బెజవాడ గజ గజ...వంశీ, నెహ్రూల మధ్య కోల్డ్ వార్
posted on Dec 10, 2012 @ 4:56PM
విజయవాడలో రాజకీయ వాతావరణం మరలా వేడెక్కినట్లు కనిపిస్తోంది. నగర పరిధిలోని గుణదలలో నిన్న తెలుగు దేశం పార్టీ కార్యాలయం ప్రారంభ కార్యక్రమం ఆ పార్టీ నేత వల్లభనేని వంశీ చేతుల మీదుగా ప్రారంభం అయింది. ఈ కార్యక్రమన్నంతా ఓ వ్యక్తి వీడియో తీయడమే ఇందుకు కారణం.
అనుమానం వచ్చిన పార్టీ నేతలు ఆ వ్యక్తిని ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది. నగర కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రు అనుచరుడు సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని వీడియో తీస్తే, ఎంత డబ్బయినా ఇస్తానని చెప్పాడని రమేష్ అనే వ్యక్తి తెలుగు దేశం నేతలకు చెప్పాడు. దీనితో పార్టీ నేతలు మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో చిత్రాల ద్వారా నెహ్రు తన ఫై దాడి చేయాలని పధక రచన చేస్తున్నారని వంశీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ అవసరం తమకు లేదని, కేవలం ప్రచారం కోసమే వంశీ ఈ ఆరోపణలు చేస్తున్నారని నెహ్రు వర్గీయులు తిప్పి కొట్టారు.
ఏది ఏమైనా గుణదలలో ఏ చిన్న రాజకీయ కార్యక్రమం జరిగినా అక్కడి సాధారణ ప్రజానీకం భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు పరిస్థితి దృష్ట్యా పోలీసులు కూడా బారీ ఎత్తున బలగాలను మొహరిస్తూఉండడంతో అక్కడ ప్రజలలో ఆందోళనలు నెలకొని ఉన్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా ఈ ఇద్దరు నేతలు మాటల యుద్దానికి తలపడుతూ ఉండటం సహజంగా మారింది.
ఇలా ఒకరి కార్యకలాపాలఫై మరొకరు నిఘా పెట్టడంతో విజయవాడ రాజకీయాలు మరలా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంఘటన ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.