Kavuri sambasiva rao

కావూరి కాంగ్రెస్ కి దూరమైతే ఉత్తరాంధ్రలో పార్టీ అధోగతేనా?

      ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కావూరి సాంబశివ రావు ఇక కాంగ్రెస్ కు దూరం అయినట్లే అయన మాటలను బట్టి భావించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ కు చేసిన సేవలు చాలని, ఇక పార్లమెంట్లో అడుగు పెట్టానని ఆయన స్పష్టంగానే ప్రకటించారు.   ఇప్పటికే తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటికీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తనకు స్వయంగా ఫోనే చేసి, ఎఫ్ డి ఐ ల ఫై ఓటింగ్ లో పాల్గొనాలని సూచించడంతో వచ్చానని, ఢిల్లీ లో ఉన్నప్పటికీ సోనియా గాంధీ ని కలిసే అవకాశం లేదని ఆయన అన్నారు. తనకు పార్టీలో ఏ పదవీ అక్కర్లేదని కావూరి స్పష్టంగానే చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడితే, వచ్చే ఎన్నికల్లో మరో పార్టీ నుండి పోటీ చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లకు తగిన స్థానం లేదని ఆయన అన్నారు. ఈ నెలాఖరులో కొల్లేరు సమస్య ఫై ఆందోళన చేపట్టాలని ఆయన భావిస్తున్నారు. తన భవిష్యత్ కార్యచరణఫై ఇప్పుడే ఏమీ చెప్పలేనని ఆయన అంటున్నప్పటికీ, ఈ ఆందోళన ద్వారా ప్రజల్లో ఉంటున్నట్లుగా సంకేతాలిస్తూ, మరో పార్టీలో చేరడానికి దీనిని వేదికగా ఉపయోగించుకోవాలనేది ఆయన ఆలోచనగా సమాచారం.

 Purandeswari

పురందేశ్వరి, టి ఎస్ ఆర్ ల మధ్య ‘కోల్డ్ వార్’ ?

    వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విశాఖపట్నం నుండి పోటీ చేసే విషయంలో కేంద్ర మంత్రి పురందేశ్వరి, పారిశ్రామిక వేత్త, టి. సుబ్బరామి రెడ్డి ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. 1996, 1998 సంవత్సరాల్లో 11 వ, 12 వ లోక్ సభలకు జరిగిన ఎన్నికల్లో సుబ్బరామి రెడ్డి ఇక్కడ నుండి పోటీ చేసి గెలుపొందారు. గత ఉప ఎన్నికలో ఆయన నెల్లూరు లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి,మేకపాటి రాజ మోహన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. కాగా, గత ఎన్నికల్లో పురందేశ్వరి విశాఖ నుండి పోటీ చేసి గెలుపొందారు. వచ్చే 2014 ఎన్నికల్లో తనకు ఈ స్థానమే కావాలని సుబ్బరామి రెడ్డి అధిష్టానం వద్ద పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం పురందేశ్వరికి ఇవ్వవద్దని కొందరు నేతలు ఇటీవల వచ్చిన రాహుల్ గాంధీ దూతలకు సూచించారు. దూత జితేందర్ నిన్న విశాఖలో ఈ స్థానం విషయంలో నాయకులు, మాజీ కార్పొరేటర్ల నుండి అభిప్రాయ సేకరణ చేశారు. ఎక్కువ మంది నేతలు పురందేశ్వరికి ఈ స్థానం కేటాయించవద్దని జితేందర్ కు సూచించినట్లు సమాచారం. ఈ సీటు విషయంలో వీరిద్దరి మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం నడుస్తోందని తెలుస్తోంది.

KCR telangana

అఖిలపక్షాన్ని సీరియస్ గా తీసుకోని కేసిఆర్ ?

  తెలంగాణా ఫై ఈ నెల 28 న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన అఖిల పక్ష సమావేశాన్ని టిఆర్ఎస్ అధినేత కే సి ఆర్ ఓ జోక్ గా అభివర్ణించారు. ఎఫ్డి ఐ ఓటింగ్ విషయం ఫై తెలంగాణా కాంగ్రెస్ ఎంపీ లను ఓట్లను పొందేందుకే ఆ పార్టీ అధిష్టానం ఈ తేదీని ప్రకటించిందని ఆయన అన్నారు. గతంలోనే ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చిదంబరం పార్లమెంట్ లో ప్రకటించారని, అయితే, అది ఇప్పటి వరకూ ఏర్పాటు కాలేదని ఆయన విమర్శించారు.దీనిని బట్టి ఈ సమావేశాన్ని కేసిఆర్ అంత సీరియస్ గా తీసుకోవడం లేదని తెలుస్తోంది.   తమ పార్టీ తరపున కేసిఆర్ ఈ సమావేశానికి హాజరవుతారని, అలాగే అన్ని పార్టీలు తమ అధ్యక్షులను మాత్రమే దీనికి పంపించాలని టిఆర్ఎస్ శాసనసభ్యుడు తారక రామారావు విజ్ఞప్తి చేశారు.

