టిడిపి చిత్తూరు జిల్లా అధ్యక్షునిగా జంగాలపల్లి శ్రీనివాస్ నియామకం

    చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు నిజామాబాద్ జిల్లా పిట్లం వద్ద తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షునిగా జంగాలపల్లి శ్రీనివాస్ ను ప్రధాన కార్యదర్శి గౌరిగాని శ్రీనివాసులు ఎంపిక చేశారు. జిల్లాలో ముఖ్య నాయకులు, నియోజకవర్గ ఇంచార్జ్ లతో సమావేశం నిర్వహించి జిల్లా పార్టీ కార్యవర్గం, అనుబంధ విభాగాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పార్లమెంట్ నియోజకవర్గా కార్యకర్త కోడెల శివ ప్రసాద్ మహాదేవ నాయుడు, జంగాలపల్లి శ్రీనివాస్, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

ఆరు నూరైనా పాదయాత్ర కొనసాగుతుంది: చంద్రబాబు

  ఆరోగ్య సమస్యలెలా ఉన్నా పాదయాత్ర ఆపే ప్రసక్తి లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఆరు నూరైనా పాదయాత్ర ఆపేది లేదు. ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకొన్న తర్వాత వెనకడుగు ఉండకూడదు. బయట తిరిగేటప్పుడు ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. తట్టుకోవాలి. పాదయాత్రను జనవరి 26తో ముగించాలనుకొన్నాం. కానీ అప్పటికి అనుకున్న చోటుకు చేరడం సాధ్యమయ్యేలా లేదు. అవసరాన్ని బట్టి ఆ తర్వాత కూడా పాదయాత్ర కొనసాగుతుంది అని చెప్పారు. నేడు చంద్రబాబు పాదయాత్ర నిజామాబాద్ జిల్లా జుక్కల్, బాన్సువాడ నియోజక వర్గాలలో జరుగుతుంది. పిట్లం మండలంలోని బోల్లక్ పల్లి నుండి పాదయాత్ర ప్రారంభమై, బాన్స్ వాడ, తాడ్ కోల్ చౌరస్తా,  బస్సు స్టాండ్ ఎదురుగా అంబేద్కర్ విగ్రహం మీదుగా బీర్కూర్ క్రాస్ రోడ్డుకు చేరుతుంది. భోజన విరామం తరువాత సోమేశ్వరం, దేశాయిపేట, దుర్గి క్రాస్ రోడ్డు, అంకోల్ క్యాంప్, నెమలి, కామిశెట్టిపల్లి బిర్కూర్ క్రాస్  రోడ్ మీదుగా మైలారం క్రాస్ రోడ్ వద్దకు పాదయాత్ర చేరుకుంటుంది.      

పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రాజీనామా

చిత్తూరు జిల్లా పుంగనూర్ శాసన సబ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే పార్టీని వదిలేది లేదని స్పష్టం చేశారు. జిల్లా రాజకీయాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చిరకాల ప్రత్యర్ధి అయిన అయన కిరణ్ ముఖ్య మంత్రి అయినప్పటి నుండి పార్టీ లో అసంతృప్తితో ఉన్నారు. నవంబర్ ౩౦ లోపు కిరణ్ ను ముఖ్య మంత్రి పదవి నుండి తప్పించక పొతే, రాజీనామా చేస్తానని అయన గతంలోనే స్పష్టం చేశారు. అయన రాజీనామా నిర్ణయం తెలిసిన వెంటనే, పార్టీ సీనియర్ నాయకులను రంగంలోకి దించింది. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి మొదలు, రాష్ట్ర పీసిసి ఆధ్యక్షుడు బొత్సా సత్యానారాయణ, డి.శ్రీనివాస్ లు ఆయనకు ఫోన్ చేసి సముదాయించే ప్రయత్నం చేసారు. పార్టీలోనే ఉంటానని అయన అంటునప్పటికి, మరో రెండు, మూడు నెలల్లోపు రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగక పొతే, అయన జగన్ పార్టీలో చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తో అనేక మంది పార్టీ నాయకులకు వైరం ఉంది. అయితే, అయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే అది బలపడింది. పెద్దిరెడ్డి విషయం అలా కాదు. వీరి వైరం కొన్ని దశాబ్దాల నాటిది. ఈ పరిణామాలన్నీ చివరకు పెద్దిరెడ్డి రాజీనామాకు దారి తీశాయి.

