మళ్లీ కోత వేళలు పెరుగుతాయా ?

రాష్ట్రంలో విద్యుత్తుకోత వేళాపాళా లేకుండా పోయిందన్న ఆందోళన నానాటికీ పెరుగుతోంది.  గతంతో పోల్చుకుంటే కొంత వరకూ నయమే అని రాష్ట్రప్రభుత్వం సమర్ధించుకుంటున్నా ప్రజలు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు ఉత్పత్తికి ఎన్నో అవరోధాలు ఎదురవుతుంటే కోత వేళలు పెరగకతప్పదని పరిస్థితి అర్థమవుతోంది. గతంలో శ్రీశైలం జల విద్యుత్యుత్పాదన కేంద్రంలో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. యుద్ధ ప్రాతిపదికన మేల్కంటే అక్కడ ఉత్పత్తి ప్రారంభానికి ఓ వారంపైనే సమయం వృథా అయింది. ఇప్పుడు మళ్లీ వరంగల్‌ జిల్లాలోని కేటిపిఎస్‌ 5వదశలోని 9వయూనిట్‌లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో 500మెగావాట్ల విద్యుత్తు ఆగిపోయింది. కేటీపిఎస్‌ బాయిలర్‌లో ఎయిర్‌ట్యూబ్‌ లీకేజీ కూడా ఇదే సమయంలో జరిగిందని అధికారులు గుర్తించారు. దీంతో ఇక్కడ ఇంకో 250మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిరది. ఇలా రెండుయూనిట్లలో 750మెగావాట్ల విద్యుత్‌ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిరది. రెండు రోజుల పాటు పునరుద్దరణ చర్యలు తప్పవని అధికారులు ధృవీకరిస్తున్నారు. రాష్ట్రంలో దీని ప్రభావం వల్ల కోత పెరుగుతుందని భావిస్తున్నారు.

రోజుకో మలుపు తిరుగుతున్న నటి హేమశ్రీ మర్డర్

  కన్నడనటి హేమశ్రీ హత్యకేసులో కీలక వివరాలు ఒక్కొటొక్కటిగా బైటపడుతున్నాయి. బెంగళూరు పోలీసులు కార్పొరేటర్ మురళిని అదుపులోని తీసుకుని ప్రశ్నించినప్పుడు విస్మయం కలిగించే నిజాలు వెల్లడయ్యాయి. బెంగళూరు పోలీసులకు కార్పొరేటర్ మురళి చెప్పిన వివరాల ప్రకారం.. హేమశ్రీ మురళి కూతురు పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యింది. ఓమంత్రిగారినికూడా ఈ వేడుకలకు ఆహ్వానించారు. ఆయన కోరిక తీర్చమని హేమశ్రీని బలవంతపెట్టారు. ససేమిరా అనడంతో క్లోరోఫామ్ ని ప్రయోగించారు. మోతాదు ఎక్కువై హేమశ్రీ చనిపోయింది. మృతదేహాన్ని ఆమె భర్త సురేంద్రబాబు, మురళి కలిసి బెంగళూరుకి తీసుకెళ్లారు. బాప్టిస్ట్ ఆసుపత్రికి తీసుకెళ్లి డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారు. హెబ్బాళ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఉదయం నాలుగున్నరకల్లా సురేంద్రబాబు రెడ్డిపల్లి ఫామ్ హౌస్ కి హేమశ్రీ శవాన్ని తీసుకొచ్చాడు. అంతా ప్లాన్ ప్రకారం జరిగింది. తప్పించుకునేందుకు ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని ఎత్తులూ వేశారు. కానీ.. పోలీసులు హేమశ్రీ భర్త సురేంద్రబాబుకి మర్యాదలు చేసినప్పుడు నిజం కక్కేశాడు. మాజీ కార్పొరేటర్ మురళికికూడా అందాల్సిన ట్రీట్ మెంట్ అందేసరికి నిజాలు గడగడా బైటికొచ్చాయ్. బెంగళూరులో సురేంద్రబాబుపై పాతిక్కిపైగా కేసులున్నట్టు తెలుస్తోంది.