NTR statue in Parliament

పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహం

    తెలుగువారి ఆత్మగౌరవ నినాదాన్ని ఎలుగెత్తి చాటిన మాజీ ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు (నందమూరి తారకరామారావు) విగ్రహాన్ని పార్లమెంట్ లో ఏర్పాటు చేసేందుకు ఉన్న అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి. ఎన్టీఆర్ విగ్రహాన్ని సమర్పించాలని లోక్ సభ సెక్రటరీ జనరల్ కేంద్ర మంత్రి, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి సూచించారు. హైదరాబాద్ కు చెందిన మహా చార్య అనే శిల్పి దీనిని తయారు చేయనున్నారు. అయితే, విగ్రహాన్నితామే సమర్పిస్తామని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఒకరితో ఇకరు పోటీకి వచ్చారు. అయితే, చివరకు ఈ అవకాశం పురందేశ్వరికే దక్కింది. ఈ విగ్రహం రాజ్యసభ ఆరో నంబర్ విశ్రాంతి మందిరం పక్కన, తమిళ నేత మురసోలి మారన్ విగ్రహం ఎదురుగా ప్రతిష్టించనున్నారు. తాము ఇచ్చే విగ్రహం రాగి, సీసం, తగరం, జింకు వంటి లోహాలతో తయారుచేయాలని లోక్ సభ సెక్రటేరియట్ మంత్రికి సూచించింది. ఎన్టీఆర్ జయంతి అయిన మే 28 న పార్లమెంట్లో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించాలని పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారు.    

TRS T JAC

‘అఖిలపక్షం’ ఫై టిఆర్ఎస్, జెఎసిల్లో ఆనందం

    తెలంగాణా విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ నెల 28 న అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం తో ఒక్కసారిగా ప్రత్యేక తెలంగాణా రాజకీయాలు వేడెక్కాయి. ఏది ఏమైనా తెలంగాణా రాష్ట్ర సమితి నాయకులు మాత్రం ఈ ప్రకటనతో ఆనందంతో ఉన్నారు. అలాగే, తెలంగాణా జెఎసి విషయం కూడా.   రాష్ట్రంలోని ఒక్కో పార్టీ నుండి ఒక్కరినే ఈ సమావేశానికి పిలవాలని హరీష్ రావు, కోదండ రామ్ వంటి నేతలు డిమాండ్ చేస్తున్నారు. వారు పార్టీ అధ్యక్షులు అయితే ఇంకా బాగుంటుందని వారన్నారు. మరో వైపు ఈ ప్రకటనతో తెలంగాణా వస్తుందన్న నమ్మకం పూర్తి స్థాయిలో ఏర్పడిందని, ఇది చారిత్రాత్మకమని తెలంగాణా కు చెందిన కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తెలంగాణా ఫై అఖిల పక్షాన్ని డిమాండ్ చేసిన తెలుగు దేశం ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయం ఫై అంతటా ఉత్కంట నెలకొని ఉంది. ప్రత్యేక రాష్ట్రం విషయంలో కేంద్రమే ఓ నిర్ణయం తీసుకోవాలని గతంలో తీర్మానించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఏమి చేస్తుందనేది కూడా సస్పెన్సే. బహుశా, ముందుగా కాంగ్రెస్ తన నిర్ణయాన్ని ప్రకటించాలని జగన్ పార్టీ సూచించే అవకాశాలున్నాయి. ఏది ఎలా ఉన్నా, రాష్ట్రంలో ఇక ‘తెలంగాణా’ రాజకీయాలు వేడెక్కే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ పెద్దలు తీసుకొన్న ఈ చొరవను తన ఖాతాలో వేసుకోవడానికి టిఆర్ఎస్ నేతలు ప్రయత్నించడం కొసమెరుపు.

