తెలుగు మహాసభల కోసం ఆరు కమిటీలు
అత్యంత ప్రతిష్టాత్మకంగా డిసెంబరు 27, 28, 29 తేదీలలో తిరుపతిలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆరు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. మహాసభలకు అతిథుల ఆహ్వానం, వసతి ఏర్పాట్లు, బోజన సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, ఆరోగ్యం, పారిశుద్యం, భద్రత తదితర అంశాలకు సంబంధించి ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి విభాగానికి వేరు వేరుగా కమిటీలను ఏర్పాటు చేశారు.
సభలకు వచ్చే అతిథులకు స్వాగతం పలకడం దగ్గర నుండి వాలంటీర్లకు శిక్షణ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన ఆహ్వాన కమిటీ టీటీడీ కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన పనిచేస్తుంది. ప్రతినిధులకు వసతి కల్పించే బాధ్యతను పర్యవేక్షించే కమిటీకి చిత్తూరు జిల్లా కలెక్టర్ సారధ్యం వహిస్తారు. భోజన విభాగాన్ని పర్యవేక్షించే ఆహార కమిటీకి పౌరసరఫరాల విభాగం కమిషనర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రవాణా కమిటీకి రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఆధ్వర్యం వహిస్తారు. ఆరోగ్య, పారిశుద్ధ్య కమిటీ వైద్య,ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. రాయలసీమ ఐజీ ఆధ్వర్యంలో భద్రతా కమిటీ ఏర్పాటయింది.