ కు ఎస్సీలే టార్గెట్.. ఎన్హెచ్చార్సీ ముందుకు దళిత నేత

ఆంధ్రప్రదేశ్ లో దళితులపై దమనకాండ జరుగుతోంది. దళితులను దారుణంగా చంపేస్తున్నారు. రక్షణ కల్పించాలి అంటూ అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య కేంద్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)కి  లేఖ రాశారు.  ఈ లేఖను  ఆయన  ఈమెయిల్  ఎన్హెచ్ఆర్సీకి పంపారు. ఆ  లేఖ వివరాలనుమంగళవారం (మార్చి 28)  మీడియాకు వెల్లడించారు.  45 నెలల వైకాపా పాలనలో తొలి బాధితులు దళితులే.  మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను, మాస్క్ పెట్టుకోనందుకు చీరాల కిరణ్ కుమార్ ను చంపేశారు.  ఎమ్మెల్సీ అనంతబాబు    డ్రైవర్ సుబ్రహ్మణ్యంను దారుణంగా చంపేసి శవాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేశారు. దళితుడిని అత్యంత కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పై విడుదలైన సందర్భంగా  గజమాలలతో సత్కరించారు. భారీ ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు.   అలాగే కృష్ణాయపాలెంలో ఎస్సీలపై ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి దళిత రైతులను 24 రోజులు జైల్లో పెట్టారు.  బేడీలు వేసి బస్సులో తిప్పారు. కడప పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్న డాక్టర్ అచ్చెన్న ను హత్య చేశారు. ఆయన కుమారుడు చక్రవర్తి అనుమానితుల పేర్లు  ముందుగానే ఇచ్చినా పోలీసులు విచారించలేదు.  తాటికొండ దళిత మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి  శ్రీదేవి తన నియోజకవర్గానికి వెళ్లేందుకు భయంగా ఉందని, తనకు ప్రాణభయం ఉందనీ, సాక్షాత్తూ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి నుంచే ప్రాణభయం ఉందనీ సొంత ఊరు వదిలేసి హైదరాబాద్ లో తలదాచుకుంటున్నారు.   కాకినాడలో గిరీష్ బాబు అనే దళిత యువకుడు కాళ్లలో రాడ్లు ఉన్నాయని చెప్పినా, ఎస్సై కనికరించలేదన్నారు. రాడ్లు చూపమని లాఠీకి రబ్బరు తగిలించి కొట్టారు. ఇసుక ట్రాక్టర్ ను అడ్డుకున్నాడని ఇందుగుమిల్లి వరప్రసాద్ కు శిరోముండనం చేశారు. పులివెందుల నాగమ్మ, నంద్యాల మహాలక్ష్మిలపై అత్యాచారాలు జరిగాయి. పేరేచర్లలో  మహిళపై జరిగిన అత్యాచారం కేసులో  80 మందిని అనుమానితులుగా  పోలీసులు  ఎఫ్ఐఆర్  నమోదు చేశారు. తప్పులను ప్రశ్నిస్తే దాడి చేస్తున్నారు. అన్యాయం పై తిరగబడితే హత్య చేస్తున్నారు. అణచి వేతలపై  గొంతు ఎత్తితే  దౌర్జన్యం చేస్తున్నారు. దళితులపై దాడులు జరగని జిల్లా కానీ, నియోజకవర్గం కానీ,  గ్రామం కానీ ఏపీలో లేదు.  తెలుగు నేల చరిత్రలో గతంలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో దళితులపై దమనకాండ జరుగుతోంది. గతంలో ఢిల్లీలో  హెచ్ఆర్సీని స్వయంగా కలిసి లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చామన్నారు. హెచ్చార్సీ,  ఏపీ సిఎస్ కు లేఖ పంపి నెలలు గడిచినా ఇప్పటివరకు  తనకు సమాచారం కూడా ఇవ్వలేదు.   ఈ మొత్తం సంఘటనలపై కేంద్రంలోని హెచ్ఆర్సీ ఆధ్వర్యంలో పూర్తి విచారణ జరిపించాలని బాలకోటయ్య లేఖలో డిమాండ్ చేశారు.

కేబినెట్ పునర్వ్యవస్థీకరణా, ముందస్తు ఎన్నికలా.. డైలమాలో జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిలో ఏదో గాభరా కనిపిస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం తరువాత పార్టీ ఎమ్మెల్యేలలో అసంతృప్తి బహిర్గతం అయిన తరువాత కింకర్తవ్యం అన్న భావన జగన్ లో కనిపిస్తోంది. నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసినా పెద్దగా ఫలితం కనిపించకపోవడంతో ఆయన ఏం చేయాలన్న విషయంలో మల్లగుల్లాలు పడుతున్నట్లు పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఫ్రెష్ టీంతో సిద్ధం కావాలా? లేక ముందస్తుకు వెళ్లి మళ్లీ ప్రజా క్షేత్రంలో పోరాడాలా అన్న డైలమాలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. గవర్నర్ తో సోమవారం(మార్చి 27) భేటీ కానీ, బుధవారం (మార్చి 29)న హస్తిన పర్యటన కానీ ఇందులో భాగమేనా అన్న అనుమానాలను పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా గత మూడు నాలుగు రోజులుగా  వైసీపీలో ఏదో జరుగుతోంది? అధినేత జగన్ లో ఏమిటో తెలియని తొందర, హడావుడి, గాభరా  కనిపిస్తోంది.! ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనూరాథ విజయం సాధించడం ఒక్కటే కాదు. అసంతృప్తులకు హెచ్చరికగా ఉంటుందని ఓ నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసినా ఫలితం లేకపోయిందన్న భావనా కాదు? నలుగురే కాదు ఇంకా చాలా చాలా మంది అసంతృప్త ఎమ్మెల్యేలు ఉన్నారంటూ వస్తున్న విశ్లేషణలూ కాదు? మరేదో ఉంది. మరేదో జరుగుతోంది. అందుకే జగన్ గాభరాగా ఉన్నారు. హడావుడి పడుతున్నారు. సోమవారం హఠాత్తుగా గవర్నర్ తో భేటీ, అది అయ్యీ అవ్వగానే హస్తిన యానానికి ఏర్పాట్లు. ఎందుకు? ఏమిటి? అన్న ప్రశ్నలు రాజకీయ సర్కిల్స్ లోనే కాదు, పార్టీ శ్రేణుల్లో కూడా జోరుగా చర్చ జరుగుతోంది. జగన్ హస్తిన వెళ్లి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చి రెండు వారాలు కూడా కాలేదు. అంతలోనే మళ్లీ బుధవారం (మార్చి 29)న మళ్లీ హస్తినకేగి వారిరువురితో భేటీ కానున్నారు. జగన్ వరుస ఢిల్లీ పర్యటనల కారణంగా వైసీపీ అధినేత జగనేనా, లేక జగన్ పార్టీకి హై కమాండ్ హస్తినలో ఉందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయని పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది. హఠాత్తుగా ఏ కారణం చెప్పకుండా జగన్ సోమవారం గవర్నర్ తో భేటీ కావడంతో పార్టీలోనూ రాజకీయ వర్గాలలోనూ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు జగన్ సిద్ధమయ్యారా? అన్న చర్చకు తెరలేచింది. అంతలోనే జగన్ హస్తిన పర్యటన షెడ్యూల్ బయటకు రావడంతో ముందస్తు యోచనలో ఉన్నారా అన్న అనుమానాలను పరిశీలకులలోనే కాదు, పార్టీ నాయకులలోనూ వ్యక్తం అయ్యింది.   గవర్నర్ తో జగన్ భేటీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్ కు దారి తీసిన పరిస్థితులు, రాష్ట్రంలో రాజకీయ పరిణామాల గురించి చర్చించి ఉంటారనీ, చాలా కాలంగా జగన్ పదేపదే చెబుతూ వస్తున్న కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై అంశాలు వారి మధ్య చర్చకు వచ్చి ఉంటాయన్న ఊహాగానాలూ వినిపించాయి.   ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు మొత్తం అన్ని స్థానాలలోనూ పార్టీ అభ్యర్థులే గెలవాలి, అలా కాకపోతే వైఫల్యానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటా. అవసరం అనుకుంటే మంత్రులనూ మారుస్తా అంటూ జగన్ హెచ్చరించిన విషయాన్ని పరిశీలకులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పక్కా అన్న విశ్లేషణలు చేశారు. అంతలోనే  జగన్ మళ్లీ హస్తిన బాట పట్టడంతో  ముందస్తు చర్చ కూడా తెరమీదకు వచ్చింది.  అలాగే మళ్లీ వైఎస్ వివేకా హత్య దర్యాప్తులో సీబీఐ మళ్లీ వేగం పెంచుతోందన్న సంకేతాలు ఏమైనా వచ్చాయా  అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.    

