‘ఇద్దరు’ ఫై కాంగ్రెస్ లో తర్జన భర్జనలు
posted on Dec 13, 2012 @ 10:48AM
ఈ నెల 28 న తెలంగాణా విషయం ఫై ఢిల్లీ లో జరుపతలపెట్టిన సమావేశానికి ప్రతి పార్టీ నుండి ఇద్దరేసి నేతలను పిలవాలని సూచించడం కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చకు దారి తీసింది. దీనికి హాజరయ్యేందుకు ఒక్కరే రావాలని సూచించాల్సిందిగా కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని తెలంగాణా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అయితే, కోస్తాంధ్ర నేతలు మాత్రం, ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు.
ప్రతి పార్టీ నుండి ఎందరు వెళ్లారనేది ముఖ్యం కాదని, ఆయా పార్టీలు తెలంగాణా కు అనుకూలంగా మాట్లాడారా లేదా అనేది ముఖ్యమని మరి కొంతమంది కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ లు త్వరలో సమావేశం అయిన తర్వాత ఈ సమావేశానికి ఎవరిని పంపించాలనే విషయంఫై తుది నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. గతంలో ఈ విషయం ఫై జరిగిన సమావేశానికి కావూరి సాంబశివ రావు, ఉత్తమ కుమార్ రెడ్డి హాజరయ్యారు. అయితే, కావూరి ప్రస్తుతం కాంగ్రెస్ కు దూరంగా ఉండడంతో, ఆయన పేరు పరిశీలనలోకి తీసుకోవకపోవచ్చు.
ఈ నెల 15,16 తేదీల్లో హైదరాబాద్ లో జరగనున్న పార్టీ సదస్సులో పాల్గొనడానికి గులాం నబీ అజాద్ హైదరాబాద్ వస్తున్నారు. అయితే, ఈ సమావేశాల్లో తెలంగాణ అంశంఫై చర్చ జరగదని బొత్స చెపుతున్నప్పటికీ, ఏదో ఒక రూపంలో తెలంగాణా అంశాన్ని ప్రస్తావించాలని తెలంగాణా నేతలు భావిస్తున్నారు.