వాణి, వీణ తలలు విభజింపబడి వందేళ్లు వర్ధిల్లాలి

  (ఆపరేషన్ చేసి విడదీయండి లేదామెర్సీ కిల్లింగ్ కి అనుమతించండి అంటూ వాణివీణ తల్లి దండ్రులు ప్రభుత్వానికి పెట్టిన అర్జీ కి స్పందిస్తూ). ఎక్కడ అవిభక్తల శస్త్ర చికిత్స జరిగినా మనకు వెంటనే గుర్తు వచ్చే వాణి వీణ సోమవారం పదవ ఏట అడుగుపెట్టారు. వీరు మామూలు పిల్లల్లా నడువ లేరు, కూర్చోలేరు, పడుకోలేరు. కారణం అంగవైకల్యం కాదు వారి తలలు పుట్టుకతో కలసి ఉండటం వల్ల. వీరు పుట్టిన దగ్గరనుండి వీరికి హాస్ఫటలే లోకం. పేషంట్లు, డాక్టర్లు, నర్సులు, తప్ప మరోలోకం తెలియదు. మామూలు పిల్లల ప్రపంచం వీరి కసలు తెలియదు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. వరంగల్ లో ఉన్న చిన్న గ్రామం. దాంతో వారు వీరిని కనిపెట్టుకొని చూడటం కుదరదని హాస్పిటల్లోనే ఉంచారు.మొదట గుంటూరు మెడికల్ కాలేజీ అనుబంధంగా ఉండే హాస్పటల్ లో వీరు ఉండేవారు. తర్వాత హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రికి మార్చబడ్డారు. అదే హాస్పిటల్ చివరిలో ఉండే 18 చదదరపు మీటర్ల గదిలో వీరిద్దరూ షిప్టులువారీగా చూసే ముగ్గురు ఆయాలతో సంతోషంగానే ఉంటున్నారు. వీరికి తెలుగు, హిందీ, లెక్కలు, ఇంగ్లీషు చదవటం రాయడం నేర్చుకుంటున్నారు. వాణి ఇంజనీరింగ్ చదవాలనుకుంటుంది. అయితే వీణ మాత్రం డాక్టరు తను కావాలని అంటుంది. ప్రస్తుతానకి డాక్టర్ నరేంద్రకుమార్ వీరి ఖర్చులను భరిస్తున్నారు. చిన్నతనంలో వీరికి ఆపరేషన్ చేయటానికి సంసిధ్దత వ్యక్తం చేసిన అచార్యనాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ నాయుడమ్మకి అవిభక్త కవలలను ఆపరేషన్ చేసి విడదీయటంలో నైపుణ్యం వుంది. అయితే తలలు కలిసి ఉన్న వారు వారి ఆపరేషన్లలో లేదని ప్రభుత్వం ఆయన ప్రతిపాదనను త్రోసి పుచ్చింది. ఆతరువాత డాక్టర్ ఎన్ సికె రెడ్డి వారిని నీలోఫర్ హాస్పిటల్ చేర్చి వారికి ఆపరేషన్ కు కేస్ స్టడీ చేసే లోపే వారు ట్రాన్స్ ఫర్ అయ్యారు. చాలా మంది విదేశీ డాక్టర్లు వైద్యం సాయం అందించడానికి ముందుకొచ్చారు అయినా ఏ ప్రయత్నం ముందుకు సాగలేదు. ఇంకా వారు నరక యాతన అనుభవిస్తూనే ఉన్నారు. అందరూ పిల్లలానే వీరి తెలివితేటలు ఆటపాటలు బాగానే ఉన్నా మెదడుకు చెందిన ఒక రక్త నాళం ఇద్దరికీ కలిసే ఉండటంతో వారి మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. దీనివల్ల ఎవరో ఒకరు లేదా ఇద్దరికీ ప్రాణాపాయం వుంటుందని వైద్యులు చెబుతున్నారు. అమెరికన్ డాక్టర్ డేవిడ్ ఆయన చెబుతున్న ప్రకారం ఇద్దరికీ కలసి ఒకటే రక్తం నాళం తలలో ఉండటం వల్ల చిన్న చిన్నగా సంవత్సరం పాటు ఈ పిల్లలిద్దరికీ ఆపరేషన్ చేయడం వల్ల కొత్తగా మరో రక్తనాళాన్ని అభివద్ది చెందిచవచ్చునని తద్వారా ఇద్దరినీ అపాయం నుండి తప్పించవచ్చునంటున్నారు. నీలోఫర్ డాక్టర్లలలో చాలా మంది మన దగ్గర అత్యాధునిక పరికరాలేవీ అందుబాటులో లేనందువల్ల వీరికి ప్రమాదం ఉంటుందంటున్నారు. అయితే ఎన్సికె రెడ్డి మాత్రం తన సహచరులతో కలసి ఆపరేషన్ కు సిద్దంగా ఉన్నానని అయితే సంబందిత మంత్రి, సీ ఎం అందుకు ఆమోదించ వలసి ఉందని తెలిపారు. వీరికి మంచి జీవితం ఇవ్వాలనే సంకల్ఫ సిద్ది ఉంటే దేవుని ఆశీస్సులు కూడా ఉంటాయి. దాంతో వీరిద్దరూ మామూలు ఫిల్లలకు మాదిరిగానే ఛదువుకోవచ్చు, మిగతా పిల్లలతో ఆడుకోనూ వచ్చు, అందుకే వాణి వీణ వందేళ్లు వర్దిల్లాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. నేర్పరితనం, అనుభవం ఉన్న డాక్టర్లు ఈ ఆపరేషన్ను విజయవంతం చేయడం ద్వారా మరో వెయ్యేళ్లు భావితరాలకు దారిచూపుతూ మెడికల్ హిస్టరీలో నిలిచిపోవాలని కోరుకుంటూ తెలుగువన్.కం    