వైసీపీలో అనూరాథ విజయం ప్రకంపనలు

ఎమ్మెల్యే కోటా   ఎమ్మెల్సీ ఎన్నికల్లో  తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం  అధికార వైసీపీలో చిచ్చుకు కారణమైందన్న చర్చ పొలిటిల్ సర్కల్స్ లో జోరుగా సాగుతోంది.  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడుకు మూడు స్థానాలలోనూ తెలుగుదేశం అభ్యర్థులే గెలిచినా వైసీపీలో పెద్దగా స్పందన లేదు. అసలు గ్రాడ్యుయేట్లు మా ఓటర్లే కాదు.. అది ఒక చిన్న సెక్షన్ మాత్రమే.. మా ఓటర్లు వేరే ఉన్నారంటూ సమర్ధించేసుకుంది.  అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పంచుమర్తి అనూరాథ విజయాన్ని మాత్రం  వైసీపీ జీర్ణించుకోలేక పోతోంది.  అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల  విజయం అధికార పార్టీపై పట్టభద్రుల్లో ఉన్న వ్యతిరేకత ను తేటతెల్లం చేస్తే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీపై ఎమ్మెల్యేల్లో ఉన్న జగన్ పట్ల వ్యతిరేకత బహిర్గతమైంది. క్రాస్ వోటింగ్ కు పాల్పడ్డారంటూ సస్పెన్షన్ వేటు పడిన నలుగురు వైసీపీ  ఎమ్మెల్యేలూ..  పంజరం నుంచి బయటపడినంత స్వేచ్ఛగా జగన్ పైనా, పార్టీపైనా విమర్శలు గుప్పించడం చూస్తుంటే  పార్టీలో ఇక ఒక్కరొక్కరుగానో, మూకుమ్ముడిగానో మరింత మంది ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని, అసమ్మతిని బయటపెట్టేందుకు రెడీ అవుతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నలుగిరిలో దళిత మహిళా ఎమ్మెల్యే అయిన  ఉండవల్లి శ్రీదేవి తన భర్త డాక్టర్ శ్రీధర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో వెల్లడించిన విషయాలు వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో   కోట్ల రూపాయలు  చేతులు మారాయంటూ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలు వైసీపీకే నష్ట చేకూర్చాయి.  పార్టీ నుంచి సస్పెండైన  నలుగురు ఎమ్మెల్యేలూ కూడా సజ్జల ఆరోపణలకు చాలా చాలా ఘాటు రిప్లై ఇచ్చారు.  ఇంకోవైపు.. ఈ ఎన్నికల ఎపిసోడ్‌లో తనకు 10 కోట్ల ఆఫర్ ఇచ్చారంటూ జనసేన ఎమ్మెల్యేగా ఒకే ఒక్కడిగా ఉంటాను కానీ.. జగన్ పార్టీలో చేరి.. 152 వాడిగా ఉండనంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన.. కొద్ది రోజులకే... జగన్ పార్టీలోకి జంప్ కొట్టిన... ఒకే ఒక్కడు.. రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ తెరపైకి రావడం.. నీకు అంత సీన్ లేదు.. నీకు పదివేల రూపాయిల ఆఫరే ఇవ్వడమే ఎక్కువంటూ తెలుగుదేశం  నేతలు వరుసగా ప్రెస్ మీట్ పెట్టి వ్యంగ్య బాణాలు సంధించడంతో. ఆయన సైలెంటైపోయారు.  అయితే మార్చి 14వ తేదీన కేబినెట్‌ సమావేశంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్నీ మన ఫ్యాన్ పార్టీ అభ్యర్థులే గెలవాలని.. లేకుంటే మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు తథ్యం అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినా కూడా ఇలా జరగడం పార్టీలోనూ, ప్రజలలోనూ జగన్ ప్రభ మసకబారిందనడానికి తార్కానంగా విశ్లేషకులు చెబుతున్నారు.  ఇక  ఎమ్మెల్యే   ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీసీ మహిళ పంచుమర్తి అనురాధ కు ముఖ్యమంత్రి  జగన్ ప్రజా వ్యతిరేక విధానాలను గట్టిగా ఎండగట్టిన  నేతగా   మంచి గుర్తింపు ఉంది.  మొత్తం మీద పంచుమర్తి అనూరాథ విజయం వైసీపీలో రగిల్చిన చిచ్చు ఇప్పట్లో ఆరేదిగా కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కవితకు మళ్లీ ఈడీ నోటీసులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మళ్లీ   నోటీసులు ఇచ్చింది.   ఈ నెల 11,20,21 తేదీల్లో కవిత ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణను సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. లిఖితపూర్వక వాదనలు వినిపించాలని కవిత, ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కవితకు ఏ క్షణమైనా నోటీసులు ఇచ్చే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం కీలకంగా మారింది.  అయితే ఈ విచారణకు సంబంధించి ఆమె కానీ, ఆమె ప్రతినిథి కానీ హాజరు కావచ్చని ఈడీ పేర్కొంది. దీంతో ఈ రోజు విచారణకు కవితకు బదులుగా ఆమె న్యాయవాది సోమ భరత్ ను కవిత పంపించారు. కవిత ఈడీకి అందజేసిన  మొబైల్ ఫోన్లను తెరవనున్నామనీ, ఆ సమయంలో   స్వయంగా హాజరుకావడం లేదా తన ప్రతినిధిని పంపాలనీ ఈడీ పేర్కొన్నదనీ, అందుకే కవితకు బదులుగా ఆమె ప్రతినిథిగా న్యాయవాది సోమ భరత్ ఈడీ కార్యాలయానికి వెళ్లారని చెబుతున్నారు. 

