దిల్ రాజు పేరెంట్స్ కి యాక్సిడెంట్

    టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పేరెంట్స్ మెదక్ జిల్లా తూఫ్రాన్ సమీపంలో కారు యాక్సిడెంట్‌లో గాయపడ్డారు. రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి, తల్లి ప్రమీలమ్మ కారులో హైదరాబాద్ నుండి నిజామాబాద్ వెళ్ళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం డిసెంబర్ 21న విడుదలువుతోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు వంశీ పైడి‌పల్లి కాంబినేషన్లో ‘ఎవడు' నిర్మిస్తున్నారు.

ఫలక్ నుమా ప్యాలెస్ ఫంక్షన్ హాల్

  హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ ఫంక్షన్ హాల్ గా మారింది. అత్యంత ఆర్భాటంగా కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి పెళ్లిళ్లు జరిపించే మహరాజులు ఈ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ ని బుక్ చేస్తున్నారు. రోజుకి కేవలం కోటి రూపాయలు మాత్రం దీనికి అద్దె చెల్లించాలి.   మామూలు మనుషులకు మాత్రం ప్యాలస్ ప్యాకేజీని చూస్తే కళ్లు గిరగిరా తిరుగుతాయ్. ఎంట్రన్స్ లోనే సైనిక దుస్తుల్లో ఉన్న సిబ్బంది, వాద్యాలు, మేళతాళాలతో ఆహూతుల్ని సాదరంగా ఆహ్వానిస్తారు. వచ్చినవాళ్లని మెయిన్ ఎంట్రన్స్ దాకా తీసుకెళ్లేందుకు రాజాశ్వాల్ని పూన్చిన గుర్రాలు సిద్ధంగా ఉంటాయట. ఒకేసారి 1500 మంది అతిథుల్ని ఆహ్వానించేందుకు ఏర్పాట్లున్నాయ్.   డిన్నర్ కాస్ట్ మనిషికి ఆరు నుంచి ఏడున్నర వేలవరకూ ఉంటుంది. నూటొక్కమంది ఒకేచోట భోం చేయొచ్చు. కాకపోతే దీనికోసం మనిషికి మరో ఏడెనిమిది వేలు సమర్పించుకోవాల్సొస్తుంది. హుక్కారూమ్, ఒంటె చర్మంతో చేసిన తివాచీలు, సోఫా సెట్లు, ప్రత్యేకంగా తయారు చేయించిన ఫర్మిచర్ ఈ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ కి స్పెషల్ అట్రాక్షన్. ఈనెల 22వ తేదీన జరిగే పెళ్లికోసం ప్యాలస్ ఫంక్షన్ హాల్ ని ఆల్రెడీ బుక్ చేసేసుకున్నారుకూడా.

కృష్ణానదిలో ఆర్టీసీ బస్సు

    మహబూబ్ నగర్ జిల్లాలో ఈ వింత జరిగింది. పొద్దున్నే ఫుల్లుగా తాగి డ్యూటీఎక్కిన డ్రైవర్ గారు నేరుగా బస్సుని నదిలోకి పోనిచ్చేశారు. మానపాడు మండలం పాలపాడులో బయలుదేరిన బస్సు గమ్యస్థానానికి చేరాల్సిందిపోయి నేరుగా నదిలోకి దూసుకెళ్లింది. బస్సులో ఉన్నప్రయాణికుల టైం బాగుండి కొద్దిలో ప్రమాదం తప్పినా.. ఓ పదిమందికి మాత్రం బానే గాయాలయ్యాయి.     నదిలో బస్సాగగానే జనం బతుకు జీవుడా అంటూ కిందికి దూకేసి మెల్లగా చేతులూ చేతులూ పట్టుకుని బైటికొచ్చేశారు. తాగుబోతు డ్రైవర్ కి బస్సుని అప్పజెప్పి జనం ప్రాణాలతో చెలగాటమాడడం ఏంటని బాధితులు డిపో అధికారుల్ని నిలదీస్తున్నారు. సిబ్బంది ప్రవర్తన, తీరు తెన్నుల్ని గమనించకుండా అధికారులు కళ్లుమూసుకుని కూర్చున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.     దీన్నింతటితో వదిలేస్తే మరోసారి మరో ప్రమాదం కచ్చితంగా జరుగుతుందని, జనం ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని బాధితులు అంటున్నారు. వెంటనే ప్రమాదానికి కారణమైన డ్రైవర్ తోపాటు, బాధ్యతారహితంగా వ్యవహరించిన అధికారులందర్నీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అని ఊదరగొట్టడం కాదని, ఇలాంటి ఘటనలు జరక్కుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ యాజమాన్యంపై ఉందని మండిపడుతున్నారు.    