జీవవైవిధ్య పరిరక్షణకు అందరు కృషి చేయాలి: ప్రధాని

  ప్రధాన మంత్రి డాక్టర్ మన్‌మోహన్ సింగ్ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రధానికి గవర్నర్ దంపతులు స్వాగతం పలికారు. అలాగే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పి.సి.సి. అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు మంత్రులు, ఇంకా డి.జి.పి. కూడా విమానాశ్ర యంలో ప్రధానికి స్వాగతం పలికారు. ప్రధాని జీవ వైవిధ్య సదస్సుకు హాజరు కావడానికి అధికారులు ముందుగానే హెలికాప్టర్‌ను, కాన్వాయ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి ఆయన నేరుగా హెచ్‌ఐసిసి సదస్సుకు వెళ్లారు. జీవ వైవిధ్య ప్రాధాన్యతను ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయని చెప్పారు. పర్యావరణ ఇబ్బందులపై ప్రజల్లో అవగాహన క్రమంగా ఏర్పడుతోందన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణకు అందరూ కృషి చేయాలని మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు. ఇందు కోసం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఉద్యమించాలన్నారు. జీవ వైవిధ్యంపై పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోలేక పోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2010 లక్ష్యాలను చేరుకోలేక పోయామన్నారు. ప్రకృతి నుండి కనుమరుగు అవుతున్న జంతువులను పరిరక్షించాల్సిన బాధ్యత మనపైన ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పర్యావరణమే ముఖ్యమన్నారు. ఆయుర్వేద విజ్ఞానాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వన్యప్రాణుల రక్షణ కోసం చట్టాలని కఠినతరం చేశామని చెప్పారు. సాంప్రదాయ పంటలను కాపాడుకోవాలన్నారు. ఆహార భద్రత ప్రపంచానికి పెను సవాల్‌గా మారిందన్నారు.

