కుప్పం నుంచి పోటి అంటే కష్టం: నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ నేతగా క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన నారా చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే చర్చలు పాదయాత్రతో పాటు మొదలైనాయి. పాదయాత్రలో కొందరు కుప్పం నుంచి పోటీ చేస్తారా అని ప్రశ్నించగా, కుప్పం ప్రజలకు చంద్రబాబు దేవుడు అని, అక్కడి నుండి తాను పోటీ చేస్తే కుప్పం ప్రజలు ఒప్పుకోరని చెప్పారు. ఆయన రాజకీయాల గురించి పలు విషయాలను మీడియాతో చర్చించారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని నాశనం చేసిందని, ఇపుడు రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం వైపు చూస్తున్నారని అన్నారు. నేనెప్పుడూ రాజకీయాల నుంచి వేరు కాలేదని, 1995 నుంచే పార్టీ కోసం పని చేస్తున్నానని అన్నారు. 1999 నుంచి క్రియాశీలక రాజకీయాల్లోనే ఉన్నానన్నారు. తన తండ్రి పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఇరువురు పాల్గొంటారన్నారు. రాష్ట్రంలో ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయని, వాటిని చెప్పుకునేందుకు బాబు కోసం రాత్రి రెండు గంటల వరకు ప్రజలు వేచి చూస్తున్నారన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రజల విశ్వాసం పూర్తిగా కోల్పోయిందని వ్యాఖ్యానించారు. పాదయాత్ర జయప్రదం అవుతుందని ఆయన అన్నారు.