mangali krishna paritala ravi

మంగలి కృష్ణకు విముక్తి

    అనంతపూర్ జిల్లాలో సంచలనం రేకెత్తించిన సూట్ కేసు బాంబు కేసులో జైలులో ఉన్న పులివెందుల కృష్ణ అలియాస్ మంగలి కృష్ణ కు కోర్టు ఆ కేసు నుండి విముక్తి కలుగ చేసింది. ఈ కేసులో ఉన్న ఇతర ముద్దాయిలకు కూడా కోర్టు తీర్పు ఊరటనిచ్చింది. తగిన సాక్ష్యా దారాలు లేని కారణంగా ఈ కేసును కొట్టి వేస్తూ అనంతపూర్ నాలుగో అదనపు ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. 2001 మార్చి 19 న తెలుగుదేశం ఎంఎల్ఏ పరిటాల రవీంద్రను సూట్ కేసు బాంబు ప్రయోగించి హత్య చేయడానికి విఫల యత్నం జరిగింది. మంగలి కృష్ణ తో పాటు, మరో నలుగురి ఫై అనంతపూర్ పోలీసులు 2005 లో ఈ కేసు నమోదు చేశారు. మద్దెల చెరువు సూరి అనుచరుడు భాను కిరణ్ కు తుపాకీ సరఫరా చేసిన కేసులో కూడా మంగలి కృష్ణ కు ఇదివరకే బెయిల్ లభించిన విషయం తెలిసిందే.

nandamuri balakrishna

కొడాలిపై విరుచుకుపడ్డ బాలకృష్ణ ఫ్యాన్స్

    తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన గుడివాడ ఎంఎల్ఏ కొడాలి నాని విషయంలో ‘మాటకు మాట’ విధంగా పరిణామాలు జరుగుతున్నాయి.కొడాలి నాని నటుడు బాల కృష్ణ ఫై చేసిన విమర్శలకు బాల కృష్ణ అభిమానులు ఘాటుగా స్పందించారు.   ‘ఎన్ టీ ఆర్ అభిమానివనీ, నందమూరి కుటుంబానికి వీర విదేయుడవనీ ఇన్ని రోజులు నీకు విలువనిచ్చాం. మా బాలకృష్ణ ఫై పిచ్చి కూతలు కూస్తావా, ఖబడ్దార్’ అంటూ అఖిల భారత నందమూరి బాల కృష్ణ అభిమాన సంఘం కన్వీనర్ జి ఎల్ శ్రీధర్ ఘాటు పదజాలంతో కొడాలి నానికి వార్నింగ్ ఇచ్చారు. సిట్టింగ్ ఎంఎల్ఏ ను కాదని పార్టీనీకు రెండుసార్లు టికెట్ ఇచ్చినా, బాలయ్య ఫైనే పిచ్చి కూతలు కూస్తావా అంటూ శ్రీధర్ నానీకి హెచ్చరిక చేశారు. నాని తాను చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా బాలయ్యకు క్షమాపణలు చెప్పాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. నందమూరి పేరు చెప్పుకొని కోట్లు సంపాదించిన కొడాలి నాని ప్రస్తుతం జగన్ పార్టీకి అమ్ముడుపోయారని ఆయన వ్యాఖ్యానించారు.‘నీ మీద పోటీ చేయడానికి బాలకృష్ణ అక్కర్లేదు. గుడివాడలో ఓ సాధారణ కార్యకర్తను నిలబెట్టి కూడా గెలిపించుకోగలం’ అని శ్రీధర్ వ్యాఖ్యానించారు. ‘బాలకృష్ణ రాష్ట్రంలో ఎక్కడి నుండి అయినా పోటీ చేసి గెలవగలరు. కొడాలి నాని గుడివాడ దాటితే, వెయ్యి ఒట్లయినా ఆయనకు వస్తాయా’ అని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు వ్యాఖ్యానించారు.తమ నేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశిస్తే బాల కృష్ణ ఫై కూడా పోటీ చేస్తానని కొడాలి నాని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

