జైలు నుంచి శ్రీలక్ష్మి విడుదల

సీనియర్ ఐఏఎస్ అధికారిణి, ఓఎంసీ కేసులో నిందితురాలు శ్రీలక్ష్మి చంచల్ గుడా జైలు నుంచి విడుదలయ్యారు. శ్రీలక్ష్మి పూచీకత్తుల సమర్పణ ఆలస్యమవడంతో సోమవారం సాయంత్రం విడుదల కాలేదు. మంగళవారం బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందడంతో ఆమెను విడుదల చేశారు. మూడున్నర నెలల పాటు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేశారు. పాస్‌పోర్టును తమ ముందు పెట్టాలని, బెయిల్ సమయంలో ఎవరితోనూ మాట్లాడకూడదని, హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కోర్టు ఆదేశించింది. వెన్నునొప్పితో బాధపడుతున్న శ్రీలక్ష్మికి శస్త్రచికిత్స అవసరమని, శ్రీలక్ష్మి తీవ్రమైన మానసికవ్యధతో నలిగిపోతున్నారని, అందువల్ల జైలులో ఉంటూ శస్త్రచికిత్స చేయించుకుంటే శస్త్రచికిత్స ఫలితం ఉండకపోవచ్చునని, బెయిల్ ఇస్తే కాస్తా మానసికంగా ఊరట చెందుతుందని, దానివల్ల శస్త్రచికిత్స ఫలితం ఇస్తుందని వైద్యులు ఇచ్చిన వివరణను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ బెయిల్ ఆదేశాల ప్రకారం వచ్చే ఏడాది జనవరి 21న ఆమె కోర్టులో లొంగిపోవాల్సి ఉంటుంది.   

జగన్ లేని లోటు వైకాపాని కలవరపెడుతోందా?

  చంద్రబాబు పాదయాత్ర అటు కాంగ్రెస్ శ్రేణుల్లోనూ, ఇటు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనూ భయం పుట్టిస్తోంది. గ్రామీణులకు దూరంగా జరిగిపోయి హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుతెచ్చుకున్న చంద్రబాబు ఇప్పుడు తనమీదపడ్డ మచ్చని పూర్తిగా తుడిచేసుకునేందుకు ఈ పాదయాత్రని చేపట్టారు. రోబోయే ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ ఓటుబ్యాంక్ ని బాగా పెంచుకునేందుకు చంద్రబాబు యాత్ర గట్టిగానే పనిచేస్తుందని తెలుగుదేశం నేతలు బలంగా నమ్ముతున్నారు. చంద్రబాబుపై వెళ్లినచోటల్లా ప్రజలు చూపిస్తున్న ఆదరణ ఈ అంచనాలకు ఊతమిస్తోంది. బాబుకి జనంలోంచి వస్తున్న స్పందనని గమనించిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త గట్టిగానే కంగారుపడుతోంది. వై.ఎస్ జగన్ జైల్లో కూర్చునే ఎంతగా చక్రం తిప్పాలని ప్రయత్నం చేసినా.. ఆ పార్టీ పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యకమవుతోంది. ఉపఎన్నికల్లో విజయలక్ష్మితోపాటు షర్మిలకూడా ప్రచారానికొచ్చి “ నేను మీ రాజన్న కూతుర్ని వచ్చాను. మా అన్నకి అన్యాయం జరుగుతోంది “ అంటూ చేసిన ప్రచారం బాగానే ఫలించింది. కానీ.. రోజులుగడిచినకొద్దీ అదే మంత్రం పనిచేస్తుందని చెప్పడంకూడా కష్టమే. యాంటీ కాంగ్రెస్ వేవ్ బలంగా వేళ్లూనుకుంటున్న సమయంలో ఎవరు దాన్ని క్యాష్ చేసుకోగలిగితే వాళ్లకే వచ్చే ఎన్నికల్లో పూర్తి లాభం దక్కుతుందన్నది నిర్వివాదాంశం. కానీ.. ఎన్నికల నాటికి జగన్ జైలునుంచి విడుదలకానూవచ్చు, కాకపోనూ వచ్చు. ఒకవేళ అప్పటికీ జగన్ జైల్లోనే ఉంటే వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ప్రచారంలో జగన్ పాల్గొన తీరు ఒకలా ఉంటే జగన్ లేని ప్రచారం తీరు మరోలా ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా.. పదేపదే వియలక్ష్మి అనే బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించుకోవడంవల్ల చివరికి ఎన్నికల సమయంలో ఆ అస్త్రంకూడా పనిచేయకుండాపోయే ప్రమాదముంటుందని వాళ్లు హెచ్చరిస్తున్నారు. గండంనుంచి గట్టెక్కించగల శక్తి, కాస్తో కూస్తో షర్మిలకుకూడా ఉన్నా జగన్ తో పోలిస్తే, విజయమ్మతో పోలిస్తే షర్మిల ఛర్మిష్మా కాస్తంత డల్ గానే ఉంటుందని చెప్పొచ్చు. అందుకే విజయమ్మ తన బిడ్డ విడుదలౌతాడా లేదా అని గట్టిగానే బెంగపెట్టుకున్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి జగన్ మీద జనం కురిపిస్తున్న ప్రేమంతా దివంగత నేత వైఎస్సార్ మీదున్న అభిమానమేతప్ప మరోటికాదు. ఆ నిజం పార్టీ నేతలకు, అధ్యక్షుడికి, గౌరవాధ్యక్షురాలికి కూడా బాగానే తెలుసు. కానీ.. ఎన్నికల సమయానికి జగన్ జైల్లో ఉండిపోవడం ఖాయమైతే వైకాపాకి కష్టాలు తప్పకపోవడంకూడా ఖాయమేనని జనంలో ఇప్పటికే ఓ టాక్ మొదలైంది.

