లక్ష్యంమంచిదే!
posted on Oct 9, 2012 @ 12:01PM
మురికి కూపాలుగా... రోగాలకు నిలయాలుగా మారుతున్న నగరాలను క్లీన్‌సిటీస్‌గా మార్చేందుకు దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ క్లీన్‌సిటీ ఛాంపియన్ షిప్ పోటీలకు శ్రీకారం చుట్టింది. మహానగరాలనుండి చిన్న పట్టణాలవరకు చెత్తకు నివాసాలుగా మారిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం ముదావహం. డోర్ టూ డంపింగ్ యార్డు’ పేరుతో ఈ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తోంది. ఈ పోటీలకు వేదిక వరంగల్ జిల్లా. 10నుండి 17వ తేదీ వరకు హైదరాబాద్ మినహా అన్ని తెలంగాణా జిల్లాలలోని 65 మున్సిపాలిటీలు, ఐదు కార్పొరేషన్ల నుండి సుమారుగా వెయ్యిమంది ఈ ఛాంపియన్ షిప్‌కు హాజరవుతున్నారు. రోడ్డుపై చెత్తవేయకుండా నేరుగా డంపింగ్‌యార్డులోకి తరలించడమే ఈ పోటీల ముఖ్యఉద్దేశ్యం. నిజంగా ఇది అభినందించదగ్గ విషయం. రోగాలకు రెండొంతులు కారణం ఈ చెత్తే అని చెప్పుకోవాలి. మున్సిపల్ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిద్దాం. ఇటువంటి కార్యక్రమాలపై పేరున్న కళాకారులు, పెద్దలు తమ వంతుగా దీన్ని మరింతగా ప్రజల్లోకి వెళ్లేలా చేయగలిగితే ప్రజల్లో తప్పకుండా అవగాహన కలుగుతుంది. దీనికి తోడు మున్సిపల్ శాఖ, రహదారులు వంటి ఇతర శాఖలు కూడా చేయికలిపి విజయవంతం చేయాలని ఆశిద్దాం. కేవలం పోటీలలో పాల్గొనటమే కాకుండా ఒక సంఘంగా కాలనీల పరంగా ఏర్పాటై.. ఆయా కాలనీలలో రోడ్లపై చెత్తలేకుండా...చూడగలిగితే... ఈ కార్యక్రమం ఎంచుకున్న లక్ష్యం నెరవేరినట్లేనని ప్రకృతి ప్రేమికుల ఉవాచ.