జగన్ లేని లోటు వైకాపాని కలవరపెడుతోందా?

 

చంద్రబాబు పాదయాత్ర అటు కాంగ్రెస్ శ్రేణుల్లోనూ, ఇటు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనూ భయం పుట్టిస్తోంది. గ్రామీణులకు దూరంగా జరిగిపోయి హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుతెచ్చుకున్న చంద్రబాబు ఇప్పుడు తనమీదపడ్డ మచ్చని పూర్తిగా తుడిచేసుకునేందుకు ఈ పాదయాత్రని చేపట్టారు. రోబోయే ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ ఓటుబ్యాంక్ ని బాగా పెంచుకునేందుకు చంద్రబాబు యాత్ర గట్టిగానే పనిచేస్తుందని తెలుగుదేశం నేతలు బలంగా నమ్ముతున్నారు. చంద్రబాబుపై వెళ్లినచోటల్లా ప్రజలు చూపిస్తున్న ఆదరణ ఈ అంచనాలకు ఊతమిస్తోంది. బాబుకి జనంలోంచి వస్తున్న స్పందనని గమనించిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త గట్టిగానే కంగారుపడుతోంది. వై.ఎస్ జగన్ జైల్లో కూర్చునే ఎంతగా చక్రం తిప్పాలని ప్రయత్నం చేసినా.. ఆ పార్టీ పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యకమవుతోంది. ఉపఎన్నికల్లో విజయలక్ష్మితోపాటు షర్మిలకూడా ప్రచారానికొచ్చి “ నేను మీ రాజన్న కూతుర్ని వచ్చాను. మా అన్నకి అన్యాయం జరుగుతోంది “ అంటూ చేసిన ప్రచారం బాగానే ఫలించింది. కానీ.. రోజులుగడిచినకొద్దీ అదే మంత్రం పనిచేస్తుందని చెప్పడంకూడా కష్టమే. యాంటీ కాంగ్రెస్ వేవ్ బలంగా వేళ్లూనుకుంటున్న సమయంలో ఎవరు దాన్ని క్యాష్ చేసుకోగలిగితే వాళ్లకే వచ్చే ఎన్నికల్లో పూర్తి లాభం దక్కుతుందన్నది నిర్వివాదాంశం. కానీ.. ఎన్నికల నాటికి జగన్ జైలునుంచి విడుదలకానూవచ్చు, కాకపోనూ వచ్చు. ఒకవేళ అప్పటికీ జగన్ జైల్లోనే ఉంటే వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ప్రచారంలో జగన్ పాల్గొన తీరు ఒకలా ఉంటే జగన్ లేని ప్రచారం తీరు మరోలా ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా.. పదేపదే వియలక్ష్మి అనే బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించుకోవడంవల్ల చివరికి ఎన్నికల సమయంలో ఆ అస్త్రంకూడా పనిచేయకుండాపోయే ప్రమాదముంటుందని వాళ్లు హెచ్చరిస్తున్నారు. గండంనుంచి గట్టెక్కించగల శక్తి, కాస్తో కూస్తో షర్మిలకుకూడా ఉన్నా జగన్ తో పోలిస్తే, విజయమ్మతో పోలిస్తే షర్మిల ఛర్మిష్మా కాస్తంత డల్ గానే ఉంటుందని చెప్పొచ్చు. అందుకే విజయమ్మ తన బిడ్డ విడుదలౌతాడా లేదా అని గట్టిగానే బెంగపెట్టుకున్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి జగన్ మీద జనం కురిపిస్తున్న ప్రేమంతా దివంగత నేత వైఎస్సార్ మీదున్న అభిమానమేతప్ప మరోటికాదు. ఆ నిజం పార్టీ నేతలకు, అధ్యక్షుడికి, గౌరవాధ్యక్షురాలికి కూడా బాగానే తెలుసు. కానీ.. ఎన్నికల సమయానికి జగన్ జైల్లో ఉండిపోవడం ఖాయమైతే వైకాపాకి కష్టాలు తప్పకపోవడంకూడా ఖాయమేనని జనంలో ఇప్పటికే ఓ టాక్ మొదలైంది.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.