ఆరునెలల్లో మన్మోహన్ సర్కారు పతనం : మమత జోస్యం

  కేంద్రంలో మన్మోహన్ సర్కారు ఆరునెలల్లోపే పతనమౌతుందని తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ జోస్యం చెప్పారు. వెంటిలేటర్ మీదున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ కాపాడలేరని ఆమె విమర్శించారు. యూపీఏ పూర్తిగా బ్రెయిన్ పనిచేయని స్థితిలో మంచమెక్కిందంటూ నిప్పులు చెరిగారు మమతాబెనర్జీ. మరోవైపు రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల్ని అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఫెమా చట్టంలోని నిబంధనల్ని సరిచేయడంవల్లే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం రిజర్వ్ బ్యాంక్ కి సూచించింది.

నేపాల్ విద్యార్ధినిపై సామూహిక అత్యాచారం

  బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియాలో ఓ విద్యార్దినిపై సామూహిక అత్యాచారం జరిగింది. 800 ఎకరాల జ్ఞానభారతి క్యాంపస్ లో ఈ దారుణం జరిగింది. శనివారం రాత్రి తన ప్రియుడితో కలిసి కారులో క్యాంపస్ నుంచి వెళ్తున్న అమ్మాయిపై ఎనిమిదిమంది వ్యక్తులు దాడి చేశారు. ప్రియుణ్ణి తరిమికొట్టి ప్రియురాలిని దట్టమైన అడవిలోకి లాక్కెళ్లి అత్యాచారం జరిపారు. క్యాంపస్ లో బీట్ కానిస్టేబుల్ కి సమాచారం అందించిన ఆమె ప్రియుడు తమని దుండగులు అడ్డగించిన ప్రదేశానికెళ్లి చూస్తే విద్యార్ధిని కనిపించలేదు. తెల్లవారుజామున దుండగులు ఆమెని ఓ హాస్టల్ సమీపంలో పడేసి వెళ్లిపోయారు. సెల్ ఫోన్ లో ప్రియుడికి ఆమె సమాచారం అందించిన తర్వాత అక్కడికి చేరుకుని ఆగమేఘాలమీద ఆసుపత్రికి తరలించి భాధితురాలికి వైద్య పరీక్షలు చేయించారు.

నచ్చితే నేరుగా కావలించుకోవచ్చు

  నచ్చిన దాన్ని మెచ్చుకోవడం చాలామందికి అలవాటు.. అందమైనదాన్ని దగ్గరికి తీసుకుని కౌగిలించుకోవాలన్న వేడిపుట్టడంలోనూ తప్పులేదు.. అది ఇతరులకు ఇబ్బంది కలగనంతవరకూ.. ఈ క్లాజ్ ని వ్యక్తిగత స్పర్శకు వర్తింపజేయడానికి సోషల్ లైఫ్ లో చాలా పరిమితులుంటాయ్. కానీ.. అనుకున్నదే తడవుగా ముద్దొచ్చినదాన్ని గట్టిగా హత్తుకోవాలన్న కలను నిజంచేసుకోవడానికి ఇప్పుడు సరికొత్త మార్గాలు అందుబాటులోకొచ్చాయ్. మామూలుగా ఫేస్ బుక్ లో నచ్చిన కామెంట్ కి లైక్ పోస్ట్ ఇవ్వడం చాలాకాలంనుంచి వస్తున్న లేటెస్ట్ ఆచారం. అలా నచ్చినవాళ్లని మెచ్చుకుని గట్టిగా కౌగిలించుకోవలనుకున్నప్పుడు ఆవతలివాళ్లు ఎక్కడున్నా ఆ బిగి కౌగిలిని అందుకోగలిగే ఛాన్స్ ఇప్పుడు అందుబాటులోకొచ్చేసింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన బిగి కౌగిలి జాకెట్ ని ధరిస్తే చాలు అవతలివాళ్లు నేరుగా కౌగిలించుకున్న ఫీలింగ్ కలుగుతుందట. జాకెట్ లో ఉన్న గాలి తిత్తులు ఉబ్బి కావలించుకున్న ఫీలింగ్ వచ్చేస్తుందట. మళ్లీ గట్టిగా జాకెట్ ని కావలించుకుంటే అవతలివాళ్లకు ఆ సిగ్నల్ వెళ్లిపోయి అక్కడకూడా సేమ్ ఫీలింగ్. సెల్ ఫోన్ ద్వారా పనిచేసే ఈ కొత్త జాకెట్ పుణ్యమా.. అని నచ్చినవాళ్లను ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడపడితే అక్కడ కౌగిలించుకోగలిగే అవకాశం రావడం నిజంగా అదృష్టం కదూ.. కాకపోతే ఈ ఫెసిలిటీని గట్టిగా... వినియోగించుకోవడానికి ఫేస్ బుక్ అకౌంట్ తప్పని సరిగా ఉండాలి మరి..

