తెలంగాణా అఖిల పక్ష సమావేశం ఫై ‘టి’ కాంగ్రెస్ నేతల ఆశ
posted on Dec 7, 2012 @ 1:05PM
ఈ నెల 28 న ఢిల్లీ లో తెలంగాణా ఫై జరిగే అఖిల పక్ష సమావేశం తగిన ఫలితాలను ఇస్తుందని తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు.
ఈ అంశం ఫై ఏదో ఒక ప్రకటన చేస్తూ, కేంద్రం తుది నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తుందనే అపప్రద ఉన్న తరుణంలో కూడా, కాంగ్రెస్ నేతలు ఈ రకమైన ఆశాభావంతో ఉన్నారు.
అఖిల పక్షం తర్వాత తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవిస్తుందని రాష్ట్ర మంత్రి జానా రెడ్డి అన్నారు. ఎఫ్ డి ఐ లఫై ఓటింగ్లో గట్టేక్కడానికే ఈ తేదీని ప్రకటించారనడం సబబు కాదని, వ్యతిరేక ఆలోచనలు వద్దని ఆయన అన్నారు. చక్కటి వాతావరణంలో ఈ చర్చలు జరగనున్నాయని జానా అన్నారు.
తెలంగాణా రాష్ట్ర సాధన దిశగా ఈ సమావేశం ఓ ముందడుగు అని మరో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయం వెలువడుతుందని తమకు గట్టి నమ్మకం ఉందని ఆయన అన్నారు. ప్రతి పార్టీ నుండి ఒక్కరినే పిలవాలని, ఇద్దరినీ పిలిస్తే ఈ సమావేశం ఏర్పాటు లక్ష్యం నెరవేరదనే మంత్రి అభిప్రాయం సరైనదే.
అయితే, ఎంత మందిని పిలవాలనే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ అజాద్ అనడం చూస్తుంటే ప్రత్యేక రాష్ట్రం విషయం మరలా మొదటికి వచ్చినట్లే భావించాల్సి ఉంటుంది.