నడిరోడ్డుపై నరికి చంపేశారు

రాయలసీమ ముఠాకక్షలు షాద్‌నగర్ శివార్లలో ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఇద్దరు వ్యక్తులను ప్రత్యర్థులు వేటకొడవళ్లతో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. మృతులలో ఒకరు అనంతపురం జిల్లా బుక్కపట్నం మండల౦ కృష్ణాపురంవాసి మల్లికార్జున్‌గా, మరొకతన్ని తాడిపత్రికి చెందిన లింగుట్ల ప్రసాద్‌గా గుర్తించారు. షాద్‌నగర్‌ శివారులోని ఓ డాబా వద్ద మరో ఇద్దరితో కలిసి టీ తాగుతుండగా వాహనాలపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు ఇద్దరిపై దాడి చేసి హత్య చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పాత కక్షలే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. నిరుడు నవంబర్ 12వ తేదీన జరిగిన వెంకట్రామారెడ్డి హత్యకు ప్రతీకారంగానే ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తోంది.  

బెంగుళూరు టెస్ట్: కీవిస్ 328/6, ఓజాకు 4 వికెట్లు

బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో జరుగుతున్న రెండవ టెస్టులో మొదటిరోజు న్యూజిలాండ్ 6 వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసింది. లైట్ సరిగ్గా లేక వెలుతురు పోవడంతో మొదటి రోజున 8.3 ఓవర్లు మిగిలి ఉండగానే ఆటను నిలిపి వేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నన్యూజిలాండ్ పరుగులు ఏమి చేయకుండానే మెక్‌కల్లమ్ ను జహీర్‌ఖాన్‌ అవుట్ చేశాడు. మరో ఓపెనర్ గుప్తిల్ 53 పరుగులు చేయగా, ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విలియమ్సన్ 17, రాస్ టేలర్ 127 బంతుల్లో 113, ఫ్లిన్ 33, ఫ్రాంక్లిన్ 8 పరుగులు చేశారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో వాన్ విక్ 63, బ్రేస్ వెల్ 11 పరుగులతో ఉన్నారు. టీమిండియా బౌలర్స్‌లలో స్పిన్నర్ ఓజా 4 వికెట్లు తీసుకోగా రవిచంద్రన్ అశ్విన్, జహీర్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ బంద్, పలుచోట్ల ఉద్రిక్తత

రాష్ట్రంలో విద్యుత్ సమస్యపై నిరసన తెలుపుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని చోట్ల బంద్ ప్రభావమే లేదు. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన ఆందోళనలో ఆ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా పులివెందులలోనూ ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. బస్టాండు వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు రాస్తా రోకో నిర్వహించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పులివెందులలోనే ధర్నాలో పాల్గొన్న పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడు అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా మాచర్లలో పిన్నెల్లి లక్ష్మా రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పిన్నెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిని నిరసిస్తూ కార్యకర్తలు బైఠాయించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు.

జూ ఎన్టీఆర్ ‘బాద్ షా’ ఫస్ట్ లుక్కు

జూ ఎన్టీఆర్ బాద్ షా చిత్రానికి సంబంధించిన న్యూలుక్ స్టిల్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి విడుదల చేశారు. జూ ఎన్టీఆర్ బాద్ షా చిత్రంలో ప్రత్యేకమైన హెయిర్ స్టైల్స్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో 7 సరికొత్త హెయిర్ స్టైల్స్‌లో కనిపిస్తాడు. ఇందు కోసం ముంబై నుంచి ప్రత్యేకంగా మేకప్ ఆర్టిస్టులను తెప్పించారు. ఈ సినిమాలో జూనియర్ లుక్ అభిమానులకు, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని తేవడం ఖాయం అంటున్నారు. జూనియర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. యంగ్ హీరో నవదీప్ ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రం సంక్రాంతి సందర్బంగా జనవరి 11, 2013న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.        