ఆ ఏడు కోట్ల నోట్ల కట్టలు బాల సాయివే..!

  నగరంలో కలకలం రేపిన నోట్ల కట్టల కేసు కొత్త మలుపు తిరిగింది. మొదట కథనంలో చెప్పిన ఎమ్మెల్యే పాత్ర ఇప్పుడు మాయమైంది. డీజీపీ కార్యాలయం ఆటోలో దొరికిన రూ.6.70 కోట్ల నగదు కర్నూలు బాల సాయిబాబాకు చెందిన డబ్బుగా తేలింది. సంఘటన జరిగిన ఓ రోజు తరువాత బాలసాయి ట్రస్టు చైర్మన్ రామారావు వచ్చి పోలీసులను కలిశారు. తాము కర్ణాటకలో నిర్మించనున్న బాలసాయి మందిరానికి చెందిన డబ్బు అది అని, దానిని తరలించే బాధ్యత వంశీ అనే వ్యక్తికి ఇచ్చామని, అది అన్సారి అనే వ్యక్తికి చేరాల్సి ఉందని అంతలోనే ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. ఇందులో రూ.4 కోట్లకు పైగా ఆంధ్రా బ్యాంకు నుండి, మిగతా డబ్బులు సన్నిహితుల నుండి తీసుకొచ్చామని తెలిపారు.   అయితే 1.70 కోట్లు ఎక్కడివన్న విషయంలో దర్యాప్తు సాగుతుందని సమాచారం. సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే కాకుండా, బాలసాయి ట్రస్టు ఆలస్యంగా ఎందుకు స్పందించిందని అనుమానాలున్నాయి. బాలసాయి కి ముఖ్యుడు అయిన రామారావు బ్యాంకు అకౌంటెంటు ఉద్యోగం వదిలి ఆయన దగ్గర చేరాడు. బాలసాయికి సంబంధించిన అన్ని వ్యవహారాలు ఈయన ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ట్రస్టుకు సంబంధించిన డబ్బు అయితే ఇంత భయంగా, అజాగ్రత్తగా ఎందుకు తరలిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామారావు ఇంతకు ముందు హైదరాబాద్ లో భూ కబ్జా కేసుల్లోనూ ఉన్నారు. బాలసాయి ఈ వ్యవహారాల్లో కోర్టు మెట్లు ఎక్కారు.

ఆటోలో రూ.7 కోట్లు

  హైదరాబాద్ నడిబొడ్డున..రాష్ట్ర డీజీపీ కార్యాలయం ముందు ఓ ఆటోలో రూ.6.70 కోట్లు పట్టుబడ్డాయి. నిన్న జరిగిన ఈ సంఘటన ఇప్పుడు హైదరాబాద్ లో చర్చానీయాంశంగా మారింది. డబ్బు తరలిస్తున్న ఆటో డీజీపీ కార్యాలయం ముందుకు రాగానే గ్యాస్ అయిపోవడంతో ఆగిపోయింది. దాంతో ఆ ఆటో డ్రైవర్ దిగి వెళ్లాల్సిన చోటుకు మరో ఆటో మాట్లాడాడు. బ్యాగులను ఒక దానిలోంచి మరో ఆటోలోకి మార్చే క్రమంలో వాటిలో ఏముందనే దానిపై గొడవ ప్రారంభమైంది. డీజీపీ కార్యాలయం ముందు విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సంజీవరెడ్డి వారివద్దకొచ్చాడు. బ్యాగులో ఏముందని ప్రశ్నించాడు. ఇంతలో రెండో ఆటోలోకి బ్యాగులను మార్చడం పూర్తయింది. చివరికి బ్యాగులు తెరచి చూసిన సంజీవరెడ్డికి కళ్లు తిరిగిపోయాయి.     మూడు బ్యాగులలో వెయ్యి నోట్ల కట్టలుగా కట్టిన బండిల్స్ తరలిస్తున్నారు. ఆ బ్యాగులను మాసాబ్‌ట్యాంక్ వద్ద గల ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి తరలించి లెక్కించారు. మూడు బ్యాగుల్లో కలిపి మొత్తం రూ.6,70,50,000 ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు, పోలీసులు నిర్ధారించారు. పట్టుబడిన డబ్బుకు సంబంధించి పోలీసులకు ఎటువంటి ఆధారం లభించలేదు. వారిలో చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆధారం రెండో ఆటో డ్రైవర్ మాత్రమే. డబ్బుకు సంబంధించిన పూర్తి వివరాలు అతడికి తెలియవు. ఇదంతా ఒక ఎత్తైతే.. డబ్బు తరలిస్తున్న వ్యక్తితోపాటు, అంత కిక్కిరిసిన ట్రాఫిక్‌లో గ్యాస్ అయిపోయిన ఆటోతో సహా మొదటి ఆటో డ్రైవర్ ఎలా పరారయ్యాడన్నది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది!

