కేజ్రీవాల్ పై మండిపడ్డ సోనియా అల్లుడు

క్విడ్ ప్రోక్ కింద వందలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్టు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అవినీతి ఆరోపణలపై రాబర్ట్ వాద్రా మండిపడ్డాడు. తనపై కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ధీటుగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. తమ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్‌లు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను ఎక్కడా చట్టాన్ని అతిక్రమించలేదని, ఏళ్లుగా వ్యాపారాలు చేస్తున్నానని, తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, చట్టబద్దంగానే బిజినెస్ చేస్తున్నానని వివరణ ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనపై విమర్శలు చేయడం తగదన్నారు. మీ వద్ద తన వ్యాపారానికి వ్యతిరేకంగా ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టుకి వెళ్లవచ్చునని అన్నారు.

టి 20 ప్రపంచ చాంపియన్ గా వెస్టిండీస్

    వెస్టిండీస్ సుదీర్ఘ విరామం తర్వాత విశ్వవిజేతగా నిలిచింది. పొట్టి క్రికెట్ సమరంలో చాంపియన్‌గా అవతరించింది. టి-20 ప్రపంచ కప్ ఫైనల్లో కరీబియన్లు 36 పరుగులతో ఆతిథ్య శ్రీలంకను ఓడించి కప్‌ను ఎగరేసుకుపోయారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహేల సేన 18.4 ఓవర్లలో 101 పరుగులకు కుప్పకూలింది. మహేల 33, సంగక్కర 22, కులశేఖర 26 పరుగుల మినహా ఇతర బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్ దాటలేకపోయా రు. విండీస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ లంక పతనాన్ని శాసించారు. సునీల్ నరైన్ 3/9, సామీ 2/6 అద్భుతంగా బౌలింగ్ చేశారు.   అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 137 పరుగులు చేసింది. శామ్యూల్స్ 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో సామీ 15 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు దూకుడుగా ఆడగా, డ్వెన్ బ్రావో 19 పరుగులు చేశాడు. కాగా ఇతర బ్యాట్స్‌మెన్ దా రుణంగా విఫలమయ్యారు. లంక మిస్టరీ స్పిన్నర్ అజంతా మెండిస్ 4/12 మరోసారి అద్భుతంగా రాణించాడు. మాథ్యూస్ 1/11, అఖిల ధనంజయ 1/16 పొదుపుగా బౌలింగ్ చేయగా, స్టార్ పేసర్ మలింగ 0/54 ధారాళంగా పరుగులిచ్చేశాడు. శామ్యూల్స్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', ఆసీస్ ఆల్‌రౌండర్ వాట్సన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు దక్కాయి.

చంద్రబాబుకి పోటిగా షర్మిల పాదయాత్ర

  జగన్ కి బెయిల్ వస్తుందని గంపెడు ఆశలతో ఉన్న వైయస్ఆర్ పార్టీశ్రేణులు సుప్రీం తాజా తీర్పుతో డీలా పడ్డారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పాదయాత్రతో జనంలోకి వెళ్లిపోవడంతో దీనికి కౌంటర్‌గా వైఎస్ కూతురు, జగన్ సోదరి షర్మిలతో సుదీర్ఘ పాదయాత్ర చేయించడం మినహా మరో మార్గం లేదని వారు భావిస్తున్నారు. షర్మిల పాదయాత్రకు జగన్ కూడా ఒకే చెప్పారని, ఇక అధికారిక ప్రకటనే తరువాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఒకటి రెండు రోజుల్లో వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలతో విజయమ్మ సమావేశం కానున్నారు. అనంతరం భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఓదార్పు యాత్రకన్నా ప్రజాసమస్యలపై షర్మిళ పాదయాత్రకే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే షర్మిళ పాదయాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభించాలా లేక మరో ప్రాంతమా అన్న విషయంపైనా త్వరలోనే వైకాపా క్లారిటీ ఇవ్వనుంది.

కేజ్రీవాల్ పై రాబర్ట్ వాద్రా ఫైర్

క్విడ్ ప్రోక్ కింద వందలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్టు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అవినీతి ఆరోపణలపై రాబర్ట్ వాద్రా మండిపడ్డాడు. తనపై కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ధీటుగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. తమ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్‌లు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను ఎక్కడా చట్టాన్ని అతిక్రమించలేదని, ఏళ్లుగా వ్యాపారాలు చేస్తున్నానని, తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, చట్టబద్దంగానే బిజినెస్ చేస్తున్నానని వివరణ ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనపై విమర్శలు చేయడం తగదన్నారు. మీ వద్ద తన వ్యాపారానికి వ్యతిరేకంగా ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టుకి వెళ్లవచ్చునని అన్నారు.