 Jagan bail

జగన్ బెయిల్ పిటీషన్ కు అనర్హుడు

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ కు సిబిఐ కోర్టు మరో సారి బెయిల్ ను నిరాకరించింది. ప్రస్తుత దశలో జగన్ బెయిల్ అడగటానికి వీలు లేదని సిబిఐ కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఏడు అంశాల ఫై విచారణ జరుగుతోందని, కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న ఈ తరుణంలో జగన్ కు బెయిల్ ఇస్తే, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అందువల్ల బెయిల్ ఇవ్వవద్దన్న సిబిఐ వాదనతో కోర్టు ఏకీభవించి జగన్ కు బెయిల్ నిరాకరించింది.   ఆయనకు బెయిల్ ఇస్తే, విచారణకు అవాంతరాలు ఏర్పడతాయని కూడా సిబిఐ, కోర్టుకు విన్నవించింది. ఆరు నెలల వరకూ జగన్ ఏ కోర్టు లోనూ బెయిల్ కు పిటీషన్ వేయకూడదని సుప్రీంకోర్టు సూచించిన విషయాన్ని కూడా సిబిఐ అధికారులు కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. దీనితో కోర్టు జగన్ బెయిల్ పిటీషన్ ను తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు సిబిఐ దర్యాప్తునకు కాల పరిమితి విధించలేదని ప్రత్యెక కోర్టు స్పష్టం చేసింది. దేశంలోని ఏ న్యాయస్థానమైనా సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిందేనని న్యాయమూర్తి వివరించారు.

chandrababu

భాష ఫై చంద్రబాబు నాయకులకు క్లాస్

    పల్లెల్లోని ప్రజల వద్ద ఉపయోగించాల్సిన భాష ఫై తెలుగు దేశం అధినేత చంద్ర బాబు నాయుడు తన పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. జగన్ లక్ష కోట్లు తిన్నాడని ప్రజలకి చెపితే వారికి అర్ధం కాదని, వెయ్యి లారీల డబ్బు తిన్నాడని ( జగన్ డబ్బును వందల నోట్లలోకి మారిస్తే) చెపితే అర్ధమవుతుందని బాబు అన్నారు. తాను జగన్ అవినీతిని ప్రజలకు అర్ధమయ్యే భాష లో వివరించినపుడు ప్రజలనుండి స్పందన అధికంగా వచ్చిందని బాబు వెల్లడించారు. ఇలా చెపితే నాయకులకు ఏమి అర్ధమౌతుంది ? పార్టీ ముఖ్య నాయకులందరినీ హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు పిలిపించి, రాజకీయ పరిబాష పుష్టిగా ఉన్నవారితో  ప్రత్యెక క్లాస్ ఇప్పిస్తే ఉపయోగం ఉంటుంది. మొత్తానికి తన వెయ్యి కిలోమీటర్ల పాద యాత్ర లో బాబు సరికొత్త విషయాలను నేర్చుకుంటున్నట్లుగా ఉంది. ప్రజలను ఆకట్టుకోవడానికి బాబు చేసే ఈ కొత్త ఆలోచనలు తగిన ఫలితాలు ఇస్తాయో, లేదో తేలాలంటే మాత్రం 2014 వరకూ వేచి చూడాల్సిందే.

 KCR telangana

మళ్ళీ నిద్ర లేచిన కే.సి.ఆర్.

