పరిటాల శ్రీరామ్ ఎంట్రీకి చంద్రబాబు బాబు గ్రీన్‌ సిగ్నల్‌

    అనంతపురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలో అతిపెద్ద గుర్తింపును అందుకున్నది. రాష్ట్రంలో ఎక్కడ విభేదాలు భగ్గుమన్నా దాని వెనుక ఎవరు ఉన్నారు అన్న ప్రశ్న లేచిందో ఈ నియోజకవర్గ నేతను గుర్తు చేసుకునేవారు. దివంగత ఎమ్మెల్యే పరిటాల రవి పేరు రాష్ట్రంలో తెలియని వారు ఉండరు. గొడవలు, అల్లర్లు అన్నింటినీ నియంత్రించగలిగిన నేతగా ఈయన ఎదిగిన తీరు రామ్‌గోపాల్‌వర్మ వంటి ప్రముఖ దర్శకుడు, నిర్మాత చిత్రీకరించాక ఈ నియోజకవర్గం పేరు ఇంకా పాపులర్‌ అయింది. ఈ పాపులార్టీని రవి వ్యతిరేక గ్రూపు కూడా సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించింది. అయితే పరిటాల రవి కుటుంబమే ఆ ఫేమ్‌ నిలబెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏళ్లు గడిచేకొద్ది మార్పులు సహజం కాబట్టి పరిటాల రవి హత్యానంతరం సునీత ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రవి పెద్దకుమారుడు పరిటాల శ్రీరామ్‌ తాజా ఆకర్షణ అయ్యారు. ఈయనే భవిష్యత్తు ఎమ్మెల్యే అని పరిటాల అభిమానులు భావిస్తున్నారు. పైగా పరిటాల కుటుంబం ఏర్పాటు చేసిన ట్రస్టులో కీలకమైన బాధ్యతలు శ్రీరామ్‌ ఇటీవలే చేపట్టారు. దీంతో రవి అభిమానులు తమ ఆశ నెరవేరే సమయం వచ్చేసిందని భావిస్తున్నారు. అయితే, తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ రాజకీయాల్లోకి వస్తాడని, 2014 ఎన్నికల్లో మాత్రం పోటీలో ఉండడని తల్లి, ఎమ్మెల్యే పరిటాల సునీత వెల్లడిరచారు. సునీత ఈ ప్రకటన చేయటం ద్వారా అభిమానులు ఎంత వరకూ తన కుమారుడు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారో అంచనా వేసుకునేందుకు అవకాశం తీసుకున్నారు. ఇప్పటికే ట్రస్టు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గంటూ క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్న శ్రీరామ్‌ తాజాగా తల్లితో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీకోసం వస్తున్నా పాదయాత్రకు హాజరయ్యారు. దీంతో అభిమానులు ఉండబట్టలేక చంద్రబాబును శ్రీరామ్‌తో మాట్లాడిరచమని అభిమానులు కోరారు. దీనికి సునీత నవ్వుతూ దానికి ఇప్పుడు కాదు అన్నారు. అంటే సునీత ముందుగా శ్రీరామ్‌కు రాజకీయానుభవం తెలియజేశాక కానీ, రంగంలో దించకూడదని ఆలోచించి ఉండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే వెంటనే శ్రీరామ్‌ను దించేస్తానని గతంలో రవి అభిమానులకు సునీత మాట ఇచ్చారు. చంద్రబాబు కూడా పాదయాత్ర సమయంలో తెలివిగా త్వరలో శ్రీరామ్‌ క్రియాశీలకంగా వ్యవహరిస్తారని అభిమానులకు భరోసా ఇచ్చారు. అంటే చంద్రబాబు, సునీత ఇద్దరూ కూడా శ్రీరామ్‌కు రాజకీయ అవగాహన పెంచేందుకు నిర్ణయించుకున్నారని అభిమానులు భావిస్తున్నారు. అయితే సునీత వైఖరి ఊరించేదిలా ఉందని అభిమానులు అంటున్నారు. ఇలా ఊరించి ఊరించి ఒక్కసారిగా రంగంలోకి దించితే గెలుపు ఖాయం అవుతుందని సునీత, చంద్రబాబు భావిస్తున్నారేమో? అయి ఉండొచ్చు కదా!