మదమెక్కి కొట్టుకుంటున్న హర్యానా వాసులు!

  అవును మీరు చదువుతున్నది నిజమే. ఏటా విపరీతంగా పెరిగిపోతున్న మానభంగాల్ని, దళితమహిళలపై జరుగుతున్న అరాచకాల్ని అరికట్టాలంటే పదహారేళ్లకే మగపిల్లలకు పెళ్లిళ్లు చేసేయాలని సామాజిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇంత బాహాటంగా బాల్యవిహాహాల్ని సమర్ధిస్తున్న ఆ సెల్ఫ్ డిక్లేర్డ్ సామాజిక శాస్త్రవేత్తలు హర్యానాలో పంచాయతీలుకూడా చేసేస్తుంటారు. ప్రత్యేకించి దళిత మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడు పంచాయతీపెట్టేసి నామమాత్రపు రుసుమును తప్పుకింది కట్టించేసి మ్యానేజ్ చేయడంలో ఈ పెద్దరాయుళ్లు బాగా సిద్ధహస్తులు. తాజాగా హర్యానాలో పదహారేళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ విషయాన్నికూడా పెద్దరాయుళ్లు విలేజ్ కోర్ట్ లోనే తేల్చేయాలని చూశారు. కానీ.. బాధితులు అడ్డం తిరగడంతో అది కోర్టు వరకూ వెళ్లింది. సాక్ష్యం చెప్పినా, బాధితులకు అండగా నిలబడినా చంపేస్తామంటూ తెగబలిసి కొట్టుకుంటున్నవాళ్లు బాధితవర్గాన్ని బెదిరిస్తుంటే తీర్పులు చెప్పి నేరాన్ని కప్పిపుచ్చి మసిబూసి మారేడుకాయజేసి జరిగిన తప్పుని ఒప్పుగా మార్చేసే పెద్దరాయుళ్లు చోద్యం చూస్తున్నారటకూడా. హర్యానాలో ఈ సంవత్సరం దాదాపు 650 రేప్ లు జరిగాయ్. ఒళ్లు మదమెక్కితే రేప్ లు చేస్తారు కాబట్టి, చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేసేస్తేపోలా అని ఉచిత సలహాలు కూడా పంచాయతీలు చేసే పెద్దలు విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్నారట.