    ఇక తెలంగాణా ప్రజలకి నేనూ నా పార్టీ తప్ప మరొక దిక్కు లేదు, అని హోల్ సేల్ గా అటు తెలంగాణా ప్రజలమీదా ఇటు తెలంగాణా విషయం మీదా పేటెంట్ హక్కులు పొందినట్లు మాట్లాడే తె.రా.స. అధ్యక్షులవారు శ్రీమాన్ చంద్రశేఖరులు ఆ అభిజాత్యం తోనే ఇంత వరకు మిగిలిన పార్టీలవారిని ముఖ్యంగా బిజేపిని, తెలంగాణా కాంగ్రేసు వాళ్ళని చులకనగా చూసేవారు. ఒక వైపు చంద్రబాబు మరో వైపు షర్మిల కూడా తమ పెరట్లో చక్కబెట్టేస్తున్నప్పటికీ, 'అవి తమ పెరట్లో తిరిగే కోళ్ళు వాటిని తానూ ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు' అనే భ్రమలో ఇంతవరకు ఉపేక్షించిన ఆయన ఒక్కసారిగా షర్మిలమ్మ 'గద్వాల్ సవాల్తో' ఉళ్లికిపడి లేఛి చూసేసరికి మరోవైపు చంద్రబాబు కూడా తన ఇలాకాలో అప్పుడే 1000 రోజులు బట్టి తిరుగుతున్నట్లు తెలిసింది ఆయనకీ. అది గాకుండా, తెలంగాణా మేము తప్పక ఇస్తామని ప్రతిజ్ఞ చేసిన బి.జే.పి.తో పంతానికి పోయి దానితోదూరం ఉన్నందుకూ, కోదండాచార్యులవారిని పట్టించుకోనందుకూ మొన్న జరిగిన తెలంగాణా జే.ఏ.సి.సమావేశంలో కే.సి.ఆర్.కి కొందరు సుద్దులు కూడా చెప్పడం అయిన తరువాత ఆయనలో మార్పో లేక చలనమో వచ్చినట్లు కనిపిస్తోంది. ఇంతవరకూ అటువంటి మతతత్వపార్టీతో అంటకాగితే రేపు మైనార్టీ వర్గాల ఓట్లు రాలవేమో అని కాస్త దూరం పాటించిన కే.సి.ఆర్.గారికి అలనాడు బోధీ వృక్షం క్రింద కూర్చొని తపస్సు చేసిన గౌతమ బుద్దునికి జ్ఞానోదయం అయినట్లు,తెలంగాణా జే.ఏ.సి.సమావేశంలోజ్ఞానోదయం అయినట్లు కనిపిస్తోంది. ఇంతవరకూ తానూ కాంగ్రేసు తోక పట్టుకొని తెలంగాణా కోసం యెంత ఈదిన అది ఒడ్డుకి జేరక పోవడంతో, ఇప్పుడు ఏ బి.జే.పి.ని ముట్టుకొంటే తానూ మైలపడిపోతననుకోన్నడో ఇప్పుడు అదే బి.జే.పి.ని నమ్ముకోవడమే మంచిదేమో అనే ఒక ధర్మ సందేహం కూడా బయట పెట్టేరు.అయిష్టంగానయినా తెలంగాణా బి.జే.పి నాయకులతో ఎన్నికల సర్దుబాట్లు తప్పనిసరి అని గ్రహించినట్లు కనిపిస్తోంది. అంతేగాక,తెలంగాణా జే.ఏ.సి. ఆద్వర్యంలో ఇక 'పల్లెబాట' పట్టేందుకు సిద్దం అయి, ఇక తన పెరట్లో తిరుగుతున్న తే.దే.పా. మరియు పిల్ల కాంగ్రేసుల సంగతీ అటో ఇటో తెల్చేసందుకు తన కత్తులు పదును పెట్టుకొంటునట్లు తెలుస్తోంది. చంద్రబాబు చెప్పినట్లు ఆరు నెలలు పడుకొని, ఆరు నెలలు లేచి మాట్లాడే కే.సి.ఆర్. మళ్ళీ నిద్రలోంచి లేచినట్లు కనిపిస్తోంది. మళ్ళీ నిద్రలోకి జారుకోనక మునుపే, కొన్ని పనులయిన చక్క బెట్టక పొతే మళ్ళీ మేలుకోనేసరికి పరిస్తితులు చేయి దాటి పోవచ్చునని తెలుసుకోన్నట్లు కనిపిస్తోంది.  

Jitendra Deshprabhu illegal mining case

రాహుల్ దూత గతం ఏమిటి ?

    కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ దూతగా రాష్ట్రానికి వచ్చిన జితేంద్ర దేస్ ప్రభు గతం అంతా నేరమయమే. గోవాకు చెందిన ప్రభు గతంలో శరద్ పవార్ పార్టీ ఎన్సిపి తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. గోవాలో బయట పడిన అక్రమ మైనింగ్ వ్యవహారంలో ప్రభు పాత్ర ఉందని గోవా పోలీసులు నిర్ధారించి ఆయనను అరెస్టు కూడా చేశారు. ఆయనకు 1.72 కోట్ల జరిమానా పడింది.   కార్గోవా గ్రామంలో రెండు లక్షల టన్నుల మేర ఐరన్ ఒర్ అక్రమ మైనింగ్ కు ప్రభు పాల్పడ్డారని, దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు 50 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పోలీసులు ప్రభు ఫై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ప్రభు ఇటీవలే కాంగ్రెస్ లో చేరి అధికార ప్రతినిధి గా బాధ్యతలు చేపట్టారు. అయనను పార్టీలో చేర్చుకోవడంఫై బిజెపి కాంగ్రెస్ పార్టీ ని తీవ్రంగా విమర్శించింది కూడా. అలాంటి వ్యక్తికి ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్దుల విజయావకాశాల ఫై సర్వే చేసే పనిని పార్టీ అప్పగించింది. ఇలాంటి వ్యక్తి ప్రస్తుతం వివిధ స్థానాలకు పార్టీ అభ్యర్దులను ఎంపిక చేసే కసరత్తులో పాలు పంచుకుంటున్నాడు. ఇలాంటి నాయకుల వల్ల పార్టీకి లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతోందని పార్టీకి చెందిన నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  

KCR BJP

ఎన్డిఏ వైపు కేసిఆర్ ?

    ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం ఇక కాంగ్రెస్ వల్ల రాదని తేల్చుకున్న టిఆర్ఎస్ అధినేత కే. చంద్ర శేఖర రావు ఎన్డిఏ వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తన పార్టీ నాయకులతో అన్నట్లు సమాచారం. కాంగ్రెస్ హై కమాండ్ తెలంగాణా విషయంలో తమను మోసం చేసిందనే అభిప్రాయంతో ఉన్న కేసిఆర్ ఇక ఎన్డిఏ ను నమ్ముకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు భావిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే, వంద రోజుల్లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఇస్తామని బిజెపి గతంలో అనేక సార్లు ప్రకటించిన విషయాన్ని కూడా కేసిఆర్ తన పార్టీ నాయకులకు గుర్తు చేస్తున్నారు.అకస్మాత్తుగా, కేసిఆర్, ఎన్డిఏ మంత్రం జపించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2014 లో కేంద్రంలో ఎన్డిఏ అధికారంలోకి రావడం దాదాపు ఖాయమని కేసిఆర్ భావిస్తుండడం కూడా ఇందుకు ఒక కారణం.  ఒక వేళ అది నిజమైతే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు తధ్యమని కేసిఆర్ భావిస్తున్నారు. ఎన్డిఏ ద్వారా తెలంగాణా ఏర్పడితే, తమ పార్టీనే ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంటుందనీ, అదే కాంగ్రెస్ ద్వారా ప్రత్యెక రాష్ట్రం ఏర్పడితే, టిఆర్ఎస్ ను తమ పార్టీలో విలీనం చేయాలని కాంగ్రెస్ షరతులు పెడుతుందని కేసిఆర్ భావిస్తున్నారు.

YS sharmila YS jagan

వైఎస్ కుటుంబంలో అభిప్రాయ బేధాలు ?

    కడప పార్లమెంట్ సీటుకు అభ్యర్ధిని ఎంపిక చేసే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభిప్రాయ భేదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య చిచ్చుకు కారణం కాబోతోందా ? ప్రస్తుత చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే వీటికి సమాధానం అవుననే అగుపిస్తోంది. 2014 లో కడప స్థానం నుండి తన బాబాయి కుమారుడు అవినాష్ రెడ్డి పోటీ చేస్తారని జగన్ మోహన్ రెడ్డి సంవత్సరం క్రితమే ప్రకటించారు. దీనితో ఈ నియోజక వర్గంలో పాద యాత్రతో తన ప్రచారాన్ని మొదలపెట్టాలని ఆయన పధక రచన చేసుకున్నారు. అయితే, జగన్ సోదరి షర్మిలా కూడా ఇదే స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలియడంతో అవినాష్, అయన కుటుంబ సభ్యులు అసంతృప్తి తో ఉన్నారు. షర్మిలా కడప నుండి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తోందని తెలియడంతో ప్రమాదాన్ని నివారించడానికి తన పాద యాత్రను వాయిదా వేసుకోవాలని పార్టీ నాయకులు అవినాష్ కు సూచించారు. అయితే, జగన్ జైలులో ఉండడంతో, షర్మిలా మాటే చెల్లుబాటు అయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వివేకానంద రెడ్డి జగన్ నుండి గతంలో  దూరం కావడంతో చీలిన వై ఎస్ కుటుంబం మరో సారి ఈ సీటు విషయంలో అదే జరుగుతుందా అనే ఆందోళనలు వై ఎస్ కుటుంబంలో నెలకొని ఉన్నాయి.

