త్వరలో రిటైర్ కానున్న లక్ష్మణ్

టీం ఇండియా స్టైలిష్ బాట్స్‌మన్ వి.వి.ఎస్ లక్ష్మణ్ తన కెరీర్‌కి గుడ్‌బై చెప్పనున్నాడు. న్యూజీలాండ్‌తో జరిగే టెస్ట్ సీరిస్ లక్ష్మణ్‌కు చివరి సీరిస్ కానుంది. లక్ష్మణ్ రేపు రిటైర్‌మెంట్‌ను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. టీం ఇండియా దిగ్గజాలు గంగూలీ, ద్రవిడ్‌లు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పగా ఇప్పుడు లక్ష్మణ్ కూడా ఆ లిస్ట్‌లో చేరబోతున్నాడు. టీం ఇండియా బెస్ట్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన లక్ష్మణ్ 1996లో సౌతాఫ్రికాపై టెస్ట్ ఆరంగేట్రం చేశారు. ఇప్పటికే 134 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 8781 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 56 అర్ధసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ ఆటగాడుగా ముద్ర వేసుకున్న వివిఎస్ లక్ష్మణ్ 2006 నుంచి ఒన్డేలకు దూరమయ్యాడు. 86 ఒన్డేల్లో 2338 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 16 అర్ధసెంచరీలు ఉన్నాయి.

టిడిపి నర్సారెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట

తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) నర్సారెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. నర్సారెడ్డి ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పుపై శుక్రవారం స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎన్నికపై హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసింది. దీనిపై నర్సారెడ్డి, వెంకట్రామి రెడ్డి ఇద్దరూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ పిటిషన్ మరో రెండు వారాల్లో విచారణకు వచ్చే అవకాశముంది. కాగా నర్సారెడ్డికి హైకోర్టు తీర్పు ఇటీవల షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. నర్సారెడ్డి ఎన్నికల చెల్లదంటూ హైకోర్టు గత శుక్రవారం తీర్పు ఇచ్చింది. నర్సారెడ్డిపై కాంగ్రెసు అభ్యర్థి వెంకట్రామి రెడ్డి 9 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు హైకోర్టు వెల్లడించింది. నర్సారెడ్డి ఎన్నికల చెల్లదంటూ వెంకట్రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఓట్ల లెక్కింపు జరిపి నర్సారెడ్డి ఎన్నిక చెల్లదని ప్రకటించిన విషయం విదితమే.

నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు: చంద్రబాబు

ప్రధానమంత్రిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం స్పష్టం చేశారు. మెదక్ జిల్లా సదాశివపేటలో గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఇఫ్త్తార్ విందు సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రధాని అయితే దేశానికి సుభిక్షం కాదని, సెక్యులర్ భావాలు గల వ్యక్తికే మద్దతు ఇస్తామని బాబు చెప్పారు. ముస్లింల అభివృద్ధికి అవసరమైన చర్యల కోసం పార్టీ పరంగా కమిటీ వేశామన్నారు. అందులో చర్చించి త్వరలో ముస్లిం డిక్లరేషన్ ప్రకటిస్తామని తెలిపారు. కాగా త్వరలోనే తాను ఉర్దూ నేర్చుకుంటానని చంద్రబాబు తెలిపారు. అయితే 2014 సాధారణ ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఫోకస్ అవుతున్న దృష్ట్యా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

బాబా సన్నిహితుడు బాలకృష్ణకు బెయిల్

నకిలీ పత్రాల కేసులో యోగగురువు రాందేవ్ బాబా సన్నిహితుడు బాలకృష్ణకు ఉత్తర ఖండ్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బాలకృష్ణ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ తరుణ్ అగర్వాల్ విచారించారు. పది లక్షల రూపాయలతో కూడిన రెండు వ్యక్తిగత పూచికత్తులను కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. బాలకృష్ణను జూలై 20 తేదిన హరిద్వార్ లో అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలు దాఖలు చేసిన బారతీయ పాస్ పోర్ట్ ను పొందారనే ఆరోపణలపై అరెస్ట్ చేసి సుద్దోవాలా జైలు ఉంచారు. తొలుత నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన స్పందించకపోవడంతో ఆయన జూలై 10న అరెస్ట్ చేశారు.

విలాస్ రావు దేశ్ ముఖ్ కు పార్లమెంట్ ఘననివాళి

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభం కాగానే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖా మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మృతికి పార్లమెంట్ ఉభయ సభలూ ఘనంగా నివాళులర్పించాయి. దేశానికి ఆయన చేసిన సేవలను సభ్యులు కొనియాడారు. అనంతరం ఉభయ సభలను శుక్రవారం నాటికి వాయిదా వేశారు. కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులతో గత సోమవారం (6వ తేదీ) నుంచి చెన్నయ్‌లోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖా మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ (67) మంగళవారం (14వ తేదీ) కన్నుమూసిన విషయం తెలిసిందే.