షూటింగ్ లో అగ్నిప్రమాదం

  అరకులో తీస్తున్న ఓ సినిమా సెట్ లో అగ్నిప్రమాదం జరిగింది. కోడిపుంజు వలస దగ్గర్లో వేసిన సినిమా సెట్లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అసిస్టెంట్ కెమెరామన్ భాను ప్రకాష్ అక్కడికక్కడే చనిపోయాడు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇంటింటా అన్నమయ్య సినిమా షూటింగ్ లో ఈ ప్రమాదం జరిగింది.   షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. గాయపడ్డ వ్యక్తుల్ని హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కె.రాఘవేంద్రరావు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీరామరాజ్యం సినిమా నిర్మాత యలమంచిలి రాజు ఇంటింటా అన్నమయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రమాదం కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.

జగన్ కు ఈడీ నోటీసులు

  మనీ లాండరింగ్ కేసులో డిసెంబర్ 17న హాజరు కావాలని జగన్ కు ఈడీ న్యాయాధికార సంస్థ నోటిసులు జారీ చేసింది. ఈ మేరకు విచారణకు హాజరైన విజయసాయి రెడ్డికి ఈడీ న్యాయాధికార సంస్థ నోటిసు అందజేసింది. మానీలాండరింగ్ చట్టం కింద డిసెంబరు 5న హాజరు కావాలని ఎమ్మార్, ఎంజీఎఫ్ కు కూడా నోటీసులు జారీ చేసింది.   జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రెండో దఫా జప్తు (అటాచ్‌మెంట్)కు సిద్ధమవుతోంది. సీబీఐ చార్జిషీట్లను సమగ్రంగా పరిశీలించిన ఈడీ అధికారులు ఈ కేసులో ఏ-2 నిందితుడు, జగన్ సంస్థల ఆడిటర్ విజయసాయి రెడ్డిని సోమవారం ప్రశ్నించారు. ఈడీ ప్రధాన కార్యాలయంలో సాయిరెడ్డిని డైరెక్టర్ రాజేశ్వర్ సింగ్, విచారణాధికారి కమల్‌సింగ్ అరగంటకుపైగా విచారించారు. జగన్ ఆస్తులు, సంస్థల ఆస్తులపై ఈ విచారణ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జగతి పబ్లికేషన్స్, హెటిరో డ్రగ్స్ తదితర సంస్థలకు చెందిన రూ.51 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 18 తేదీలోపు దీనిపై విచారణ జరుగనుంది. ఈ నేపథ్యంలోనే రెండో విడత జప్తునకు కూడా ఈడీ అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలియవచ్చింది.                              

ఎర్రన్నాయుడుకి ప్రవాసాంధ్రుల నివాళి

    తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కింజరాపు ఎర్రన్నాయుడుకు అమెరికాలోని డల్లాస్ నగరంలో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆదివారం అక్కడ జరిగిన సభలో ప్రసంగించిన పలువురు వక్తలు రాష్ట్రానికి, ప్రజలకు ఆయన చేసిన సేవలను స్మరించుకుని ఆయన కుటుంబానికి సానుభూతిని తెలిపారు. ఆయన మృతికి సంతాపసూచకంగా రెండు నిమషాల పాటు మౌనం పాటించారు.   ఇంగ్లండ్‌లో ఎర్రన్నకు సంతాపం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడుకు విదేశాల్లో ఉన్న టీడీపీ అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. టీడీపీ గ్లోబల్ యూకే, యూరోప్ విభాగం ఆధ్వర్యంతో ఇంగ్లండ్‌లోని స్టోక్ఆన్‌ట్రెంట్ పట్టణంలో ఆదివారం సంతాప సభ జరిగింది. 150 మంది మౌనయాత్ర నిర్వహించారు. సభలో నివాళులు అర్పించారు.