7వ నందిని అందుకోబోతున్న మహేష్ బాబు

  నంది అవార్డుల ప్రకటన తెలుగు చిత్ర పరిశ్రమలో సంబరాలకు తెరలేపింది. అన్ని పోటీలను తట్టుకుని నందిని గెలుచుకున్న నటులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక హీరో మహేష్ బాబు, నటుడు ప్రకాష్ రాజ్ లు మరీ మరీ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ప్రకాష్ రాజ్ అందుకుంటున్నది 9వ నంది అవార్డు అయితే, హీరో మహేష్ బాబు అందుకుంటున్నది ఏడవ నంది అవార్డు కావడం విశేషం. ఇంతకు ముందు నిజం, అతడు పాత్రలకు ఉత్తమ నటుడి అవార్డులతో పాటు, పలు చిత్రాలకు స్పెషల్ జ్యూరి అవార్డులు గెలుచుకున్నాడు. అసలు ఉత్తమ నటుడి అవార్డుకు హీరోలు నాగార్జున, బాలకృష్ణలతో పోటీ పడి ప్రిన్స్ అవార్డు కొట్టేశాడు. రాజన్న సినిమాలో నాగార్జున, శ్రీరామరాజ్యం సినిమాలో బాలకృష్ణ ల పాత్రల నిడివి తక్కువగా ఉండడం, ఆ చిత్రంలోని మిగతా పాత్రల పరిధి ఎక్కువగా ఉండడం మహేష్ బాబు కు ప్లస్ పాయింట్ గా మారింది. దీంతో ఆయనను ఉత్తమ నటుడిగా అవార్డు కమిటీ ఏకగ్రీవంగా ఎంపికచేసింది.

ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసిన లయన్స్

    ఛాంపియన్స్ లీగ్‌లో లయన్స్ చేతిలో ముంబై ఇండియన్స్ చిత్తుగా ఓడిపోయింది. ముంబై ఇండియన్స్ పై లయన్స్ ఎనిమిది వికెట్లతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ముంబయి ఓపెనర్లు స్మిత్, సచిన్ శుభారంభం అందించారు. మాస్టర్ ఆచితూచి ఆడగా, స్మిత్ ఫోర్లతో విజృంభించాడు. దీంతో నాలుగు ఓవర్లలో 35 పరుగులు వచ్చాయి. ఆ మరుసటి ఓవర్లో స్మిత్ అవుటవడంతో ముంబయి జోరు కాస్త తగ్గింది. మిచెల్ జాన్సన్ 29 బంతుల్లో 4 ఫోర్లతో 30, రోహిత్ శర్మ 27 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 27, డ్వెన్ స్మిత్ 19 బంతుల్లో 6 ఫోర్లతో 26, దినేశ్ కార్తీక్ 9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 19 నాటౌట్ రాణించారు. సచిన్ 16, పొలార్డ్ 11 పరుగులు చేశారు. చివరి ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన అంబటి రాయుడు 4 పరుగులు చేశాడు. టాపార్డర్ రాణించినా భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. 158 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన లయన్స్ మెకంజీ 41 బంతుల్లో 68, డి కాక్ 33 బంతుల్లో 51లు18.5 ఓవర్లలోనే విజయాన్ని అందించారు.

శంకర్‌రావు అరెస్ట్ కి రంగంలోకి దిగిన పోలీసులు

  మాజీ మంత్రి శంకర్‌రావును అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. శనివారం సాయంత్రం 4 గంటలకు సర్వసన్నాహాలతో ఆయన నివాసానికి వచ్చారు. అయితే అంతకుముందే శంకర్‌రావు ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయారు. పోలీసులు ఆయన నివాసంలో అణువణువూ తనిఖీ చేసి రిక్తహస్తాలతో వెనుదిరిగారు. రంగారెడ్డి జిల్లా అల్వాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఖానాజీగూడలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ భూముల వివాదంలో శంకర్‌రావు, ఆయన సోదరుడితోపాటు పలువురిపై కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టు కాకుండా శంకర్‌రావు తెచ్చుకున్న స్టేను హైకోర్టు ఎత్తివేసింది. దీంతోఅల్వాల్ ఏసీపీ గణేష్ ఆధ్వర్యంలో పోలీసులు శంకర్‌రావును అరెస్టు చేసేందుకు ఆయన నివాసానికి వచ్చి వెతికినా కనిపించలేదు. ఆయన ఎక్కడికి వెళ్లారో తెలియదని, తమకు చెప్పలేదని శంకర్‌రావు భార్య పోలీసులకు చెప్పారు.

నంది అవార్డుల్లో దూసుకెళ్తున్న మహేష్ బాబు

  నంది అవార్డుల ప్రకటన తెలుగు చిత్ర పరిశ్రమలో సంబరాలకు తెరలేపింది. అన్ని పోటీలను తట్టుకుని నందిని గెలుచుకున్న నటులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక హీరో మహేష్ బాబు, నటుడు ప్రకాష్ రాజ్ లు మరీ మరీ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ప్రకాష్ రాజ్ అందుకుంటున్నది 9వ నంది అవార్డు అయితే, హీరో మహేష్ బాబు అందుకుంటున్నది ఏడవ నంది అవార్డు కావడం విశేషం. ఇంతకు ముందు నిజం, అతడు పాత్రలకు ఉత్తమ నటుడి అవార్డులతో పాటు, పలు చిత్రాలకు స్పెషల్ జ్యూరి అవార్డులు గెలుచుకున్నాడు. అసలు ఉత్తమ నటుడి అవార్డుకు హీరోలు నాగార్జున, బాలకృష్ణలతో పోటీ పడి ప్రిన్స్ అవార్డు కొట్టేశాడు. రాజన్న సినిమాలో నాగార్జున, శ్రీరామరాజ్యం సినిమాలో బాలకృష్ణ ల పాత్రల నిడివి తక్కువగా ఉండడం, ఆ చిత్రంలోని మిగతా పాత్రల పరిధి ఎక్కువగా ఉండడం మహేష్ బాబు కు ప్లస్ పాయింట్ గా మారింది. దీంతో ఆయనను ఉత్తమ నటుడిగా అవార్డు కమిటీ ఏకగ్రీవంగా ఎంపికచేసింది.