గబ్బర్ సింగ్ డబుల్ సెంచరీ

  గబ్బర్ సింగ్ మూవీ సూపర్ హిట్.. చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ సినిమాకి అభిమానులు ఆశించిన స్థాయిలో హిట్టొచ్చింది. ఐదు సెంటర్లలో ఈ బొమ్మ రెండొందల రోజులు ఆడింది. పవన్ కల్యాణ్ తోపాటు ఇది అభిమానులక్కూడా చాలా సంతోషకరమైన విషయం.   కానీ.. ఆ ఆనందం పైకి పెద్దగా కనిపించడంలేదు. ఎందుకంటే ఈ సినిమాకి 50 రోజుల ఫంక్షన్, వంద రోజుల ఫంక్షన్ జరగనేలేదు. ఇప్పుడు అన్నీ కలిపి రెండొందల రోజుల ఫంక్షన్ గ్రాండ్ గా చేయాలని అభిమానులు తెగ ముచ్చటపడుతున్నారు.   హిందీలో సల్మాన్ చేసిన దబాంగ్ రీమేక్ గబ్బర్ సింగ్.. హిందీలో అప్పుడే సల్మాన్ సీక్వెల్ కూడా మొదలుపెట్టేశాడు. తెలుగులో మాత్రం ఇంకా సీక్వెల్ తీస్తారా లేదా అన్నదానిపై అస్సలు క్లారిటీ లేదు. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినా ప్రచారం జోరుగా సాగుతూనే ఉంది.   పవన్ ఓకే అంటే తాను సీక్వెల్ కి రెడీ అంటున్నాడు దర్శకుడు. దర్శకుడు, పవర్ హీరో సరేనంటే సీక్వెక్ నేను రెడీ అంటూ నిర్మాత స్టేట్ మెంట్. ముగ్గురూ కలిసి ఓ మాటమీద నిలబడితేనేగానీ ఈ విషయంలో క్లారిటీ వచ్చే సూచనలు కనిపించడంలేదు. పవన్ కల్యాణ్ మాత్రం హిందీలో దబాంగ్ 2 కి వచ్చే రెస్పాన్స్ ని చూసి తెలుగులో సీక్వెల్ గురించి ఆలోచిస్తామని చెబుతున్నాడు.

నామా కి ప్రతి సవాల్ విసిరిన టీఆర్ఎస్

    తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ దమ్ముంటే ఖమ్మం లోక్ సభ స్థానంలో పోటీ చేసి గెలిచి చూపించాలని టీడీపీ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సవాల్ కు తెలంగాణ రాష్ట్ర సమితి ఓకే చెప్పింది. దమ్ముంటే నామా నాగేశ్వరరావు లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని ప్రతి సవాల్ విసిరింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ప్రసన్నం చేసుకోవడానికి ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు, ఎంపీ నామా నాగేశ్వరరావులు కేసీఆర్ మీద అనవసర విమర్శలకు దిగుతున్నారని, మోత్కుపల్లి తన ప్రవర్తన మార్చుకోవాలని, లేకుంటే పరాభవం తప్పదని టీఆర్ఎస్ హెచ్చరించింది. ఖమ్మంలో తెలంగాణ వాదం బలహీనంగా ఉందని టీడీపీ ఆపోహా పడుతోందని, నామా రాజీనామా చేసి పోటీకి దిగితే తెలంగాణ వాదం సత్తా ఏంటో తెలుస్తుందని టీఆర్ఎస్ తెలిపింది.