పాతబస్తీ గరం గరం!

  హైదరాబాద్ పాత నగరం మళ్లీ వేడెక్కింది. రాత్రి వేళల్లో అల్లరి మూకల ఆగడాలు జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తొమ్మిది గంటలు కాగానే పోలీసులు అప్రకటిత కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.   చార్మినార్ పరిసర ప్రాంతాల్లో అల్లరి మూకల ఆగడాలు ఎక్కువగా ఉన్నాయని పోలీసులు అంటున్నారు. ఈ మూకలు చేసిన రాళ్ల దాడిలో పోలీస్ వాహనాలు, ఎటిఎమ్ లు ధ్వంసమయ్యాయి. చార్మినార్, శాలిబండ, హరిబౌలి, మొఘల్ పురా ప్రాంతాల్లో ఓ వర్గానికి చెందిన జనం పెద్దఎత్తున రోడ్లమీదికి రావడంతో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత నెలకొంటోంది.   వివాదాల్లో ఉన్న చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం షెడ్డు నిర్మాణం పనుల్ని చేపట్టేందుకు విహెచ్ పి నాయకులు వస్తున్నారంటూ పెద్దఎత్తున జరిగిన ప్రచారం గందరగోళానికి, ఉద్రిక్తతకు దారితీస్తోంది. దీనికి సంబంధించి ఓ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు రహస్య సమావేశాలుకూడా జరిపారు.   అల్లరిమూకల అరాచకం ఎక్కువైపోయిందని, రాత్రిళ్లు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పడుకోవాల్సొస్తోందని పాతబస్తీ ప్రజలు వాపోతున్నారు. టాస్క్ ఫోర్స్ తోపాటు అదనపు బలగాలుకూడా రంగంలోకి దిగడంతో కాస్త ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది.

పట్టపగలే మహిళపై అత్యాచారం, హత్య

    హైదరాబాద్ కూకట్ పల్లి గాయత్రీ నగర్ లో ఉంటున్న ఓ మహిళను పట్టపగలు కొందరు దుండగులు, దారుణంగా రేప్ చేసి చంపేశారు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు కంపెనీ నుంచి ఇంటికొచ్చిన మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. తలుపు తెరిచి ఉండడంతో ఇంట్లోకి చొరబడ్డ దుండగులు.. బాధితురాలి కాళ్లూ చేతులూ కట్టేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని, మెడకి కరెంట్ వైర్ ని చుట్టి ఊరేసి చంపేశారని పోలీసులు చెబుతున్నారు. తెలిసినవాళ్లే ఈ పని చేసుంటారన్న అనుమానంతో పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీస్ జాగిలం.. బాధితురాలు పనిచేస్తున్న బైండింగ్ వర్క్స్ కంపెనీ దగ్గరికెళ్లి ఆగడం ఈ అనుమానాల్ని బలపరుస్తోంది.

విశాఖకు నీలం దెబ్బ

    నీలం తుఫాన్ దెబ్బకు విశాఖ జిల్లా విలవిల్లాడుతోంది. జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. షీలానగర్, హరిజన జగ్గయ్యపాలెం, అయ్యప్పనగర్ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. హుకుంపేట మండలం చిదుపుట్టు వద్ద వంతెన కొట్టుకుపోయి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మనగపక మండలం ఎస్సీ కాలనీలోకి వరద నీరు చేరడంతో కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. ముఖ్య రహదార్లపై భారీగా నీరు ప్రవహిస్తోంది. నాతవరం సమీపంలో వరద నీటిలో మూడు ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. ప్రయాణీకులను రక్షించేందుకు మూడు పడవలను ఏర్పాటుచేశారు.

