ఆస్తి తగాదాలతో రోడ్డెక్కిన సౌందర్య కుటుంబం
posted on Oct 9, 2012 @ 3:11PM
తెలుగు, కన్నడ, తమళం భాషల్లో ఓ తరాన్ని ఏలిన సూపర్ స్టార్ సౌందర్య. మూడుభాషల్లో లెక్కలేనన్ని సినిమాల్లో తన నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించి కోట్లాది రూపాయలు వెనకేసుకున్న హీరోయిన్ సౌందర్యకి మూడు సినీపరిశ్రమల్లోనూ మంచి పేరుకూడా ఉంది. తన నటనతో చాలామంది అభిమానుల్ని సంపాదించుకున్న సౌందర్య ఓ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాల్ని పోగొట్టుకుంది. ఆమెతోపాటు అన్నకూడా అదే ప్రమాదంలో చనిపోయాడు. అప్పట్నుంచీ నివురుగప్పిన నిప్పులా ఉన్న సౌందర్యకుంటుంబంలోని ఆస్తి కలహాలు ఇప్పుడు రోడ్డునపడ్డాయి. సౌందర్య అన్న భార్య విమలకూ, సౌందర్య భర్తకూ మధ్య ఆస్తి వివాదాలు కోర్టు గడపలో ఉన్నాయి. తాజాగా సౌందర్య రాసిన వీలునామా బైటపడడంతో ఆమె భర్తకి పచ్చివెలక్కాయ్ నోట్లోపడ్డట్టయ్యింది. సౌందర్య భర్త రఘు.. ఆస్తంతా తనే కొట్టేద్దామని చూస్తున్నాడని, తనని బెదిరిస్తున్నాడని సౌందర్య వదిన విమల కోర్టుకి ఫిర్యాదుచేసింది. తనకీ తన బిడ్డకీ రక్షణ కల్పించాలనికూడా కోరింది. ఎదురుదాడికి దిగిన రఘు, అసలు సౌందర్య విల్లే రాయలేదని, అంతా ప్రత్యర్థి లాయర్ అభూత కల్పన అనీ ఆరోపించాడు. దీంతో సౌందర్య అన్నభార్య తరఫున కేసు వాదిస్తున్న లాయర్.. సౌందర్య భర్తమీద యాభై లక్షల రూపాయలకు పరువునష్టం దావాకూడా వేశాడు. మొత్తంమీద ఈ వ్యవహారంలో సౌందర్యభర్తకే ఎక్కువ ఇబ్బంది కలగొచ్చని కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎవరికి ఎంత చెందాలో, ఏమివ్వాలో కచ్చితంగా సౌందర్య రాసిపెట్టిపోయినప్పుడు అసలు ఇలాంటి వివాదాలకు తావే లేదని కన్నడ సినీ వర్గాలు అనుకుంటున్నాయి. సౌందర్య రాసిన విల్లు నిజమో కాదో తేల్చి దానిప్రకారమే అమలుచేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని మూడు భాషలకూ చెందిన సినీ ప్రముఖులు భావిస్తున్నారు.