గెజిటెడ్ అధికారి ఉద్యోగాలిచ్చినా చేరలేదు

ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. ఉద్యోగం దొరకాలంటే పైసలు పెట్టాల్సిందే ఈ మాటలు మనం రోజు వినేవే. దీనికి పూర్తి భిన్నంగా పిలిచి గెజిటెడ్ అధికారి ఉద్యోగాలిస్తే అక్షరాల 135 మంది ఉద్యోగం వద్దని, అసలు ఆ ఉద్యోగంలో చేరడానికే రాలేదు. రాష్ట్రంలోమండల వ్యవసాయ అధికారి నియామక పత్రాలు పంపితే మొత్తం 135 మంది చేరకపోవడంతో వ్యవసాయశాఖ బిత్తరపోయింది. వారి కోసం రెండు నెలలు ఎదురుచూసి ఇక మళ్ళీ నియామకాలు చేపట్టడానికి ప్రతిపాదనలు సిద్ధంచేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఇంకా 200 ఏఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మూడు నెలల క్రితం 474 పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చారు. వాటిలో సాంకేతిక కారణాల వల్ల 12 పోస్టులు ని౦పడం సాధ్యం కాక పక్కన పెట్టారు. మిగతా 462 పోస్టులకు అర్హుల నుంచి 327 దరఖాస్తులు రావడంతో వారికి నియామక పత్రాలను వ్యవసాయ కమిషనర్ కార్యాలయం పంపింది. ఉద్యోగంలో చేరడానికి నెల రోజులు గడువు ఇస్తే 135 మంది రెండు నెలలైనా రాలేదు. వీటి భర్తీకి అనుమతించాలంటు మళ్ళీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడానికి వ్యవసాయ కమిషనర్ కార్యాలయం సిద్ధమవుతుంది.      

మైనారిటీ కార్పొరేషన్ లో మరో భాగోతం

    రాష్ట్ర మైనారిటి నిధుల గోల్ మాల్ వ్యవహారంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. నకిలీ ఖాతాలలో ప్రైవేటు వ్యక్తులు రూ.55.47 కోట్లు కొట్టేయగా మరో రూ.132 కోట్లు 18 బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా ఉన్నట్లు మైనారిటీ సంక్షేమ ఉన్నతాధికారుల పరిశీలనలో బయటపడింది. వీటిలో రూ 128 కోట్లకు సంబంధించి పూర్తి వివరాలు లభ్యమయ్యాయి. మరో నాలుగు కోట్లకు సంబంధించి పూర్తి వివరాలు బయట పడకపోవడంతో అవి ఎక్కడున్నాయనే విషయంలో అనుమానం వ్యక్తం అవుతుంది. కార్పొరేషన్ ఎండీగా ఉన్న ఇలియాస్ రిజ్వీ ఈస్థాయిలో ఎఫ్‌డీలు వేస్తున్నా సర్కారుకు సమాచారం లేకపోవడం గమనార్హం. మైనారిటీ సంక్షేమ శాఖలో బోధనా ఫీజుల విడుదలపై సాంఘిక, బీసీ సంక్షేమశాఖ అధికారులతో కూడిన టీమ్‌ల విచారణ వేగం పుంజుకుంది. సోమవారం హైదరాబాద్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు కాలేజీల్లో పరిశీలన జరిపినట్లు తెలిసింది. బోధనా ఫీజులు ఎక్కువగా మంజూరైన కాలేజీల్లోనే అధికారులు విచారణ జరుపుతున్నారు.