 Gali Janardhan Reddy

జైలు నుంచే గాలి ఎన్నికల్లో పోటి

    అక్రమ గనుల తవ్వకాల కేసులో చంచల్ గూడ జైల్‌లో వున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి వచ్చే సంవత్సరం మేలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బదవ శ్రామిక రైత కాంగ్రెస్‌ తరపున పోటీ చేయనున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో గనుల కేసులో సిబిఐ జనార్ధన్‌రెడ్డిని అరెస్టు చేసింది. ఏడాది కాలంగా ఆయన జైలులోనే ఉన్నారు. అయితే జనార్థన్‌రెడ్డి వచ్చే ఎన్నికలలో బిఎస్‌ఆర్‌ కాంగ్రెస్నుండి బళ్ళారి, కుష్తాగి, చిత్ర దుర్గా నియోజకవర్గాలలో ఏదో ఒకచోట నుండి పోటీచేయనున్నారు. ఎక్కడ నుంచి పోటీచేసేది ఆయన నిర్ణయంపైనే ఉంటుందని’ ఆయన సోదరుడు, బళ్ళారి ఎంఎల్‌ఎ జి సోమశేఖరరెడ్డి తెలిపారు.

indrakaran reddy jagan

జగన్ పార్టీలోకి ఇంద్ర కరణ్

    కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు ఇంద్ర కరణ్ రెడ్డి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు ఆయన జిల్లా కే చెందిన మాజీ శాసనసభ్యుడు కోనేరు కోనప్ప కూడా జగన్ పార్టీలో చేరారు. ఈ నెల 17 వ తేదీన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో జరిగే బహిరంగ సభలో పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో వీరు జగన్ పార్టీలో అధికారికంగా చేరనున్నారు. ఈ ఇద్దరు నాయకులు గత శుక్రవారం చంచల్ గూడా జైలులో జగన్ ను కలిసి దాదాపు గంట సేపు చర్చలు జరిపారు.ఇంద్ర కరణ్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో బలమైన నేత. అంత క్రితం తెలుగు దేశం పార్టీలో పని చేసిన సమయంలో అయన పార్లమెంట్ సభ్యునిగా, జిల్లా పరిషత్ అధ్యక్షునిగా కొనసాగారు. పి వి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఇంద్ర కరణ్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఒకటిన్నర నెలల క్రితం అయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వై ఎస్ వర్గంగా ముద్ర పడ్డ ఇరువురు నేతలు మొదటి నుండి జగన్ పార్టీ వైపే మొగ్గు చూపుతూ వచ్చారు. తెలంగాణా ప్రత్యెక రాష్ట్రాన్ని తాము అడ్డగించమని జగన్ తనకు చెప్పారని ఇంద్ర కరణ్ అన్నారు.    

ప్రమాదం నుంచి బయటపడ్డ పరిటాల అనుచరుడు

    దివగంత పరిటాల రవీంద్ర అనుచరుడు చమన్ రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. విజయవాడ నుంచి హైదరాబాద్ కి వస్తున్న చమన్ కారు జగ్గయ్య పేట మండలం అన్నమంచిపల్లి వద్ద ప్రమాదానికి గురైంది. రాంగ్ రూట్ లో వస్తున్న ఇసుక లారీ డీ కొనడంతో కారులో వున్న చమన్ తో సహా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిని విజయవాడలోని ప్రైవేటు అసుపత్రికి పోలీసులు తరలించారు. ప్రస్తుతం చమన్ హాస్పటల్లో కోలుకుంటున్నాడు. పరిటాల రవికి కీలక అనుచరుడుగా వున్న చమన్, ఇటీవల రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రధాన రాజకీయపార్టీ నుంచి పోటి చేయనున్నాడు.

రావి కుమార్తె రిసెప్షన్‌కు బాలయ్య

    ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి బాలకృష్ణ గుడివాడ నియోజకవర్గ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు కుమార్తె రిసెప్షన్‌కు హాజరుకానున్నారు. రావి వెంకటేశ్వకరరావు కుమార్తె వివాహం నవంబర్ 29న హైదరాబాద్‌లో జరిగింది. గుడివాడలో జరిగే రిసెప్షన్‌కు బాలకృష్ణ వస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా జిల్లాలోని పార్టీ నాయకులతో ఆయన సమావేశమవుతారని కొందరు అంటున్నప్పటికీ, అందులో వాస్తవం లేదని జిల్లా పార్టీ నాయకుడొకరు చెప్పారు. కేవలం రిసెప్షన్‌లో పాల్గొనేందుకే ఆయన గుడివాడ వస్తున్నారని  పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలలో తాను అసెంబ్లీకే పోటీ చేస్తానని బాలకృష్ణ ఇటీవల స్పష్టం చేశారు. కృష్ణా, అనంతపురం జిల్లాలోని ఏదోక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే బాలయ్య ఇంతవరకు తన అంతరంగాన్ని బయటపెట్టలేదు. గుడివాడలో జరిగే రిసెప్షన్‌కు వస్తున్న బాలయ్య అక్కడ జిల్లా నాయకులతో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉందని అంటున్నారు.