జగన్ పై ఇన్వెస్టర్ల ఒత్తిడి

జగన్ కు బెయిల్ రాకపోవడంతో ఆయన కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారు ఆందోళన చెందుతున్నారు. జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం కారణంగా తాము కుడా కేసుల్లో కూరుకుపోయామని, తమ పెట్టుబడులు వెనక్కి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారట. కొందరు పెట్టుబడిదారులు లోటస్‌పాండులోని జగన్ ఇంటికి వెళ్లి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారట. ఈడి, సిబిఐ జగన్ ఆస్తులపై కొరడా ఝులిపించడంతో వారిలో ఆందోళన ప్రారంభమైందట. మరోవైపు జగన్ ఇంటికి వచ్చి వెళుతున్న వారిపై సిబిఐతో పాటు ఇంటెలిజన్స్ వర్గాలు నిఘా పెట్టాయట. ఎవరెవరు వస్తున్నారని గమనిస్తున్నారట. జగన్ జైలు నుండి బయటకు వస్తే పరిస్థితులు కొంచె కుదుట పడతాయని ఆయన కుటుంబ సబ్యులు, పార్టీ నేతలతో పాటు ఆయన కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారు కూడా భావించారు. అయితే ఇప్పట్లో జగన్‌కు బెయిల్ వచ్చే అవకాశాలు లేకపోవడంతో వారిలో ఆందోళన ప్రారంభమైందంటున్నారు.

తెలంగాణ కోసం మరో కొత్త పార్టీ

తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్డీ) తెలంగాణ శాఖను ఏర్పాటుచేస్తున్నట్లు ఆర్‌ఎల్డీ అధినేత, కేంద్రమంత్రి అజిత్‌ సింగ్‌ ఈరోజు ప్రకటించారు. తెలంగాణ శాఖ కన్వీనర్‌గా కపిలవాయి ఇందిరా దిలీప్‌ను, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మహ్మద్‌ రియాజ్ను నియమించారు. తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమాన్ని నేనెక్కడా చూడలేదు. అని అజిత్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణకు మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ నేతలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. కాగా అంతకుముందు హైదరాబాద్ చేరుకున్న అజిత్ సింగ్ తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టతరమని అన్నారు. ఆయన ఆర్ఎల్డీ తెలంగాణ శాఖను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ వచ్చారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలతో సమావేశమయ్యారు. అనంతరం అజిత్ సింగ్ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వస్తుందని ప్రకటనలు ఏళ్ల తరబడి వింటూనే ఉన్నామన్నారు. తెలంగాణవారంతా ఏకతాటిపై ఉన్నారన్నారు.

రాబర్ట్ వాద్రాపై పై విచారణ అసాధ్య౦: చిదంబరం

రాబర్ట్ వాద్రాపై పై అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఉంటే రాబార్ట్ అవినీతిపై విచారణ జరిపించాలని చాలా మంది సవాల్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అనుకోని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం రాబర్ట్ పై విచారణ జరపడం అసాధ్య మంటున్నారు. ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగిన లావాదేవీని ఆరోపణలు వచ్చాయనో లేదా అవినీతి చర్యగానో భావించో ప్రశ్నించడానికి వీల్లేదు. ఈ లావాదేవీలను ఆదాయం పన్ను శాఖ రిటర్న్‌లు, ఇతర రిటర్న్‌లలో వెల్లడించారు కూడా. అంతేకాకుండా పరస్పర ప్రయోజనాలు ఉన్నాయని కానీ లేదా అవినీతి ఉద్దేశాలు ఉన్నాయని కానీ ఎవరూ ఆరోపించలేదు. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను అని చిదంబరం అన్నారు.