ఆస్తి తగాదాలతో రోడ్డెక్కిన సౌందర్య కుటుంబం

    తెలుగు, కన్నడ, తమళం భాషల్లో ఓ తరాన్ని ఏలిన సూపర్ స్టార్ సౌందర్య. మూడుభాషల్లో లెక్కలేనన్ని సినిమాల్లో తన నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించి కోట్లాది రూపాయలు వెనకేసుకున్న హీరోయిన్ సౌందర్యకి మూడు సినీపరిశ్రమల్లోనూ మంచి పేరుకూడా ఉంది. తన నటనతో చాలామంది అభిమానుల్ని సంపాదించుకున్న సౌందర్య ఓ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాల్ని పోగొట్టుకుంది. ఆమెతోపాటు అన్నకూడా అదే ప్రమాదంలో చనిపోయాడు. అప్పట్నుంచీ నివురుగప్పిన నిప్పులా ఉన్న సౌందర్యకుంటుంబంలోని ఆస్తి కలహాలు ఇప్పుడు రోడ్డునపడ్డాయి. సౌందర్య అన్న భార్య విమలకూ, సౌందర్య భర్తకూ మధ్య ఆస్తి వివాదాలు కోర్టు గడపలో ఉన్నాయి. తాజాగా సౌందర్య రాసిన వీలునామా బైటపడడంతో ఆమె భర్తకి పచ్చివెలక్కాయ్ నోట్లోపడ్డట్టయ్యింది. సౌందర్య భర్త రఘు.. ఆస్తంతా తనే కొట్టేద్దామని చూస్తున్నాడని, తనని బెదిరిస్తున్నాడని సౌందర్య వదిన విమల కోర్టుకి ఫిర్యాదుచేసింది. తనకీ తన బిడ్డకీ రక్షణ కల్పించాలనికూడా కోరింది. ఎదురుదాడికి దిగిన రఘు, అసలు సౌందర్య విల్లే రాయలేదని, అంతా ప్రత్యర్థి లాయర్ అభూత కల్పన అనీ ఆరోపించాడు. దీంతో సౌందర్య అన్నభార్య తరఫున కేసు వాదిస్తున్న లాయర్.. సౌందర్య భర్తమీద యాభై లక్షల రూపాయలకు పరువునష్టం దావాకూడా వేశాడు. మొత్తంమీద ఈ వ్యవహారంలో సౌందర్యభర్తకే ఎక్కువ ఇబ్బంది కలగొచ్చని కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎవరికి ఎంత చెందాలో, ఏమివ్వాలో కచ్చితంగా సౌందర్య రాసిపెట్టిపోయినప్పుడు అసలు ఇలాంటి వివాదాలకు తావే లేదని కన్నడ సినీ వర్గాలు అనుకుంటున్నాయి. సౌందర్య రాసిన విల్లు నిజమో కాదో తేల్చి దానిప్రకారమే అమలుచేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని మూడు భాషలకూ చెందిన సినీ ప్రముఖులు భావిస్తున్నారు.

ఆంధ్రాయూనివర్సిటీలో మెస్ చార్జీల కలకలం

  మెస్ చార్జీల్ని వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్ధులు తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతున్నారు. ఆరుబైటే వర్సీటీ పరిపాలనా భవనం ఎదుట రోడ్డుమీద పడుకుని విద్యార్ధులంతా నిరసన తెలుపుతున్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా మెస్ చార్జీల్ని పెంచకపోతే తాము ఎలా స్థిమితంగా చదువుమీద దృష్టిపెట్టగలమని విద్యార్ధులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్ధులమీద పెట్టే పెట్టుబడి దేశాభివృద్ధికి పెట్టే పెట్టుబడి అన్న విషయాన్ని యూనివర్సిటీ వర్గాలు, ప్రభుత్వాలు గుర్తించాలని ఆందోళనకు దిగిన విద్యార్ధులు కోరుతున్నారు. యూనివర్సీటీ పాలకవర్గం మెస్ చార్జీల విషయంలో ఓ నిర్ణయం తీసుకునేవరకూ తాము ఆందోళనను విరమించే ప్రశ్నేలేదని స్టూడెంట్స్ తెగేసి చెబుతున్నారు. తమను చులకన చేసి మాట్లాడిన రిజిస్ట్రార్ బేషరతుగా క్షమాపణ చెప్పాలనికూడా విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు.

పెరుగుతున్న అత్యాచారాలపై సోనియాగాంధీ ఫైర్

హర్యానాలో వరుసగా జరుగుతున్న అత్యాచారాలపై  సోనియాగాంధీ  మండిపడ్డారు. దళిత అమ్మాయిలపైన అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని కటినంగా శిక్షించాలని హర్యానా ముఖ్యమంత్రి భూపేంద్రసింగ్ హుడాను కోరారు. నెల రోజుల వ్యవధిలోనే మహిళలపై వరుసగా 13 అత్యాచారాలు జరగడంపై సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచారాలు నిరోధించిందుకు పెళ్లి వయస్సును తగ్గించాలన్న ఖాప్ పంచాయతీ తీర్మానాన్ని ఈ సందర్భంగా ఆమె ఖండించారు. చట్టం ప్రకారమే అందరూ నడుచుకోవాలని హెచ్చరించారు. హర్యానాలోని జింద్ జిల్లాలో ఓ దళిత బాలిక అత్యాచారానికి గురైంది. సోనియా ఈ రోజు ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.

