కాంగ్రెస్ హస్తవాసి తెలంగాణాకి మేలు చేస్తుందా?
రాష్ట్రంలో ‘డ్డాo’ అని ‘అఖిలపక్షం బాంబు’ ను పేల్చిన కాంగ్రెస్ మళ్ళీ రాష్ట్రంలో మంటలురాజేసి ఆ మంటలో చలికాచుకొంటోంది. రేపు ౨౮న జరుగ బోయే అఖిలపక్ష సమావేశంలో ఏవో అద్బుతాలు జరిగిపోతాయని ఏపార్టీకి పెద్దగా నమ్మకాలు లేకపోయినప్పటికీ, తెలంగాణా సమస్యతో సతమతమవుతున్న రాష్ట్రానికి ఇప్పుడయినా బయటపడే అవకాశం దొరకకపోదా? అని అందరు అడియాసకిపోయి ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అయితే, సమావేశం తేది ప్రకటించిననాటి నుండి నేటి వరకు డిల్లీకాంగ్రెస్ పెద్దలు మొదలుకొని నిన్న బొత్ససత్తిబాబు వరకు “అఖిలం అంతా ఒక టైం పాస్ వ్యవహారం’ అని ప్రత్యక్ష పరోక్షంగా ఎంత నెత్తి మొత్తుకొని చెపుతున్నపటికీ అమాయకులయిన ప్రజలు ఇంకా ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు.
కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు అఖిలపక్ష సమావేశంలో తెలంగాణా ప్రకటించేసి ఆ క్రెడిట్ అంతా ఇంతకాలం తెలంగాణా కోసం ఉద్యామాలు చేస్తున్న కెసిఆర్ చేతిలో ఎందుకు పెడుతుంది? అయితే గియితే ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకొంటుంది గానీ ఇతరులకు ఎందుకు ఇస్తుంది? అని ఆలోచిస్తే అది ప్రస్తుత పరిస్తితుల్లో ఇవ్వదని తెలుస్తుంది. రాష్ట్రంలో తనకి ఎప్పుడయితే అనుకూల వాతావరణం సృష్టిoచుకోవాలని అది తలస్తుoదో అప్పుడే అది ఏ ప్రకటనయినా చేస్తుంది. అంటే, ఎన్నికలు సమీపిస్తున్నపుడో, లేక తనకి ఓటేస్తేనే ఇస్తామనో చెప్పుకొని తెలంగాణా సమస్యని బ్రహ్మాస్త్రంలాగ అది వాడుకొంటుంది. అంతవరకూ, ఈ అఖిలాలు అనేకం జరుపుతూనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ.
అయితే, పై కారణాలవల్లనే కాంగ్రెస్ ఇప్పట్లో తెలంగాణా ఇవ్వదని రాజకీయాలలో కాకలుతీరిన తెలంగాణా కాంగ్రెస్ నేతలకి మరి తెలియకనే ఒత్తిడి తెస్తున్నారనుకోవాలా? లేక కాంగ్రెస్ అధిష్టానం వారు కలగలిసి ఆడుతున్న నాటకం ఇది అనుకోవాలా? ఇప్పుడు తెలంగాణా ఇవ్వడంవల్ల పార్టీకి జరిగే నష్టం గురించి వారికి అధిష్టానం వివరించి ఉండవచ్చును. అప్పుడు, వారుకూడా ప్రజలలో తమకు ఏర్పడుతున్న ఇబ్బందులు, తే.ర.స. నుండి ఎదురవుతున్న ఒత్తిళ్ళ గురించి తమ అధిష్టానానికి వివరించినట్లు వారే తెలుపుతున్నారు. మీరు పార్టీలో ఉంటూనే మీ ఉనికిని కాపాడుకొంటూ, రాజకీయ భవిష్యత్తుని కాపాడుకొనేందుకు మీరుకూడా ఉద్యమాలు చేసుకోండని కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలుగుదేశం పార్టీ లాగానే తన పార్టీ తెలంగాణా నేతలకి చెప్పి ఉండవచ్చును. అందుకే వారు ఎంత తీవ్ర పదజాలం వాడుతున్న పార్టీ పట్టించుకోవట్లేదు. పార్టీ పట్టించుకోక పోయినా వారు పదవులు వీడట్లేదు అనుకోవాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీలో లోపాయికారిగా సాగుతున్న ఈ నాటకం తెల్సుండబట్టే కెసిఆర్ ఆపుదపుడు కాంగ్రెస్ మీద విరుచుకు పడుతున్నడా?