కన్నడనటి హేమశ్రీ కేసులో వీడిన మిస్టరీ

  కన్నడనటి హేమశ్రీ మరణం మిస్టరీ విడిపోయింది. అనంతపురంలో కాంగ్రెస్ నేత మురళీ ఫాంహౌస్ లో ఆమెపై అత్యాచారం జరిపి హత్యచేశారని విచారణలో తేలింది. హేమశ్రీకి ఎక్కువ మోతాదులో మత్తుమందిచ్చి ఆమెపై అత్యాచారం చేయడంవల్ల చనిపోయిందని పోస్ట్ మార్టం నివేదిక తేల్చింది. స్పృహకోల్పోయిన మూడుగంటలతర్వాత ఆమెని ఆసుపత్రికి తరలించారని, అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్థారించారు. ఆత్యాచారానికీ, హత్యకీ పాల్పడ్డ నిందితులు పరారీలో ఉన్నారు. హేమశ్రీ భర్త సుధీంద్రతో కాంగ్రెస్ నేత మురళికి వ్యాపార లావాదేవీలున్నాయ్. చాలాకాలంగా హేమశ్రీపై కన్నేసిన మురళి ఓ పథకం ప్రకారం అత్యాచారం జరిపి, హత్యచేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. కిందటేడాదే సుధీంద్రతో హేమశ్రీకి పెళ్లయ్యింది. అంతకుముందే అతనికి పెళ్లైపోయినట్టు తెలియడంతో హేమశ్రీ గొడవకు దిగడంతో బంధువులు రాజీ కుదిర్చారు. అప్పట్నుంచీ ఇద్దరూ అనంతపురంలో కాపురం చేస్తున్నారు. హేమశ్రీని ఆమె భర్త సుధీంద్రే హతమార్చాడన్న వదంతులు బలంగా ప్రచారమయ్యాయి. భార్యని చావుబతుకుల్లో ఆసుపత్రిలో చేర్చిన సుధీంద్ర పోలీసులకు కీలకమైన సమాచారం అందించడంతో మిస్టరీ విడిపోయింది. పరారీలో ఉన్న నిందితులకోసం పోలీసులు పెద్దఎత్తున గాలిస్తున్నారు.

చంద్రబాబు ముందస్తు ఎన్నికల యాత్ర

  చంద్రబాబు పాదయాత్ర పల్లెలగుండా సాగుతోంది. ఎప్పుడూ సీరియస్ గా కనిపించే చంద్రబాబు చిరునవ్వుతో అందర్నీ పలకరిస్తున్నారు. ఎప్పుడూ విక్టరీ సింబల్ ని సూచించే రెండువేళ్లని చూపించే ఆయన ఇప్పుడు రెండు చేతులూ జోడించి నమ్రతగా తనని చూసేందుకొచ్చినవాళ్లకు నమస్కారం చేస్తున్నారు. చంద్రబాబులో చాలా మార్పు కనిపిస్తోంది. గ్రామీణుల్లో ఎనలేని అభిమానాన్ని సంపాదించుకునేందుకు ఆయన చాలా కసరత్తు చేస్తున్నారు. వాస్తవానికి పాదయాత్ర మొదలుపెట్టడానికి ముందే చంద్రబాబు ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలి, తనని చూడడానికి వచ్చేవాళ్లని ఎలా పలకరించాలి, ఏమేమి హామీలు ఇవ్వొచ్చు, ఎలా ప్రజాభామానాన్ని చూరగొనచ్చు అనే అంశాలమీద విస్తృత స్థాయిలో రీసెర్చ్ చేసినట్టు సమాచారం. గతంలో పార్టీ లీడర్లందరికీ వరసపెట్టి వ్యక్తిత్వ వికాస పాఠాలు నేర్పించిన చంద్రబాబు, తనుకూడా క్లాసులకు హాజరయ్యారు. హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకునేందుకు అప్పట్లో తహతహలాడిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సంపాదించుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి బాబు ఏం చేసినా పక్కా ప్లాన్ తోనే చేస్తారు. కార్యరంగంలోకి దిగేముందు విషయంమీద గట్టి కసరత్తు చేస్తారు. నిపుణుల సలహాల్నికూడా జోడించి బాగా వర్కవుట్ చేసే ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు పాదయాత్రకి వస్తున్న జనాన్ని చూస్తే చంద్రబాబు ఛరిష్మా ఇంకా తగ్గలేదనే అనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఓటుబ్యాంక్ బలపడే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని పార్టీవర్గాల అంచనా...

