ప్లీజ్! నన్ను ప్రజాసేవ చేసుకోనీయరూ!
posted on Dec 7, 2012 @ 7:06PM
నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్లే, ప్రజాసేవలో ‘ప్రజలకు సేవ’ కూడా ఉండదు. అయినా, మన నేతలు ఆ పడికట్టుపదాన్ని అలవోకగా వాడేసుకొంటూ ప్రజలతో ఆడేసుకొంటున్నారు. అయినా కూడా భూదేవంత సహనమూర్తులయిన ప్రజలు మళ్లీమళ్లీ వాళ్ళనే ‘ప్రజాసేవ’ చేయాలని గట్టిగా కోరేస్తుండటం వల్ల, వాళ్ళ మీద గౌరవంతోనో లేక వాళ్ళమాట కొట్టేయలేని తమ బలహీనతవల్లనో పాపం శ్రమ అనుకోకుండా ప్రజాసేవ చేసుకుపోతున్నారు సదరు ప్రజా ప్రతినిధులు.
ఇక, విషయానికి వస్తే, గత రెండున్నర దశాబ్దాలుగా ప్రజాసేవకే అంకితమయిపోయి, కాంగ్రేసు యంపీగా ఇటు పార్టీకి, అటు ప్రజలకి సేవలందిస్తున్న శ్రీ కావూరి సాంబశివరావుగారు, తనకు మంత్రి పదవి ఇవ్వక పోవడముతో ప్రజలకి మరింత ఎక్కువగా సేవచేయలేకపోతున్నని బాధపడుతూ కొద్ది రోజుల క్రితమే తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసేసారు. యఫ్.డి.ఐ. బిల్లు వోటింగు సమయంలో పాల్గొనకుండా కాంగ్రేసు ‘హస్తాన్ని’ కొంచెంమెలి తిప్పి చూసారు. కాని, పార్టీ హై కమాండులో పెద్దగా చలనం రాలేదు. అటు పార్టీలోంచి పొమ్మని చెప్పకుండా, ఇటు మంత్రి పదవీ ఇయ్యకపోతే ఇక ప్రజాసేవ ఎలాగ చేసుకోవాలో తెలియక ఆయన సతమతమయిపోతూ ఆ ఆవేదనని మీడియా ముందు ఉంచేరు ఇలా... “ఇన్ని సంవత్సరాలుగా నిస్వార్దంగా పార్టీకి సేవలందిస్తున్న నాకే పార్టీలో గుర్తింపు లేకపోతె, ఇక మా వంటి సామాన్య పార్టీ కార్యకర్తలమేమైపోవాలి అని కార్యకర్తలు నిలదీస్తుంటే వాళ్ళకి నేను జవాబు చెప్పుకోలేక పొతున్నను. నిజమే! మా అధిష్టానానికి ‘పెరటి మొక్క వైద్యానికి పనికి రాదనట్లు’, పాత కాపులమయిన మేము పనికి రాకుండా పోయాము. నిన్న గాక మొన్న పార్టీలో జేరిన వారికి మంత్రి పదవులు మాకు శూన్య ‘హస్తం.’’
“గత అనేక సంవత్సరాలుగా నాంచబడుతున్న ‘కొల్లేరు సరస్సు ఉద్యమాన్ని’ మళ్లీ ప్రారంభించాలని అనుకొంటున్నాను. అవసరమయితే, రైల్ రోకో, హైవే రోకో వంటి ఆందోళనలకీ మేము సిద్దం” అని ప్రకటించేరు కావూరి వారు.
ఇప్పుడు ఆయనని ‘ప్రజాసేవ’ చేసుకొనీయాలో వద్దో కాంగ్రెసు అధిష్టానమే ఆలోచించుకోవాలి మరి.