ఘనంగా ఎర్రన్నాయుడు అంత్యక్రియలు

  టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు అంత్యక్రియలు నిమ్మాడలోని వ్యవసాయక్షేత్రంలో శనివారం ఉదయం పూర్తయ్యాయి. ఎర్రనాయుడు కుమారుడు ఆయన చితికి నిప్పుపెట్టారు. భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు ప్రియనేతకు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఎర్రన్నాయుడు పార్థివదేహం వద్ద పోలీసులు గౌరవవందనం సమర్పించారు. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.   అంతిమ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, లోకేష్, యనమల రామకృష్ణుడు, నామా నాగేశ్వర రావు, నందమూరి హరికృష్ణ, ఉమ్మారెడ్డి, వల్లభనేని వంశీ, నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ, మంత్రులు బాలరాజు, శత్రుచర్ల విజయరామ రాజు, హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు పాల్గొన్నారు.

ఎర్రన్నాయుడు అంతక్రియలు ప్రారంభం

  టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు ఎర్రన్నాయుడు అంతిమయాత్ర కన్నీటి మధ్య శనివారం ఉదయం ప్రారంభమైంది. నిమ్మాడలోని ఇంటి వద్ద నుంచి ఆశేష ప్రజానీకం మధ్య అంతిమయాత్ర కొనసాగుతోంది. అంతిమ యాత్రలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, లోకేష్, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.   ఎర్రన్నాయుడు పార్థివదేహం ఉన్న వాహనంలో చంద్రబాబు స్మశాన వాటికకు వెళ్లారు. జననేత కడసారి చూపు కోసం భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. అధికార లాంఛనాలతో ఎర్రన్నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. నిమ్మాడలోని వ్యవసాయ క్షేత్రంలో ఎర్రన్నాయుడు అంత్యక్రియలు జరుగుతాయి.

అమెరికాలో నెల్లూరు యువతి ఆత్మహత్య

  అమెరికాలో భర్త వేధింపులు భరించలేక నెల్లూరు జిల్లా యువతి అత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతి వార్త తెలుసుకుని బుచ్చిరెడ్డిపాళెంలో విషాదం అలుముకుంది. సరిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. బ్యాంక్ ఉద్యోగి మునగాల శ్రీనివాసులురెడ్డి మూడో సంతానం సరిత (21). వారణాసిలో ఎంటెక్ చదివిన సరితకు హైదరాబాద్‌కు చెందిన అన్నపురెడ్డి సుధీర్‌రెడ్డితో వివాహమైంది.   మొదట సుధీర్ అమెరికా వెళ్లాడు. ఆ తర్వాత సరితకు వీసా రావడంతో ఆమె కూడా అమెరికా వెళ్లింది. భర్తకు వేరే మహిళతో సంబంధం ఉన్న విషయం తెలిసి నిలదీయగా వేధింపులు అధికమయ్యాయి. దాంతో కలత చెందిన సరిత ఉరి వేసుకుని ప్రాణాలు వదిలింది. అంతకుముందే ఈ మెయిల్‌లో తండ్రికి ఈ సమాచారం పంపింది. కానీ, సుధీర్‌రెడ్డి నుంచి ఎలాంటి సమాచారం అందలేదని, సరిత మృతిపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామని ఆమె తండ్రి శ్రీనివాసులురెడ్డి తెలిపారు.

టీడీపీ నేత ఎర్రన్నాయుడు దుర్మరణం

  తెలుగుదేశం సీనియర్ నేత ఎర్రం నాయుడు తెల్లవారు ఝామున ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. విశాఖలోని ఒక వివాహానికి హాజరై తిరిగి శ్రీకాకుళం వెళ్తుండగా శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలి వద్ద పెట్రోల్ ట్యాంక్ ను ఎర్రం నాయుడు ప్రయాణిస్తున్న కారు ఢీ కొనడంతో షాక్ కు గురై కోమాలోకి వెళ్ళిపోయారు. ఆయనను వెంటనే హైవే అంబులెన్స్ లో కిమ్స్ శాయి శేషాద్రి ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు ఆయనను పరీక్షించి మృతిచెందినట్లు నిర్థారించారు.   ప్రమాదంలో జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు చౌదరి బాబ్జి ఇంకా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఎర్రం నాయుడు మృత దేహానికి పోస్ట్ మార్టం పూర్తయ్యింది. ఆయన భౌతికకాయాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు ఉంచుతారు. నేడు ఆయన స్వంత గ్రామంలో అత్యక్రియలు జరుగుతాయని తెలిసింది.

