నితిన్ గడ్కరీ.. కేజ్రీవాల్ కొత్త టార్గెట్..!
జన్ లోక్ పాల్ కోసం తీవ్రంగా పోరాడుతున్న అరవింద్ కేజ్రీవాల్ తనామనా అన్న తేడాలేకుండా రాజకీయ నేతల్ని వరసపెట్టి ఏకిపారేస్తున్నారు. వాద్రా డిఎల్ ఎఫ్ లావాదేల్ని బజారున పెట్టారని సంతోషపడిపోయి కేజ్రీవాల్ ని శెభాష్ అంటూ మెచ్చుకున్న బిజేపీ జాతీయ అధ్యక్షుడు గడ్కారీకి ఇప్పుడు పచ్చివెలక్కాయ్ నోట్లో పడింది. సొంత పరిశ్రమకోసం మహారాష్ట్ర సర్కారుతో కుమ్మక్కై.. గడ్కరీ.. వందెకరాలు గుటకాయస్వాహా చేశారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. రైతుల పేరుతో ప్రాజెక్ట్ లనుంచి నీటిని పరిశ్రమలకు మళ్లిస్తున్నారని, పైపైకి పార్టీలపరమైన భేదాలు కనిపిస్తున్నా.. మహారాష్ట్ర నేతలంతా ఒక్కటేనని కేజ్రీవాల్ ఆరోపించారు. మహారాష్ట్రలో జరిగిన 70 వేలకోట్ల ఎకరాల సాగునీటి కుంభకోణంలో అన్నిపార్టీలకూ భాగస్వామ్యం ఉందని, రైతుల పేరు చెప్పి జలాశయాల్ని నిర్మించి, వాటినుంచి నీళ్లని విద్యుత్తు, చక్కెర కర్మాగారాలకు మళ్లిస్తున్నారని, నితిన్ గడ్కరీకి చెందిన ఐదు విద్యుత్తు ప్లాంట్లు, మూడు చక్కెర కర్మాగారాలు ఉన్నాయని, జలాశయాల నిర్మాణంకోసం రైతుల పొట్టగొట్టి సేకరించిన భూమిలో మిగిలిన భూమిని గడ్కరీకి ధారాదత్తం చేశారని, మహారాష్ట్రలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న 71 ధర్మల్ విద్యుత్తు కేంద్రాలు మొదలైతే ఏటా 2049 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు అవసరమౌతుందని, ఆ నీటిని అందజేస్తే.. రైతులకు చుక్కనీళ్లుకూడా అందవని, రోజూ రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ఆరోపించారు.