సినీనటి కమలాదేవి కన్నుమూత

అలనాటి సినీనటి టి.జి. కమలాదేవి గురువారం కన్నుమూశారు. కమలాదేవి వయస్సు 84 సంవత్సరాలు. ఆమె అసలు పేరు గోవిందమ్మ. డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయని, నటిగా తెలుగు చలన చిత్ర సీమలో కమలాదేవి తనదైన ముద్రను వేసుకున్నారు. అంతేకాకుండా ఆమె మంచి బిలియర్డ్ క్రీడాకారిణి. బిలియర్డ్ లో రెండు సార్లు కమలాదేవి జాతీయ చాంపియన్ షిప్ ను గెలుచుకున్నారు. సుమారు ఆమె 70 సినిమాల్లో కథానాయకగా నటించారు. కమలాదేవి దక్షయజ్ఞం, బాల నాగమ్మ, ముగ్గురు మరాఠీలు, గుణ సుందరి కథ, పాతాళభైరవి, మల్లీశ్వరి, కథానాయకుడు, ఇల్లరికం తోడు దొంగలు, పల్లెటూరు, చక్రపాణి, వెలుగు నీడలు, భక్త రాందాసు, బంగారు పంజరం, కంచుకోట, పెత్తందార్లు, అభిమానవతి చిత్రాల్లో నటించారు. కమలాదేవి సెన్సార్ బోర్డు చైర్మన్ గా కూడా సేవలందించారు. ఆంధ్ర ప్రదేశ్ నాటక అకాడమి ఆమెకు నాటక కళా ప్రపూర్ణ అవార్డుతో సత్కరించారు. నాటకాలలో ప్రదర్శించిన అలెగ్జాండర్ పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఆమె అంత్యక్రియలు ఆదివారం జరుగుతాయని బంధువులు వెల్లడించారు. కమలాదేవి మృతికి తెలుగు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

టీడీపీ ముస్లింలకు దగ్గరవుతుందనే అసత్య ప్రచారాలు: వంశీ

తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు మతకలహాలకు తావులేకుండా వినాయకచవితి, రంజాన్ తదితర పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించారని అర్బన్ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్ అన్నారు. పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ముస్లింలకు టీడీపీ దగ్గరవుతుందనే అక్కసుతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనవాసరావు, మాల్లాది విష్ణు, జోగి రమేష్ అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మైనార్టీల సంక్షేమం టీడీపీ ఆవిర్భావం నుంచే కృషి చేస్తుందన్నారు. అబ్దుల్ కలాం వంటి గొప్పవ్యక్తిని రాష్ట్రపతిని చేసింది చంద్రబాబు కాదా అని వంశీ ప్రశ్నించారు.    తొమ్మిది వేల మసీదుల నిర్మాణం, 500 షాదీఖానాలు మంజూరు, దుకాన్ ఔర్ మకాన్ పథకం, రోషిణి పథకం, ఉర్దూ పాఠశాలలు తదితర వాటిని ఏర్పాటు చేసింది చంద్రబాబు హయాంలోనే అన్న విషయాన్ని ఎమ్మెల్యేలు గుర్తుంచుకోవాలన్నారు. ప్రధాన కార్యదర్శి బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణకు మద్దతు, మైనార్టీలకు డిక్లరేషన్ ప్రకటిస్తామని చంద్రబాబు ప్రకటించగానే కాంగ్రెస్ నాయకులకు వణుకు పుడుతుందన్నారు. ఈ సమావేశంలో నాగుల్ మీరా, సొంగా రవీంద్రవర్మ, రహీం అప్సర్, యలమంచిలి గౌరంగబాబు, అబ్దుల్ వాహిద్ తదితరులు పాల్గొన్నారు.

దినేష్ రెడ్డి నియామకం చెల్లదు: హైకోర్టు

డీజీపీగా దినేష్ రెడ్డి నియామకం చెల్లదని గతంలో క్యాట్ ఇచ్చిన నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. దినేష్ రెడ్డి నియామకాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. వారంలోగా డీజీపీ స్థాయి అధికారులు వివరాలను యూపీఎస్సీకి పంపాలని గురువారం హైకోర్టు ఆదేశించింది. యూపీఎస్సీ నివేదిక అందగానే వారంలోగా కొత్త డీజీపీని నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. అంతే కాకుండా ప్రభుత్వానికి హైకోర్టు రూ.5వేలు జరిమానా విధించింది. డీజీపీ నియామకం చెల్లదంటూ కేంద్ర పరిపాలనా పరమైన వివాదాల పరిష్కార న్యాయస్థానం (క్యాట్) ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం, దినేష్‌డ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.