నంది అవార్డ్స్ విన్నర్స్ 2011

  2011 సంవత్సరానికి గాను నంది అవార్డులను శనివారం ప్రకటించారు. ఉత్తమ నటుడిగా టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు (దూకుడు) ఎంపిక కాగా, ఉత్తమ నటిగా నయనతార (శ్రీరామ రాజ్యం) ఎంపికయింది. ఉత్తమ దర్శకుడిగా ఎన్ శంకర్(జై బోలో తెలంగాణ), దూకుడు చిత్రంలో నటనకుగాను ఉత్తమ హాస్య నటుడిగా ఎంఎస్‌ నారాయణ, ఉత్తమ సహాయ నటుడిగా ప్రకాశ్‌రాజ్‌ నంది పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ఇక నాగార్జున, చార్మిలకు స్పెషల్‌ జ్యూరీ అవార్డులు వరించాయి. ఉత్తమ సంగీత దర్శకునిగా ఇళయరాజా ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రంగా శ్రీరామరాజ్యం ఎంపికయింది.       నంది అవార్డ్స్ విన్నర్స్ 2011   ఉత్తమ నటుడు : మహేష్ బాబు(దూకుడు) ఉత్తమ నటి : నయనతార(శ్రీరామ రాజ్యం) ఉత్తమ దర్శకుడు : ఎన్ శంకర్(జై బోలో తెలంగాణ) ఉత్తమ విలన్ : మంచు లక్ష్మి (అనగనగా ఒక ధీరుడు) ఉత్తమ చిత్రం : శ్రీరామ రాజ్యం ఉత్తమ ద్వితీయ చిత్రం : రాజన్న ఉత్తమ తృతీయ చిత్రం : విరోధి ఉత్తమ గాయకుడు : గద్దర్ (జై బోలో తెలగాణ చిత్రంలోని పొడుస్తున్న పొద్దుమీద సాంగ్) ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం : జైబోలో తెలంగాణ ఉత్తమ కుటుంబ కథాచిత్రం : 100% లవ్ ఉత్తమ వినోదాత్మక చిత్రం : దూకుడు ఉత్తమ హాస్య నటుడు : ఎంఎస్ నారాయణ(దూకుడు) ఉత్తమ సహాయ నటుడు : ప్రకాష్ రాజ్ (దూకుడు) ఉత్తమ సహాయ నటి : సుజాత రెడ్డి (ఇంకెన్నాళ్లు) ఉత్తమ పిల్లల చిత్రం : శిఖరం ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం : అవయవదానం ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ : సమ్మెట గాంధీ(రాజన్న) ఉత్తమ సహాయనటి : రత్నసాగరి(కారాలు మిర్యాలు) ఉత్తమ బాల నటుడు : నికిల్ (100% లవ్) ఉత్తమ బాల నటి : బేబి ఆని(రాజన్న) ఉత్తమ సినిమాటో గ్రాఫర్ : బిఆర్ కె రాజు ఉత్తమ మాటల రచయిత : నీలకంఠ(విరోధి) స్పెషల్ జ్యూరీ అవార్డ్(పురుషులు): అక్కినేని నాగార్జున(రాజన్న) స్పెషల్ జ్యూరీ అవార్డ్(మహిళలు) : చార్మి(మంగళ) ఉత్తమ గేయ రచిత : సురేందర్ (పోరు తెలంగాణ) ఉత్తమ సంగీత దర్శకుడు : ఇళయరాజా (శ్రీరామ రాజ్యం) ఉత్తమ చలన చిత్ర పుస్తకం : సినిమా పోస్టర్ (ఈశ్వర్) ఉత్తమ సినీ విమర్శకుడు : రెంటాల జయదేవ్ ఉత్తమ కాస్టూమ్ డిజైనర్ : భాషా ( అనగనగా ఓ ధీరుడు) ఉత్తమ గేయ రచయిత : శివశక్తి దత్త(రాజన్న మూవీలోని అమ్మ అవని సాంగ్) ఉత్తమ నృత్య దర్శకుడు : శ్రీను ఉత్తమ ఫైట్స్ : విజయ్(దూకుడు) ఉత్తమ మేకప్ : రాంబాబు(శ్రీరామ రాజ్యం) ఉత్తమ కథ రచయిత : రాజు మాదిరాజ్(రుషి) ఉత్తమ సినమాటోగ్రాఫర్ : పీ ఆర్కే రాజు(శ్రీరామ రాజ్యం) ఉత్తమ ఎడిటర్ : ఎంఆర్ వర్మ(దూకుడు)

ఇకపై 150 కిలోమీటర్ల వేగంతో రైళ్లు

దేశంలోని అతిపెద్దసంస్ధ అయిన రైల్యేలు ఇకపై ప్రయాణీకుల సమయాన్ని తగ్గించే ప్రయత్నంగా సూపర్ ఫాస్టు రైళ్లలో వేగాన్న పెంచనున్నారు.  దీనివల్ల రైల్యేలకు అధనపు భారం ఏమీ వుండదు. మామూలుగా ఇప్పటికే ఉన్న రైళ్ల పట్టాలపై వీటిని నడపవచ్చు. దీనివల్ల ప్రయాణీకులకు సులువుగా, అతితక్కువ వ్యవధిలో గమ్యానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి రాజధాని, శతాబ్ది ఎక్స్ ప్రస్ లకు మాత్రమే ఈ సౌలభ్యం ఉన్నప్పటికీ 90 కిలోమీటర్ల వేగంతోనే వాటిని కూడా నడుపుతున్నారు. మన రాష్ట్రానికి ఈ వేగంతో ప్రయాణించే రైళ్లు ఎన్ని ఉంటాయనేది కేంద్ర రైల్యే శాఖ ఇంకా తెలుపవలసి ఉంది.