రాజకీయాల్లో పరిటాల శ్రీరామ్ ఎంట్రీకి టైముంది: సునీత

    దివంగత తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి పెద్ద కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్లు జోరుగుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో పరిటాల శ్రీరాం తెరపై కనిపించడం మొదలుపెట్టాడు. దీంతో రవి అభిమానులు తమ ఆశాదీపం వచ్చిందనుకున్నారు. అక్కడక్కడా కనిపిస్తూ, అడపాదడపా రాజకీయ కార్యక్రమాల్లో మెరుస్తూ ఆశలు రేపిన శ్రీరాం గురించి ఇపుడు ఆయన తల్లి సంచలన నిర్ణయం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరాం ఎంట్రీ ఉండబోదన్నారు. తన కొడుకు రాజకీయాల్లోకి రావడానికి ఇంకా చాలా టైముందని, ప్రస్తుతానికి ఏ నిర్ణయమూ తీసుకోలేదని అన్నారు. రాబోయే ఎన్నికలలో మాత్రం పరిటాల శ్రీరామ్ పోటీ చేయబోడని ఆమె స్పష్టంచేశారు. శ్రీరాం వచ్చేస్తున్నాడు అనుకున్న అభిమాలకు మాత్రం నిరాశను మిగిల్చింది. ఒకవైపు యువకుల నుంచి పరిటాల శ్రీరామ్‌కు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుండగా ఈ నిర్ణయం తీసుకోవడం మంచిది కాదేమో అని పరిటాల కుటుంబ అభిమానులు ఆవేదన చెందుతున్నారు.

లక్ష్యంమంచిదే!

మురికి కూపాలుగా... రోగాలకు నిలయాలుగా మారుతున్న నగరాలను క్లీన్‌సిటీస్‌గా మార్చేందుకు  దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర మున్సిపల్‌ శాఖ క్లీన్‌సిటీ ఛాంపియన్‌ షిప్‌ పోటీలకు శ్రీకారం చుట్టింది.  మహానగరాలనుండి చిన్న పట్టణాలవరకు చెత్తకు నివాసాలుగా మారిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం ముదావహం.   డోర్‌ టూ డంపింగ్‌ యార్డు’ పేరుతో ఈ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తోంది.  ఈ పోటీలకు వేదిక వరంగల్‌ జిల్లా.  10నుండి 17వ తేదీ వరకు హైదరాబాద్‌ మినహా అన్ని తెలంగాణా జిల్లాలలోని 65 మున్సిపాలిటీలు, ఐదు కార్పొరేషన్ల నుండి సుమారుగా వెయ్యిమంది  ఈ ఛాంపియన్‌ షిప్‌కు హాజరవుతున్నారు. రోడ్డుపై చెత్తవేయకుండా నేరుగా డంపింగ్‌యార్డులోకి తరలించడమే  ఈ పోటీల ముఖ్యఉద్దేశ్యం.  నిజంగా ఇది అభినందించదగ్గ విషయం.  రోగాలకు రెండొంతులు కారణం ఈ చెత్తే అని చెప్పుకోవాలి.  మున్సిపల్‌ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిద్దాం. ఇటువంటి కార్యక్రమాలపై పేరున్న కళాకారులు, పెద్దలు తమ వంతుగా దీన్ని మరింతగా ప్రజల్లోకి వెళ్లేలా చేయగలిగితే ప్రజల్లో తప్పకుండా అవగాహన కలుగుతుంది.  దీనికి తోడు మున్సిపల్‌ శాఖ, రహదారులు వంటి ఇతర శాఖలు కూడా చేయికలిపి  విజయవంతం చేయాలని ఆశిద్దాం. కేవలం పోటీలలో పాల్గొనటమే కాకుండా ఒక సంఘంగా    కాలనీల పరంగా ఏర్పాటై.. ఆయా కాలనీలలో రోడ్లపై చెత్తలేకుండా...చూడగలిగితే... ఈ కార్యక్రమం ఎంచుకున్న లక్ష్యం నెరవేరినట్లేనని ప్రకృతి ప్రేమికుల ఉవాచ.

దీని భావమేమి..