సుప్రీంలో అమరావతి కేసుల విచారణ.. జగన్ సర్కార్ లో టెన్షన్

ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం  (మార్చి 28) విచారించనుంది. రాజధాని తరలింపును ఆపాలని గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి విదితమే. ఈ తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్, అలాగే  స్టే ఇవ్వొద్దనీ, హైకోర్టు తీర్పునే అమలు చేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని  కోరుతూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్ లను కూడా  జస్టిస్‌ జోసెఫ్‌, జస్టిస్‌ నాగరత్నలతో కూడిన సుప్రీం కోర్టు  ధర్మాసనం విచారించనుంది. కాగా అమరావతి కేసుల విచారణ త్వరిత గతిన పూర్తి చేయాలని కోరుతూ ఏపీ సర్కార్ గతంలో చేసిన విజ్ణప్తిని అప్పట్లో సుప్రీం కోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.     గతంలో నిర్ణయించిన తేదీనే అంటే మార్చి 28నే అమరావతి పిటిషన్ల విచారణ చేపడతామని స్పష్టం చేసింది.    అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని జగన్ సర్కార్ పదేపదే సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరుతోంది. ఆ క్రమంలోనే ఈ నెల  2న ఇదే అంశాన్ని  న్యాయస్థానం ముందుకు తీసుకురాగా కోర్టు నిరాకరించింది. గతంలో చెప్పిని విధంగా ఈ నెల 28నే ఈ కేసు విచారణ చేపడతామని విస్పష్టంగా తేల్చి చెప్పింది.  హైకోర్టు తీర్పుపై స్టే తెచ్చుకోవాలని జగన్ సర్కార్ డిస్పరేట్ గా ప్రయత్నిస్తున్న జగన్ సర్కార్ కు మంగళవారం కోర్టు ఏం చెబుతుందన్న విషయంలో టెన్షన్ తప్పడం లేదు.  ఇలా ఉండగా  మరో వంక గత ఏపీ ప్రభుత్వం అమరావతిని చట్ట బద్ధంగా ఏర్పాటు చేసినట్లుగా కేంద్రం  ఇప్పటికే  స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం కు నివేదించింది కూడా.    

మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఆర్ఎస్ సభ్యలు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్ సభ్యులు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత ఈ వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ప్రస్తుత సమావేశాలలోనే మహాళా రిజర్వేషన్ బిల్లును సభలో ప్రవేశ పెట్టాలని కోరారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు. కాగా ఇటీవలే ఢిల్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం హస్తినలో దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ల కోసం పోరును ఉధృతం చేయడంలో భాగంగా ఆమె త్వరలో దేశంలోని వర్సిటీలు, కాలేజీలలో రౌండ్ టేబుల్ సమావేశాలకు ప్రణాళిక రూపొందించారు. అలాగే మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు కోరుతూ విద్యావేత్తలు, మేధావులకు కవిత పోస్టు కార్డులు రాశారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కవితతో పాటు పలు పార్టీల నేతలు డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విస్మరించినందున ఆందోళనని మరింత తీవ్ర రూపం చేయాలని నిర్ణయించారు.  ఈ నేపథ్యంలోనే లోక్ సభలో బీఆర్ఎస్ మహిళా రిజర్వేషన్ బిల్లుపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పట్టింది. 

జైలు శిక్ష పడినా బీజేపీ ఎమ్మెల్యేలు సేఫ్.. వారికి అనర్హత అంటదు!

మోడీ ఇండిపేరు పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సూరత్ కోర్టు ఇలా జైలు శిక్ష విధించిందో లేదో అలా ఆయనపై లోక్ సభ సెక్రటేరియెట్ అనర్హత వేటు వేసింది. అయితే ఈ చర్య.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ స్వపక్షీయుల విషయంలో ఒకలా, విపక్షీయుల విషయంలో మరోలా వ్యవహరిస్తోందంటూ ఇంత కాలంగా వస్తున్న విమర్శలకు బలం చేకూర్చింది. బీజేపీ పాలిత రాష్ట్రం అయిన కర్నాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు కోర్టులు జైలు శిక్షలు విధించినా, అలా విధించి రెండు నెలల దూటుతున్నా.. ఇంత వరకూ వారిపై అనర్హత వేటు పడలేదు. రూ.50లక్షల అవినీతి కేసులో నేరం రుజువై బీజేపీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్ కు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే మరో బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామికి చెక్ బౌన్స్ కేసులో ప్రజాప్రతినిథుల ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. వీరిద్దరికీ కోర్టుల్లో జైలు శిక్ష పడినప్పటికీ అసెంబ్లీలో వీరి సభ్యత్వం మాత్రం పదిలంగానే ఉంది. అంతే కాదు.. ఏదైనా కేసులో రెండేళ్లు, అంతకు మించి జైలు శిక్షకు గురైన వారు ఎన్నికలలో పోటీ చేయకుండా ఆటోమేటిగ్గా వారిపై అనర్హత వేటు పడుతుంది. కానీ కర్నాటక బీజేపీ ఎమ్మెల్యేలకు మాత్రం అవేమీ వర్తించడం లేదు.  వీరిద్దరికీ జైలు శిక్ష పడినప్పటికీ వారి శాసనసభ సభ్యత్వాలను ఇంతవరకు రద్దు చేయలేదు. ప్రస్తుతం బెయిల్ పైన ఉన్న వీరిద్దరూ   కర్నాటక అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికలలో పోటీ చేయడానికి వారు అప్పుడే సన్నాహాలు కూడా మొదలెట్టేశారు.  ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యంగ పదవుల్లో ఉండటానికి గానీ లేదా ఎన్నికల్లో పోటీ చేయడానికి గానీ వీల్లేదు.  పై కోర్టుకు వెళ్లడానికి కోర్టు అవకాశం  ఇచ్చినా, ఆయన అనర్హుడే అవుతారు. రాహుల్ విషయంలో బీజేపీ చెబుతున్న మాటలివి. మరి ఇవే మాటలు.. రాహుల్ లాగే శిక్ష పడి దర్జాగా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న బీజేపీ వారికి వర్తించదా అని కాంగ్రెస్ సహా విపక్షాలు నిలదీస్తున్నాయి.   