కాలేజిలో స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్

  పాలిటెక్నిక్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయిపైన విద్యార్ధి నేతలు సాముహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లాలో బయటపడింది. తన కూతురిపై సాముహిక అత్యాచార౦ జరిపిన వారిలో తృణమూల్ కాంగ్రెసు ఛత్ర పరిషత్ నేత సామ్యో మండల్ ఉన్నట్లు బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూనియర్ స్టూడెంట్ ను గదిలోకి తీసుకొనివెళ్ళి మద్యం తాగించే ప్రయత్నం చేశారని, దానికి ఆమె నిరాకరించడంతో ఆమె బట్టలు విప్పి సెల్‌ఫోన్లలో చిత్రీకరించి ఆ తరువాత అత్యాచారం చేశారని బాధితురాలి తండ్రి చెప్పాడు. ఐదుగురు నిందితుల్లో సెక్యూరిటీ గార్డ్ భోల్ యాదవ్ కూడా ఉన్నాడు. మరో నలుగురు నిందితులు మండల్, అవిక్ ఘోష్, బిజయ్ సింగ్, మిథిలేష్ ఓజా పరారీలో ఉన్నారు. బాధితురాలిని చిత్తరంజన్ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు.

పాదయాత్రలో చంద్రబాబు డబుల్ సెంచరి

  చంద్రబాబు పాదయాత్రలో డబుల్ సెంచరి పూర్తి చేశారు. రెండు వేల కిలోమీటర్లకు పైగా జరగనున్న ఈ పాదయాత్రలో బాబు 200 కిలోమీటర్లు పూర్తి చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం రేణుమాకులపల్లిలో ఆయన ఈ మైలురాయిని అధిగమించారు. ”వస్తున్నా మీకోసం” అంటూ భద్రత గురించి కూడా భయం లేకుండా చంద్రబాబు అందరితో మమేకం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆ జిల్లాలో హిందూపురం, పెనుగొండ, రాప్తాడు, కల్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో సుమారు 90 గ్రామాలు సందర్శించారు. రేణుమాకులపల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలకు ఉచిత విద్యుత్ పేరిట కాంగ్రెస్ మోసం చేస్తు౦దని, వ్యవసాయానికి 9గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత తమదేనని అన్నారు. సంచార జాతుల వారు రాజకీయంగా ఎదిగేందుకు టిడిపి అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. చేనేత వర్గాల వారు కాంగ్రెస్ హయంలో ఆత్మహత్యలు చేసుకు౦టున్నారని, తమ హయంలో రాజికీయంగా న్యాయం చేసిన విషయం చంద్రబాబు వారికి గుర్తు చేశారు.

