దీని భావమేమి..
posted on Oct 9, 2012 @ 11:55AM
ఈ మధ్యకాలంలో నాయకులకు తాము ఏం మాట్లాడినా చెల్లుబాటైపోతుందనుకోవడం... ఆనక... అబ్బే.. నేను అలా అనలేదు... వక్రీకరించారు... అంటూ వచనాలు పలకడం అలవాటైపోయింది. ఇది సంచలనంకోసం కొందరైతే... ఇంకొందరు అనుకోకుండా అనేసి నాలుక్కరుచుకుంటున్నారు.. వారి బాట పట్టాడు హర్యానాకు చెందిన ఓ గ్రామ పెద్ద. హర్యానాలోని జింద్ జిల్లాలో 28 రోజులుగా తొమ్మిది అత్యాచార సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో పెరుగుతున్న అత్యాచారాలపై ఖాప్ పంచాయతీ సభ్యుడు సుబేసింగ్ మాట్లాడుతూ.. అత్యాచారాలకు టి.వి.లు, సినిమాలే కారణమని, యువత సినిమాలు, టీవీలో వస్తున్న అశ్లీల కార్యక్రమాలతో చెడిపోతున్నారు. అమ్మాయిలకు 16 ఏ ళ్ళ వయసులోనే పెళ్ళి చేస్తే... అత్యాచారాల ఘటనలు ఆగిపోతాయి.’ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలపై అక్కడి మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. అత్యాచారాల నివారణకు కృషిచేయాల్సింది పోయి... మహిళా హక్కుల్ని కాలరాసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 16 ఏళ్ళ దళిత బాలికను నలుగురు యువకులు బలవంతంగా సామూహిక అత్యాచారం చేశారు. ఆమె అవమానభారంతో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ అత్యాచార ఘటన జరిగిన అనంతరం ఖాప్ పెద్ద ఈ వ్యాఖ్యలు చేయడంతో మహిళా సంఘాలు మండిపోతున్నాయి. నిజానిజాలు యెలా వున్నా... నోరు వీపుకు చేటుతేకే... అన్న సామెతను అప్పుడప్పుడు నాయకులు... నాయకులమని భావించేవారు గుర్తుంచుకుంటే మంచిదేమో!