టిడిపి ఓటింగ్ కు గైర్ హాజరు, సర్వత్రా విమర్శలు
posted on Dec 7, 2012 @ 5:47PM
ఎఫ్ డి ఐ ల ఫై రాజ్య సభ లో జరిగిన ఓటింగ్ లో తెలుగు దేశం సభ్యులు పాల్గొనకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆ పార్టీకి రాజ్య సభ లో ఐదుగురు సభ్యులు ఉన్నారు. టి డి పి కి చెందిన దేవేందర్ గౌడ్, గుండు సుధారాణి, సుజన చౌదరి ఓటింగ్ లో పాల్గొన లేదు. దీనితో యూపిఏ ప్రభుత్వం గట్టెక్కింది. వీరితో పాటు బి ఎస్ పి, ఎస్ పి సభ్యులు కూడా ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.
ఈ విషయంతో టి డి పి విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది. ఇలా చేయడానికి చంద్ర బాబు ఎంత పాకేజ్ తీసుకున్నారని ఇటీవలే టి డి పి నుండి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అమర్నాథ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ తో టి డి పి కుమ్మక్కు అయినదానికి ఇంతకంటే ఆధారాలు ఏమి కావాలని నాగం జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అయితే, ఈ ముగ్గురు సభ్యులు వ్యక్తిగత కారణాల వల్లే ఓటింగ్ లో పాల్గొనలేక పోయారని ఆ పార్టీ ఎంపి సి ఎం రమేష్ వివరణ ఇచ్చారు. అసలు ఈ విషయం తమ నేత చంద్ర బాబు కు తెలియదని, తానే ఈ విషయాన్ని మొదటగా ఆయనకు తెలియచేసానని రమేష్ వివరణ ఇచ్చారు. వైద్య పరీక్షల నిమిత్తం దేవేందర్ గౌడ్ ఓటింగ్ కు దూరంగా ఉండాల్సి వచ్చిందని రమేష్ అన్నారు. అయితే, సుజన, సుధా రాణి ఇంకా ఈ విషయంలో వివరణ ఇవ్వలేదు. సుజన చౌదరికి ఉన్న వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా ఆయన ఓటింగ్ కు దూరంగా ఉన్నారని కూడా కధనాలు వస్తున్నాయి.
ఏది ఏమైనా ఈ అంశం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.