షర్మిల యాత్ర - రాహుల్ సమర్పణ

  వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనమయ్యేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తోందని రాష్ట్రంలో తలపండిన కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జరుగుతున్న పరిణామాల్నిచూస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వైకాపాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని తెలుగుదేశం పార్టీని కోలుకోలేని దెబ్బకొట్టడమే లక్ష్యంగా వ్యూహాలు సాగుతున్నాయనికూడా కొందరంటున్నారు. అంచనాల్ని తలక్రిందులు చేస్తూ తెలుగుదేశంపార్టీకి గతవైభవాన్ని కట్టబెట్టేందుకు చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నామీకోసం యాత్రకు జనంనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. టిడిపికి జనంలో పెరుగుతున్న ఆదరణనుచూసి కంగారుపడ్డ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీగా వై.ఎస్ జగన్ చెల్లెలు షర్మిలని రంగంలోకి దించుతోంది. ఇడుపులపాయనుంచి మొదలయ్యే షర్మిలయాత్రకి రూట్ మ్యాప్ కూడా ఖరారయ్యింది. అంతా బాగానే ఉంది కానీ ఈ యాత్రకు అసలు స్పాన్సరర్ ఎవరన్నదానిమీద ఇప్పుడు జనంలో ఉత్కంఠ బయలుదేరింది. రాహుల్ ప్రథాని కావాలంటే రాష్ట్రంనుంచి కనీసం పాతికమంది ఎంపీల మద్దతు తప్పదు. కాంగ్రెస్ నేతల్ని మాత్రమే నమ్ముకుని కూర్చుంటే ఓడలు బండ్లయ్యే ప్రమాదం ఉందన్న విషయం సోనియాకి స్పష్టంగా తెలుసు. ఈ పరిస్థితుల్లో అడ్డుపడి ఆదుకోగలిగిన సత్తా ఒక్క వై.ఎస్.ఆర్.సి.పికి మాత్రమే ఉందన్న విషయం సోనియాతోపాటు రాహుల్ కి కూడా స్పష్టంగా తెలుసు. రాష్ట్రపతి ఎన్నికల్లో వై.ఎస్ జగన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్ధికి ఓటేయడంకూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఎపిసోడ్ కి మంచి ఉదాహరణ అని చాలామంది చెవులు కొరుక్కున్నారుకూడా. ఈ పరిణామాలన్నింటినీబట్టి చూస్తే షర్మిలయాత్రకి రాహుల్ గాంధీ స్పాన్సర్ షిప్ వ్యవహారం నిజమే అయ్యుండచ్చని చాలామంది గట్టిగానే అనుకుంటున్నారు.       వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనమయ్యేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తోందని రాష్ట్రంలో తలపండిన కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జరుగుతున్న పరిణామాల్నిచూస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వైకాపాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని తెలుగుదేశం పార్టీని కోలుకోలేని దెబ్బకొట్టడమే లక్ష్యంగా వ్యూహాలు సాగుతున్నాయనికూడా కొందరంటున్నారు. అంచనాల్ని తలక్రిందులు చేస్తూ తెలుగుదేశంపార్టీకి గతవైభవాన్ని కట్టబెట్టేందుకు చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నామీకోసం యాత్రకు జనంనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. టిడిపికి జనంలో పెరుగుతున్న ఆదరణనుచూసి కంగారుపడ్డ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీగా వై.ఎస్ జగన్ చెల్లెలు షర్మిలని రంగంలోకి దించుతోంది. ఇడుపులపాయనుంచి మొదలయ్యే షర్మిలయాత్రకి రూట్ మ్యాప్ కూడా ఖరారయ్యింది. అంతా బాగానే ఉంది కానీ ఈ యాత్రకు అసలు స్పాన్సరర్ ఎవరన్నదానిమీద ఇప్పుడు జనంలో ఉత్కంఠ బయలుదేరింది. రాహుల్ ప్రథాని కావాలంటే రాష్ట్రంనుంచి కనీసం పాతికమంది ఎంపీల మద్దతు తప్పదు. కాంగ్రెస్ నేతల్ని మాత్రమే నమ్ముకుని కూర్చుంటే ఓడలు బండ్లయ్యే ప్రమాదం ఉందన్న విషయం సోనియాకి స్పష్టంగా తెలుసు. ఈ పరిస్థితుల్లో అడ్డుపడి ఆదుకోగలిగిన సత్తా ఒక్క వై.ఎస్.ఆర్.సి.పికి మాత్రమే ఉందన్న విషయం సోనియాతోపాటు రాహుల్ కి కూడా స్పష్టంగా తెలుసు. రాష్ట్రపతి ఎన్నికల్లో వై.ఎస్ జగన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్ధికి ఓటేయడంకూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఎపిసోడ్ కి మంచి ఉదాహరణ అని చాలామంది చెవులు కొరుక్కున్నారుకూడా. ఈ పరిణామాలన్నింటినీబట్టి చూస్తే షర్మిలయాత్రకి రాహుల్ గాంధీ స్పాన్సర్ షిప్ వ్యవహారం నిజమే అయ్యుండచ్చని చాలామంది గట్టిగానే అనుకుంటున్నారు.

దొంగలకూ సెంటిమెంట్లుంటాయ్....

  ప్రకాశ్ సాహు పేరు చెప్పగానే ఏగుడి తలుపులైనా గడగడలాడాల్సిందే. ఈ చోరశిఖామణి ఆలయాల్లో చోరీలు చేయటంలో ఆరితేరిన వాడు. విజయవాడ కనక దుర్గమ్మ గుడిలో దొంగతనం చేసినప్పుడు బయట పడింది ఇతని పేరు. ఆతరువాత చాలా గుళ్లలో దొంగతనాల్లో పాలు పంచుకున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. చత్తీస్ ఘడ్ కి చెందిన ఇతగాడికి అమ్మవారి నగలంటే చాలా ఇష్టమట. అంతేకాదు సదరు సాహు అమ్మవారికి దణ్ణం పెట్టుకోందే దొంగతనం చేయడంట. ప్రస్తుతానికి ఇతని ఖాతాలో తూర్పు గోదావరి జిల్లాలో దేవాలయాల్లో జరిగిన దొంగతనాలతోపాటు, కెపిహెచ్ బిలో, జూబ్లిహిల్స్ లో జరిగిన నగల దుకాణాల చోరీలు కూడా సాహు పనేనని పోలీసులు భావిస్తున్నారు. అలాగే ఈ మధ్య జరిగిన లాల్ దర్వాజ మహంకాళీ అమ్మవారి నగల్నికూడా సాహూయే కొట్టాశాడన్న అనుమానాలు గట్టిగా వ్యక్తమౌతున్నాయి. పోలీసులు సాహూని అదుపులోకి తీసుకుని నిజం రాబాట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