విశాఖలో రేపిస్ట్ సైకో..

  ఆడామగా.. ఆరుబైట చల్లగాలికి హాయిగా మంచాలేసుకుని పడుకున్నారు. మంచి నిద్రలో ఎవరో మీదకొచ్చి ఏదో చేస్తున్నట్టు ఓ పీడకల. ఛటుక్కున కళ్ళు తెరిచి చూసేసరికి అది కలకాదు.. నిజమే.. ముఖానికి ముసుగేసుకున్న ఓ మనిషి వంటిమీద నూలుపోగైనా లేకుండా మీదపడి ఏదో చేయబోతున్న విషయాన్ని గ్రహించిన ఆడాళ్లు పెద్దపెట్టున కేకలు పెట్టారు. గోలగోలవుతోందని గ్రహించిన ఆ సైకో అలాగే దిసిమొలతోనే చీకట్లోకి పారిపోయాడు. ఇదేదో హార్రర్ సినిమానో లేక బూతు సినిమానో కాదు.. విశాఖ జిల్లాలో నిజంగా జరిగిన విషయం. ఇందిరానగర్ మధురవాడలోకి ప్రవేశించిన ఓ సైకో తలకి ముసుగేసుకుని దిసిమొలతో ఆడాళ్లను టార్గెట్ చేస్తూ ఏదో చేయబోయినప్పుడు జరిగిన వాస్తవ సంఘటన ఇది. ఆరుబైట పడుకున్న మహిళల్ని అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన సైకో.. వాళ్లు ఎదురుతిరిగేసరికి పారిపోయాడు. పోతూపోతూ ముగ్గురు మహిళల్ని తీవ్రంగా గాయపరిచి చీకట్లో మాయమైన సైకోకోసం స్థానికులు ఎంతగా గాలించినాకూడా లాభం లేకపోయింది.

షూటింగ్ లో అగ్నిప్రమాదం, 6 గురు సజీవ దహనం

    హైదరాబాద్ లో ఓక టీవి సీరియల్ కోసం వేసిన సేట్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే సజీవ దహనం అయ్యారు. సెట్లో లోని మంటలు పక్కనే ఉన్న అపార్ట్ మెంట్ కి వ్యాపించడంతో అందులో ఉంటున్నవారు ఉపరి ఆడాక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు తీశారు. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మణికొండ శివార్లలో సెక్రెటేరియట్ కాలనిలో ఓ సినిమా షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన సెట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న బాబా అపార్ట్ మెంట్ కి వ్యాపించాయి. బిల్డింగ్ అంతా పొగ కమ్ముకోవడంతో ఉపిరి తీసుకోలేక ఉక్కిరిబిక్కిరయ్యారు.  ప్రమాద స్థలానికి పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సకాలంలో స్పందించకపోవడం వల్లే ఇంత భారీ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు మరోవైపు ప్రభుత్వ అధికారులు కళ్లుమూసుకుని అపార్ట్‌మెంట్లకు అనుమతులు ఇవ్వడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

రుణ మాఫీ ఎలా చేస్తానో చేసిచూపిస్తా: చంద్రబాబు

    తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తొలి సంతకం రుణ మాఫీపైనే చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రుణ మాఫీ ఎలా చేస్తారో చెప్పాలని వైఎస్పార్‌సీపీ నేత విజయమ్మ ప్రశ్నించారని, రుణ మాఫీ ఎలా చేస్తానో చేసిచూపిస్తానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆయన దోచుకున్న సోమ్ము రికవరి చేస్తే రాష్ట్రంలోని రైతుల రుణాలను మూడు సార్లు మాఫీ చేయవచ్చునని అన్నారు. రాష్ట్రంలోని రైతులకు విత్తనాలు, ఎరువులు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని చంద్రబాబు విమర్శించారు.  తెలుగుదేశం హయాంలో గ్రామసభల ద్వారా అనేక సమస్యలు పరిష్కరించామని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతులు తీసుకున్న రుణాలన్నీ మాపీ చేస్తామని మరోమారు ఆయన స్పష్టం చేశారు.

