ఒక్కరూ లేక ఇద్దరు చాలు
posted on Dec 10, 2012 @ 11:23AM
ఒకవైపు తెలంగాణా కోసం వేసిన అఖిలపక్ష సమావేశం అంతా ఒట్టి భూటకమని ఒకవైపు కాంగ్రేసుని దుయ్యబడుతూనే, మరో వైపు అఖిలపక్ష సమావేశంలో పార్టీల బండారాలు బయట పడతాయని తే.రా.స. నేతలు మరియు టీజేఏసీ చైర్మన్ కోదండరాం తదితరులు బల్లగుద్ది మరీ చెపుతున్నారు. అయితే, ఇప్పుడు అంతటా నంబర్ గేమ్ (ఉదా:యఫ్.డి.ఐ.)నడుస్తోంది కాబట్టి, అఖిలానికికూడా అదేరూల్ వర్తింపజేయాలని వారు వాదిస్తున్నారు. అదే పనిలో నేడు తెలంగాణా యంపీలు డిల్లీలో హోంమంత్రి సుషీల్ కుమార్ షిండేను కలిసి, ముఖ్యమంత్రి, పీ.సి.సి అధ్యక్షుడు కోరినట్లు అఖిలపక్ష సమావేశం వాయిదావేయవద్దని, ముఖ్యంగా పార్టీకి ఒక్కరినే చొప్పున ఆహ్వానించాలని కోరేరు. అప్పుడే, రాష్ట్రంలో అన్ని పార్టీలు తెలంగాణాపై తమ ఖచ్చితమయిన అభిప్రాయం ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుందని నొక్కి మరీ జెప్పారు.
గానీ, ఇటువైపు లగడపాటివంటివారి వాదన మరోలా ఉంది. కేవలం, ఒక వర్గంవారి వాదననే వినేసి ఎదో ఒక నిర్ణయం తీసేసుకొంటే కుదరదుగాక కుదరదు, కనీసం పార్టీకి ఇద్దర్నినయిన ఆహ్వానించాలని అప్పుడే అందరి అభిప్రాయాలూ వ్యక్తం అవుతాయని చెప్పుతున్నారు. ఏది ఏమయినప్పటికీ, ఇప్పుడు గేమ్ అంతా కాంగ్రేసు ప్రకటించబోయే ఆ ‘మాజిక్ నంబరు’ మీదే ఆదారపడి ఉంది. అది, ‘ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు’ అని అంటుందా లేక ఒక్కరు లేక ఇద్దరు ముద్దు అని అంటుందా అనేది తెలిసిపోతే అప్పుడు రాష్ట్రంలో అసలు గేమ్ మొదలవుతుంది. ఇప్పుడు బంతి కాంగ్రేసు కోర్టులో ఉంది. సర్వ్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మరీ సర్వ్ చేయకపోతే, అది డిసెంబర్ 2009లో చేసిన ప్రకటనల్లా తయారవుంది పరిస్తితి.