బెంగుళూరు టెస్ట్: మెక్‌కల్లమ్ డకౌట్ 106/3

భారత్ న్యూజిలాండ్ మధ్య బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో ఈరోజు ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఓపెనర్ మెక్‌కల్లమ్ టీమిండియా ఫేసర్ జహీర్ ఖాన్ బౌలింగ్‌లో డకౌట్‌గా పెవిలియన్‌కు చేరుకోగా, ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విలియమ్సన్ 17‌, మరో ఓపెనర్ గుప్తిల్‌ 53ను ఓజా అవుట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులోరాస్ టేలర్ 27,ఫ్లిన్ 5 తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నంలో పడ్డారు.   భారత్: మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, చటేశ్వర పుజారా, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, జహీర్ ఖాన్, ఉమేశ్ యాదవ్, ప్రజ్ఞాన్ ఓజా న్యూజిలాండ్: రాస్ టేలర్ (కెప్టెన్), బ్రెండడ్ మెక్‌కల్లమ్, గుప్టిల్, విలియమ్సన్, ఫ్లిన్, ఫ్రాంక్లిన్, వాన్ విక్, బ్రేస్‌వెల్, పటేల్, బౌల్ట్, సౌధీ.

ఈగలు తోలుకుంటున్న యాంటీ నార్కోటిక్స్ సెల్

హైదరాబాద్ పోలీసులు ఆర్భాటంగా మొదలుపెట్టిన యాంటీ నార్కోటిక్స్ సెల్ సిబ్బంది ఇప్పుడు కేసుల్లేక ఈగలు తోలుకుంటున్నారు. 2012 ఫిబ్రవరి 23న ప్రారంభమైన ఈ సెల్, మొదలైన రోజుకి ఉన్న కేసుల్ని మాత్రమే పరిష్కరించగలిగింది. తర్వాత కాలంలో ఒక్కటంటే ఒక్కకేసుకూడా కొత్తగా నమోదు కాలేదు. మారువేషాల్లో డ్రగ్ రాకెట్లను ఛేదించాల్సిన పోలీసులు, అదంతా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కనుక, తమకు భారీగా నిధులిస్తే తప్ప ఏమీ చేయలేని పరిస్థితంటూ చేతులెత్తేస్తున్నారు. సిసిఎస్, డిటెక్టివ్ డిపార్ట్ మెంట్ లో భాగంగా పనిచేస్తున్న యాంటీ నార్కోటిక్స్ విభాగంలో ఉన్న ఉద్యోగులు మొత్తం ప్రస్తుతం కొత్త కేసులకోసం వెతుక్కుంటున్నారు.  

స్కూల్ బస్సు బోల్తా, పిల్లలకు తీవ్రగాయాలు

పశ్చిమగోదావరిజిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడులో స్కూల్ బస్సు బోల్తాపడి పదిమంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థుల్ని వెంటనే ఏలూరు ఆసుపత్రికి తరలించారు. బోల్తాపడ్డ బస్సు కొద్దిలో మరో పెద్ద ప్రమాదం నుంచి బైటపడింది. బస్సు ఎడమపక్కనున్న కాలవలో పడుంటే అందులోఉన్న పిల్లలంతా ప్రాణాలు పోగొట్టుకునేవాళ్లు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్ధుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. నిర్లక్ష్యంగా బస్సుని నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఓఎన్ జీసీ గ్యాస్ పైప్ లైన్ పగిలిపోయింది

తూ.గో.జిల్లా మకిలిపురం మండలం అడవిపాలెంలో ఓఎన్ జీసీ పైప్ లైన్ లీకైంది. పొలాల్లో పైప్ లైన్ కి పడ్డ రంధ్రంలోంచి పెద్దఎత్తున గ్యాస్ ఎగసిపడుతోంది. ఎప్పుడు మంట అంటుకుంటుందోనని గ్రామస్థులు విపరీతంగా భయపడిపోతున్నారు. అగ్గిపుల్ల వెలిగిస్తే మొత్తం ఊరుఊరంతా మాడి మసైపోతుందన్న భయంతో ఊళ్లో అంతా వంటచేసుకోవడం మానేశారు. లైటేస్తే పేలుడు సంభవించి ఊరే లేచిపోతుందన్న భయంతో కరెంట్ మీటర్లన్నీ ఆపేసి కూర్చన్నారు. లీకేజీని అరికట్టేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదు. గతంలో పాశర్లపూడిలో జరిగిన బ్లో అవుట్ బీభత్సాన్ని తలుచుకుని చుట్టుపక్కలఊళ్ల జనం గజగజా వణుకుతున్నారు.  

