మళ్ళీ ఇద్దరే : పార్టీలకు షిండే లేఖ
posted on Dec 12, 2012 @ 5:11PM
తెలంగాణా విషయాన్ని చర్చించడానికి జరుప తలపెట్టిన అఖిల పక్ష సమావేశం ఈ నెల 28 నే జరుగుతుందని, దానికి అన్ని రాజకీయ పక్షాలు తమ తరపున ఇద్దరేసి నేతలను పంపించాలని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే రాష్ట్రంలోని తొమ్మిది రాజకీయ పార్టీలకు ఈ రోజు లేఖలు రాసారు.
ఈ సమావేశం శుక్రవారం ఉదయం పది గంటలకు ఢిల్లీ లోని నార్త్ బ్లాక్ లో జరుగుతుందని ఆయన ఆయా పార్టీల నేతలకు లేఖలు రాసారు. ఈ సమావేశంలో ఇతర అంశాలేవీ చర్చకు రావని, కేవలం తెలంగాణా అంశంఫైనే చర్చ జరుగుతుందని షిండే ఆ లేఖలో వివరించారు.
ఈ సమావేశం వాయిదా పడక పోవడంతో టిఆర్ఎస్ నాయకులు, తెలంగాణా కాంగ్రెస్ ఎంపిలు ఆనందం వ్యక్తం చేశారు. అయితే, మళ్ళీ ప్రతి పార్టీ నుండి ఇద్దరు నేతలు రావాలని సూచించడం ఫై తెలంగాణా కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో తామంతా ఢిల్లీ వెళ్లి తమ నేత సోనియా గాంధీ కి తమ అభ్యంతరాన్ని తెలియ చేస్తామని వారన్నారు. ఇలా ఇద్దరినీ పిలవడం వల్ల సమస్య మరలా మొదటికి వస్తుందని వారు వెల్లడించారు.
ఇద్దరిని ఆహ్వానించడం కుట్రలో భాగమని ఓ తెలుగు దేశం పార్టీ ఎంఎల్ఏ వ్యాఖ్యానించారు. ఏది ఎలా ఉన్న, ఇలా పార్టీ నుండి ఇద్దరినీ పిలవడం వల్ల సమస్య పరిష్కారం మాత్రం కాదని, ఈ అఖిల పక్ష సమావేశం కేవలం ఓ వృధా ప్రయత్నమేనని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.