నకిలీ సర్టిఫికెట్ తో లా అడ్మిషన్.. స్పీకర్ తమ్మినేనిపై రాష్ట్రపతికి కూన ఫిర్యాదు

తమ్మినేని నకిలీ  సర్టిఫికెట్‌తో లా అడ్మిషన్ తీసుకున్నారంటూ రాష్ట్రపతికి తెలుగుదేశం ఎమ్మెల్యే కూన రవికుమార్ ఫిర్యాదు చేశారు.  తాను డిగ్రీ చదవలేదంటూ తమ్మినేనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారని ఆ ఫిర్యాదులో కూన పేర్కొన్నారు. ఎన్నికల అఫిడవిట్ లో కూడా తమ్మినేని డిగ్రీ చదవలేదనే పేర్కొన్నారన్న కూన ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో  కోరారు. అలాగే ఇదే విషయంపై    ఏపీ, తెలంగాణ గవర్నర్లు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సీఎం జగన్‌..కు లేఖలు రాశారు.  తమ్మినేని సీతారాం స్పీకర్ అయిన తర్వాత హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని మహాత్మాగాంధీ లా కళాశాలలో 2019-20లో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌తో అడ్మిషన్ తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. లా కోర్సులో చేరాలంటే డిగ్రీ, లేదంటే అందుకు సమానమైన కోర్సు పూర్తి చేసి ఉండాలని, కానీ తమ్మినేని డిగ్రీ కానీ, అలాంటి మరే కోర్సు కానీ చదవలేదని అన్నారు. ఈ విషయాన్ని ఆయనే గతంలో ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మినేని స్వయంగా పేర్కొన్నారని కూన గుర్తు చేశారు. అంతేకాదు, 2019 సాధారణ ఎన్నికల  సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లోనూ  తన అత్యున్నత విద్యార్హత ఇంటర్మీడియెట్ మాత్రమేనని, శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ చదువుతూ మధ్యలోనే మానేశానని ఆయన స్వయంగా వెల్లడించిన విషయాన్ని కూన రవికుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే, తమ్మినేని లా పరీక్షలకు హాజరైనట్టు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌ను, ఎన్నికల అఫిడవిట్‌ను కూడా ఆయన ఆ లేఖలకు జత చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా నకిలీ సర్టిఫికెట్లతో అడ్మిషన్ తీసుకోవడం సరికాదని, విలువలకు, నైతిక ప్రవర్తనకు కట్టుబడలేదని, కాబట్టి ఆయన శిక్షార్హుడని, తమ్మినేనిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా చట్టంముందు అందరూ సమానమేనని చాటిచెప్పాలని ఆయన ఆ లేఖలో కోరారు.

కథ కంచికేనా? సజ్జల ఇంటికేనా?

