జైలు నుంచి శ్రీలక్ష్మి విడుదల
posted on Oct 9, 2012 @ 5:33PM
సీనియర్ ఐఏఎస్ అధికారిణి, ఓఎంసీ కేసులో నిందితురాలు శ్రీలక్ష్మి చంచల్ గుడా జైలు నుంచి విడుదలయ్యారు. శ్రీలక్ష్మి పూచీకత్తుల సమర్పణ ఆలస్యమవడంతో సోమవారం సాయంత్రం విడుదల కాలేదు. మంగళవారం బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందడంతో ఆమెను విడుదల చేశారు. మూడున్నర నెలల పాటు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేశారు. పాస్‌పోర్టును తమ ముందు పెట్టాలని, బెయిల్ సమయంలో ఎవరితోనూ మాట్లాడకూడదని, హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కోర్టు ఆదేశించింది. వెన్నునొప్పితో బాధపడుతున్న శ్రీలక్ష్మికి శస్త్రచికిత్స అవసరమని, శ్రీలక్ష్మి తీవ్రమైన మానసికవ్యధతో నలిగిపోతున్నారని, అందువల్ల జైలులో ఉంటూ శస్త్రచికిత్స చేయించుకుంటే శస్త్రచికిత్స ఫలితం ఉండకపోవచ్చునని, బెయిల్ ఇస్తే కాస్తా మానసికంగా ఊరట చెందుతుందని, దానివల్ల శస్త్రచికిత్స ఫలితం ఇస్తుందని వైద్యులు ఇచ్చిన వివరణను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ బెయిల్ ఆదేశాల ప్రకారం వచ్చే ఏడాది జనవరి 21న ఆమె కోర్టులో లొంగిపోవాల్సి ఉంటుంది.