వాద్రాపై విచారణ జరిపిన అధికారిపై బదీలి వేటు

  రాబర్ట్‌ వాద్రా, డీఎల్ఎఫ్ మధ్య హర్యానాలో కుదిరిన ఒప్పందంపై విచారణకు ఆదేశించిన ఐఏఎస్ అధికారి అశోక్‌ ఖేమ్కాపై వేటు పడింది. హుడా ప్రభుత్వం ఆయనను బదిలీ చేసింది. రాబర్ట్‌ వాద్రా, డీఎల్ఎఫ్ ఒప్పందంపై రిజిస్ట్రేషన్‌ ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌ అయిన ఖేమ్కా విచారణకు ఆదేశించారు. గుర్గావ్‌, ఫరీదాబాద్‌, పల్వాల్‌, మెవాత్‌ జిల్లాల్లో 2005 నుంచి అక్టోబర్‌ 12 వరకూ రాబర్ట్‌ వాద్రా పేరుపైన వచ్చిన పత్రాలన్నింటినీ పరిశీలించాలని అధికారులను కోరారు. అదే సమయంలో వాద్రాకు చెందిన స్కైలైట్‌ హాస్పిటాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, డీఎల్ఎఫ్కు మధ్య కుదిరిన ఒప్పందంలో అవకతవకలున్నాయనే నేపధ్యంలో డీల్‌ను రద్దు చేశారు. అవకతవకలపై విచారణకు ఆదేశించడమే ఆయన చేసిన తప్పన్నట్లుగా ఖేమ్కాను ట్రాన్స్‌ఫర్‌ చేయడంపై బిజెపి సహా ప్రతిపక్షాలు హుడా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. అవకతవకల నిగ్గు తేల్చడానికే ఆదేశించానని ఖేమ్కా తెలిపారు. మిగతా విషయాలను కోర్టులు తేల్చాలని అన్నారు.

బాబ్లీనీ కూల్చేయాల్సిందే

మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టును తొలగించి తీరాల్సిందేనని అఖిలపక్ష నేతలు అభిప్రాయపడ్డారు. బాబ్లీ వివాదంపై సోమవారం భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అనీల్, తెదేపా నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, మండవ వెంకటేశ్వర రావు, రమణ, టీఆర్ఎస్ నేతలు వినోద్ కుమార్, విద్యాసాగర రావు, సీపీఐ నాయకుడు చాడ వెంకట రెడ్డి హాజరయ్యారు. బాబ్లీ ప్రాజెక్టు కొనసాగితే తెలంగాణలోని పలు జిల్లాలు ఎడారిగా మారుతాయని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బాబ్లీతో పాటు మరో 13 మినీ ప్రాజెక్టుల పైన కూడా దృష్టి సారించాలని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడవద్దని ఏకగ్రీవ అభిప్రాయానికి వచ్చారు. మంగళవారం సుప్రీం కోర్టులో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇరు రాష్ట్రాల న్యాయవాదులు తుది వాదనలు వినిపించనున్నారు.