వైసీపీ.. ఆవిర్భావం నుంచీ ఆ పార్టీలో ఏదో హడావుడి. విపక్షంలో ఉన్నప్పుడూ, అధికారంలో ఉన్నప్పుడూ కూడా ఏదో అలజడి. గందరగోళం. తమ అధినేతకు వ్యతిరేకంగా ప్రపంచం అంతా ఏకమైపోయి ఏదో చేసేయడానికి ప్రయత్నిస్తోందన్న ఆందోళన కనిపిస్తూనే వస్తోంది. ఇప్పుడు నాలుగేళ్లు అధికారంలో ఉన్న తరువాత కూడా వైసీపీపై ప్రజా వ్యతిరేకతకు తమ విధానాలు, తమ తప్పిదాలు కారణం కాదంటోంది. కోర్టుల్లో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు వస్తే విపక్ష నేత మేనేజ్ చేశారంటుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ చేస్తే విపక్షం కోట్లు కుమ్మరించి వారిని ప్రలోభ పెట్టిందంటుంది. అంతే కానీ ప్రజలలో, లేదా పార్టీలో జగన్ పట్ల వ్యతిరేకత పెరుగుతోందని అంగీకరించదు. ఆయనపై కుట్ర జరుగుతోందనే చెబుతుంది. అదలా ఉంచితే.. వైసీపీ అధినేత జగన్ ను తమ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్సే( ఎమ్మెల్యే కోటా, గ్యాడ్యుయేట్) ఎన్నికలలో ఓటమి ఉక్కపోతకు గురి చేస్తోంది. ఈ ఓటమితో ఇప్పటి వరకూ పడిపోతున్నది మంత్రులు, ఎమ్మెల్యేల గ్రాఫే అని చెప్పుకోవడానికి అవకాశం లేకుండా చేసింది. ఇప్పుడు పార్టీ వ్యూహాత్మకంగా నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఒక పథకం ప్రకారం పార్టీ ప్రస్తుత పరిస్థితికి, పార్టీలో అసంతృప్తికీ, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమికీ, ఇంకా ఏమైనా ఉంటే అన్నిటికీ సజ్జలే కారణమన్న ప్రచారం పార్టీ శ్రేణుల్లో వ్యూహాత్మకంగా మొదలైంది. ఎందుకంటే..  సకల శాఖల మంత్రిగా  రాష్ట్రం మొత్తానికి సజ్జల చిరపరిచితుడే. పార్టీలో ఏం జరిగినా సజ్జల కనుసన్నలలోనే జరుగుతుంది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుకైనా ఉండేది సజ్జలే.  పార్టీ నిర్ణయాలైనా, ప్రభుత్వ నిర్ణయాలైనా  మంత్రులు, అధికారులు కాదు సజ్జలే మీడియా ముందుకు వచ్చి చెబుతారు. ఆఖరికి జగన్ కుటుంబంలో పరిణామాలపై వివరణ ఇచ్చినది కూడా సజ్జలే. షర్మిల కొత్త పార్టీ పెట్టిన సమయంలో కానీ, విజయమ్మ రాజీనామాపై స్పందించడం కానీ అన్నీ సజ్జలే చేశారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ శాఖల, నియోజకవర్గాల సమస్యల గురించి ముఖ్యమంత్రికి విన్నవించుకోవాలన్నా సజ్జల అనుమతి ఉండాల్సిందే. ప్రభుత్వం విడుదల చేసే జీవోల వెనుక ఉండేదీ సజ్జలే.  అసలు ఇదంతా ఎందుకు.. విపక్ష నేతగా పాదయాత్ర చేసిన సమయంలో వైపీసీ అధినేత జగన్ ప్రత్యక్షంగా ప్రజల ముందుకు వచ్చేవారు. వారు తమ సమస్యలపై నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ వారికి నేరుగా హామీలిచ్చే వారు, భరోసా ఇచ్చేవారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ నోట నేను ఉన్నాను, నేను విన్నాను అన్న మాట రావడం లేదు. సజ్జల ఉన్నారు.. సజ్జల వింటారు అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక వైసీపీలో ప్రస్తుతం వెల్లువెత్తుతున్న అసంతృప్తికి  కారణం సజ్జలేన్న ప్రచారం పకడ్బందీగా మోదలైంది.  అంటే సకల శాఖల మంత్రిగా ప్రభుత్వ సలహాదారు సజ్జల పార్టీలో మంచికీ చెడుకీ కూడా కారణభూతుడిగా మారిపోయారు. స్పష్టంగా చెప్పాలంటే.. ఫేస్ ఆఫ్ వైసీపీ జగన్ అయితే ఫేట్ ఆఫ్ వైసీపీ సజ్జల అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. అందుకే గత ఏడాది ఏప్రిల్ లో జగన్ తన క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా వెల్లువెత్తిన అసంతృప్తి, అసమ్మతి నేరుగా జగన్ కు తాకకుండా సజ్జల దగ్గరే ఆగిపోయాయి. అప్పట్లో అయితే అసమ్మతి ఒక్కసారిగా ఎగసిపడి తాటాకు మంటలా ఆగిపోయింది. అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాభవాలు, పార్టీ ఎమ్మెల్యేలలోనే వెల్లువెత్తుతున్న అసమ్మతి, అసంతృప్తి అలాగే సస్పెన్షన్ వేటుకు గురైన ఎమ్మెల్యేల ఆగ్రహం, ఆక్రోషం అంతా హు ఈజ్ సజ్జల..అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  సామాన్య జర్నలిస్టు అయిన సజ్జల ఇన్ని కోట్ల ఆస్తులెలా కూడబెట్టారంటూ ప్రశ్నిస్తున్నారు. క్రాస్ ఓటింగ్ కోసం కోట్లు చేతులు మారాయంటూ సజ్జల చేసిన విమర్శలు ఆయనకే బూమరాంగ్ అయ్యాయి.  ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ నేపథ్యంలోనే సజ్జల వ్యూహాలకు అనుగుణంగానే ఇప్పటి దాకా జగన్ పాలన సాగిందన్న పరిస్థితి నుంచి, ఇప్పుడు పార్టీలో సజ్జలకు వ్యతిరేకంగా పకడ్బందీ వ్యూహాలు రూపుదిద్దుకుంటున్నట్లు వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితి నుంచి జగన్ బయటపడాలంటే.. సజ్జలపై వేటు వేడయమే మార్గమన్నట్లుగా వైసీపీ భావిస్తోంది. తొలి నుంచీ వైసీపీ వ్యూహాలు అలాగే ఉన్నాయి. మంచి అంతా జగన్ ఖాతాలో, తప్పులన్నీ వీలైతే విపక్షాల ఖాతాలో.. అది కుదరకపోతే పార్టీలోనే కీలకంగా ఉన్న వ్యక్తి మీదకు నెట్టేయడం. గతంలో విజయసాయి. పార్టీలో నంబర్ 2గా ఉన్న సమయంలో సర్వం ఆయనే అనేటట్లు ఉండేది పరిస్థితి. ఆ తరువాత విజయసాయి పరిస్థితి ఏలా మారిందో అందరికీ తెలుసు. విజయసాయి తరువాత ఆ స్థానంలోకి వచ్చిన సజ్జలపై ఇప్పుడు కత్తి వేలాడుతోందని అంటున్నారు. ఇటీవలి పరిణామాల తరువాత పార్టీ నేతలే మీడియా ముందుకు వచ్చి  తప్పు సజ్డలదేనని, సీఎం జగన్‌కు ఏమీ సంబంధం లేదంటూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఆ ప్రచారం చాలా చాలా చిన్నగానే ఉన్నా.. రానున్న రోజులలో ఇది మరింత ఉధృతం అవుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.   సజ్జల తప్పుడు నిర్ణయాల కారణంగానే జగన్ పై విమర్శలు వస్తున్నాయన్నట్లుగా సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.  ఇంత కాలంగా ప్రతిపక్షాలపై జరిగిన దాడులు, బనాయించిన కేసులు అన్నిటి వెనుకా ఉన్నది సజ్జలే అని ఎస్టాబ్లిష్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఆ దిశగా ప్రచారమూ ఆరంభమైంది. అంతా సజ్జలే చేశారు. వైసీపీ ఫేస్ జగన్ దే అయినా, ప్రస్తుత పార్టీ ఫేట్ కు మాత్రం సజ్జలే కారణం అంటూ  వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.   అన్నిటికీ మించి పార్టీ ప్రస్తుత పరిస్థితి నుంచి బయటకు రావాలంటే సజ్జలను బలి చేయడమే మార్గమన్న నిర్ణయానికి వైసీపీ వచ్చేసిందనీ, అది జరిగితేనే.. జగన్ తాను సజ్జలను నమ్మి మోసపోయానన్న నిజం తెలుసుకుని ఇప్పటి వరకూ జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుంటారన్న అభిప్రాయాన్ని ప్రజలలో కలిగించే అవకాశం ఉందని పార్టీ ఒక నిర్ణయానికి  వచ్చేసిందని అంటున్నారు.   పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యేలు ఎలాగూ సజ్జలనే టార్గెట్ చేస్తున్నారు. పార్టీ కూడా అదే కంటిన్యూ చేస్తే... ఇక జగన్ పై పడిన మచ్చలన్నీ చెరిగిపోతాయన్నది వైసీపీ నేతల భావనగా కనిపిస్తోంది.   అయితే ఇదంతా పార్టీలో సజ్జల వ్యతిరేకుల వ్యూహమే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పటికింకా పార్టీ మొత్తం సజ్జల గుప్పెట్లోనే ఉంది. సజ్జల వ్యతిరేకులు తమంతట తాముగా సజ్జలను విమర్శిస్తూ గళం విప్పే అవకాశం లేదు.  జగన్ స్వయంగా.. ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడానికి   సజ్జలను టార్గెట్ చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఉంటారని పరిశీలకుల అంటున్నారు.  అన్నిటికీ మించి జగన్ కు తాను వినా పార్టీలో మరెవరూ గుర్తింపు పొందడానికి ఇష్టపడరని ఆయన నైజం తెలిసిన వారు అంటున్నారు. విజయసాయి రెడ్డి,   వైవీ సుబ్బారెడ్డి,  ఉమ్మారెడ్డి, మైసూరారెడ్డి, ఇలా పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఎవరైనా ఆ తరువాత డమ్మీలుగా మారిపోయారని గుర్తు చేస్తున్నారు. ఇక ఇప్పుడు సజ్జల వంతు అని చెబుతున్నారు. వైసీపీలో సజ్జల కథ కంచికి చేరిందనీ, ఆయన ఇంటికి చేరడమే తరువాయనీ అంటున్నారు. 

మరో వివాదంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్

వివాదాలు ఆయన వెంట పడతాయో.. వివాదాల వెంట ఆయన పడతారో చెప్పలేం కానీ తెలంగాణ హైల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ మాత్రం నిత్యం వివాదాలతో వార్తలలో ఉంటారు.  గతంలో ఒక సారి  శ్రీనివాస్ రావు ఏసుక్రీస్తు దయతోనే దేశంలో కరోనా కేసులు తగ్గాయనీ, కరోనా నుంచి విముక్తి చెందామనీ చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి. ఆయన అలా  అని ఊరుకోలేదు.   క్రైస్తవం వల్లే దేశం అభివృద్ధి చెందిందన్నారు.ఆఫ్కోర్స్ అది ఆయన వ్యక్తి గత విశ్వాసం కావచ్చును. కానీ, ఆయన ఒక అధికారి, ఆవిషయం మరిచి పోయి చేసిన వ్యాఖ్య సహజంగానే అప్పట్లో దుమారం రేపింది. గత ఏడాది డిసెంబర్ లో  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో శ్రీనివాసరావు   ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అంతే కాదు ప్రపంచానికి, అభివృద్ధి పాఠాలు నేర్పిందే క్రైస్తవ మతమని,    ప్రపంచం  అభివృద్ధి చెందడానికి క్రైస్తవులే కారణమని కూడా అన్నారు. అదే జోరులో  క్రైస్తవ మత ప్రచారానికి నడుంబిగించాలని కూడా సూచించారు.  నిజమే అప్పట్లో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు సెమీ క్రిస్మస్ వేడుకలలో తన   విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అది కూడా వ్యక్తిగత హోదాలో హాజరైన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ పోస్టులో ఉన్న ఆయన, తన విధుల్లో భాగమైన కరోనా మహమ్మారి కట్టడి జీసస్ క్రైస్ట్ దయవల్లే జరిగిందని చెప్పడం విమర్శలకు తావిచ్చింది.  నిజానికి  శ్రీనివాసరావు మత విశ్వాసాల గురించి పెద్దగా తెలియక పోయినా  ఆయన రాజకీయ ఆశలు, ఆకాంక్షల గురించి మాత్రం ఆయన తన చేష్టల ద్వారా అందరికీ తెలిసేలా వ్యవహరిస్తుండటంకద్దు. గతంలోనూ ఆయన పబ్లిక్ లో ముఖ్యమంత్రి కేసీఆర్  కాళ్లు మొక్కి, వివాదాస్పద అధికారిగా వార్తల్లోకి ఎక్కారు.  అదొక వివాదం అయితే కరోనా నుంచి విముక్తి పొందడానికి ఏసుక్రీస్తు దయే కారణమంటూ చేసిన వ్యాఖ్యలు మరో వివాదం. ఆయన వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. అది సర్దుమణిగిందనుకునే లోగానే.. తాజాగా అయన రాష్ట్రంలో ఆదర్శవంతమైన ఎమ్మెల్యే అంటూ ఎవరైనా ఉంటే అది మంత్రి హరీష్ రావేనని అన్నారు. కొత్తగూడెంలోపర్యటించిన సందర్భంగా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఒక విధమైన తన్మయత్వంతో మంత్రి హరీష్ పై ప్రశంసల వర్షం కురిపించారు. హరీష్ సిద్ధిపేటకు చేసిన దానిలో సగంపనులు చేసిన కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు.  ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వోద్యోగా, బీఆర్ఎస్ కార్యకర్తా అంటూ సామాజిక మాధ్యమంలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

జయహో ఎన్టీఆర్ వెబ్ సైట్, శకపురుషుడు సావనీర్.. చంద్రబాబుకు వివరించిన ఎన్టీఆర్ శతజయంతి కమిటీ

నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకల కమిటీ చైర్మన్ టి.డి. జనార్థన్ సారధ్యంలో ఆదివారం(మార్చి 26)  తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడితో ఆయన నివాసంలో బేటీ అయ్యింది. మహానటుడు, ప్రజానాయకుడు తెలుగువారి ఆరాధ్యుడు అయిన ఎన్.టి.ఆర్. శతజయంతి సంవత్సరంలో ఆయన తరతరాలకు గుర్తిండిపోయేలా జయహో ఎన్.టి.ఆర్. అన్న వెబ్ సైట్, శకపురుషుడు అనే ప్రత్యేక సంచికతో పాటు ఎన్.టి.ఆర్. శాసనసభలో చేసిన ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలతో రెండు పుస్తకాలను తీసుకొస్తున్నామని టీడీ జనార్ధన్ చంద్రబాబు నాయుడికి  వివరించారు.   శత జయంతి వేడుకలలో భాగంగా ఎన్.టి.ఆర్. ప్రసంగాలతో వెలువడే రెండు పుస్తకాలను విజయవాడలో ఆవిష్కరిస్తామని, వెబ్ సైట్,  శకపురుషుడు సావనీర్ ను హైదరాబాదులో  విడుల చేస్తామని తెలిపారు.  ఈ రెండింటికీ సంబంధించిన  విశేషాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా  వివరించారు.  గత ఐదు నెలలుగా ఎన్.టి.ఆర్. శతజయంతి కమిటీ శ్రమిస్తున్నదని,  సినిమా రంగంలోని ప్రముఖులు మరియు రాజకీయరంగంలోని నిష్ణాతుల అభిప్రాయాలను వీడియో/వ్యాస రూపంలో తీసుకున్నామనీ,  ఎన్.టి.ఆర్.ను తరతరాలు గుర్తుంచుకునే దిశగా వీటిని రూపకల్పన చేస్తున్నామని   జనార్థన్ ఈ సందర్భంగా చంద్రబాబుకు తెలిపారు.   ఎన్.టి. రామారావు  నటుడుగా, రాజకీయ నాయకుడుగా అనూహ్య విజయాలను సాధించి మార్గదర్శకుడిగా మిగిలారని అటువంటి నాయకుడిపై జనార్థన్ సారథ్యంలో కమిటీ చేస్తున్న కృష్టి అభినందనీయమని చంద్రబాబు అన్నారు.  ఈ కమిటీ చేస్తున్న అవిరళ కృషికి తమ మద్దతు ఉంటుందన్నారు.  హైదరాబాద్, విజయవాడ రెండు ప్రాంతాలలో ఏర్పాటు చేసే కార్యక్రమాలు విజయవంతం కావటానికి కావలసిన సంపూర్ణ మద్దతు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. టి.డి. జనార్థన్ అధ్యక్షతన రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాట్రగడ్డ ప్రసాద్, కంఠంనేని రవిశంకర్, విక్రమ్ పూల, భగీరథ, అట్లూరి నారాయణరావు, డి. రామ్ మోహన్ రావు,  మండవ సతీష్, కె. రఘురామ్, శ్రీపతి సతీష్, మధుసూదన రాజు, విజయ్ భాస్కర్, గౌతమ్ బొప్పన కమిటీ సభ్యులు చంద్రబాబునాయుడిని కలిసిన వారిలో ఉన్నారు. 

నైన్త్ స్టాండర్డ్ ప్రశ్నపత్రంలో కోహ్లీపై ప్రశ్న!

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై తొమ్మదో తరగతి ప్రశ్నపత్రంలో ఒక ప్రశ్న పొందుపరిచారు. టీమ్ ఇండాయా మాజీ కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారత దేశంలో ఒక మతం లాంటి క్రికెట్ లో మకుటం లేని రారాజులా వెలుగొందుతున్నకోహ్లీ  ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు సాధించాడు.   విద్యార్థులకు క్రీడల పట్ల ఉన్న ఆసక్తి, అవగాహనపై తొమ్మిదో తరగతి పశ్నపత్రంలో కోహ్లీపై ఒక ప్రశ్న ఇచ్చారు.   ఆసియాకప్ లో ఆప్ఘనిస్థాన్ జట్టుపై విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. అందుకు సంబంధించి 100-120 పదాల్లో వ్యాసం రాయాలన్నదే ఆ ప్రశ్న. ఈ ప్రశ్నాపత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