జగన్ బెయిల్కు అనర్హుడు : సీబీఐ

    అక్రమాస్తుల కేసులో చంచల్ గూడ జైలులో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ బెయిల్ ఇచ్చేందుకు వ్యతిరేకించింది. 90 రోజుల లోపు విచారణ పూర్తి చేయకుంటే నిందితులకు బెయిల్ ఇవ్వవచ్చన్న దానికి సీబీఐ తన వాదనలో సమాధానం ఇవ్వలేదని జగన్ తరపు న్యాయవాది చెబుతున్నారు. పిఆర్సి 437, పిఆర్సి 167(2)కింద జగన్ బెయిల్ కోసం దరఖాస్తు చేస్తే సీబీఐ సమాధానం ఇవ్వడం లేదని, సీబీఐ తన దర్యాప్తు ఎప్పటికి పూర్తి చేస్తుందో కూడా చెప్పడం లేదని జగన్ తరపు న్యాయవాదులు చెబుతున్నారు. అయితే జగన్ కోర్టును తప్పుదారి పట్టించేందుకు బెయిల్ పిటీషన్ వేస్తున్నారని, ఆయన సుప్రీం కోర్టులో బెయిల్ పిటీషన్ వేసినప్పుడు 90 రోజుల గడువు పూర్తి కాలేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. ప్రస్తుత పరిస్థితులలో జగన్ కు బెయిల్ ఇవ్వవద్దని సీబీఐ కోర్టును కోరింది. జగన్ తరపున ప్రముఖ న్యాయవాది పద్మనాభ రెడ్డి వాదిస్తున్నారు. జగన్ కు బెయిల్ ఇప్పట్లో రాదని తెలుస్తోంది.

పుట్టపర్తి సత్యసాయి జయంతి వేడుకలు

    పుట్టపర్తి సత్యసాయి బాబా 87వ జన్మదిన వేడుకలు ప్రశాంతి నిలయంలో వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. త్రిపుర గవర్నర్ డీవై పాటిల్ శుక్రవారం ఉదయం బాబా జయంతి వేడుకలను ప్రారంభించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఇందుకు సంబంధించిన అన్నిఏర్పాట్లు చేసింది. ప్రశాంతి నిలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. సత్యసాయి మహా సమాధిని పుష్పాలలో అతి సుందరంగా అలంకరించారు. దేశవిదేశాలకు చెందిన వేలాది మంది సత్యసాయి భక్తులు ఇప్పటికే ప్రశాంతి నిలయం చేరుకున్నారు. కాగా సత్యసాయి 87వ జయంతి కానుకగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ పూర్వపు సత్యసాయి తాలూకాలోని పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల పరిధిలోని 118 గ్రామాలతో పాటు, బత్తలపల్లి మండలంలోని మరో 5 గ్రామాలకు రూ.80కోట్ల వ్యయంతో రక్షిత మంచినీటిని అందించే పనులకు నేడు శంకుస్థాపన చేయనుంది.  

తెలంగాణలో షర్మిల

    వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర గురువారం సాయంత్రం తెలంగాణలోకి అడుగు పెట్టింది. షర్మిల తుంగభద్ర నది మీదుగా మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశించారు. రాయలసీమలో 625 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిల మహబూబ్‌నగర్‌లో 225 కిలోమీటర్లు నడక సాగిస్తారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఆమె పాదయాత్ర సాగుతుంది. ఆమె వెంట పాదయాత్రలో వాసిరెడ్డి పద్మతో పాటు నల్లగొండ జిల్లాకు చెందిన జిట్టా బాలకృష్ణా రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యెడ్మ కిష్టారెడ్డి, స్వర్ణా సుధాకర్ ఉన్నారు. షర్మిల పాదయాత్ర మహబూబ్‌నగర్‌లోకి గురువారం మధ్యాహ్నం 2 గంటలకే ప్రవేశించాల్సి ఉంది. అయితే, ఆమె విశ్రాంతి తీసుకోవడం వల్ల, ఇతర కారణాల వల్ల ఆలస్యమైంది. గురువారం ఆమె మహబూబ్‌నగర్ జిల్లాలో 11 కిలోమీటర్లు నడవాల్సి ఉంది. అయితే, ఆలస్యం కావడంతో కొద్ది దూరం మాత్రమే ఆమె నడక సాగిస్తారు.  

