త్వరలో విడుదల....జయప్రద!
ఒకనాడు తన అందచందాలతో, అపూర్వమయిన నటనతో తెలుగు సినిమాని ఒక ఊపుఊపిన అందాలతార జయప్రద, తరువాత తెలుగుదేశంలో జేరి రాజకీయ ఓనామాలు దిద్దికున్న తరువాత, ఎందువల్లో ఆమెకి చంద్రబాబుతో పొసగక, మూట ముల్లె సర్దుకొని ఏకంగా డిల్లి రైలు ఎక్కేసింది. అక్కడి నుండి, ఆమె ఉత్తర ప్రదేశ్ రైలు క్యాచ్చేసి అమర్సింగ్ తో కలిసి చాలా ఏళ్ళు అసలు సిసలు ‘సమాజ్వాది’గా ఒక వెలుగు వెలిగింది. అయితే, అక్కడ మారిన రాజకీయ పరిణామాలతో కొద్ది కాలం క్రితమే, మళ్ళీ హైదరాబాదు ట్రైను ఎక్కివచ్చేసింది ఆమె. అలా వచ్చినప్పటినుండీ, తిరుపతి వెంకన్న ముందొకసారి, శ్రీశైలమల్లన్నముందు మరోసారి ప్రజలకి అప్పుడప్పుడు తళ్ళుకుమని కనిపిస్తూ, ఇదిగో ‘వచ్చేస్తున్నా మీకోసం’ అంటూ, రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకి తన రాజకీయ ఆఫర్ (సంసిద్దత) ఈయసాగింది. అయితే, బొత్తిగా సినిమా సెన్స్ లేని మన రాజకీయ పార్టీలు ఆమె ఆఫర్లను పట్టించుకొన్న దాఖలాలు లేవు.
జయప్రధ ముందుగా, ‘చంద్రబాబు చాలా మంచి మనిషి. రాజకీయాలలో చాలా నిబద్దతగలవాడు’ అని అతనికి ఒక సర్టిఫికేటు జారి చేసి చూసింది, గాని అటువైపునుండి రెస్పాన్సు లేకపోవడంతో ఆమె కొంచెం నిరాశకు గురయింది.
ఇక మిగిలిన వాటిలో వై.యస్.ఆర్.కాంగ్రెసులోకి వెళ్దామని ఉన్నాఅక్కడ ఇప్పటికే తనకు పోటీగా అందాలభామ రోజా సెటిల్ అయిపోయుంది. పోనీ, వై.యస్.ఆర్.కాంగ్రెసు ‘ద్వారములు తెరిచియే యున్నవి’ గనుక దైర్యం చేసి జేరిపోయినా తరువాత పదవులకోసం పెద్ద నోర్రున్న రోజాతో పోటీ పడక తప్పదు. కావాలంటే డ్యాన్సులలో పోటీ పడగలదు గానీ, ఆమెతో తూ...తూ! మై...మై! అనుకోవలసి వస్తే కష్టమే మరి. మళ్ళీ ‘మౌనమేలనోయి...’ అని పాడుకొంటూ వేరే రైలు పట్టుకోవాల్సి ఉంటుంది.
అందుకని దైర్యం ఉంటే మహాసముద్రంవంటి కాంగ్రెస్లోకి దూకి ఈదాలి. కావాలంటే, ఆమెకు ఈత వచ్చేదాకా సాయపడేందుకు మన మెగాస్టారు చిరంజీవి ఎలాగు ఉన్నాడక్కడ. ఇప్పటికే అతను డిల్లీకి దారి కనిపెట్టడమే గాకుండా, కాంగ్రేసు రాజకీయాలును కూడా కొంత మేర వంటబట్టిన్చుకొన్నాడు గనుక, ఆ పార్టీలో జేరితే అతను యధా శక్తితో స్వచ్చమయిన ‘కాంగ్రేసు హస్తం’ అందించి ఆమెకు సహాయ పడవచ్చును. ఎంతయినా వెండితెర అనుబందాలు ఉండనే ఉంటాయి కదా.
ఇక అదీ వీలు కాకపోతె, ఏ సినిమా ఎట్రాక్షన్స్ లేక బోసిపోయున్న బి.జే.పీ.లో జేరి అదృష్టం పరీక్షించుకోవాలి. పొతే అక్కడ “ఎగిరెగిరి దంచినా అంతే కూలి, రోటి కాడ పాటపాడినా అంతే కూలన్నట్లు” ఉటుంది ఆపార్టీలో వ్యవహారం. ఇప్పటికే సగం వయసయిపోయిన ఆ పార్టీ నేతలకే తమ రాజకీయ భవిష్యత్ అంతా అగమ్యగోచరంగా ఉంది. ‘ఎక్కడున్నావే గొంగళీ అని అడిగితే...నువ్వేసినచోటనే ఇదిగో ఇలా పడి ఉన్నాను...’అన్నట్లు ఉంది వారి పరిస్తితి. ఇక అందులో జేరి మళ్ళీ కొత్తగా ఒనమాలనుండి ప్రారంబించాలా లేక దైర్యం చేసి చిరంజీవి ‘హస్తం’ పట్టుకొని ‘కాంగ్రెస్ సముద్రంలోకి’ దూకాలో ఆమె నిర్ణయించు కోవాలి. ఏమయినప్పటికీ, ఇప్పుడేమి ఎలక్షన్ సీజను కూడా కాదు గాబట్టి, ఇప్పుడు ఆమెకి ఎర్ర తివాచీలు పరిచి స్వగతం పలికేవారులేరు గనుక, తనే ఆ పనేదో చేసుకొంటూ ఏదో పార్టీ వైపు జేరుకొంటే ఆమె రాజకీయ అనుభవాన్ని పరిశీలించిన తరువాత ఎవరో ఒకరు అవకాశం ఇవ్వకపోరు. మరికొద్ది రోజులు ఆమె గోడ మీద ఒప్పిగ్గా కూర్చోనగలిగితే, ఎన్నికలు సీజను ఎలాగు వచ్చేస్తోంది గాబట్టి అప్పుడు ఆమెకి డిమాండ్ ఏర్పడవచ్చు. పైనుంచి చూసి ఏ పార్టీ బాగుంటే ఆ పార్టీలోకి సేఫ్ ల్యాండింగ్ అయిపోవచ్చు.
ఆమె జయప్రదంగా రాష్ట్ర రాజకీయాలలోకి దూకాలని కోరుకుందాము.