కవిత పిటిషన్ విచారణ మూడు వారాలు వాయిదా!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ మూడు వారాలకు వాయిదా పడింది. ఈడీ సమన్లు రద్దు చేయాలని, మహిళలను ఇంటి వద్దే విచారించాలని, తనకు వ్యతిరేకంగా ఈడీ ఎలాంటి (అరెస్ట్ లాంటి) చర్యలు తీసుకోవద్దని కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేయగా,  తమను సంప్రదించకుండా ఆదేశాలు ఇవ్వొద్దని కోరుతూ  ఈడీ కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే . కవిత పిటిషన్ విచారణ ఈ రోజు సుప్రీంలో జరిగింది. ఆ సందర్భంగా  ఢిల్లీ లిక్కర్ కుంభకోణం  కేసు విచారణను ఈడీతో కాకుండా..  కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి, విచారణ జరపాలని కోరారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, విక్రమ్ చౌధురి వాదనలు వినిపించగా,  ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్, అదనపు సొలిసిటర్ జనరల్  వాదనలు వినిపించారు.  ఒక మహిళగా తనకు ఉన్న హక్కులను ఈడీ కాలరాస్తోందని పిటిషన్   ఆరోపించిన కవిత  తనను  తమ ఇంటి వద్ద లేదా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని కోరారు.    సీఆర్పీసీ సెక్షన్ 160ని ఉల్లంఘించి.. తనని ఈడీ కార్యాలయానికి పిలిచి విచారిస్తున్నారని పేర్కొన్నారు. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. న్యాయవాదుల సమక్షంలో, సీసీ టీవీ కెమెరాల ఎదుట విచారణ చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.  మహిళలను ఈడీ ఆఫీసుకు పిలిచి విచారణ జరిపే విషయంలో గతంలో నళినీ చిదంబరం పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విషయంలో కవిత వేసిన పిటిషన్ ను, నళిని వేసిన పిటిషన్ కు కోర్టు ట్యాగ్ చేసింది. తర్వాతి హియరింగ్ లో రెండు పిటిషన్లను కలిపి విచారించే అవకాశం ఉందని అంటున్నారు. 

వివేకా హత్యకేసు సాగదీత ఇంకెంత కాలం.. సుప్రీం

వివేకా హత్య కేసు దర్యాప్తులో జాప్యంపై సుప్రీం కోర్టు సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును ఇంకెంత కాలం సాగదీస్తారని ప్రశ్నించింది. కేసు మొత్తం రాజకీయ దురుద్దేశంతో కూడినదేనంటూ రిపోర్టు రాశారంటూ పేర్కొన్న సుప్రీం కోర్టు, హత్యకు ప్రధాన కారణాలు, ఉద్దేశాలు బయటపెట్టాలని ఆదేశించింది. అంతే కాకుండా అవసరమైతే విచారణాధికారిని మార్చండి, మరో అధికారిని నియమించండి అని పేర్కొంది. అయితే ఇప్పుడు ఉన్న అధికారిని మార్చాలన్నది తమ ఉద్దేశం కాదనీ, ఆయనా కొనసాగుతారనీ పేర్కొంది. సీబీఐ ఇచ్చిన సీల్డ్ కవర్ నివేదిక మొత్తం చదివామని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం ఆ నివేదిక ఆధారంగా ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. కేసు దర్యాప్తు వేగవంతం విషయంలో సీబీఐ డైరెక్టర్ నుంచి ఆదేశాలు తీసుకోవాలని ఆదేశిస్తే ఈ నెల 29కి విచారణను వాయిదా వేసింది.  

జగన్ పై వాళ్లకీ నమ్మకం పోయిదా?

వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్‌పై  ఆయన సొంత సామాజిక వర్గమే నమ్మకం  కోల్పోయిందా?   ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలే అందుకు సాక్ష్యమా అంటే రాజకీయ వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తోంది.    నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ వైసీపీ సస్పెండ్ చేసిన నలుగురిలో ముగ్గురు జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన వారే కావడమే ఇందుకు సాక్ష్యమంటున్నారు. అసలు గత ఎన్నికలలో నెల్లూరు జిల్లా వైపీపీకి పదికి పది అసెంబ్లీ స్థానాలనూ కట్టబెట్టింది. ఇప్పుడు ఆ జిల్లాకే చెందిన ముగ్గురు కీలక పెద్దా రెడ్లనే పార్టీకి వ్యతిరేకంగా క్రాస్ ఓటింగ్ కు పల్పడ్డారంటూ జగన్ సస్పెండ్ చేశారు.   క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఆ నలుగురు ఎమ్మెల్యేలలో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. అయితే సస్పెన్షన్ కు గురైన ముగ్గురు పెద్దా రెడ్లూ కూడా తాము క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదనే అంటున్నారు. అదే సమయంలో తమపై విశ్వాసం ఉంచని జగన్ పై విమర్శలు సైతం గుప్పిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరు ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే  గత కొంత కాలం నుంచీ సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నవారే. ఇక మూడో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అయితే ఇంత కాలంగా పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదని అంటున్నారు. అసలు వైసీపీ మరీ ముఖ్యంగా సకల శాఖల మంత్రి సజ్జలకు తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు ఎలా తెలిసిందంటున్నారు. ఏకపక్షంగా తనపై నింద మోపి పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటూనే.. తన సస్పెన్షన్ పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తానిప్పుడు ఫ్రీ బర్డ్ నని మేకపాటి వ్యాఖ్యానించారు.  అదలా ఉంచితే.. అయితే గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఫ్యాన్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అలాంటి జిల్లాలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడానికి కారణం జగన్ తీరేనని పార్టీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వీస్తున్న ఎదురుగాలికి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2019లో పార్టీలకు అతీతంగా జగన్ సామాజిక వర్గం మొత్తం వైసీపీకి మద్దతు పలికిందనీ, ఇప్పుడు అదే సమాజిక వర్గంపార్టీలకు అతీతంగా ఆయనకు వ్యతిరేకంగా మారుతోందని అంటున్నారు.   ఒక్క ఉమ్మడి నెల్లూరు జిల్లా అనే కాదు.. జగన్ సామాజిక వర్గానికి చెంది ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న వారి సంఖ్య   ఉమ్మడి కడప జిల్లా నుంచి మొదలు  అనంతపురం, కర్నూలు, చిత్తూరు,  ప్రకాశం జిల్లాల్లో కూడా ఘనంగానే ఉందని పార్టీ వర్గాలే అంటున్నాయి.   ఇంకోవైపు  జగన్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఒక సామాజిక వర్గాన్ని  లక్ష్యంగా చేసుకొన్నారనీ,  ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని అమరావతి అంటూ ప్రతిపక్ష నేతగా మద్దతు ప్రకటించిన ఆయనే స్వయంగా   అధికారం చేపట్టిన తరువాత మాటమార్చి, మడమతిప్పి మూడు రాజధానులంటూ ప్రకటించిన విషయాన్నిపరిశీలకులు గుర్తు చేస్తున్నారు. 

చివరకు మిగిలేది ఆ నలుగురేనా?