కాకినాడకు పొంచి ఉన్న ప్రమాదం

  ఒకవైపు జీవవైవిద్య సదస్సుజరుగుతున్నా, దానికి సంబంధించిన ప్రచారానికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం క్రియలపై మాత్రం ఏమాత్రం శ్రద్ద చూపటం లేదు. అందుకు ఓ మంచి ఉదాహరణ కాకినాడ బీచ్ తవ్వకాలు. కాకినాడ బీచ్ ప్రాంతాన్ని ఎన్నడూ లేని విధంగా గ్యాసు తవ్వకాలపేరుతో గుల్లచేస్తూ సముద్ర తీరానికి చేటుతెస్తున్నారు. కాకినాడ సముద్రంలో హోప్ ఐలాండ్ లో జరుగుతు ఈ ట్రెడ్జింగ్ పనుల వల్ల రానున్నరోజుల్లో సముద్రంలో ఏ ఉపద్రవం తలెత్తినా కాకినాడ వాసులకు ముప్ఫు తప్పదని పర్యావరణవేత్తలు ఎంతగా హెచ్చరిస్తున్నా ఇలాంటి పనులకు అడ్డుకట్టపడడంలేదు. గతంలో వచ్చిన సునామీ కాకినాడను ముంచెత్తకుండా ఉండడానికిగల ఏకైక కారణం హోప్ ఐలాండ్ మాత్రమేనని పర్యావరణ శాస్త్రవేత్తలు బల్లగుద్దిమరీ చెబుతున్నారు. గ్యాస్ తవ్వకాల పేరుతో జరుగుతున్న అరాచకాలవల్ల చేపలవేటకు వెళ్తున్న జాలర్లు ఉట్టి చేతుల్లో తిరిగొస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్నరోజుల్లో సముద్ర తీర ప్రాంతాలయిన ఉప్పాడ, ఏటిమొగ్గలతోపాటు కాకినాడకు కూడా భారీ స్థాయిలో ముప్పు పొంచి ఉందని నిపుణులు చేస్తున్న హెచ్చరికలు గాల్లో కలిసిపోతున్నాయ్. ఇంత పెద్దఎత్తున పర్యావరణానికి నష్టం కలుగుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని కోస్తావాసులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విజయ్‌ మాల్యాకి అరెస్ట్ వారెంట్

  కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్‌మాల్యా మరోసారి చిక్కుల్లో పడ్డారు. చెక్‌బౌన్స్ కేసులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. శంషాబాద్ విమానాశ్రయ వినియోగ రుసుంను చెల్లింకచకోవడంతో జీఎంఆర్ కోర్టును ఆశ్రయించింది. జీఎంఆర్ పిర్యాదు మేరకు 13వ నగర న్యాయస్థానం విజయ్ మాల్యాకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో విజయ్‌మాల్యా కోర్టుకు హాజరుకానందుకు ఆయనపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు ఆయనతోపాటు మరో ఐదుగురిపై హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని పదమూడవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి అరెస్టు వారెంట్ జారీ చేస్తూ తీర్పునిచ్చారు. మాల్యా ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో జీఎంఆర్ సంస్థ నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్ చట్టం ప్రకారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో ఆయనపై కోర్టు వారెంట్లు జారీ చేసింది. విదేశాల్లో ఉన్నందున కోర్టుకు హాజరు కాలేనని మాల్యా పిటీషన్‌ దాఖలు చేసుకున్నారు.

చేతికందని డబ్బుకి రూ.70 లక్షల పన్నుకట్టినా సైనా

  డెక్కన్ క్రానికల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. నేరుగా డబ్బుని మేనేజర్లద్వారా అకౌంట్ లో జమచేస్తానని డెక్కన్ క్రానికల్ సంస్థ సైనాతో డీల్ కుదుర్చుకుంది. కానీ.. ఇవ్వాల్సిన డబ్బు సైనా అకౌంట్లో పడనేలేదు. కానీ.. డీల్ కుదుర్చుకున్న పాపానికి తొందరపడి ముందే కూసిన సైనా నెహ్వాల్ 70 లక్షల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించింది. ఈ ఏడాది జూలైనెలనుంచి రితీ స్పోర్ట్స్ తో మరో కాంట్రాక్ట్ ని సైన్ చేసిన సైనాకి గతంలో కుదుర్చుకున్న డెక్కన్ క్రానికల్ ఒప్పందంవల్ల ఒరిగిందేలేదు. పైగా ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నుంచి ట్యాక్స్ కట్టాలంటూ నోటీస్ రావడంవల్ల తను లండన్ ఒలంపిక్స్ లో వచ్చిన ప్రైజ్ మనీ నుంచి డబ్బుని తీసి ట్యాక్స్ కట్టాల్సొచ్చిందని సైనా మేనేజర్లు చెబుతున్నారు. డెక్కన్ క్రానికల్ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన విషయం తెలిసి చాలాకాలంపాటు డబ్బుకోసం ఒత్తిడి చేయలేదని, కానీ తీసుకోని డబ్బుకి ట్యాక్స్ కట్టాల్సొచ్చిన విషయం తెలిసిన తర్వాతైనా డెక్కన్ క్రానికల్ గ్రూప్ సరైన రీతిలో స్పందించిఉంటే బాగుండేదని సైనా మేనేజర్లు అంటున్నారు. మరోవైపు ముంబైకి చెందిన ఓ సంస్థ డెక్కన్ చార్జర్స్ టీమ్ ని కొనేసింది. ఇప్పటికైనా సైనా బకాయిల్ని చెల్లించే ఉద్దేశం ఆ సంస్థకి కలిగితే చాలా బాగుంటుందని చాలామంది క్రీడాకారులు అనుకుంటున్నారు. పాపం.. సైనా.. సో.. పిటీ.. కదా..