కాగ్‌ నుంచి తప్పించుకుంటున్న ఆర్‌ఐఎల్‌? ఆయిల్‌ మంత్రిత్వశాఖను ముఖేష్‌ కొనేసారా?

                ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునందుకున్న ధనవంతుల్లో ముఖేశ్‌ అంబానీ ఒకరు. ఆయన కంపెనీ ఆర్‌ఐఎల్‌తో కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) రెండో ఆడిట్‌లో భాగంగా జరగాల్సిన సమావేశం రద్దు అయింది. ఈ సమావేశం రద్దు చేస్తూ ఆయిల్‌ మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. కాగ్‌తో సమావేశం కన్నా ముందే ఆర్‌ఐఎల్‌ ఆంక్షలు విధిస్తూ కొత్త నిబంధనలు తెరపైకి తెస్తున్నది. అంటే ఆర్‌ఐఎల్‌కు కాగ్‌తో సమావేశమయ్యే ఆసక్తి లేదన్న మాట. తన కంపెనీ అసలు విషయం బయటకు వస్తుందనే ముఖేశ్‌ ఇప్పటికే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని మార్పించిన విషయం అందరికీ తెలిసిందే.                దానితో ఆగకుండా కొత్త మంత్రితో చర్చించి కాగ్‌తో సమావేశాన్ని ఆపుజేయించారని తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది. కేజీ డి`6 చమురు క్షేత్రంలో వ్యయాలతో పాటు దానితో ముడిపడి ఉన్న భిన్న వ్యవహారాలను వెలుగులోకి తెచ్చేందుకే కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి కాగ్‌ నివేదిక కోరారు. ఈ నివేదిక కోరినందుకే ఆయన్ని శాఖ మార్పించిన ముఖేశ్‌ కాగ్‌తో సమావేశాన్ని ఆపుజేయించుకోవటం తన మనీపవర్‌ చాటినట్లుందని విమర్శలు వినిపిస్తున్నాయి.                 ఈ నివేదిక విషయంలో ఆర్‌ఐఎల్‌ ఎంత ఆలస్యం చేస్తే అంతకాలం ఆర్‌ఐఎల్‌ తాజాపెట్టుబడులపై నిషేధం కొనసాగుతుంది. ఒకవైపు కాగ్‌ నుంచి తప్పించుకుంటూ క్రేజీవాల చేస్తున్న ఆరోపణలకు ముఖేశ్‌ బలాన్ని ఇస్తున్నారు. 

బాబు మాట సిఎంకు మిర్చి మంట?

  తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మాటలు సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి మిర్చి తిన్నంత మంటగా ఉంటున్నాయని రాజకీయవిశ్లేషకులు అంటున్నారు. తాను చేస్తున్నది మీ కోసం వస్తున్నా పాదయాత్ర మాత్రమే కాదని అవినీతి వ్యతిరేక పోరాటమని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు. రాష్ట్రప్రభుత్వంపై ఆయన ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. తాను ధర్మపరిరక్షణ పోరాటం చేస్తున్నానని బాబు తెలిపారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం అన్ని వ్యవస్థల్నీ భ్రష్టుపట్టించిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి తిరోగమనంలో ఉందని విమర్శించారు. నగదుబదిలీ పేరిట పేదల పొట్టలు కొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దపడిరదన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో ఎవరి ఆదాయం పెరగలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో లాలూచీ పడ్డ పార్టీలు తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. తనపై సిబిఐ దర్యాప్తు చేయించినా ఏమీ నిరూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. అడ్డుగోలు ఆస్తులు సంపాదించుకునే వారికి జగన్‌ ఆదర్శం అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తక్కువ ఆదాయంతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్‌ కొనసాగిస్తోందన్నారు. ప్రజలు కష్టాలు పడుతుంటే హైదరాబాద్‌లో కూర్చుని మాట్లాడటం బాగోదనే తాను ఈ పాదయాత్ర చేపట్టానన్నారు. నగరాలతో సమానంగా గ్రామాల్లోనూ పరిశ్రమలను తేవాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ విస్మరించిందన్నారు.

మీడియాతో జాగ్రత్తలు తీసుకుంటున్న సబిత?