ఇకపై ఫేస్ బుక్ లో ఫోటోలు చాలా సేఫ్

ఐనవాళ్లకు, కావాలనుకున్నవాళ్లకు చూపించుకునేందుకు చాలామంది ఫేస్ బుక్ లో ఫోటోలు పెట్టుకుంటారు. కొంతమంది ఆకతాయిలు వాటిని కాపీచేసేసి, అశ్లీలంగా మార్చేసి నెట్ లో పెట్టేసి శాడిజం చూపిస్తుంటారు. ఇష్టపడి సోషల్ నెట్ వర్క్ లో పెట్టుకున్న ఫోటోల్ని ఎవరుపడితేవాళ్లు ఎలాపడితే అలా ఉపయోగించుకోవడానికి వీల్లేకుండా చేసే ఓ వ్యవస్థ ఉంటే బాగుండని చాలామంది చాలా రోజులుగా అనుకుంటున్నారు. వినియోగదారుల ప్రైవసీని కాపాడాల్సిన బాధ్యతను గుర్చించిన ఫేస్ బుక్ యాజమాన్యం.. ఫోటోల దొంగతనాన్ని అరికట్టేందుకు కొత్తగా ఓ వ్యవస్థను ఏర్పాటుచేసింది. మెకాఫీ సంస్థ ద్వారా మెకాఫీ సోషల్ ప్రొటెక్షన్ అనే కొత్త టూల్ ని అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల యజమాని అనుమతిలేకుండా ఫోటోల్ని కాపీ చేసుకోవడానికి వీలుకాదు. పైగా ఎవరైనా అలా చేయాలని చూస్తే ఉన్న ఫోటో బ్లర్ అయిపోయి, అలాంటి ప్రయత్నాలకు అడ్డుకట్టపడుతుంది.   

ఆకాశంలో హెలికాప్టర్ల ఆక్సిడెంట్, 10మృతి

గుజరాత్‌లోని జామ్ నగర్ సమీపంలో ఏయిర్ ఫోర్సుకు చెందిన రెండు హెలికాప్టర్లు ఢీకొనడంతో 10మంది మృతి చెందారు. ఇంకా ఎవరైనా బతికి ఉన్నారనేది తెలియలేదు. హెలికాఫ్టర్లు రెండు ఎగిరిన వెంటనే కొంత దూరం వెళ్లి ఢీకోన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎమ్ఐ-17 రకానికి చెందిన ఈ హెలికాప్టర్లను శిక్షణ కోసం ఉపయోగిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో రెండు హెలికాప్టర్లు నామరూపాల్లేకుండా పోయాయి. పైలట్ల పొరపాటు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించే ప్రయత్నం జరుగుతోంది.

చావును దగ్గర నుంచి చూసిన ఆశారాం బాపు

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు, ఆయనతో పాటు మరో నలుగురు శిష్యులు హెలికాప్టర్‌ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయట పడ్డారు. గుజరాత్‌లోని గోధ్రాలో రెండు రోజుల పాటు సత్సంగ్‌లో ప్రవచనాలు వినిపించేందుకు ఆశారాం బాపు, ఆయన శిష్యులు బయలు దేరి వెళ్లారు. గోధ్రాలోని సైన్స్ కళాశాలలో హెలికాప్టర్ ల్యాండింగ్‌ కావాల్సి వుండగా, కొద్దిసేపు ముందు అందులో సాంకేతిక లోపం రావటంతో హెలికాప్టర్ పైన నుంచి కిందపడి౦ది. కింద పడిన హెలికాప్టర్ ఒక పక్కకు ఒరిగి మూడు ముక్కలైంది. ఆయితే హెలికాప్టర్ కొద్ది ఎత్తులో నుంచి పడిపోవడంతో ఆసారం బాపు  ప్రాణాలతో బయటపడ్డారు. హెలికాప్టర్ అద్దాలు పగులగొట్టి పైలట్, బాపులను బయటకు తీసి వెంటనే వారిని సమీపంలో ఉన్న ఆశ్రమ్ ఆస్పత్రికి తరలించారు. 

మంత్రి పితాని ఇంటిని ముట్టడించిన విద్యార్థులు

ఇంజనీరింగ్ కళాశాల ఫీజులపై గత కొద్ది రోజులుగా ప్రభుత్వానికి కళాశాల యాజమాన్యాల మధ్య చర్చలు జరుగుతూనే వున్నాయి. అయినా చర్చలు ఒక కొలిక్కి రాలేదు. విద్యా సంవత్సరం మొదలై ఇప్పటికే నెలరోజులు దాటింది. అయినా ప్రభుత్వం తరపునుంచి కాని ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాల తరపున గానీ ఎటువంటి స్పందన కనబపడకపోవటంతో ఈరోజు ఉదయం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని ఉన్నత విద్యా మరియు సాంకేతిక విద్యామంత్రి పితాని సత్యనారాయణ ఇంటిని తెలంగాణా విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో ముట్టడించారు. పోలీసులు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.