పార్లమెంట్ మెయిన్ గేట్ వద్ద టి.కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

    తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు గురువారం పార్లమెంట్ వద్ద ఆందోళనకు దిగారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలంటూ పార్లమెంట్ ఒకటో నెంబర్ గేటు ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. అంతకు ముందు ఎంపీ మధుయాష్కీ నివాసంలో తెలంగాణ ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపారు. పార్లమెంట్‌లో వెంటనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టకపోతే సభను స్తంభింపజేస్తామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ విషయంలో అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవాలని ఎంపీలు తమ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కసబ్ ఉరిశిక్ష పై నేతల స్పందన

    కసబ్ ఉరిశిక్ష అమలుపై హిందూ, ముస్లిం, సిక్ అని తేడా లేకుండా అన్ని వర్గాల వారు ఆనందోత్సాహాలు ప్రదర్శిస్తున్నారు. ముంబై నగరంలో ఉండే డబ్బా వాలాలు కసబ్ ఫోటోలను దహనం చేశారు. కసబ్ ఉరిని కాంగ్రెసు, బిజెపి సహా అన్ని పార్టీలు స్వాగతించాయి. బహిరంగ ఉరి తీస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. ఆలస్యమైనా సరైన శిక్ష విధించారని ఇంకొంతమంది అభిప్రాయపడ్డారు. కసబ్ ఉరిపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది ఉగ్రవాది కసబ్ ఉరితీతపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పేర్కొన్నారు. న్యాయస్థానం నిర్ణయం మేరకే కసబ్‌కు ఉరిశిక్ష అమలు చేశామని, చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే అని సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. కసబ్ ఉరితీతను స్వాగతిస్తున్నాం టెర్రరిస్టు అజ్మల్ కసబ్ ఉరితీత ఆలస్యమైనా స్వాగతిస్తున్నామని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. పార్లమెంటు పై దాడి చేసిన అఫ్జల్‌గురును కూడా ఉరితీయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటన ఉగ్రవాదులకు ఓ హెచ్చరిక కసబ్ ఉరిశిక్షను స్వాగిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. రక్తపాతం సృష్టించిన కసబ్ కు ఉరిశిక్ష అమలు అందరూ ఆహ్వానించాలన్నారు. విదేశీ ఉగ్రవాదం కారణంగా అనేక మంది ప్రాణాలు విడిచారని, ఉగ్రవాదం పై ప్రభుత్వం ఉక్కు పడికిలి బిగించాలని కిషన్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదులకు కసబ్ ఉరితీత ఓ హెచ్చరిక అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు పార్లమెంటుపై దాడి చేసి అఫ్జల్‌గురుకు కూడా ఉరిశిక్ష అమలు చేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కసబ్ ఉరి.. భారతదేశ చట్టం శక్తిని తెలుపుతుంది... చట్టం ప్రకారం అజ్మల్ కసబ్ ఉరిశిక్ష అమలయిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యానించారు. ఎరవాడ జైలులో కసబ్ ను ఉరితీసి అతడి మృతదేహాన్ని పూడ్చిపెట్టడం జరిగిందన్నారు. అప్జల్ గురు సంగతేంటి..? అతడిని ఎప్పుడు ఉరి తీస్తారు..? గుజరాజ్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కసబ్ ఉరిశిక్ష అమలు విషయంపై ట్విట్టర్లో స్పందిస్తూ... కసబ్ ఉరి సరే... మరి అప్జల్‌గురు సంగతేంటని ప్రశ్నించారు. పార్లమెంటుపై దాడి చేయడమే కాకుండా పలువురు మరణానికి కారకుడయిన అప్జల్‌గురును వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు.  