  గత కొంతకాలంగా రాష్ట్ర హోంశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియా విషయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఎందుకంటే మీడియాతో ఎక్కువగా టచ్‌లో ఉంటే వార్తల్లో వ్యక్తి కావచ్చని అనిపించినప్పటికీ అవసరమైనప్పుడు మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు. మీడియాతో ఆచితూచి వ్యవహరించాలని ఆమె నిశ్చయించుకున్నట్లు కనబడుతున్నారు. ఇటీవల ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తెలంగాణా మార్చ్‌ సందర్భంగానూ మీడియాతో సఖ్యతగా ఉన్నట్లు కనిపిస్తూనే సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు నడుచుకున్నారన్నట్లు చూపారు. దీంతో తెలంగాణావాదులు తనను తప్పు పట్టకుండా ఆమె జాగ్రత్తలు తీసుకున్నారు. అలానే సిబిఐ పిలుపు వచ్చినప్పుడు సిఎంను కలిశాక ఇతర మంత్రులైనా మాట్లాడారు కానీ, ఆమె తక్కువగా మాట్లాడటం తన శైలి అన్నట్లు వ్యవహారించారు. అలానే తూర్పుగోదావరి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న ఈమె ఆ జిల్లా ఎస్పీ, ఎఎస్పీల మధ్య విభేదాలు తలెత్తినప్పుడు కూడా హూందాగా హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌ గృహనిర్బంధంపై ఆయన సబితకు ఫోను చేశారు. సబిత ఏమి హామీ ఇచ్చారు? అసలేమి మాట్లాడారో తెలియలేదు. అంటే సబితకు ఫోను చేశారన్న వార్తే తప్పించి మీడియాకు ఆమె మాట్లాడిన మాటలు బయటకు రాలేదంటే సబిత చాలా సీరియస్‌గా జాగ్రత్తలు పాటిస్తున్నట్లే కదా!

కాదేదీ హ్యాకింగుకు అనర్హం?

  ప్రపంచంలో అతిపెద్ద వ్యాపారం హ్యాకింగు. ఎంతటి పెద్ద సంస్థను అయినా ఈ హ్యాకర్లు ఇబ్బంది పెడుతుంటారు. ఎంతో కష్టపడి పూర్తి సమాచారంతో తయారు చేసుకున్న వెబ్‌సైట్‌ను హ్యాకింగు చేయటం ద్వారా ఆ సమాచారం ఉపయోగపడకుండా పోతుంది. ఇలా సమాచారం వృధా అవటమే కాకుండా కొన్నేసార్లు సంస్థలు సకాలంలో అందుబాటులో లేక హ్యాకర్ల వల్ల వినియోగదారులకు దూరమై భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. వ్యాపారంలో తమ ప్రత్యర్ధుల న దెబ్బ తీసేందుకు కొన్ని సంస్థలు ఈ హ్యాకర్లను ఆశ్రయిస్తున్నాయి. వారు కోరినంత ధనమిచ్చి ప్రత్యర్ధి సమాచారాన్ని సొంతం చేసుకుంటున్నారు. ప్రత్యేకించి హ్యాకింగుపై ఆధారపడి బతికేవారు ఎక్కువగా అమెరికా, యుకె, హంగేరీ, అల్జీరియా, నైజీరియా,  రష్యా దేశాల్లో ఉన్నారు. తాజాగా చేసిన పరిశోధనలో మన భారతదేశానికి ఎక్కువ మంది హ్యాకర్లు వలస వస్తున్నారట. నైజీరియన్లు అయితే ఇక్కడే నివాసముండి లాటరీల పేరిట హ్యాకింగు ద్వారా మెయిల్స్‌ పెడుతున్నారు. ఈ హ్యాకింగు వల్ల ఒకవైపు ఆర్ధికంగా నష్టపోయి, మరోవైపు సమయాన్ని వృధా చేసుకున్న కంప్యూటర్‌ నిపుణుల జాబితాలో ఇండియానే ఎక్కువ. తాజాగా డీఆర్‌డీవోతో పాటు మరో ఐదు ప్రభుత్వ విభాగాల వెబ్‌సైట్లు హ్యాకింగుకు గురయ్యాయి.   శాస్త్రవేత్తల నియామకాలకు సంబంధించిన ఈ వెబ్‌సైట్‌ హ్యాకింగుకు గురవటంతో ప్రభుత్వంలోని అన్ని విభాగాల అధికారులు అప్రమత్తమయ్యారు.