ఈ మధ్యకాలంలో నాయకులకు తాము ఏం మాట్లాడినా చెల్లుబాటైపోతుందనుకోవడం... ఆనక... అబ్బే.. నేను అలా అనలేదు... వక్రీకరించారు... అంటూ వచనాలు పలకడం అలవాటైపోయింది. ఇది సంచలనంకోసం కొందరైతే... ఇంకొందరు అనుకోకుండా అనేసి నాలుక్కరుచుకుంటున్నారు.. వారి బాట పట్టాడు హర్యానాకు చెందిన ఓ గ్రామ పెద్ద. హర్యానాలోని జింద్‌ జిల్లాలో 28 రోజులుగా తొమ్మిది అత్యాచార సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.  రాష్ట్రంలో పెరుగుతున్న అత్యాచారాలపై ఖాప్‌ పంచాయతీ సభ్యుడు సుబేసింగ్‌ మాట్లాడుతూ.. అత్యాచారాలకు టి.వి.లు, సినిమాలే కారణమని,  యువత సినిమాలు, టీవీలో వస్తున్న  అశ్లీల కార్యక్రమాలతో  చెడిపోతున్నారు.  అమ్మాయిలకు 16 ఏ ళ్ళ వయసులోనే పెళ్ళి చేస్తే...   అత్యాచారాల ఘటనలు ఆగిపోతాయి.’ అన్నారు.  ఇలాంటి వ్యాఖ్యలపై అక్కడి మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.  అత్యాచారాల నివారణకు కృషిచేయాల్సింది పోయి... మహిళా హక్కుల్ని కాలరాసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  16 ఏళ్ళ దళిత బాలికను నలుగురు యువకులు బలవంతంగా సామూహిక అత్యాచారం  చేశారు. ఆమె అవమానభారంతో కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు యువకులను  అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ అత్యాచార ఘటన జరిగిన అనంతరం ఖాప్‌ పెద్ద ఈ వ్యాఖ్యలు చేయడంతో మహిళా సంఘాలు మండిపోతున్నాయి. నిజానిజాలు యెలా వున్నా... నోరు వీపుకు చేటుతేకే... అన్న సామెతను అప్పుడప్పుడు  నాయకులు... నాయకులమని భావించేవారు గుర్తుంచుకుంటే మంచిదేమో!

శ్రీలక్ష్మికి బెయిల్ దొరికింది

సీనియర్ ఐఏఎస్ అధికారిణి, ఓఎంసీ కేసులో నిందితురాలు శ్రీలక్ష్మికి ఎట్టకేలకు బెయిల్ దొరికింది. మహిళా జైలులో చేసిన నిరీక్షణకు తాత్కాలికంగా తెరపడింది. శ్రీలక్ష్మికి మూడున్నర నెలల పాటు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేశారు. మూడున్నర నెలల తర్వాత, అంటే వచ్చే ఏడాది జనవరి 20 వరకు మాత్రమే బెయిల్ ఇస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. బెయిల్ ఇస్తూ శ్రీలక్ష్మికి షరతులు విధించింది. పాస్‌పోర్టును తమ ముందు పెట్టాలని, బెయిల్ సమయంలో ఎవరితోనూ మాట్లాడకూడదని, హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కోర్టు ఆదేశించింది. వెన్నునొప్పితో బాధపడుతున్న శ్రీలక్ష్మికి శస్త్రచికిత్స అవసరమని, శ్రీలక్ష్మి తీవ్రమైన మానసికవ్యధతో నలిగిపోతున్నారని, అందువల్ల జైలులో ఉంటూ శస్త్రచికిత్స చేయించుకుంటే శస్త్రచికిత్స ఫలితం ఉండకపోవచ్చునని, బెయిల్ ఇస్తే కాస్తా మానసికంగా ఊరట చెందుతుందని, దానివల్ల శస్త్రచికిత్స ఫలితం ఇస్తుందని వైద్యులు ఇచ్చిన వివరణను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. శ్రీలక్ష్మి పూచీకత్తుల సమర్పణ ఆలస్యమవడంతో సోమవారం సాయంత్రం విడుదల కాలేదు. మంగళవారం ఉదయం బెయిల్ పత్రాలు జైలుకు అందిన తర్వాతే ఆమె విడుదల కానున్నారు.

అక్కినేని అమల అరెస్ట్

అమల అరెస్టయ్యారు. నటిగా కాదు, ఒక స్వచ్ఛంద కార్యకర్తగా ఆమె అరెస్టయ్యారు. ఒకవైపు జీవ వైవిధ్య సదస్సులు జరుపుతూ మరోవైపు అటవీ సంపదను, జంతు సంపదను నాశనం చేసే చర్యలు చేపడుతోందని కేంద్ర ప్రభుత్వం చర్యలను నిరసిస్తూ గ్రీన్ పీస్ సంస్థ చేపట్టిన నిరసన ప్రదర్శనకు ఆమె మద్దతుగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా చార్మినార్ వద్ద ప్రధానిని విమర్శిస్తూ బొగ్గు గనుల తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఓ బ్యానరు కట్టారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని, నిరససను బలవంతంగా విరమింపజేశారు. అనంతరం గ్రీన్ సభ్యులతో పాటు ఆమెను అరెస్టు చేసి చార్మినార్ పోలీసుస్టేషన్ కు తరలించారు. ఇంతకీ వారి కట్టిన బ్యానరుపై ఏముందంటే “బొగ్గు తవ్వకాలను ఆపాలి, అడవులను పరిక్షించాలి” అని రాసి ఉంది. తీరా చూస్తే అది రాసినందుకు కాదు వారిని అరెస్టు చేసింది అనుమతి లేకుండా ఒక చారిత్రక కట్టడంపై నిరసన తెలిపినందుకు అని పోలీసులు తెలిపారు.

చంద్రబాబు విజయయాత్ర

  అనుకున్న విధంగానే హిందూపూర్ నుంచి చంద్రబాబు పాదయాత్ర మొదలుపెట్టారు. చంద్రబాబు పాదయాత్ర “వస్తున్నా మీకోసం” విజయవంతం కావాలని ఊరూరా, వాడవాడలా అభిమానులు ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. హిందూపూర్, రాప్తాడు, పెనుగొండ నియోజకవర్గాల్లో పాదయాత్రని పూర్తిచేసుకున్న చంద్రబాబు కళ్యాణదుర్గం అనే కంచుకోటలో ప్రవేశించారు. మంత్రి రఘువీరారెడ్డి నియోజకవర్గంలో పాదయాత్రని చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. కుర్లపల్లి క్రాస్ నుంచి యాత్ర ప్రారంభం. కదిరిదేవరపల్లి, ములకనూరు, ములకనూరు మిట్ట, దాసంపల్లి, బోయలపల్లి, కానక్కపల్లి, కురుబరహళ్లి క్రాస్, నారాయణపురం క్రాస్, యర్రంపల్లి క్రాస్ కల్యాణదుర్గం పాదయాత్రలో మజిలీలు. బోయలపల్లిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ నియోజకవర్గంలో చంద్రబాబు పాదయాత్రలో స్పెషల్ అట్రాక్షన్. నిజానికిది ఓ రకంగా ముందస్తు ఎలక్షన్ క్యాంపెయిన్ అన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. గ్రామీణ ప్రాంతాల్లో కోల్పోయిన పట్టుని తిరిగి సంపాదించుకునేందుకు చంద్రబాబు చేపట్టిన విజయయాత్ర ఇదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదంటున్నారు.

ప్రముఖ గాయని ఆశాభోంస్లే కుమార్తె మృతి

    ప్రముఖ గాయని ఆశాభోంస్లే కుమార్తె వర్షా భోంస్లే సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. 56 సంవత్సరాల వయసున్న వర్షా భోంస్లే ముంబైలోని తన నివాసంతో లైసెన్స్‌డ్ తుపాకీతో కాల్చుకుని చనిపోయింది. ఆరోగ్య సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. 2008లో ఒకసారి వర్షా భోంస్లే ఆత్మహత్యకు పాల్పడి తృటిలో ప్రాణాలతో బయటపడింది. వర్షా భోంస్లే ఫ్రీ లాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఆమె గాయని కూడా. వర్షా భోంస్లే మృతితో బాలివుడ్ విషాదంలో మునిగిపోయింది. ప్రస్తుతం ఆమె తల్లి ఆశాభోంస్లే మరాఠి కల్చర్ అవార్డు కార్యక్రమంలో పాల్గొనేందుకై సింగపూర్ వెళ్లారు.

తెలంగాణ మార్చ్ వల్ల కిరణ్ కుమార్ రెడ్డికే లాభం

  తెలంగాణ మార్చ్ కోసం కోదండరామ్ తెగ ఊగిపోయారు. ఎలాగైనా మార్చ్ ని విజయవంతం చేసి సత్తా చాటాలని ఉవ్విళ్లూరారు. మార్చ్ కి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలనుకూడా అరెస్ట్ చేయించిన ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయ ఘటనలకూ తావులేకుండా మ్యానేజ్ చేయగలిగింది. గత అనుభవాల్ని దృష్టిలోపెట్టుకుని పోలీసులు పక్కా వ్యూహంతో ఆందోళనకారుల్ని కట్టుదిట్టం చేయగలిగారు. ముందునుంచీ మార్చ్ కి వ్యతిరేకంగా ఉన్న కేసీఆర్ ఈ విషయంలో సంతృప్తిగానే ఉన్నా తనకి పెద్దగా ఒరిగిందేం లేదు. మరి తెలంగాణ మార్చ వల్ల లాభపడిందెవరు? నూటికి నూరు శాతం కిరణ్ కుమార్ రెడ్డే.. అని ఈ ప్రశ్నకి సమాధానం అశేష తెలుగు ప్రజానీకంనుంచి గట్టిగా వ్యక్తమవుతోంది. తెలంగాణ ఉద్యమం పేరుతో గతంలో ట్యాంక్ బండ్ మీద విగ్రహాల విధ్వంసం ఎపిసోడ్ ని దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడమేకాక ఓ పద్ధతిలో ముందుకెళ్లిన కిరణ్ కుమార్ రెడ్డి.. మార్చ్ తూతూమంత్రంగా ముసిగిపొయ్యేలా చేయగలిగారని కాంగ్రెస్ వర్గాలు బాహాటంగా చెప్పుకుంటున్నాయ్. దీనివల్ల అధిష్ఠానం దృష్టిలో కిరణ్ కి మంచి మార్కులేపడ్డాయి. లా అండ్ ఆర్డర్ చేయిజారిపోయిందన్న వాదనలకు ఈ మార్చ్ ని కంట్రోల్ చేయడంద్వారా కిరణ్ కుమార్ రెడ్డి చెక్ పెట్టగలిగారని సోనియాతోపాటు ఢిల్లీ పెద్దలంతా భావిస్తున్నట్టు సమాచారం. ఈ ఊపునే కొనసాగిస్తే వచ్చే ఎన్నికలవరకూ కిరణ్ సీటుకి ఢోకా లేదని హస్తినలో పెద్దలు చెప్పుకుంటున్నారు. ఎవరు ఎన్నిరకాల విశ్లేషణలు ఇచ్చినా, ఎన్నిరకాలుగా రాజకీయ సమీకరణాలగురించి అంచనాలు గుప్పించినా తెలుగువన్ డాట్ కామ్ మాత్రం ముందునుంచీ కచ్చితమైన విశ్లేషణని అందిస్తోంది. 2014 ఎన్నికలవరకూ కిరణ్ కుర్చీకి వచ్చిన ఢోకా ఏమీ లేదని తెలుగువన్ డాట్ కామ్ ముందునుంచీ చెబుతూనే ఉంది.  

విజయమ్మ మీదే జగన్‌ పార్టీ భారం

జగన్‌కి ఇప్పట్లో బెయిల్‌ వచ్చే సూచనలు కనిపించడంలేదు. కనీసం మూడు నెలల పాటు జగన్ కి బెయిల్ మంజూరు చేయకూడదని సిబిఐ గట్టిగా కోరుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈడీ వేసిన పిటిషన్ జగన్ తో పాటు వైయస్ఆర్ కాంగ్రెస్ కి కుడా పెద్దదెబ్బని రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ భారం పూర్తిగా విజయలక్ష్మి భుజాల పైనే ఉన్నట్లు లెక్క షర్మిల, భారతి ఆమెకు చేదోడువాదోడుగా నిలబడక తప్పదు. వచ్చే ఎన్నికల నాటికి కుడా పరిస్థితిలో పెద్దగా మార్పు రాకపోతే మళ్ళీ ఉపఎన్నికల్ నాటి సీన్ పునరావృతం అవుతుందని చాలామంది అనుకుంటున్నారు. మరో వైపు చంద్రబాబు ప్రజల్లో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకొనేందుకు పాదయాత్ర చెప్పట్టారు. వెళ్ళిన చోటాళ్ళ బాబుకు జనం జేజేలు కొడుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న జనం బాబు వైపుకి మళ్ళి పోకు౦డా చుసుకోనేందుకు వైకాపా నేతలు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఈ ప్రయత్నంలో విజయలక్ష్మి పై భారం అ౦తకంతకి పెరిగిపోతోంది.

నిరాశలో జగన్‌ అభిమానులు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానులు ఎంత మంది దేవుళ్లకు మొక్కుకున్నా ఫలితం లేక పోయింది. సుప్రీంకోర్టు బెయిలు నిరాకరించింది. సిబిఐ వాదనలతో ఏకీభవించింది. సిబిఐ తిరుగులేని సాక్ష్యాలను చూపింది. దాల్మియా గ్రూప్‌ సీనియర్‌ ఉద్యోగుల పేరిట తీసుకున్న లాకర్లలో 14 కోట్ల రూపాయల నగదు, 5 కోట్లు విలువ చేసే బంగారం దొరికింది. అంతకంటె విలువైన హార్డు డిస్కుకూడా దొరికింది. దానిలో క్విడ్‌ ప్రోకోగా చెపుతున్న దినేష్‌ దాల్మియాకు సిమెంట్‌ కంపెనీ కోసం 140 కోట్ల కు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అందులో 55 లక్షలు జగన్‌కు దక్కినట్లు మిగతా ఇవ్వవలసి ఉన్నట్లు ఉంది. దినేష్‌ దాల్మియా విచారణ కూడా ఇదే బయటపడినట్లు సమాచారం. అంతే కాకుండా ఐటి దాడుల్లో కూడా ఇదే విషయం బయట పడినట్లు కోర్టుకు రుజువులు చూపుతూ ఎంతో మంది పేరొందిన రాజకీయనాయకులగా వున్నవారు దీని వెనుక ప్రధాన పాత్ర పోషించారు కాబట్టి వారందరిని విచారించడానికి గాను ఇంకా వ్యవధి కావాలని సిబిఐ తరుపున వాదిస్తున్న న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ప్రస్తుతానికి 3 వేల కోట్ల ఆస్ధుల్ని గుర్తించామని సిబిఐ తెలిపింది. జగన్‌ బయటికి వస్తే సాక్షులను ప్రలోభపెడతారన్న వాదనకు సుప్రీం కోర్టు ఏకీభవించింది. అంతేకాకుండా పూర్తి విచారణ జరిపే వరకు బెయిల్‌ ఇవ్వకూడదని కూడా సీబిఐ వారనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో మరో మూడు నెలల వరకు బెయిలు మంజూరు చేయవద్దని కూడా వారు న్యాయమూర్తిని కోరారు. దీంతో వైయస్సార్‌ సిపి పార్టీలో నిరాశా, నిసృహ ఆవరించింది.

అమ్మాయిని పిలిచి గ్యాంగ్ రేప్ చేయించిన మహిళ

    16 ఏళ్ళ అమ్మాయిని తన ఇంటికి రమ్మని పిలిచి ముగ్గురు యువకులతో గ్యాంగ్ రేప్ చేయించిన సంఘటన హర్యానాలో జరిగింది. మిను అనే మహిళ తన పక్కింటిలో ఉంటున్న అమ్మాయిని తన ఇంటికి రమ్మని పిలవడంతో బాధితురాలు అక్కడికి వెళ్ళింది. అప్పటికే మిను ఇంటిలో అమ్మాయి కోసం ఎదురుచూస్తున్న నవీన్, సంజీవ్, ప్రదీప్ లు తను ఆ ఇంటిలోకి రాగానే ఆమె పై దాడి చేసి బలవంతంగా రేప్ చేశారు. ఆమెకు జరిగిన సంఘటను తట్టుకోలేకపోయిన అమ్మాయి తనపై కిరోసిన్ పోసుకొని అంటించుకుంది. బాధితురాలను వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఆమె చెప్పిన కథనం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరు యువకులను అరెస్ట్ చేయగా, మరొకతను పరారిలో ఉన్నాడు. హర్యానాలో రోజురోజుకి పెరుగుతున్న అత్యాచారాలపై మానవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

పాదయాత్రలో సెంచరి పూర్తి చేసిన చంద్రబాబు

  చంద్రబాబు పాదయాత్రలో ఒక మైలురాయి పూర్తి చేశారు. రెండు వేల కిలోమీటర్లకు పైగా జరగనున్న ఈ పాదయాత్రలో ఈయన ఆదివారం వంద కిలోమీటర్లు పూర్తి చేశారు. అనంతపురం నియోజకవర్గ పరిధిలో ఇది పూర్తయింది. ”వస్తున్నా మీకోసం” అంటూ భద్రత గురించి కూడా భయం లేకుండా చంద్రబాబు అందరితో మమేకం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం కంబదూరు మండలం కొత్తూరు గ్రామం చేరుకోవడంతో వంద కిలోమీటర్లు పూర్తయింది. బాబు పేరూరు డ్యాంను పరిశీలించి గ్రామ ప్రజలతో మాట్లాడారు. అసమర్థం ప్రభుత్వ నిర్ణయాలతో వర్షాలు వచ్చినా చెరువులు, డ్యాములు ఎండిపోయిన దుస్థితి అని ఆవేదన చెందారు. ఇలాంటి పాలనకు చెక్ పెట్టండి. సుభిక్ష రాష్ట్రం కావాలంటే సుపరిపాలన కావాలి. అందుకు తెలుగుదేశం అధికారంలోకి రావాలని బాబు వ్యాఖ్యానించారు.