పాక్‌ జట్టులో విభేదాలు

  టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌ నుంచి వైదొలిగిన అనంతరం జట్టు ఓటమిపై పాక్‌ టీంలో విభేదాలు భగ్గుమన్నాయి. శ్రీలంకతో జరిగిన సెమీస్‌లో తనను తీసుకోకపోవడంపై ఆల్‌రౌండర్‌ అబ్దుల్‌ రజాక్‌ అసంతృప్తిని వ్యక్తం చేశారు. శ్రీలంక నుంచి లాహోర్‌కు తిరిగొచ్చిన రజాక్‌ ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు. సెమీస్‌లో తాను ఆడకుండా కెప్టెన్‌ హఫీజ్‌ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టాడు. జట్టు మేనేజ్‌మెంట్‌ ఈ నిర్ణయం తీసుకోలేదని, కెప్టెనే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నాడని ఆరోపించారు. మరోవైపు పాక్‌కు చేరుకున్న కెప్టెన్‌ హఫీజ్‌ ఈ వ్యాఖ్యలను ఖండించారు. సెమీస్‌లో అతడికి చోటు కల్పించకపోవడం జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయమేనని స్పష్టం చేశాడు.

డీఎస్సీ ఫలితాలు విడుదల

  డీఎస్సీ 2012 రాత పరీక్షల ఫలితాలను సచివాలయంలో మాథ్యమిక విద్యాశాఖా మంత్రి కె.పార్థసారధి విడుదల చేశారు.డీఎస్సీ లో సాధించిన మార్కులు మాత్రమే ప్రకటిస్తున్నామని, డీఎస్సీ, టేట్ మార్కులను కలిపి మెరిట్ జాబితా త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. అన్ లైన్ లో తప్పిదాల సవరణకు ఈ నెల 8 నుంచి 18 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి డీఎస్సి, టెట్కు ఒకే పరీక్ష టెస్ట్ (టీచర్ ఎలిజిబులిటీ అండ్ సెలక్షన్)నిర్వహిస్తామని మంత్రి వివరించారు. వచ్చే ఏడాది మరో డీఎస్సితో 25వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. 3వేలకుపైగా పీఈటీ టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. మోడల్ స్కూళ్లలో పీజీ టీ, టీజీ టీ ఫలితాలు మాత్రమే విడుదల చేశారు.

అనంత రాజకీయాల్లోకి యువనేత పరిటాల శ్రీరామ్

అనంతపురం జిల్లాలోమళ్లీ తెలుగుదేశానికి ఈ జిల్లాలో మంచిరోజులు వచ్చాయి. కొత్తనాయకుడు తయారవుతున్నాడు. దివంగత నేత పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరాములు తరచూ తెలుగుదేశం కార్యక్రమాల్లో కనిపిస్తున్నాడు. అతను పార్టీ పరంగా ఏ కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా అప్పుడప్పుడు తల్లి వెంట కనబడుతూ, పర్యటనలు చేస్తున్నాడు. దీంతో అతడు తరచూ వార్తల్లో కనిపించడం మొదలుపెట్టాడు. తాజాగా చంద్రబాబు అనంతపుం జిల్లా నుంచి మొదలుపెట్టిన “వస్తున్నా మీకోసం” పాదయాత్రతో ఊపుమీదున్న తెలుగుదేశం కొత్త ఉత్సాహాన్ని పొందింది. శనివారం పరిటాల సునీత నియోజకవర్గం రాప్తాడులో పర్యటించిన చంద్రబాబు పరిటాల కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తూ మాట్లాడారు. ఈ పర్యటనలో పరిటాల సునీతతో పాటు పరిటాల శ్రీరామ్ కూడా ఉన్నారు. పైగా, యువకుల నుంచి పరిటాల శ్రీరామ్‌కు ఆహ్వానం కూడా అందుతోంది. ఈ విషయమై చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీరామ్ రాజకీయ ప్రవేశం గురించి సునీత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఆదేశాల ప్రకారం, అభిమానుల కోరిక మీద శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశం చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే, ప్రస్తుతం పరిటాల ట్రస్టు సేవా కార్యక్రమాలకు మాత్రం శ్రీరామ్ నేతృత్వం వహిస్తారని ఆమె స్పస్టంచేశారు.