అమీతుమీకి కిరణ్, డిఎల్ ?

    మొదటి నుండీ బద్ధ వైరం తో ఉంటూ వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి డి ఎల్ రవీంద్రారెడ్డి ల మధ్య వైరం తుది దశకు చేరినట్లే. మంత్రి ధర్మాన ప్రసాద రావును ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిని నిరాకరిస్తూ రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా డి ఎల్ డీసెంట్ నోట్ రాయడమే ఇందుకు కారణం. డీసెంట్ నోట్ రాసే నిభందనేదీ రాజ్యాంగంలో లేదనీ, క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలకు మంత్రి మండలి అంతా కట్టుబడి ఉండాల్సిందేనని మఖ్యమంత్రి స్పష్టం చేశారు. క్యాబినెట్ నిర్ణయాలను వ్యతిరేకించేవారు తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేయవచ్చని, లేదా తానే వారిని తొలగిస్తానని కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించడంతో ఈ వివాదం తారా స్థాయికి చేరింది. ఏ మంత్రి అయినా, క్యాబినెట్ నిర్ణయానికి అభ్యంతరం వ్యక్తం చేస్తే వారు తమంతట తాముగా తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుందనీ సుప్రీంకోర్టు ఓ తీర్పులో స్పష్టం చేసిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. మోపిదేవి విషయం, ధర్మాన విషయం వేరని ముఖ్యమంత్రి అన్నారు. మోపిదేవిని సిబిఐ అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేసిందనీ,అందుకు ప్రభుత్వ అనుమతి కోరలేదని అయన అన్నారు. అయితే, ధర్మాన ను ప్రాసిక్యూట్ చేయడానికి సిబిఐ తమ అనుమతి కోరిందని ముఖ్యమంత్రి వివరించారు. పొతే పోవచ్చని ముఖ్య మంత్రి వ్యాఖ్యానించడం, సి ఎం, డి,ఎల్ ఇద్దరూ తమ వైఖరులకు కట్టుబడి ఉండడంతో, ఈ పరిణామం ఎటు వైపు కు దారి తీస్తుందో నని పార్టీలో ఆందోళన నెలకొంది.

టివి, సినీ కళాకారుల ఇళ్లలో ఐటి సోదాలు.. ఎంత దాచారేంటి..?

    ఆదాయపు పన్ను శాఖ అధికారులు హైదరాబాద్ లో సినీ, టివి ఆర్టిస్టుల ఇళ్ళ ఫై కొరడా జులిపించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి అర్థ రాత్రి వరకూ మొత్తం 12 బృందాలు వారి ఇళ్ళ ఫై ఈ దాడులు నిర్వహించాయి. హాస్య నటుడు బ్రహ్మానందం, గాయని సునీత, గీతా మాధురి, టి వి ఆర్టిస్టులు ఓంకార్, ఉదయ భాను, ఝాన్సీ,సుమ ల ఇళ్ళ ఫై ఏక కాలంలో 40 మంది అధికారులు దాడులు నిర్వహించారు.   వీరి ఆదాయానికి తగినట్లుగా పన్ను కట్టలేదనే కారణంగా వీరి ఇళ్ళ ఫై దాడులు నిర్వహించినట్లుగా సమాచారం.  ఈ సినీ ప్రముఖుల ఆదాయానికి సంభందించిన వివరాలు, బ్యాంకు అకౌంట్ల వివరాలు అధికారులు సేకరించినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, శ్రీ నగర కాలనీ, మోతీ నగర్ ప్రాంతాల్లో హైదరాబాద్ ఫిలిం సర్కిల్ కమీషనర్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.   తన ఇంట్లో దాడులు నిర్వహిస్తున్న సమయంలో బ్రహ్మానందం షూటింగ్ లో ఉన్నట్లు తెలిసింది. అలాగే ఝాన్సీ, సుమ లు కూడా వారి ఇళ్లలో దాడులు నిర్వహించే సమయంలో వారి ఇళ్లలో లేరు. ఈ దాడులకు సంభందించిన పూర్తి వివరాలు అందించేందుకు అధికారులు నిరాకరించారు. ఐతే, త్వరలో అన్ని వివరాలు అందిస్తామని మాత్రం వారు ప్రకటించారు.