కాంగ్రెస్ ఖతం కరో...హరీష్ నినాదం

    రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. ఇక నుంచి కాంగ్రెస్‌తో చర్చలు మాని తెలంగాణ కోసం మానుకోట వంటి పోరాటాలు చేస్తామని తేల్చిచెప్పారు. ‘కాంగ్రెస్ ఖతం కరో.. తెలంగణ హాసిల్ కరో..’ నినాదంతోనే ఉద్యమం చేస్తామని పేర్కొన్నారు. మొన్నటి వరకు టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో విలీనం అవుతుందనే బాధలో ఉన్న తెలంగాణ ప్రజలు కరీంనగర్‌లో కేసీఆర్ డిక్లరేషన్ ప్రకటనతో వారిలో కొత్త ఉత్సాహం వచ్చిందని హరీష్‌రావు తెలిపారు. సూర్యాపేట సమరభేరి సభతో మలిదశ ఉద్యమానికి నాంది పలుకుతామని తెలిపారు. తెలంగాణకు వ్యతిరేకం కాదని వందసార్లు చెప్పే బదులు అనుకూలమని ఒక్కసారి చంద్రబాబు చెప్లే చాలు అని అన్నారు.

కిషోర్ చంద్రదేవ్ పై గంటా ఫైర్

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలపై కాంగ్రెస్ అధిష్టానికి లేఖ రాశారన్న ఆరోపణలెదుర్కొంటున్న కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ పై మంత్రులు గంటా శ్రీనివాస రావు ధ్వజమెత్తారు. కిరణ్ కుమార్ రెడ్డిపై, సత్యనారాయణలపై లేని పోని వ్యాఖ్యలు చేసిన కిషోర్ చంద్రదేవ్ పై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని గంటా డిమాండ్ చేశారు. బాక్సైట్ అంశంపై ఏ అర్హతతో లేఖ రాశారో కిషోర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కిరణ్ బాగా పరిపాలిస్తున్నారని ఆయన కితాబిచ్చారు. పవర్ ప్లాంటులలో తనకు వాటాలు ఉన్నాయని కిషోర్ చెప్పడం గర్హనీయమని శత్రుచర్ల అన్నారు. తనకు పవర్ ప్లాంటులలో ఎలాంటి వాటాలు లేవన్నారు. వాటాలు ఉన్నట్లు నిరూపిస్తే తాను ఆత్మహత్యకు సిద్ధమని, నిరూపించని పక్షంలో ఆయన కూడా అందుకు సిద్ధంగా ఉంటారా అని సవాల్ విసిరారు.

తెలుగుభాషా ప్రచారం ప్రారంభం

  నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని మదనపల్లె మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రచారోత్సవాలు ఆడంబరంగా ప్రారంభించారు. ఎంపీడీవో గంగయ్య, తహసీల్దార్ అమరేంద్రబాబుల ఆధ్వర్యంలో మండలంలోని 16 గ్రామపంచాయతీల్లో విద్యార్థులచే ర్యాలీలు నిర్వహించారు. పొన్నూటిపాళెం పంచాయతీ కురవంకలో ఎంపీడీవో గంగయ్య, వీడీసీ మాజీ చైర్మన్ పి.చలపతి, కార్యదర్శి పవన్‌కుమార్, వలసపల్లెలో తహసీల్దార్ అమరేంద్రబాబు, పోతబోలు, చీకిలబైలులో ఆర్ఐలు నవీన్, సయీద్, వీఆర్వోలు ముజీబ్, సుబ్బారెడ్డి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని చైతన్యభారతి, విజయభారతి స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.