‘ఆంధ్రోడు’ అనొద్దన్న ఆర్.నారాయణమూర్తి
ఆంధ్రా ప్రజలను ఉద్దేశించి ‘ఆంధ్రోడు’ అని సంభోదించవద్దని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు,నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. నిన్న హైదరాబాద్ లో ప్రజా కళాకారిణి విమల ఫై అక్రమ కేసులను నిరసిస్తూ ధూమ్ ధూమ్ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణమూర్తి మాట్లాడుతూ ఆంధ్ర ప్రజలకు కూడా ఆత్మ గౌరవం ఉంటుందని, వారిని ఉద్దేశించి ‘ఆంధ్రోడు’ అనే పదాలు వాడవద్దని తెలంగాణా ఉద్యమకారులకు విజ్ఞప్తి చేశారు. విమలఫై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, తెలంగాణా భాషను పట్టించుకోని ప్రపంచ తెలుగు మహా సభలను బహిష్కరించాలని ఈ సమావేశంలో తీర్మానాలు చేశారు.
తెలంగాణా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అసలు సిద్దంగా లేదని, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు ప్రధాన అడ్డంకి ఆ పార్టీనేనని ఈ సమావేశంలో పాల్గొన్న గద్దర్ అన్నారు. తెలంగాణా ఉద్యమం అనేది సాంస్కృతిక ఉద్యమమని, ఇది రాజకీయ ఉద్యమం మాత్రమే కాదని ఆంధ్ర జ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. తెలంగాణా భావానికి అధిక ప్రచారం రావడంలో కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యుడు వివేక్ మాట్లాడుతూ, తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కోసం అన్ని వర్గాలు కలిసి పోరాడాల్సి ఉందని అన్నారు. టిఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడుతూ, ఆంధ్ర ప్రజలు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నారని ఆర్టిసి గుర్తింపు సంఘ ఎన్నికల ఫలితాలు రుజువు చేసాయని అన్నారు.
తెలంగాణా జెఏసి చైర్మన్ కోదండ రామ్, బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఈ సమావేశంలో ప్రసంగించారు.