ప్రధానికి తెలంగాణ వాదుల నిరసన

  ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న జీవ వైవిధ్య సదస్సుకు ప్రధాని మన్మోహన్ సింగ్ వస్తున్నారు. హైదరబాద్ భద్రతా వలయంలో ఉంది. సదస్సు జరుగుతున్న మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ప్రధాని పర్యటన కోసం భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎస్పీజీ కమాండోలు రెండు రోజుల క్రితమే హైదరాబాద్ చేరుకొని కీలక ప్రాంతాల్లో మోహరించారు. ప్రధాని మన్మోహన్ సింగ్ మధ్యాహ్నం 2:45 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో 3:20కి హెచ్ఐసీసీకి చేరుకొని జీవ వైవిధ్య సదస్సులో పాల్గొంటారు. హెచ్ఐసీసీ నుంచి రోడ్డు మార్గంలో 4:05కు జీవ వైవిధ్య పార్కులో నెలకొల్పిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. తెలంగాణాపై ప్రతికూల వైఖరికి నిరసనగా ప్రధాని హైదరాబాద్ పర్యటనలో తీవ్ర స్థాయిలో నిరసన తెలపాలని తెలంగాణవాదులు బావిస్తున్నారు, తెలంగాణ జెఎసి అధ్వర్యంలో ఇందిరాపార్క్ దగ్గర ఆందోళనలు జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నల్ల బెలూన్లను పెద్ద ఎత్తున గాల్లోకి ఎగరేసి నిరసన తెలపాలని టీ జెఎసి నిర్ణయించింది.

మంత్రి శంకర్రావు కనిపించట్లేదు

గ్రీన్ ఫీల్డ్ భూముల ఆక్రమణ కేసులో ఆరోపణలెదుర్కుంటున్న మంత్రి శంకర్రావు కనిపించడంలేదు. ఈ కేసులో ఆయన్ని ప్రశ్నించేందుకు హైదరాబాద్ నేరేడ్ మెట్ పోలీసులు ముషీరాబాద్ లో ఉన్న శంకర్రావు ఇంటికెళ్లేసరికే ఆయన ఇంటినుంచి మాయమయ్యారు. సెల్ ఫోన్ లో సంబాషణలు జరిపేందుకు పోలీసులు గట్టిగా ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. శంకర్రావుమాత్రం లేటుగా తన కుటుంబసభ్యులతో ఫోన్ లో మాట్లాడారు. తాను షిరిడీకి దగ్గర్లోఉన్న శనిసింగణాపూర్ లో పూజలు జరిపిస్తున్నానని దర్శనం పూర్తయ్యాక తిరిగి హైదరాబాద్ కొస్తానని చెప్పినట్టు సమాచారం. శంకర్రావు ఎమ్మెల్యే కనక, మాజీ మంత్రి కనక ఆయన పరారయ్యే అవకాశం ఉండకపోవచ్చని, తిరిగి ఆయన హైదరాబాద్ కి రాగానే గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంలో ప్రశ్నించి వివరాలు రాబడతామని పోలీసులు చెబుతున్నారు. 

లైంగిక వేధింపుల కేసులో రాణిముఖర్జీ బ్రదర్ అరెస్ట్

  బాలీవుడ్ ప్రముఖ నటి రాణి ముఖర్జీ సోదరుడు రాజా ముఖర్జీ అరెస్టయ్యారు. ఓ టీవీ నటిని లైంగికంగా వేధించిన కేసులో ముంబై పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం ఓ టీవీ నటి రాజా ముఖర్జీకి స్క్రిప్టు చెప్పడానికి వచ్చిందని, కారులో వెలుతూ స్క్రిప్టు విందామని చెప్పిన రాజా ముఖర్జీ ఆమెను లైంగికంగా వేధించాడని సదరు టీవీ నటి ఫిర్యాదు చేసింది. టీవీ నటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని రాజాని అరెస్ట్ చేశారు. రాజా ముఖర్జీ టీవీ కార్యక్రమాల నిర్మాత. పలు సీరియళ్లకు నిర్మించిన రాజా, ఇటీవలే టీవీ సీరియల్ దర్శకత్వంలోకి అడుగు పెట్టారు.

