రాష్ట్రం ఇవ్వకున్నా నష్టం లేదు

న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై, రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితిపై విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ శుక్రవారం రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్‌కు లేఖ రాశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వకున్నా కాంగ్రెసు పార్టీకి ఎలాంటి నష్టం లేదని ఆయన అందులో స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఇవ్వవలసిన అవసరం లేకుండానే పార్టీ బలంగా ఉంటుందని అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని ఆయన అందులో కోరారు. కమిటీ చేసిన సిఫార్సులను ప్రభుత్వాలు కూడా యథాతథంగా అమలు పర్చాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ విజయాలలో మొదటి స్థానంలో ఉంటుందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావాన్ని చూపనని అన్నారు.

తెలుగుదేశం డిమాండ్ కు తలొగ్గిన రాష్ట్రప్రభుత్వం

హైదరాబాద్‌: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన భూకేటాయింపులపై సభా సంఘం వేయాలని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేస్తున్న డిమాండుకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గింది. సభా సంఘం వేయడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే, ఓ మెలిక పెట్టింది. శాసనసభలో జరిగే చర్చలో ప్రాథమిక సాక్ష్యాధారాలు బయటపడితేనే సభా సంఘం వేస్తామని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె. గీతా రెడ్డి చెప్పారు. సాక్ష్యాధారాలు ఉన్నాయా, లేవా అనేది చర్చలో తేలాల్సి ఉందని, అదే విధంగా సభా సంఘం విచారణలో ఏయే అంశాలు చేర్చాలనేది కూడా తేలాల్సి ఉందని ఆమె చెప్పారు. కాగా, భూకేటాయింపులపై గత వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ సభ్యులు శాసనసభ కార్యక్రమాలను స్తంభింపజేస్తున్నారు.

ఆంటోనీతో ఫోన్ లైన్లో కేసీఆర్

న్యూఢిల్లీ: రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీకి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు శుక్రవారం ఫోన్ చేసి మాట్లాడారు. ఆంటోనీతో ఆయన ఏం మాట్లాడిందీ తెలియరాలేదు. ఏప్రిల్ 27వ తేదీ తెరాస ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి తమ సత్తా చాటాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ఈ సభకు  అనుమతి ఇప్పించాలని ఆయన కోరినట్లు సమాచారం. అయితే, ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన కార్యక్రమాలకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే కెసిఆర్ ఆంటోనీకి ఫోన్ చేసినట్లు చెబుతున్నారు.

సీమాంధ్రులతోను ఆజాద్ భేటీ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను విభజించ వద్దని పలువురు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యులు శుక్రవారం రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్ భేటీలో తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణకు ఒప్పుకునేది లేదని ఆజాద్‌కు చెప్పినట్లుగా సమాచారం. మొదట తెలంగాణ ఎంపీలతో సమావేశం అయిన అనంతరం ఆజాద్ సీమాంధ్ర ఎంపీలతో సమావేశమయ్యారు. విభజన ఒప్పుకునేది లేదని చెప్పిన సీమాంధ్రులతో తెలంగాణ ఎంపీలతో కలిసి మరో భేటీ నిర్వహిస్తానని చెప్పారు. కాగా ఆజాద్ తెలంగాణ అంశాన్నిగానీ, శ్రీకృష్ణ కమిటీ నివేదిక, 8వ అధ్యాయంపైన గానీ భేటీలో చర్చించలేదని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. త్వరలో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై, అభివృద్ధిపైన భేటీలో చర్చించారన్నారు. కాగా కేంద్రమంత్రి పురందేశ్వరి ఆజాద్‌తో సమైక్యాంధ్ర పార్లమెంటు సభ్యుల సమావేశంలో పాల్గొన్నారు

జగన్ వర్గానికి అధికారవర్గం ప్రశంసలజల్లు

హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం చిత్తూరు జిల్లా శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని శుక్రవారం ప్రతిపక్ష పార్టీ సభ్యులతో పాటు అధికార కాంగ్రెసు పార్టీ సభ్యులు పొగడ్తలతో ముంచెత్తినట్టుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికే షాక్ ఇవ్వడాన్ని కొందరు అభినందించినట్లుగా తెలుస్తోంది. కిరణ్ నిలబెట్టిన పార్టీ అభ్యర్థిని ఓడిస్తానని అన్నమాటను పెద్దిరెడ్డి నెగ్గించుకున్నారు.   చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ సభ్యుడు నరేష్ కుమార్ పెద్దిరెడ్డి నిలబెట్టిన తిప్పారెడ్డి చేతిలో ఒక ఓటు తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. పలువురు కాంగ్రెసు సభ్యులు పెద్దిరెడ్డి తన అభ్యర్థిని గెలిపించుకోవడంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్షాలు కూడా ఆయనను మెచ్చుకున్నాయి. మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మరో అడుగు ముందుకేసి పెద్దిరెడ్డిని హీరో ఆఫ్ ది డేగా అభివర్ణించినట్లుగా సమాచారం. డిఎల్ జగన్‌కు బద్ద వ్యతిరేకి కావడం విశేషం.

'ప్రత్యారోపణలతో ప్రజాక్షేమం మరుస్తున్నారు'

హైదరాబాద్: అవినీతిపై ప్రభుత్వం, విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన భూకేటాయింపులపై సభాసంఘం వేయకుండా చర్చకు రమ్మంటున్న ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. చర్చకు ప్రాతిపదిక ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎదో ఉద్దరిద్దామని రాజకీయాలలోకి వచ్చానని కానీ ఇక్కడ అది కుదరడం లేదని ఆయన అన్నారు. ప్రజలకు భవిష్యత్తు లేని ప్రమాదం పొంచి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతంలో ఒకరిని మించి ఒకరు ఉన్నారని ఆయన ఆరోపించారు. ఆరోపణ, ప్రత్యారోపణలను కట్టిపెట్టి భూకేటాయింపుల వివరాలను బయటపెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నేను ప్రజలకు జవాబుదారిని కానీ ప్రభుత్వానికి కాదన్నారు. శ్రీకృష్ణ కమిటీ 8వ చాప్టర్ గురించి తనకు తెలియదన్నారు. దానిని అధ్యయనం చేశాక దానిపై స్పందిస్తానని చెప్పారు.

'టి' ఎంపీలకు ఆజాద్ హితబోధ

న్యూఢిల్లీ: పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులందరూ ఏకంకావాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్ హితవు పలికారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలతో ఆయన శుక్రవారం ఉదయం ఢిల్లీలో నిర్మాణభవన్‌లో భేటీ అయ్యారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించడం తప్పించి మరేదీ తమకు సమ్మతం కాదని, శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంలోని అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆజాద్‌కు ఈ సందర్భంగా తెలంగాణ ఎంపీలు స్పష్టం చేయనున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 12 గంటలకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలతో సమావేశమవుతారు. ఆ తర్వాత అందరితో కలిసి ఉమ్మడిగా సమావేశమవుతారు. తెలంగాణ ఎంపీల సమావేశం నిర్మాణభవన్‌లోని ఆజాద్ నివాసంలో జరుగుతోంది.

యడ్యూరప్పపై కేసు కు గ్రీన్‌సిగ్నల్‌

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్పకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన భూకుంభకోణాలపై పోలీసుల విచారణకు ప్రత్యేక లోకాయుక్త కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు భూముల కేటాయింపుల్లో అన్ని నిబంధనలను తుంగలో తొక్కి, డీనోటిఫై చేశారానే అభియోగంపై ఈ విచారణ చేపట్టనున్నారు. ప్రస్తుతం కోర్టు మొత్తం 15 భూకుంభకోణాలకు సంబంధించిన కేసులను విచారిస్తోంది. రెండు నెలల క్రితం గవర్నర్ చ్.ఆర్.భరద్వాజ్ అనుమతిచ్చిన నేపథ్యంలో న్యాయవాదులు సిరంజన్ బాషా, కెన్ బాలరాజ్‌లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక లోకాయుక్త పోలీసుల విచారణకు ఆదేశించింది. ఇదిలావుండగా స్వంత పార్టీలోనే అసమ్మతి మళ్లీ కుంపటి రాజుకుంది. దీంతో ఆయన గురువారం అత్యంవసరంగా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మొత్తం 27 మంది మంత్రుల్లో 21 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ సమావేశం ద్వారా యడ్యూరప్ప తనకున్న బలంపై అధిష్టానానికి గట్టి సందేశమివ్వాలనుకున్నట్టు తెలుస్తోంది.

హుటాహుటిన అధిష్టానం వద్దకు జెసీ

హైదరాబాద్: మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి శుక్రవారం న్యూఢిల్లీ వెళ్లారు. ఇటీవల జరిగిన స్థానిక శాసనమండలి ఎన్నికలలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనంతలో ఓటమికి జెసి దివాకర్ రెడ్డి కారణం అంటూ గురువారం అధిష్టానం వద్ద ఫిర్యాదు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చర్యలు తీసుకోకుంటే కాంగ్రెసుకే నష్టం అని చెప్పారు. ఈ నేపథ్యంలో జెసి దివాకర్ రెడ్డి అనంతపురంలో కాంగ్రెసు ఓటమికి కారణాలు, తనపై ముఖ్యమంత్రి కిరణ్ చేసిన ఫిర్యాదుకు వివరణ ఇచ్చేందుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో జెసి దివాకర్ రెడ్డి వర్గం ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు

చిత్తూరు: చిత్తూరు జిల్లా మదనపల్లెలో, దాని పరిసర ప్రాంతాల్లో గురువారం రాత్రి భూమి స్వల్పంగా కంపించింది. దాదాపు ఐదు సెకన్ల పాటు భూమి కంపించింది. దాని తర్వాత పెద్దపెద్ద రాళ్లు కింద పడినట్టు శబ్దం రావడంతో జనం బెంబేలెత్తిపోయారు. మదనపల్లె పట్టణంలోని పలు కాలనీలు, గ్రామీణ మండల పరిధిలోని గ్రామాల్లో కంపనాలను ప్రజలు గమనించారు. కంపనాలు రాగానే తొలుత వంట పాత్రలు కదిలాయని, ఆ తర్వాత పెద్ద శబ్దం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. కొన్ని సెకన్లపాటు. భూమి కంపించిన నేపథ్యంలో స్థానికులు పెద్ద సంఖ్యలో ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. ఈ ప్రకంపనలతో పట్టణంలో తీవ్ర కలకలం చెలరేగింది. అర్ధరాత్రి దాకా జనం రోడ్లపైనే పడిగాపులు కాశారు.

జపాన్ కు ప్రధాని హామీ

జపాన్: జపాన్ ప్రధానమంత్రి నవొటొ ఖాన్‌తో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఫోనులో సంభాషించారు. భారీ భూకంపం, సునామీ బాధితులకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ రెండు ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. కష్టాల్లో ఉన్న జపాన్ ప్రజలను ఆదుకునేందుకు భారత పౌరులు సిద్ధంగా ఉన్నారన్నారు. అంతేకాకుండా, జపాన్ కోరిన పక్షంలో అదనపు సాయం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఈ ప్రకృతి వైపరీత్యాల నష్టం నుంచి జపాన్ త్వరగా కోలుకుంటుందనే ఆశాభావాన్ని విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

భూకేటాయింపులపై స్తంభించిన అసెంబ్లీ

హైదరాబాద్‌: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన భూకేటాయింపులపై శుక్రవారం శాసనసభ గురువారం స్తంభించింది. భూకేటాయింపులపై సభా సంఘం వేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శించారు, నినాదాలు చేశారు. డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎంతగా చెప్పినా తెలుగుదేశం సభ్యులు వినలేదు. దీంతో ఆయన సభను అరగంట పాటు వాయిదా వేశారు. అంతకు ముందు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. హైకోర్టు సూచనల మేరకు శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయం బహిర్గతం చేయాలని సీపీఐ, మద్యం అమ్మకాలు పెంచేందుకు ప్రభుత్వ ప్రోత్సాహం, గీత కార్మికుల ఇక్కట్లపై బిజెపి, గ్రూప్‌ 1, 2 నోటిఫికేషన్లు విడుదలై చాలారోజులైనా మెయిన్స్‌ పరీక్ష నిర్వహించకపోవడంపై సీపీఎం వాయిదా తీర్మానాలు ప్రతిపాదించాయి.

సిఎం కిరణ్‌పై హైకమాండ్ కు బొత్స ఫిర్యాదు

న్యూఢిల్లీ: స్థానిక సంస్థల కోటాలో శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు అభ్యర్థులు ఓడిపోవటానికి దారి తీసిన పరిస్థితులకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బాధ్యత వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ అధినాయకత్వానికి సూచించినట్లు తెలిసింది. బొత్స సత్యనారాయణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీఆజాద్‌కు ఈ మేరకు ఒక నోట్ పంపించినట్లు తెలిసింది. కిరణ్‌కుమార్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాల వల్లే శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారని బొత్స ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఢిల్లీ వచ్చిన బొత్స సత్యనారాయణ గురువారం పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో పలువురు కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరిపారు. సత్యనారాయణ ఒకటి రెండు రోజుల్లో గులాంనబీ ఆజాద్‌ను కలిసి ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల కోటాలో శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరును తప్పుపడుతూ ఆయన తన నోట్‌లో పేర్కొనట్లు చెబుతున్నారు. టిడిపితోనూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌తో లోపాయికారిగా చేతులు కలపడం వల్ల పార్టీ అభ్యర్థులు ఓడిపోయారని మంత్రి బొత్స తన నోట్‌లో ఆరోపించినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండే పార్టీ, ఈ నేపథ్యంలో తమ విధానాలు, సిద్ధాంతాలను వ్యతిరేకించే పార్టీలతో లోపాయికారిగా ఎలా చేతులు కలుపుతారని ఆయన ప్రశ్నిస్తున్నారు. పార్టీ పరంగా రాష్ట్రంలో ఎలాంటి సమన్వయం లేదనీ, దీని వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని ఆయన అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయటంపై పార్టీ అధినాయకత్వం ఇప్పటికైనా దృష్టి కేంద్రీకరించాలని బొత్స కోరినట్లు తెలిసింది.

జనానికి కరెంట్ షాక్

హైదరాబాద్: గృహవినియోగదారులకు ఇది చేదువార్త. గృహ వినియోగదారులకు విద్యుత్ చార్జీలను పెంచాలన్న డిస్కాంల ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపిఇఆర్‌సి) రెండు, మూడు రోజుల్లో పచ్చ జెండా ఊపనున్నట్లు తెలుస్తోంది. పెరిగిన విద్యుత్ చార్జీల మేరకు రాష్ట్రప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుందా లేక నేరుగా గృహ వినియోగదారుల నుంచే పెరిగిన చార్జీలను వసూలు చేసేందుకు ప్రభుత్వం డిస్కాంలకు అనుమతి ఇస్తుందా అనే అంశంపై ఉత్కంఠత నెలకొంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన మరుక్షణం ఏపిఇఆర్‌సి నుంచి ఆదేశాలు వెలువడవచ్చునని సమాచారం. ఆ లోగా విద్యుత్ చార్జీల పెంపుదలకు అంగీకరిస్తే శాసనసభలో విపక్షాల నుంచి ఒత్తిడి రావడమేకాకుండా స్వపక్షం నుంచి కూడా నిరసనలు రావచ్చని భావిస్తున్నారు. వ్యవసాయ రంగానికి ఉచిత సబ్సిడీ వల్ల సాలీనా ఐదు వేల కోట్ల రూపాయల వరకు మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తోంది. ఈ ఏడాదికి గృహ వినియోగదారులకు విద్యుత్ చార్జీలను పెంచి పది సంవత్సరాలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రజల ఆర్థిక జీవన ప్రమాణాలు మెరుగుపడడం, మధ్యతరగతి వర్గం వారు కూడా ఎసి యంత్రాలను వినియోగించడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కనీసం రెండు వందల యూనిట్లు ఆ పైన విద్యుత్ వినిమయం చేసే వారికి మాత్రమే పెంచిన చార్జీలు వర్తించే అవకాశం ఉంది. ప్రభుత్వం సబ్సిడీని భరిస్తానన్నా అంగీకరించే స్థితిలో డిస్కాంలు లేవు. ఎందుకంటే డిస్కాంలకు ప్రభుత్వం సబ్సిడీల బకాయిలను క్రమం తప్పకుండా చెల్లించడం లేదు. ప్రస్తుతం గృహ విద్యుత్ వినియోగదారుల కేటగిరీ ఎల్‌టి 1లో ఐదు శ్లాబ్‌లు ఉన్నాయి. ఇకపై ఆరు శ్లాబ్‌లు చేయనున్నట్లు సమాచారం. నాల్గవ శ్లాబ్ నుంచి విద్యుత్ చార్జీలు పెంచవచ్చు.

కరుణ భార్యల ఆస్తుల విలువ

చెన్నై: డిఎంకె అధినేత కరుణానిధి తన భార్యలిద్దరికీ ఆస్తి పంచినట్లు కనిపిస్తున్నారు. తనకు, తన ఇద్దరు భార్యలకు సంబంధించిన ఆస్తుల విలువను ఆయన గురువారం వెల్లడించారు. గురువారం తిరువురూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన కరుణానిధి తమకు 41 కోట్ల విలువ చేసే అస్తులున్నట్లు వెల్లడించారు. కరుణానిధి భార్యల్లో దయాళు ఆస్తి విలువ 17.34 కోట్ల రూపాయలు కాగా, రజిత ఆస్తుల విలువ 18.68 కోట్ల రూపాయలు. ఆయనకు 4.92 కోట్ల విలువ చేసే ఆస్తులు మాత్రమే వున్నాయి. దయాళు నలుగురు సంతానాల్లో కేంద్ర మంత్రి ఎంకె అళగిరి, ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నారు. రజతి కూతురు కనిమొళి. కరుణానిధి మొదటి భార్య పద్మావతికి ఎంకె ముత్తు అనే కుమారుడున్నాడు. పద్మావతి మరణంతో కరుణానిధి 1948లో దయాళును పెళ్లి చేసుకున్నారు.

శిరీష్ కు జైలు తప్పేట్లు లేదు

హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త శిరీష్ భరద్వాజ్‌కు జైలు తప్పేట్లు లేదు. వరకట్నం వేధింపుల కేసులో అతనికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు గురువారం తిరస్కరించింది. శిరీష్ భరద్వాజ్ తరఫున న్యాయవాది సివిఎల్ నర్సింహా రావు వేసిన బెయిల్ పిటిషన్‌ను హైదరాబాదు నాంపల్లి క్రిమినల్ కోర్టులోని 8వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి తిరస్కరించారు.శిరీష్ తల్లి, శ్రీజ అత్త సూర్యమంగళకు మాత్రం కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. తన భర్త శిరీష్ భరద్వాజ్‌పై, అత్త సూర్యమంగళపై శ్రీజ వరకట్నం వేధింపుల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో శిరీష్ భరద్వాజ్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

మేడమ్‌కు సీఎం కిరణ్ మొర

న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి... అందుకుగల కారణాలను సోనియాకు వివరించారు. గురువారం ఢిల్లీలో ఆయన టెన్ జన్‌పథ్‌లో మేడమ్‌తో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల పరాజయం వెనుక కారణాలు, పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సోనియా సమక్షంలోను, ఆ తర్వాత సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌లతో దాదాపు 40 నిమిషాలపాటు చర్చించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... జగన్‌ను ఏమాత్రం ఉపేక్షించరాదని, ఆయన దూకుడుకు కళ్లెం వేయాలని కిరణ్ అధిష్ఠానాన్ని కోరారు. "ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమి వెనుక పెద్ద ఎత్తున ధన బలం పనిచేసింది. నన్ను అసమర్థుడిగా చిత్రీకరించి జగన్‌ను బలోపేతం చేసేందుకు పార్టీలో కొంతమంది పెద్ద మనుషులు పరోక్ష ప్రయత్నాలు చేస్తున్నారు. నన్ను, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు అంతర్గత కుట్ర జరుగుతోంది'' అని కిరణ్ వివరించారు. చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అనంతపురంలో జేసీ వర్గం కుట్రల మూలంగా పార్టీ పరాజయం పాలైందని సోనియాకు చెప్పారు. సొంత జిల్లాలో తనను దెబ్బతీస్తే, పార్టీని కూడా దెబ్బతీయగలమన్నది వారి ఉద్దేశమని కిరణ్ తెలిపారు. అయినప్పటికీ... చిత్తూరు జిల్లాలో కేవలం ఒకే ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారని ఆయన తెలిపారు. గిడుగు రుద్రరాజు, గంగాభవానీలపై వారి జిల్లాల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ వారికే తిరిగి అవకాశం ఇవ్వడం తప్పైందని అంగీకరించారు. అయితే... "వారిని గెలిపిస్తామని అధిష్ఠానానికి, నాకు హామీ ఇచ్చిన కొందరు పెద్ద మనుషులు ఘోరంగా విఫలమయ్యారు'' అని చెప్పారు. నామినేటెడ్ అభ్యర్థుల విషయంలో ముందుగా నిర్ణయం తీసుకుని ఉంటే ఈ ఎన్నికలపై కొంత ప్రభావం చూపేదని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఈ సందర్భంగా కడప జిల్లాలో ఎన్నిక గురించి సోనియా ప్రస్తావించారు. "జిల్లా అంతటా జగన్‌కు పట్టు లేదని తేలిపోయింది. ఇక్కడ కేవలం పది ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యాం'' అని కిరణ్ బదులిచ్చారు. జగన్ వర్గానికి గట్టి సమాధానం చెప్పడం పట్ల సోనియా సంతృప్తి వ్యక్తం చేశారు. ముందుగా కిరణ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పాలనా విధానంపై అధిష్ఠానానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించారు. ఈ భేటీలో సోనియా గాంధీ సీఎం పనితీరుపై విరుచుకుపడ్డారు. మీకు పగ్గాలు ఇచ్చి పొరపాటు చేశామని, మీ విషయంలో మా అంచనాలు తప్పాయని వ్యాఖ్యానించే వరకూ ఆమె ఆగ్రహస్థాయి చేరుకుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మండలి ఎన్నికల్లో పార్టీ పరాజయంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ముఖ్యమంత్రి పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. మీ వ్యవహారశైలి, నిర్ణయాల వల్లే పార్టీ ఓటమిపాలయిందని, నేతలతో సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఎన్నిసార్లు చెప్పినా సమన్వయం చేసుకోవడంలో విఫలమవుతున్నారని, ఇకపై సహించేది లేదని నిర్మొహమాటంగా హెచ్చరించారు. ముఖ్యమంత్రి పదవి ఇచ్చి తప్పు చేసినట్లు భావించవలసి వస్తోందని సోనియా మండిపడ్డారు.

కేసీఆర్ పై మండిపడిన దేవినేని

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్లమెంటు సభ్యుడు అయి ఉండి న్యూఢిల్లీలో సమావేశాలు జరుగుతుంటే ఇక్కడ ఉండి బయట రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ చెప్పారు. టిడిపిని పీనుగుల పార్టీ అనడం శోచనీయమన్నారు. పీనుగుల పార్టీ అయితే 2009 ఎన్నికలలో పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. భూకేటాయింపులపై ప్రభుత్వం జెఎల్పీ వేయడానికి వెనుకాడుతుందన్నారు. కాంగ్రెసు చేసిన పాపాలు బయటపడతాయనే వారు జెఎల్పీ వేయడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇంటిని ముట్టడిస్తామన్నారు. శ్రీకృష్ణ కమిటీలో ఉన్న 8వ అధ్యాయాన్ని కేంద్రం వెంటనే బహిర్గత పర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

సరి సమానం..కాంగ్రెస్కు 3-జగన్కు 3-టీడీపీకు 3

హైదరాబాద్: రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో స్థానిక సంస్థల కోటా కింద జరిగిన తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (జగన్ వర్గం)లు సమానంగా పంచుకున్నాయి. పార్టీలోని లుకలుకలు మాత్రమే కాకుండా మంత్రుల్లోని అసంతృప్తి జ్వాలలు కూడా మరోసారి పైకెగశాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్‌ను సమర్థంగా ఎదుర్కంటున్నారని ఇంత కాలం భావించారు. కానీ, అది అంత సులభం కాదని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది. పార్టీలోని అంతర్గత విభేదాలను కూడా ఆయన పరిష్కరించకలేక పోయారు. సమయం వస్తే దెబ్బ తీయడానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యర్థులు సిద్ధంగా ఉన్నారని ఎన్నికల ఫలితాల వల్ల తేలిపోయింది. అనంతపురం జిల్లాలో శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి మొదటి నుంచి తాను కాంగ్రెసు అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్ రెడ్డిని సమర్థించబోనని చెబుతూ వస్తున్నారు. సమయం చాలానే ఉన్నా ఆయనను దారికి తేవడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారు. అలాగే, తన సొెత జిల్లా చిత్తూరులో కూడా అసమ్మతి కుంపటి రగులుతున్న విషయం ఆయనకు తెలియంది కాదు. తనకు వ్యతిరేకంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పని చేస్తారని ఆయనకు తెలుసు. అయినా, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని, మరో శాసనసభ్యురాలు కుతూహలమ్మను బుజ్జగించడంలో ఆయన విఫలమయ్యారనే చెప్పవచ్చు. అలాగే, జగన్ వర్గం అభ్యర్థిని ఓడించడానికి కిరణ్ కుమార్ రెడ్డి వేసిన ఎత్తులేవీ పారలేదు. కొద్దిపాటి ఓట్లతోనే తాము ఓడిపోయామని కిరణ్ కుమార్ రెడ్డి సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నైతికంగా వైయస్ జగన్ విజయం సాధించారనే చెప్పవచ్చు. ఇకపోతే, పశ్చిమ గోదావరి జిల్లా ఫలితాలు కిరణ్ కుమార్ రెడ్డికి పెద్ద దెబ్బనే. ఇక్కడ జగన్ వర్గం రాజకీయాల కన్నా కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలే కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను దెబ్బ తీసింది. స్థానిక నాయకుల మాటలను ఖాతరు చేయకుండా ఆయన అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ సమయాన్ని చూసి మంత్రులు వట్టి వసంతకుమార్, బొత్స సత్యనారాయణ తమ అసంతృప్తిని బయట పెట్టారు. వట్టి వసంతకుమార్ రాజీనామా చేయడానికి సిద్ధపడగా, బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రికి చురకలంటించారు. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రాంగం, యంత్రాంగం బెడిసి కొట్టిందనే చెప్పాలి. ఇది అదనుగా తీసుకుని - వైయస్ రాజశేఖర రెడ్డి ఉంటే కాంగ్రెసుకు ఈ పరిస్థితి ఉండేది కాదని వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు అంటున్నారు.