జగన్ చేతులు కాలాయి. పట్టుకుందామనుకున్న ఆకులు దొరకడం లేదు. జగన్ కు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో మొదలైన పరాభవం, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వరకూ కొనసాగిందనీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇదే పరిస్థితి ఎదురౌతుందన్న విశ్లేషణల నేపథ్యంలో గతనాలుగేళ్లుగా తిరుగులేని విజయాలు సాధిస్తూ వస్తున్నజగన్ పార్టీ ఈ వరుస పరాభవాలను జీర్ణించుకోలేకపోతోంది. బయటకు ఎమ్మెల్సీ ఎన్నికలతోనే పార్టీలో జగన్ కు వ్యతిరేకత ఆరంభమైనట్లు కనిపిస్తున్నా.. వాస్తవానికి ఏడాదికి ముందే పార్టీపై జగన్  పట్టు సడలడం ఆరంభమైందని పరిశీలకులువిశ్లేషిస్తున్నారు.   ముఖ్యమంత్రిగా అధికారాలు చేపట్టి కేబినెట్ ఏర్పాటు చేసిన సమయంలోనే జగన్ తన కేబినెట్ లో మంత్రులు కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే పదవులలో ఉంటారనీ, రెండున్నరేళ్ల తరువాత కేబినెట్ ను సమూలంగా మార్చేసి కొత్తవారికి అవకాశం ఇస్తారనీ ప్రకటించారు. అప్పట్లో ఈ ప్రకటనను అందరూ స్వాగతించారు. సాహసోపేత చర్యగా అభివర్ణించారు. ఇలా చేయడం వల్ల   మంత్రుల బాధ్యతతో పని చేయడమే కాకుండా, ఎమ్మెల్యేలు కూడా ప్రజా సేవపై దృష్టి పెడతారనీ అంతా భావించారు. అయితే జగన్ తాను చెప్పినట్లుగా రెండున్నరేళ్లకు కేబినెట్ ను సమూలంగా మార్చలేదు. మూడేళ్ల తరువాత ఆయన చేసినది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మాత్రమే. అంటే తొలి కేబినెట్ లో ఉన్నవారిలో కొందరికి ఉద్వాసన పలికి మరి కొందరిని చేర్చుకున్నారు. అంతే దానికి కూడా భయం భయంగా ఎవరిని మారిస్తే ఏం సమస్య వస్తుందో అని ఒకటికి పది సార్లు కసరత్తులు చేసి నిర్ణయాలను పదే పదే మార్చుకున్నారు. ఇంత చేసినా అప్పట్లో అసమ్మతి భగ్గుమంది.  నెలల తరబడి అసమ్మతి కొనసాగింది. మూడేళ్లుగా జగన్ మాటే వేదం అన్నట్లుగా ఇచ్చిన బిల్డప్ అంతా పేకమేడే అని తేలిపోయింది.  ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో జగన్ ఎంతగా గుప్పెట మూసి ఉంచినా ఆ వేళ్ల సందులోంచి పార్టీ ప్రతిష్ట జారిపోయిందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇప్పుడు మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీల్లో పరాజయం గట్టి షాక్ ఇస్తే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓ స్థానం కోల్పోవడం అదీ కూడా సొంత ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటం వైసీపీకి కోలుకోలేని షాక్ గా చెప్పవచ్చు.  ఇక రాజకీయ వర్గాలలో అయితే ఇక వైసీపీ జారుడు బండ మీద బ్యాలెన్సింగ్ కు చేస్తున్న ప్రయత్నంగానే చర్చ జరుగుతోంది. జారుడు బండ మీద బ్యాలెన్సింగ్ అంటే జారి పడటంగానే వారు అభివర్ణిస్తున్నారు.  అంతే కాకుండా  జగన్ పార్టీకి రాజకీయ పతనం ఆరంభంగానే చెబుతున్నారు.  నాలుగేళ్లలోనే పార్టీ పరిస్థితి ఇలా దిగజారడానికి జగన్ రెడ్డి వ్యవహార శైలే కారణమని పార్టీ శ్రేణులే అంటున్నాయి. అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్న చందంగా ఈ నాలుగేళ్లూ ప్రభుత్వాన్ని నడిపిన తీరే ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణమని చెబుతున్నారు.  ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక సీటు కోల్పోవడానికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు గీత దాటడమే కారణమని జగన్ పార్టీ చెప్పడాన్ని కూడా పరిశీలకులు తప్పుపడుతున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం ఉంచకుండా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారిని నమ్ముకోవడం కంటే దివాళా కోరుతనం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. మరో వైపు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ నలుగురిని వైసీపీ సస్పెండ్ చేసింది. ఆ నలుగురూ తాము క్రాస్ వోటింగ్ కు పాల్పడలేదని మీడియా ముందుకు వచ్చి బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అదే సమయంలో తెలుగుదేశం అధినేత తమ విజయానికి క్రాస్ ఓటింగ్ ఎంత మాత్రం కారణం కాదని చెబుతున్నారు. తమ పార్టీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ పంచుమర్తి అనూరాథకే ఓటు వేశారనీ, అందుకే ఆమె 23తో విజయం సాధించిందనీ చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా.. తెలుగుదేశం నుంచి గెలిచి.. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలూ తాము వైసీపీ అభ్యర్థికే ఓటు వేశామన్న మాట చెప్పడం లేదు. అటువంటప్పుడు వైసీపీ అధినేత తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని ఎలా నిర్ధారించగలరని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. వైసీపీలో అసంతృప్త ఎమ్మెల్యేలు కట్టు దాటకుండా ఉండటానికి జగన్ పకడ్బందీ చర్యలే తీసుకున్నారు. అసంతృప్తులను గుర్తించి వారని ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. బుజ్జగించారు. వారి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకున్నారు.  ఇంత చేసినా జగన్ నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని చెబుతున్నారు. అంటే స్వయంగా పార్టీ అధినేత పిలిచి మాట్లాడినా, బుజ్జగించినా, వారు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించినా.. వినకుండా క్రాస్ ఓటింగ్ కు పాల్పడటమంటే.. ఆయన మాట చెల్లుబాటు కాకపోవడమే. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే జగన్ మాట పార్టీలో చెల్లుబాటు కావడం లేదంటే.. ముందు ముందు ధిక్కార స్వరాలు మరిన్ని ఉంటాయనడానికి సంకేతంగానే చూడాల్సి ఉంటుంది. నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్ ద్వారా పార్టీలో  ఉన్న అసమ్మతిని చల్లార్చాలని ప్రయత్నించడమంటే.. ఉన్న మంటపై నీళ్లకు బదులు పెట్రోలు పోయడమే అవుతుందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఇప్పటికే పలువురికి టికెట్లు ఉండవు అని మీటింగ్ లు పెట్టి మరీ ప్రకటించిన జగన్ ఇప్పుడు ఏ హామీ ఇచ్చి వారిని సముదాయించగలరని అంటున్నారు.   ఏది ఏమైనా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో జగన్ కు ఎదురైన పరాభవం పార్టీపై సడలిన ఆయన పట్టుకు సంకేతంగానే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ముందు ముందు ఆ పట్టు మరింత సడలుతుందనీ, సొంత పార్టీ ఎమ్మెల్యేలను నమ్మకుండా బటయ నుంచి వచ్చిన వారినే దగ్గరకు చేర్చుకుంటున్న ఆయన తీరు కారణంగా భవిష్యత్ లో ఆ బయటి వారు మాత్రమే మిగిలే పరిస్థితి వచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు.