మదమెక్కి కొట్టుకుంటున్న హర్యానా వాసులు!
posted on Oct 9, 2012 @ 3:24PM
అవును మీరు చదువుతున్నది నిజమే. ఏటా విపరీతంగా పెరిగిపోతున్న మానభంగాల్ని, దళితమహిళలపై జరుగుతున్న అరాచకాల్ని అరికట్టాలంటే పదహారేళ్లకే మగపిల్లలకు పెళ్లిళ్లు చేసేయాలని సామాజిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇంత బాహాటంగా బాల్యవిహాహాల్ని సమర్ధిస్తున్న ఆ సెల్ఫ్ డిక్లేర్డ్ సామాజిక శాస్త్రవేత్తలు హర్యానాలో పంచాయతీలుకూడా చేసేస్తుంటారు. ప్రత్యేకించి దళిత మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడు పంచాయతీపెట్టేసి నామమాత్రపు రుసుమును తప్పుకింది కట్టించేసి మ్యానేజ్ చేయడంలో ఈ పెద్దరాయుళ్లు బాగా సిద్ధహస్తులు. తాజాగా హర్యానాలో పదహారేళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ విషయాన్నికూడా పెద్దరాయుళ్లు విలేజ్ కోర్ట్ లోనే తేల్చేయాలని చూశారు. కానీ.. బాధితులు అడ్డం తిరగడంతో అది కోర్టు వరకూ వెళ్లింది. సాక్ష్యం చెప్పినా, బాధితులకు అండగా నిలబడినా చంపేస్తామంటూ తెగబలిసి కొట్టుకుంటున్నవాళ్లు బాధితవర్గాన్ని బెదిరిస్తుంటే తీర్పులు చెప్పి నేరాన్ని కప్పిపుచ్చి మసిబూసి మారేడుకాయజేసి జరిగిన తప్పుని ఒప్పుగా మార్చేసే పెద్దరాయుళ్లు చోద్యం చూస్తున్నారటకూడా. హర్యానాలో ఈ సంవత్సరం దాదాపు 650 రేప్ లు జరిగాయ్. ఒళ్లు మదమెక్కితే రేప్ లు చేస్తారు కాబట్టి, చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేసేస్తేపోలా అని ఉచిత సలహాలు కూడా పంచాయతీలు చేసే పెద్దలు విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్నారట.