వైఎస్ షర్మిల పాదయాత్ర రూట్ మ్యాప్

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో షర్మిల పాదయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ ను ప్రకటించారు. ఈ నెల 18వ తేదీన ఇడుపులపాయ నుంచి ఫర్మిల పాదయాత్రను ప్రారంభిస్తారు. అదే రోజు ఇడుపులపాయలో భారీ బహిరంగ సభ ఉంటుంది. ప్రతి రోజు ఆమె 18 కిలోమీటర్ల మేర సాగిస్తారు. ఆ రకంగా ఆమె పాదయాత్ర ఆరు నెలలు అవిశ్రాంతంగా సాగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆమె పాదయాత్ర ముగుస్తుంది. తొలి ఐదు రోజుల షెడ్యూలును పార్టీ కార్యాలయం ప్రకటించింది. తొలు రోజు ఉదయం 11 గంటలకు బహిరంగ సభ అనంతరం షర్మిల వీరన్నగట్టుపల్లె, కుమ్మరాంపల్లె, వేంపల్లె నుంచి నాలుగు రోడ్ల కూడలి, రాజీవ్ నగర్ కాలనీ వరకు పాదయాత్ర చేస్తారు. రెండో రోజు రాజీవ్‌నగర్ కాలనీ నుంచి నందిపల్లె, తాళ్లపల్లె, దుగ్గన్న పల్లె, అమ్మయ్యగారి పల్లె, చాగలేరు క్రాస్, వి కొత్తపల్లె, గొందిపల్లె క్రాస్, వేముల, భూమయ్యగారి పల్లె క్రాస్ వరకూ వెళతారు. మూడో రోజు అక్కడి నుంచి వేల్పుల, బెస్తవారిపల్లె, పులివెందుల ఆర్టీసీ బస్టాండ్, పూల అంగళ్ల మీదుగా పార్నపల్లె రోడ్డు, రింగురోడ్డు సర్కిల్ నుంచి వైయస్సార్ గృహానికి వెళతారు. నాలుగో రోజు పులివెందుల రింగ్‌రోడ్డు నుంచి చిన్న రంగాపురం, ఇప్పట్ల, చిన్న కుడాల క్రాస్, పెద్ద కుడాల క్రాస్, లింగాల, లోపట్నూతల క్రాస్ వరకూ పాదయాత్ర చేస్తారు. ఐదో రోజున కర్ణపాపయ్య పల్లె, వెలిదండ్ల, నేర్జాంపల్లె, పార్నపల్లె వరకూ యాత్ర కొనసాగుతుంది. ఆ తరువాతి యాత్ర వివరాలు తదుపరి వెల్లడిస్తారు.

బొగ్గు కుంభకోణంలో దూకుడు పెంచిన సిబిఐ

బొగ్గు కుంభకోణంలో సిబిఐ దూకుడు పెంచింది. బొగ్గు కుంభకోణం వ్యవహారంలో మరో రెండు కేసులను నమోదు చేసింది. సిబిఐ ఆరు ప్రధాన నగరాలలో 16 ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ సహా విశాఖపట్నం, సాత్నా, జైపూర్, న్యూఢిల్లీ, రూర్కేలా నగరాలలోని పదహారు ప్రాంతాలలో సిబిఐ ఏకకాలంలో సోదాలు చేస్తోంది. హైదరాబాద్ వెంగళరావునగర్‌లో ఉన్న గ్రీన్ ఇన్‌ఫ్రా, రాణిగంజ్‌లోని కమలేష్ స్టీల్స్‌లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫోర్జరీ, చీటింగ్‌తో పాటు నికర ఆస్తుల విలువను ఎక్కువగా చూపి బొగ్గు గనులు కాజేశారని కమలేష్ స్టీల్స్, గ్రీన్ ఇన్‌ఫ్రాలపై ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు కంపెనీలే కాకుండా దేశవ్యాప్తంగా చాలా కంపెనీలపై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి.