జగన్ పై లోకేష్ ఫైర్
posted on Dec 13, 2012 @ 10:09AM
చంద్ర బాబు నాయుడు తనయుడు లోకేష్ తన ట్విట్టర్ పేజీలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు విజయమ్మ, షర్మిలా లఫై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ అవినీతిని ఎందుకు ప్రస్తావించడం లేదని లోకేష్ వారిని ప్రశ్నించారు.
వంద రూపాయల నోట్ల కట్టలను వెయ్యి లారీలలో నింపితే ఎంత మొత్తం ఉంటుందో, అంత మొత్తాన్ని జగన్ మోహన్ రెడ్డి సంపాదించారని లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్ కు త్వరలో బెయిల్ వస్తుందని చెప్పే వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆయన నిర్దోషిగా వస్తారని ఎందుకు అనడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆ పార్టీ నేతలు ఎంఎల్ఏ లను కొనుగోలు చేయడానికి, దొంగ సర్వేలకు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని లోకేష్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని చెప్పుకొనే ఆ పార్టీ నేతలు డబ్బెందుకు ఖర్చు పెడుతున్నారని లోకేష్ ప్రశ్నించారు.
రాష్ట్రంలో విద్యుత్ కోతలకు తన తండ్రే కారణమని టిఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర రావు అంటున్నారని ఇదెక్కడి వింత అని లోకేష్ అన్నారు. తన తండ్రి అనంతపురం జిల్లాలో పర్యటిస్తుండగా అక్కడ వర్షం పడదని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు 25 లక్షలు పందెం కట్టిందని, అయితే అక్కడ వర్షం పడిందని ఆయన అన్నారు. ఈ డబ్బును పేదలకు ఖర్చు పెట్టాలని లోకేష్ సూచించారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా రాజకీయాల్లో క్రియాశీలకం అవ్వాలని భావిస్తున్న లోకేష్ తన అభిప్రాయాలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారని భావిస్తున్నారు. లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలకు జగన్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.