రాబర్ట్‌ వాద్రాపై కేజ్రీవాల్ ఫైర్

రాజకీయ రంగప్రవేశానికి సిద్ధమవుతున్న సామాజిక కార్యకర్త, మాజీ ఐఏఎస్ అరవింద్ కేజ్రీవాల్ కదన రంగంలోకి దిగారు. ప్రధాన ప్రత్యర్థిపై పోరాటానికి మిగిలిన వారికి భిన్నమైన ఎత్తుగడను ఎంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాపై ఆయన గురి పడింది. వాద్రా అక్రమాస్తుల్ని ఎలా కూడబెట్టిందీ కేజ్రివాల్ సాక్ష్యాధారాలతో బయటపెట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పేరు మోసిన డీఎల్ఎఫ్ సంస్థ వాద్రాకు అతి తక్కువ ధరకు అత్యంత ప్రధానమైన భూమిని ఇవ్వడమే కాకుండా వడ్డీ లేని రుణం ఇచ్చిందని, ఆ ఆస్తి విలువ 300 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. వాద్రాకు ఆ సంస్థ 50 లక్షల రూపాయలకే ఈ ఆస్తులన్నీ సమకూర్చి పెట్టిందని కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. వాద్రా సంపద విలువ మూడేళ్లలో 600 రెట్లు పెరిగిందని వారు చెప్పారు. కేజ్రివాల్ మరో సంచలన వ్యాఖ్య కూడా చేశారు. దేశంలోని అత్యంత అవినీతిపరులైన ఇద్దరు రాజకీయ నాయకుల గుట్టును శనివారం విప్పుతామని ఇటీవల కేజ్రీవాల్ చెప్పారు. అయితే, ఒక రాజకీయ నాయకుడిని గుట్టును ఒక రోజు ముందే శుక్రవారం విప్పేశారు. మరో రాజకీయ నాయకుడి ఆస్తుల వివరాలను అక్టోబర్ 10వ తేదీన వెల్లడించే అవకాశాలున్నట్లు ప్రకటించారు.

వైయస్ విజయమ్మ క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

జగన్‌బాబుపై కుట్రలు పన్ని జైలులో పెట్టారని శాపనార్ధాలు పెడుతున్న వై.ఎస్. విజయ లక్ష్మి జగన్ సంపాదించిన అక్రమ ఆస్తులపై ప్రజలకు క్షమాపణలు చెప్పాలని టిడిపి పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్ ఆస్తులపై వివరాలు వెల్లడించాలని, యు.పి.ఎ. హయాంలో 8 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆయన గుర్తు చేశారు. రూ. 60 కోట్ల బోఫోర్స్ అవినీతి కేసులో అర డజను మందితో రాజీనామా చేయించిన ఘనత ఎన్టీఆర్‌ది అని కూడా ఆయన గుర్తు చేశారు. కేంద్రాన్ని ప్రజల ఆస్తులు కాపాడండి అని తెలుగుదేశం పార్టీ కోరిందని, అందుకు విజయలక్ష్మి కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు అయ్యిందని అనడాన్ని ఖండించారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పేకమేడలా కూలే పరిస్థితి వచ్చిందని సోమిరెడ్డి అన్నారు. ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో విజయమ్మ చెప్పాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో పాలన లేదని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తుంటే కాంగ్రెసు నాయకుల కాళ్లు నొప్పి పెడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

పరిటాల రవిని హత్య చేసింది కాంగ్రెస్సే : బాబు

టీడీపీ నేత పరిటాల రవిని హత్య చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చంద్రబాబు నాయుడు అన్నారు. పేదలపై దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదని కాంగ్రెస్, వైఎస్సార్ పార్టీలను హెచ్చరించారు. పేదలకు టీడీపీ అండగా నిలుస్తుందన్నారు. ఐదోరోజు బాబు పాదయాత్రలో వెంట రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఉన్నారు. ఈ రోజు చంద్రబాబు 20 కి.మీ వరకు పాదయాత్రగా వెళ్లనున్నారు. చంద్రబాబు నాయుడు రాప్తాడు నియోజవర్గంలో పాదయాత్ర ప్రారంభించి అక్కడ నుంచి ఎంసీ పల్లి, తిమ్మాపురం, ఎస్సీ కాలనీ మీదుగా రెడ్డివారి పల్లి క్రాస్ చేరుతారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం కొండాపురం, చిన్న కొండాపురం, నక్కెలవారి పల్లి, సజ్జయ్యవారి కొట్టాల మీదుగా పేరూరుకు చేరనున్నారు. పాదయాత్రలో పేదలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. పేరూరులో చంద్రబాబు రాత్రి బస చేయనున్నారు.

జగన్ కు మరో 6 నెలల వరకు నో బెయిల్

బెయిల్ కోసం జగన్ చేసుకున్న పిటీషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. బెయిల్ పిటిషన్ జరిగిన వాదనల్లో కోర్టు కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అంతే గాక 2013 మార్చి 31 తో వాదనలు పూర్తి చేయాలని పేర్కొంటూ, ఆ సమయంలో బెయిల్ కు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా జగన్ కు సూచించింది. దీంతో మరో ఆరు నెలల వరకూ జగన్ కు బెయిల్ వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. అయితే పరిస్థితులు మారితే మరోసారి బెయిల్ కు దరఖాస్తు చేసుకునేందకు జగన్ న్యాయవాదులు అనుమతి కోరారు. జగన్ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో హోరా హోరీ వాదనలు జరిగాయి. జగన్ అరెస్ట్ అక్రమమని వెంటనే బెయిల్ మంజూరు చేయాలని జగన్ తరపు లాయర్ వాదించారు. అయితే జగన్ అక్రమాస్తులపై దర్యాప్తుకు ఇంకా మూడు నెలల సమయం పడుతుందని, ఇప్పటికే మూడు వేల కోట్ల ఆస్తులను కనిపెట్టామని, వేలాది కోట్ల ఆస్తులను దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ తరపు న్యాయవాదులు వాదించారు.

ఆస్ట్రేలియాను చిత్తు చేసిన విండీస్

    టి-20 ప్రపంచకప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు కరీబియన్ జట్టు వెస్టిండీస్ షాకిచ్చింది. విధ్వంసక వీరులు క్రిస్ గేల్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 నాటౌట్, కీరన్ పొలార్డ్ 15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38, డ్వెన్ బ్రావో 31 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 37 ధాటికి శుక్రవారమిక్కడ ఏకపక్షంగా జరిగిన సెమీఫైనల్లో వెస్టిండీస్ 74 పరుగులతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇక టోర్నీలో సూపర్ ఫామ్‌లో అదరగొడుతూ వచ్చిన కంగారూలు. ఫైనల్ రేసులో బోల్తా పడ్డారు.  206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ 16.4 ఓవర్లలో 131 పరుగులకే చేతులెత్తేశారు. కెప్టెన్ జార్జి బెయిలీ 29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63 మినహా ఎవరూ రాణించలేదు. రవి రాంపాల్ 3/16, పొలార్డ్ 2/6, సునీల్ నరైన్ 2/17, శామ్యూల్ బద్రీ 2/27 ఆసీస్ పతనాన్ని శాసించారు. అంతకు ముందు టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ పూర్తి ఓవర్లలో నాలుగు వికెట్లకు 205 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో బౌండ్రీలు 13, సిక్స్‌ల 14 రూపంలో విండీస్‌కు 136 పరుగులొచ్చాయి. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన గేల్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. ఇక ఆదివారం జరిగే ఫైనల్లో విండీస్ శ్రీలంకతో తలపడనుంది.

అబ్బాయిలకు మసాజ్ చేస్తున్న అమ్మాయిలు

  హైదరాబాద్ జూబ్లిహిల్స్ ప్రశాసన్ నగర్ లో గుట్టుగా సాగుతున్న ఓ మసాజ్ సెంటర్ భాగోతం బయటపడింది. ఐపిఎస్ అధికారులు ఉండే ప్రశాసన్ నగర్ లో ఓ ఐపిఎస్ అధికారి ఇళ్ళు అద్దెకు తీసుకొని మరి ఈ మసాజ్ సెంటర్ నడుపుతున్నారు. అయితే సాదారణంగా మసాజ్ సెంటర్ లో అబ్బాయిలకు అబ్బాయిలు, అమ్మాయిలకు అబ్బాయిలు మసాజ్ చేస్తారు. కాని ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ స్త్రీలకు పురుషులు, పురుషులకు స్త్రీలు మసాజ్ చేస్తున్నారు. ఇందుకు కాను కస్టమర్ల నుంచి వేల రూపాయలు వాసులు చేస్తున్నారు. "ఏ లా మోడ్ స్పా" పేరుతో సాగుతున్న ఈ మసాజ్ సెంటర్ లో ఈ భాగోతం నడుస్తుంది. దీనిని పోలీసులు శుక్రవారం మూసివేయించారు.