శంకర్రావుకి సంకెళ్లు తప్పవా?

  కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావుకి కూడా త్వరలోనే కారాగారవాసం పట్టే యోగం కనిపిస్తోంది. గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంలో శంకరన్న పై ఉన్న అరెస్ట్ వారెంట్ లపై ఉన్న స్టేని హైకోర్ట్ ఎత్తేసింది. అల్వాల్ మునిసిపాలిటీ పరిధిలోఉన్న కనాజీగూడ గ్రామంలో 875 ప్లాట్లని రెగ్యులరైజ్ చేసే విషయంలో శంకరన్న చేతివాటం ప్రదర్శించే ప్రయత్నం చేశాడని ఆయనపై అభియోగం. గ్రీన్ ఫీల్డ్ ప్లాట్స్ అసోసియేషన్ కి చెందిన 75 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు శంకర్రావు ప్రయత్నించారంటూ గతంలో సైబారాబాద్ పోలీస్టేషన్ పరిధిలో ఆయనపై ఓ కేసు నమోదయ్యింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే నేరంపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. శంకర్రావు అప్పట్లో హైకోర్టుని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. హైకోర్ట్ పునఃసమీక్ష జరిపి వారెంట్ ని ఎత్తేయడంతో మాజీమంత్రివర్యులు శంకర్రావుని, ఆయన కొడుకు దయానంద్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. విచారణలో సహకరించకపోతే వెంటనే సైబారాబాద్ పోలీసులు వాళ్లని అరెస్ట్ చేయొచ్చు. ఈ కేసునుంచి బైటపడేందుకు శంకర్రావు సుప్రీంకోర్ట్ గడపతొక్కబోతున్నారని సమాచారం.

నిర్మాతగా మారనున్న తెలంగాణా జాగృతి కవిత

  టీఆర్ ఎస్ అధ్యక్షుడు కల్వకుంట చంద్రశేఖర్ రావు కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సినీ నిర్మాతగా మారబోతున్నారు! ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. త్వరలోనే సినిమాలు నిర్మిస్తానని, కవిత ప్రకటించారు. ఆకాశ్ ,సుహాసినీ హీరో హీరోయిన్లుగా వస్తున్న ‘పంచాయితీ’ అనే సినిమా ప్రారంభోత్సవానికి కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్మాత విషయాన్ని ప్రకటించారు. ‘మేము త్వరలోనే కొన్ని సినిమాలు నిర్మిస్తాం. తెలంగాణ ప్రాంతం నుంచి మరింత మంది ఆర్టిస్టులు రావాలి, వారినిప్రోత్సహించడానికే సినిమాలు తీయబోతున్నా౦’అని కవిత అంటున్నారు. సినిమాలతో కవితకు అనుబందం ఈనాటిదికాదు. గతంలో కొన్ని భారీ సినిమాలు కవిత అనుమతి మేరకే తెలంగాణ పరిధిలో విడుదలయ్యాయి.

జగన్ జైల్లో ఎందుకున్నారో షర్మిల చెప్పాలి: యనమల

వైకాపా అధ్యక్షుడు జగన్ జైల్లో ఎందుకున్నారో షర్మిల రాష్ట్ర ప్రజలకు చెప్పాలని టిడిపి నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. పాదయాత్రకు రిలే మహాప్రస్థానం పేరు పెట్టుకుంటే బాగుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. మూడు వేళ కిలోమీటర్లలో ఎవరెంత నడుస్తారో ప్రజలకు ముందు తెలియజేయాలని కోరారు. రిలే మహాప్రస్థానం ప్రజల కోస౦ కాదని తన అన్న జగన్ కోసమే అని ఆయన విమర్శించారు. మరోవైపు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు దర్యాప్తు ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేమని సిబిఐ డైరెక్టర్ అమర్ ప్రతాప్ సింగ్ అన్నారు.  కోర్టు ఆదేశం మేరకు వైయస్ జగన్ ఆస్తుల కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని అన్నారు. ఈ కేసులో విదేశాల నుంచి తమకు సమాచారం రావాల్సి ఉందని, ఆ సమాచారమే కేసులో అత్యంత ప్రధానమైందని ఆయన అన్నారు. దర్యాప్తు పలు కోణాల్లో జరుగుతోందని చెప్పారు. ఓ కేసులో ఇలాంటి దర్యాప్తు సాగడం ఇదే ప్రథమమని ఆయన అన్నారు. కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు.